padyam-hrudyam

kavitvam

Thursday, March 10, 2011

రామ తారక శతకము 18

86 . జనని గర్భము నందు జనియించినది మొదలు - బాల్యమునను గొంత ప్రబలు చుండి
నటుమీద కొమరు ప్రాయంబున కొన్నాళ్ళు - తల్లి దండ్రుల ప్రేమ దనరి యుండి
యవ్వన ప్రాయంబునను రతి క్రీడల - నిన్ద్రియంబుల ప్రేమ నెపుడు దగిలి
ముసలి తనంబున మునుగుచు కొన్నాళ్ళు - కార్పణ్యముల చేత కష్ట పడుచు

నిట్టి కాలంబులను నిన్ను నెరుగలేక - వృద్ధి పొందితి ప్రకృతి చే విశదమగును
కరుణ జూడుము నన్నును కర్మి యనక - రామ! తారక! దశరథ రాజ తనయ!

87 . శ్రీ రామ నా మీద చిత్తంబు రాదాయె - నా తల్లి దండ్రివని నమ్ముకొంటి
దశరధాత్మజ నీకు దయ యింత లేదాయె - నా యిల వేల్పని నమ్ముకొంటి
సత్య సంధుడ నీదు చనువింత లేదాయె - నా ప్రాణ విభుడని నమ్ముకొంటి
భక్త వత్సల నీకు భావంబు లేదాయె - నా మూల ధనమని నమ్ముకొంటి

దూర వలసెను నీ రీతి ధూర్త హరణ - నింద లేకుండ చేపట్టి నిర్వహించు
పరుల నిందించ నాకేల పరమ పురుష - రామ! తారక! దశరథ రాజ తనయ!

88 . మూఢుడు మూర్ఖుడు ముచ్చటాడగ వింత - దీనుల కల్పుల దిక్కు వింత
కోతి కోనంగులు గూడి యుండగ వింత - కుక్క నక్కలు గూడి కూయ వింత
కోపితో కుటిలుండు కూర్మి జేయుట వింత - కపట ఘాతకులెపుడు కలయ వింత
మంత్రులతో మంత్రి ముచ్చటించుట వింత - కీడు మేలెరుగక కీర్తి వింత

ఎంత వారికి లబ్దంబు లంతె గాక - ఆదరింపగ నేర్తురే యధములెల్ల
కలుగు సుజ్ఞానికే గాక ఘనత యశము - రామ! తారక! దశరథ రాజ తనయ!

89. శ్రీ రామ నీవు నా చిత్త మందే నిలిచి - రక్షింప వయ్య నన్నక్షయముగ
నన్ను రక్షింపను నాథు లెవ్వరు లేరు - నా స్వామి నీవని నమ్మినాను
తల్లి వైనను నీవె తండ్రి వైనను నీవె - వేదాంత వేద్య నిన్ వేడినాను
అయ్యోధ్య వాస ఓ అనంత రూపాయ - ఈ వేళ నీవు నన్నేలుకొనుము

నన్ను రక్షింప నిన్ను నే వేడినాను - నమ్మగా జాల నెవ్వరి నెమ్మి తోడ
నీకు ప్రియుడను నమ్మితి నీరజాక్ష - రామ! తారక! దశరథ రాజ తనయ!

90 . దీన దయాకర దీన రక్షక నీవు - కావవే నన్నిప్డు కమల నయన
పరమాత్మ పరమాత్మ పలుకు బొంకించకు - పనులకు మీపాద పద్మ సేవ
కమలేశ కమలాక్ష కరుణతో రక్షింపు - వరము లివ్వవె నాకు వరద ఈశ
లక్ష్మీశ లక్ష్మీశ లలి మీరగా నాత్మ - దలచి రక్షింపవే నీరజాక్ష

పద్మ లోచన వరనుత పారిజాత - స్వామి రక్షించు మిక నన్ను సార్వ భౌమ
నిన్ను నెప్పుడు సేవింతు నీల వర్ణ - రామ! తారక! దశరథ రాజ తనయ!

No comments: