padyam-hrudyam

kavitvam

Saturday, January 19, 2013

సరసాహ్లాదిని


సమస్య :

నవరాత్ర్యుత్సవము లమరె నాలుగు దినముల్.

పూరణ:

శివసతికి వైభవముగా
నవరాత్ర్యుత్సవము లమరె, నాలుగు దినముల్
పవలున్ రేయియు ముందుగ
యువకుల్ శ్రమియింపజేసి యూరికి ఘనమై.

Thursday, January 17, 2013

రాళ్ళవాన......ధూళికణ పాతమగున్...






బాలుడు వీడు! కొండ కడు  భారము! మోయుట మాటలేమిలే!
చాలని తల్పబోకుడిది ఛత్రము వోలెను గాచు మిమ్ము,  నా
కేలది యల్లలాడ, దిక కీడది వట్టిది! రాళ్ళవాన  గో-
పాలుర పాలి ధూళికణ పాతమగున్! చనుదెంచు డందరున్.

గోవర్ధనగిరి గొడుగుగ
భావింతుము గోపబాల! పరమ దయాళూ!
దైవమవై మా యండను
నీవుండగ మాకు కీడె? నీరజనాభా!

అన్య చింత మాని యా పరంధాముని
నెవడు నమ్ము కొనునొ యిహమునందు
నట్టి వాని క్షేమ మాతడె వహియించు
ననుట కిది నిదర్శనమ్ము గాదె!

Monday, January 14, 2013

రావమ్మా యిదే స్వాగతమ్ము....



 



ఏ వాటిన్ గన భోగిమంటలు ప్రభల్ యింటింట ధాన్యంబులున్
భావాలన్ ప్రకటించు రంగవళి పూబంతుల్ మరిన్ గొబ్బియల్
ఠీవిన్నాడెడు గంగిరెడ్లు జియరున్ డెందంబు లుప్పొంగగా
రావమ్మా! యిదె స్వాగతమ్ము శుభ సంక్రాంతీ! జనాహ్లాదినీ!

Thursday, January 3, 2013

సరసాహ్లాదిని

సమస్య : 

చెలువుగ రామలక్ష్మణులు సీతకుఁ దమ్ములు శంభుఁ డన్నయున్.
===========================================

పూరణలు:

1.  చెలువుడ! కోరికాయె మది చెప్పవొ రాముని గాధ యన్న నీ
     పలుకుల కేమి చెప్పగల వాడ సఖీ! బహుశా యిలా స్థలిన్
     చెలువుగ రామలక్ష్మణులు సీతకు తమ్ములు, శంభుడన్నయున్
     కలియుగమందు రక్కసుల కట్టడి చేసిరి యంచు పల్కితిన్.!!!!!


2.  పలువుర జేరదీసి తన ప్రజ్ఞను  చాటెను దంబుడిట్లహో
     చెలువుగ రామలక్ష్మణులు సీతకు దమ్ములు, శంభుడన్నయున్
     చిలకలకొల్కి రాధకగు, చెప్పెదనింకను, బ్రహ్మగారికిన్
     నలదమయన్తులిర్వురును నమ్మిన బంటులు వాణి తల్లియౌ.

Tuesday, January 1, 2013

మనసు దోచెడు నేటి హేమంత శోభ!





ప్రకృతి పురుషుల శుభకర పరిణయాన
మంచుముత్తెపు సేసల మరల మరల
తలల నిడుకొని మురిసిన తరుణ మట్లు
మనసు దోచెడు నేటి హేమంత శోభ!

పచ్చ పచ్చని యాకు తివాచి పైన
వారి   తలలపై క్రిందకు జారి పడిన 
తెల్ల తెల్ల  తలంబ్రాల కుల్ల మలరి
మల్లె మొల్లలు నవ్వె! నా యుల్లమలరె!


Happiness పెంచ రావె హే న్యూ యియరా!





 Happy  గ్యాస్ బండలతో
 Happy విద్యుత్తు కోత హింసకు నాపై
 Happy పెరిగే  ధరలకు
 Happiness పెంచ రావె హే  న్యూ యియరూ !

 Happy వైన్ షాపులతో
 Happy త్రాగేటి నీటి హీన స్థితితో
 Happy నేతల కోతలు
 Happiness పెంచ రావె హే  న్యూ యియరూ !


 Happy డొక్కు బసులతో
 Happy తత్కాల్  టికెట్ల యిక్కట్టులతో
 Happy రోడ్డు ప్రమాదాల్
 Happiness పెంచ రావె హే  న్యూ యియరూ !

 Happy అవినీతులతో
 Happy కబ్జాల ఘనుల హేలావళితో
 Happy ఆరోపణలకు
 Happiness పెంచ రావె హే  న్యూ యియరూ !

 Happy అత్యాచారాల్
 Happy రౌడీయిజంపు యెకసక్కెముతో
 Happy హత్యల హింసకు
 Happiness పెంచ రావె హే  న్యూ యియరూ !