padyam-hrudyam

kavitvam

Tuesday, March 1, 2011

రామ తారక శతకము 9

41 . ఓ రాఘవా యని యొక సారి దలచితే - దు:ఖము లాపదల్ తొలగి పోవు
ఒనర రెండవ సారి యో రాఘవా యన - బహు భోగ భాగ్య సంపదలు గల్గు
చెలగి మూడవ సారి శ్రీ రామ యన్నను - ముక్తుడై వైకుంఠమున వసించు
రమణ నాల్గవ సారి రామ చంద్రా యన్న - నతని ఋణస్తు డవయ్య నీవు

అల్ప సంతోష సులభు డవగుదు వయ్య - యలమి యాజీవ పర్యంత మరయ మిమ్ము
దలచు వారికి నాపదల్ దొలగు టరుదె - రామ! తారక! దశరథ రాజ తనయ!

42 . కీడు మేలని రెండు క్రిందటి జన్మంబు - సంగ్ర హించిన యట్టి సంచి తంబు
అనుభ వింపుచు నరు లాత్మ తథ్యము లేక - మేనెల్ల తమదని మెచ్చు కొనుచు
కీడు వచ్చిన వేళ క్రియ కోర్వ జాలక - పాపంబు దలతురు భ్రాంతి చేత
నట్టి పాపంబు తా ననుభ వింపుచు నుండు - బాయని సంసార పాశములను

బద్ధులై యున్న దుర్జనుల్ పంద లగుచు - పాప ఫలములు భాసుర భ్రాంతి గాక
వలదు యితరుల వలె నట్టి వాంఛ గోర - రామ! తారక! దశరథ రాజ తనయ!

43 . కర్మ శేషము వలన గలుగును జన్మంబు - జన్మ హేతువు వలన జెడు నతండు
మూఢుడై ముందరి ముచ్చట దెలియక - బద్ధుడై యుండును భ్రాంతి తోడ
తనువు సంసారంబు తథ్యంబని తలంచి - హరినామ భజన యందాస లేక
అనుదినంబును నరులా సక్తులై పుట్టి - పుత్రా మిత్రాదులే పుణ్య మనుచు

పరుల యాచించి పీడించి పాపమొంది - పుట్టి యీరీతి కాలంబు భూమి మీద
మిమ్ము చింతింప చేకూడె మీ పదంబు - రామ! తారక! దశరథ రాజ తనయ!

44 . రామ రామా యని రంజిల్ల నా వంతు - నిజముగా రక్షింప నీదు వంతు
అపరాధి నని పల్కి యాచింప నా వంతు - నిజముగా రక్షింప నీదు వంతు
నీ పాద పద్మమ్ము నెర నమ్మ నా వంతు - నిజముగా రక్షింప నీదు వంతు
ఒరుల సేవింపక యోర్చుట నావంతు - నిజముగా రక్షింప నీదు వంతు

నేను పంతంబు తప్పక నిన్ను గొలుతు - నీవు పంతంబు తప్పక నిర్వహించు
పంతమిది నీకు నాకును పరమ పురుష - రామ! తారక! దశరథ రాజ తనయ!

45 . గోవు మందల కోటి గోదాన మొసగిన - సరిరావు మీ నామ సంస్మరణకు
కాశీ ప్రయాగ గంగాది తీర్థంబులు - సరిరావు మీ నామ సంస్మరణకు
బహు యజ్ఞములు చేసి ప్రస్తుతి కెక్కిన - సరిరాదు మీ నామ సంస్మరణకు
వేద శాస్త్రంబులు వెదకి జూచిన గాని - సరిరావు మీ నామ సంస్మరణకు

నెంచగా నమ్మ వశమె బ్రహ్మాదులకును - బుధ జన స్తోత్ర సద్గుణ పుణ్య చరిత
అఖిల సుర వంద్య దివ్య పాదారావింద - రామ! తారక! దశరథ రాజ తనయ!

No comments: