padyam-hrudyam

kavitvam

Friday, May 27, 2011

చిన్మయ రూపిణీ!
















ఇన్మును జూచి కాంచనము నిట్టె త్యజించెడు వెఱ్రి కైవడిన్
పెన్మమకారపుం బొరలు పేర్కొని యుండగ నాలుబిడ్డలన్
సన్మతి గల్గ బోదు మది చక్కగ నిన్ను స్మరింప భార్గవీ!
చిన్మయ రూపిణీ! నిను భజించెడు భాగ్యము నిమ్ము సర్వదా!

Sunday, May 22, 2011

పచ్చదనం















పచ్చదనం పరిశుభ్రత - పాటిద్దాం మనమంతా
పరిమళమూ పవిత్రతా - పంచుదాము భువినంతా ... పచ్చదనం

ఇంటింటికి ఒక మొక్కను - నాటి మనం పోషిద్దాం
ఆంధ్రావని ఎల్లెడలా - హరితవనం చేసేద్దాం ...
పచ్చదనం

నువు నాటే ప్రతి మొక్కా - రేపటి చెట్టౌనందాం
నువు నరికే ప్రతి చెట్టూ - శపియించుట నిజమందాం ... పచ్చదనం

అతి వృష్టీ అనా వృష్టి - కిచట తావు లేదందాం
కరవు కాటకాల కికను - చెల్లు చీటి వ్రాసేద్దాం
... పచ్చదనం

వృక్షో రక్షతి రక్షిత - యన్న సూక్తి నిజమందాం
పచ్చదనం పరమాత్ముని - ప్రతిరూపం అనుకొందాం ... పచ్చదనం

ఆంధ్రమాత కాదరాన - హరితాంబర మందిద్దాం
తీయని నూరూ గాలీ - ఆమె కిచ్చి మురిపిద్దాం
... పచ్చదనం

ఆనందం ఆరోగ్యం - అంతటనూ నింపేద్దాం
ఆంధ్ర భూమి భరత ధాత్రి - అమర ధామ మనిపిద్దాం
... పచ్చదనం


Friday, May 20, 2011

చిన్మయ రూపిణీ!

















జన్మము నెత్తి నాది భవ జాలము నందున చిక్కి తమ్మరో !
మన్మథ దగ్ధ లోచనుని మాలిమి ప్రేయసి ! మంద హాసినీ!
జన్మ నొసంగ నేల? కడు సంకటముల్ సృజియించ నేలనే ?
చిన్మయ రూపిణీ నిను భజించెడు భాగ్యము నిమ్ము సర్వదా !

Thursday, May 5, 2011

చిన్మయ రూపిణీ!




















మన్మనమందు షడ్రిపులు మాన్యత బాయగ నుద్యమించుచున్
సన్మతి బాపు చుండెడిని సంతతమున్ భువనేశ్వరీ! కటా!
కన్మని నీకు మ్రొక్కగను కాయము వంగ దదేమి చేయుదున్?
చిన్మయ రూపిణీ! నిను భజించెడు భాగ్యము నిమ్ము సర్వదా!