padyam-hrudyam

kavitvam

Friday, June 13, 2014

కాదేదీ కవిత కనర్హం.............

కాదేదీ కవిత కనర్హం - సబ్బు బిళ్ళ.
======================
అబ్బుర మౌను నీ ఘనత! హాయిగ మేనికి నిన్ను రుద్డగా
నబ్బు పరీమళమ్ము, లిక నంతము ధూళియు గాలి స్వేదపుం
గొబ్బగు కంపు లన్నియును, గొప్పగ సౌఖ్యము ఫేన రాజిడున్
సబ్బు! త్వదీయ మార్దవము సన్నుతి జేయగ నాకు శక్యమే?
సబ్బూ! పెట్టెకు నీవల-
నబ్బును రేరాజు కళలు! నంతట నీవై
గొబ్బున నుండగ శుక్లము !
గబ్బున నీవరిగి పోవ కద కృష్ణ మహా!
త్యాగమె నీ యూపిరి మా
భోగమునకు నీ విభూతి పూర్ణత్వ మిడున్
మూగగ కృశించి పోదువు
వేగముగా, స్వార్థ మెరుగ వింతయు సబ్బూ!

Saturday, June 7, 2014

చీర కట్టుకు సరియేది చిన్నదాన!




 
 
 
పోకముడిని బట్టి పొల్పు మీరగ జుట్టి
......కుచ్చెళ్ళు తగ బెట్టి కోక గట్టి

జాకెట్టు ధరియించి జారు పైటను దిద్ది
......మొలనూలు బిగియించి మురిపెమొదవ
...
పైటకొం గెగురంగ పదపడి గాలికి
......పై యంచు కనుపింప పట్టి చేత

వెనుక విలాసమై తనరార వాల్జడ
......నంచలు సిగ్గిల నడుగు లిడుచు

తెలుగు నట్టింట నడయాడు కలికి జూచి

నింగి వేలుపు లెల్లరు పొంగి పోయి

సిరుల జల్లుగ కురియరే చెలువు మీర

చీర కట్టుకు సరియేది చిన్నదాన!
 

Monday, June 2, 2014

తెలంగాణకు శుభాకాంక్షలు

పాడరా పాడరా మన పాటా.........
జన తెలంగాణమని ప్రతినోటా.......



కోటి ఆశలు నింపుక గుండెలోన 
స్వంత రాష్ట్రమ్ము కోసమై పరితపించి 
నారు మీ కలల్ ఫలియించి తీరుగాక 
శాంతి ధామమై తెలగాణ కాంతులీన.


తెలంగాణ సోదర సోదరీమణులకు 
స్వరాష్ట్రావతరణ శుభాకాంక్షలు!