padyam-hrudyam

kavitvam

Wednesday, October 31, 2012

సరసాహ్లాదిని

సమస్య :  శూర్పణఖ సాధ్వి లోకైకసుందరాంగి

పూరణ:

హితవు పల్కెను మారీచు డిట్లు రాజ!
కల్ల సుద్దులు చెప్పెను కపటి వినుము
శూర్పణఖ, సాధ్వి లోకైకసుందరాంగి
సీత జెరబట్ట నెంచుట చేటు నీకు.

Tuesday, October 30, 2012

పశ్చిమాద్రి కడ గాయత్రీ!





రవి పూర్ణేంద్రుల పైని నింద్ర ధనువై రాజిల్లెనేమో యనన్
నవరత్నోజ్జ్వల కింకిణీ కలిత వీణన్ వాణి పాణిన్ ధరిం-
చి విరించ్యుక్తుల నాలపింప చిగురించెన్ తా నభోవల్లి సాం-
ధ్య విశేషంబన పశ్చిమాద్రి కడ గాయత్రీ! త్రి సంధ్యా సతీ!

ఈ పద్యం కీర్తి శేషులు యడవల్లి పూర్ణయ్య సిద్ధాంతి గారు రచించిన శ్రీ గాయత్రీ శతకం లోని నాల్గవ పద్యం.

సూర్య చంద్ర బింబములపై ఇంద్ర ధనుస్సు నతికినారా యన్నట్లు వాణి నవరత్న వీణను పట్టుకొని సామగానాలాపనము చేయగా ఆకాశ లత పడమటి దిక్కున సంధ్యారాగమను నెపముతో చిగురు తొడిగిందా
అన్నట్లు గా ఉంది అన్నది ఈ పద్యంలోని సుందరమైన భావం.

Sunday, October 28, 2012

సరసాహ్లాదిని

పాలు, పెరుగు, చల్ల, వెన్న - ఈ పదాల నుపయోగించి భారతార్థంలో పద్యం వ్రాయాలి.
                                          అయితే పై పదాలను వాటి సహజార్థంలో వాడకూడదు.


పెరుగుట కక్షలెవ్వరికి పెంపొనరించును? కౌరవేశ! నీ
వెరుగవె ధర్మజాదులకు వేగమె పాలిడి జేరదీయవే,
కురియుచు చల్లగా మమత కూర్మిని,  వెన్నుని మాట చొప్పునన్!
కరుగవె సంపదల్ జరుగ కయ్యము? సాక్షిగ నుందు వెన్నగన్ .

Friday, October 26, 2012

సరసాహ్లాదిని


సమస్య:  దుర్వినయంబునన్ మనసు దోచెడి వారు హితైషులే కదా.


ఓర్వగ లేక సోదరుల యోర్మిని కూర్మిని మెచ్చలేక తా
నేర్వక ధర్మబుద్ధి కురునేత సుయోధను డొందె నాశమున్
గర్వము ద్రోహమున్ గరపు కర్ణుని మైత్రికి బద్ధుడై కటా
దుర్వినయంబునన్ మనసు దోచెడి వారు హితైషులే కదా.

Thursday, October 25, 2012

చెడ్డది నీ తల్లి .....



 

ముని యిచ్చిన వరమును తన
చిన తనపుం జాపలమున జేయగ పరిశీ-
లనమును బిల్చెను కుంతి ర-
విని,  భాస్కరుడిచ్చి పోయె బిడ్డ నతివకున్.

బిడ్డను గని భయమున రా-
బిడ్దొక మందసము నందు పెట్టెను వానిన్
అడ్డుపడ మాతృ హృదయము
చెడ్డది నీతల్లి యనుచు చేరెను నదికిన్.

పెట్టెను బాలుని తోడను
గట్టిగ బిగబట్టి గుండె కన్నియ నదిలో
నెట్టన విడువం బెట్టెను
చట్టున వెనుదిరిగె తల్లి చంచల మతియై.

Wednesday, October 24, 2012

చిన్మయ రూపిణీ !

 


  
కరముల నీ పదార్చనలు, కన్నుల నీదగు దివ్య రూపము-
న్నరయుటలున్, ముఖమ్మున భవాబ్ధిని దాటగ నావయైన నీ
వర గుణ వర్ణనల్ సలుపు భాగ్యము పొందిన పుణ్యమూర్తులన్
చరణము లంటి మ్రొక్కినను చాలదె చిన్మయ రూపిణీ! శివా!

Tuesday, October 23, 2012

కువకువలాడు మాబ్రతుకు ....................







 


 
నవనవలాడు జీవితము నవ్య సుశోభల, సర్వ సౌఖ్యముల్
కువకువలాడు మా బ్రతుకు గూటను  నీ కరుణార్ద్ర దృక్కులన్
పవలును రేయియున్ తడియ! పర్వమె నిత్యము! నెన్న నీ మహ-
ర్నవమిని నిన్ను గొల్చినను నాకమె చిన్మయ రూపిణీ ! తుదిన్.

Monday, October 22, 2012

సరసాహ్లాదిని

నన, నీనీ, నును, నేనే  -  ఈ పదాల నుపయోగించి భారతార్థంలో పద్యం వ్రాయాలి:

ననరు బోడి నీవేనటే నన్ను వలచి
వచ్చితివి భామి నీ నీదు వలపు సింహ
బలుని ముంచెత్తె నునుసిగ్గు వలదు చాలు
కలికి నేనేగదా రమ్ము కౌగిలిమ్ము.

త్రోవ జూప గదే !



 





 
దుర్గమమౌ భవాటవిని దు:ఖితునై కనజాల కుంటి నే
మార్గము త్రోవ జూప గదె మాలిమి దృక్కుల కాంతి రేఖలన్
స్వర్గమదేల నాకు భవ సంచిత కిల్బిషముల్ నశించినన్
భర్గుని రాణి! దుర్గ! విను  ప్రార్థన మీ నవరాత్రి వేళలో!

Sunday, October 21, 2012

ఈ నవరాత్రి వేళలో !


    



మృణ్మయ  భంజికల్ కనగ మేము ధరించిన యీ శరీరముల్
కన్మరుగౌ నిమేషమున కాలుని చూపులు సోకినంతనే
సన్మతి నిచ్చి నీ చరణ సన్నిధి నిల్పవె మమ్ము నెప్పుడున్
చిన్మయరూపిణీ !   నిను భజించెద    నీ నవరాత్రి వేళలో !

Saturday, October 20, 2012

సరసాహ్లాదిని

" పోరా,  తేరా, రారా, సారా "   ఈ పదాలను పాదాదిలో నుపయోగించి భారతార్థంలో పద్యం చెప్పాలి.

పోరాదు కృష్ణ జోలికి
తేరా దగదోయి  సభకు ధృతరాష్ట్ర !  సుతున్
రారాజు నాపవలె మన-
సారా యోచింపు మనెను సంజయు డంతన్.

Saturday, October 13, 2012

సరసాహ్లాదిని

దుగ్ధము, దగ్ధము, ముగ్ధము, దిగ్ధము   ఈ నాలుగు పదాలను పాదాదిలో ఉంచి
 కృష్ణుని పై వృత్తం వ్రాయాలి:

ఉత్పలమాల:

దుగ్ధము  లాను బాల్యమున ద్రుంచెను పూతన !  గోపికాళికిన్ 
దగ్ధము జేసె మోహమును తానయి సర్వము ! స్పర్శమాత్రచే 
ముగ్ధ మనోహరాంగి యగు మూర్తిగ మల్చెను కుబ్జ !  శౌరి! సం-
దిగ్ధము బాపి యర్జునుని దిద్దెను పోరున గీత వాక్కులన్ !

Saturday, October 6, 2012

సరసాహ్లాదిని

సమస్య : అర్థము లేని మాటలకు నందరు మెచ్చి శిరస్సు లూపరే!

పూరణ: వ్యర్థము వీనితో మనకు వాదము, లెమ్మిక ధర్మనందనా!
            స్పర్థను దూరుచుండె నిటు చైద్యుడు చక్రిని, చింత యేల యీ
            యర్థము లేని మాటలకు? అందరు మెచ్చి శిరస్సు లూప రే 
            యర్థము కోరి యీ తగవొ? ఆ హరికే ఎరుకౌను చూడగా!
 
 

Wednesday, October 3, 2012

సరసాహ్లాదిని

సమస్య : రామ పదాబ్జమే శరణురా యని పల్కెను రావణుం డహో!

పూరణ:  రామశరాగ్ని కీలలను రాజ్యము దగ్ధము కాక మున్నె శ్రీ 
             రాముని ప్రాపు పొందుమని భ్రాత వచింపగ క్రోధనేత్రుడై  
             రామను గోలుపోయి వని గ్రాలెడు మర్త్యుడు దేవుడేమి? ఏ-
             రామ పదాబ్జమే శరణురా? యని పల్కెను రావణుం డహో!
             

Tuesday, October 2, 2012

స్మరియింతును.........


 





సత్యాగ్రహ చాపమ్మున
నిత్యమ్ము నహింస యనెడు నిశిత శరాళిన్ 
దైత్యుల బోలిన దొరల య-
కృత్యమ్ముల నేసి గొనవె కీర్తిని బాపూ!

స్మరియింతును బాపూ నిను 
స్మరియించెద నో మహాత్మ! సదమల భక్తిన్ 
స్మరియింతు ననవరతమును 
హరియింపు మసత్య హింస లందరి యెదలన్.