padyam-hrudyam

kavitvam

Sunday, September 28, 2014

కూష్మాండ


బ్రహ్మాండమున్ రెప్పపాటు లో సృజియించి 
..........పెంచి పోషించెడి పెద్ద దిక్కు !
సూర్య మండలములో శోభలీనుచు నుండి
.........జగతి వెల్గించెడి పగటి చుక్క!
అష్ట సిద్ధుల నీయ నపురూప మాలతో 
.........సర్వదా సన్నద్ద చల్లనమ్మ !
ప్రాణు లందున నొప్పు రమ్య తేజస్సుగా
.........తన చాయ నింపిన దైవ శక్తి!
ప్రీతి కూష్మాండ బలి గొని ప్రేమతోడ
ప్రాణి కోటిని కాపాడు ప్రాణశక్తి
నేటి నవరాత్రులందున నియతితోడ
కొలువ కూష్మాండ శక్తిని కలుగు శుభము.
***************************************************
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ॥
దుర్గామాత నాలుగవ స్వరూప నామము ‘కూష్మాండ’. దరహాసముతో అంటే అవలీలగా బ్రహ్మాండమును సృజించుతుంది కాబట్టి ఈ దేవి ‘కూష్మాండ’ అనే పేరుతో విఖ్యాతి చెందింది.
ఈ జగత్తు సృష్టి జరుగక ముందు అంతటా గాఢాంధకారమే అలముకొని ఉండేది. అప్పుడు ఈ దేవి తన దరహాసమాత్రంతో ఈ బ్రహ్మాండాలను సృజించింది. కాబట్టి ఈ స్వరూపమే ఈ సృష్టికి ఆదిశక్తి. ఈ సృష్టిరచనకు పూర్వము బ్రహ్మాండమునకు అస్తిత్వమే లేదు.
ఈమె సూర్యమండలాంతర్వర్తిని. సూర్యమండలంలో నివసింపగల శక్తిసామర్థ్యములు ఈమెకే గలవు. ఈమె శరీరకాంతిచ్ఛటలు సూర్యకిరణ ప్రభలలాగా దేదీవ్యమానముగా వెలుగొందుతూ ఉంటాయి. ఈమె తేజస్సు నిరుపమానము. దానికి అదే సాటి. ఇతర దేవతాస్వరూపాలేవీ ఈమె తేజః ప్రభావములతో తులతూగలేవు. ఈమె తేజోమండల ప్రభావమే దశదిశలూ వెలుగొందుతూ ఉంటుంది. బ్రహ్మాండములోని అన్ని వస్తువులలో, ప్రాణులలో ఉన్న తేజస్సు కూష్మాండ ఛాయయే.
ఈ స్వరూపము ఎనిమిది భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది. అందువల్లనే ఈమె ‘అష్టభుజాదేవి’ అనే పేరుతో కూడా వాసిగాంచింది. ఈమె ఏడు చేతులలో వరుసగా కండలమూ, ధనుస్సూ, బాణమూ, కమలమూ, అమృతకలశమూ, చక్ర గదలు తేజరిల్లుతూ ఉంటాయి. ఎనిమిదవ చేతిలో సర్వ సిద్ధులనూ, నిధులనూ ప్రసాదించే జపమాల ఉంటుంది. సింహవాహన. సంస్కృతంలో ‘కూష్మాండము’ అంటే గుమ్మడికాయ. కూష్మాండబలి ఈమెకు అత్యంత ప్రీతికరము. ఇందువల్ల కూడా ఈమెను ‘కూష్మాండ’ అని పిలుస్తారు.
నవరాత్రి ఉత్సవాలలో నాల్గవరోజు కూష్మాండాదేవీ స్వరూపమే దుర్గామాత భక్తుల పూజలను అందుకొంటుంది. ఈనాడు సాధకుని మనస్సు అనాహత చక్రంలో స్థిరమవుతుంది. కాబట్టి ఈ రోజు ఉపాసకుడు పవిత్రమైన, నిశ్చలమైన మనస్సుతో కూష్మాండాదేవి స్వరూపాన్నే ధ్యానిస్తూ పూజలు చేయాలి. భక్తులు ఈ స్వరూపాన్ని చక్కగా ఉపాసించడంవల్ల పరితృప్తయై ఈమె వారి రోగాలనూ, శోకాలనూ రూపుమాపుతుంది. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములూ, ఆరోగ్యభాగ్యములు వృద్ధి చెందుతాయి. సేవకుల కొద్దిపాటి భక్తికే ఈ దేవి ప్రసన్నురాలవుతుంది. మానవుడు నిర్మల హృదయంతో ఈమెను శరణుజొచ్చిన వెంటనే అతి సులభముగా పరమ పదము ప్రాప్తిస్తుంది.
శాస్త్రాలలో, పురాణాలలో పేర్కొనబడిన రీతిలో విధివిధానమును అనుసరించి మనము దుర్గాదేవిని ఉపాసిస్తూ అనవరతము భక్తి మార్గంలో అగ్రేసరులమై ఉండాలి. ఈ తల్లి భక్తిసేవా మార్గంలో కొద్దిపాటిగానైనా పురోగమించగలిగిన సాధకునికి ఆమె కృపానుభవము అవశ్యము కలిగి తీరుతుంది. దాని ఫలితంగా దుఃఖరూప సంసారమంతా భక్తునికి సుఖదాయకమూ, సుగమమూ అవుతుంది. మనిషి సహజంగా భవసాగరాన్ని తరించడనికి ఈ తల్లియొక్క ఉపాసన అతి సులభమైన, శ్రేయస్కరమైన మార్గం. మనిషి ఆదివ్యాధులనుండీ సర్వదా విముక్తుడవటానికీ, సుఖసమృద్ధిని పొందటానికీ, ఉన్నతిని పొందటానికీ కూష్మాండా దేవిని ఉపాసించటమనేది రాజమార్గం వంటిది. కాబట్టి లౌకిక, పారలౌకిక ఉన్నతిని కాంక్షించేవారు ఈ దేవీస్వరూపంయొక్క ఉపాసనలో సర్వదా తత్పరులై ఉండాలి.
(తెలుగులో నా భావాలు .......సౌజన్యంతో)

Saturday, September 27, 2014

చంద్రఘంట

చంద్రార్థాకృతి ఘంట రూపమున శీర్ష మ్మందు చెన్నొంద దే-
వేంద్రాదుల్ నుతియింప సాధకులు సేవింపంగ సంసారపున్
సంద్రంబీది తరించు మార్గమునకై శాంతిప్రదా! చిన్మయీ!
మంద్రాస్యా! శివ! చంద్రఘంట! జననీ ! మాహేశ్వరీ ! వేడెదన్.
**************************************************************
పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ।
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥
దుర్గామాతయొక్క మూడవ శక్తి నామము ‘చంద్రఘంట’. నవరాత్రి ఉత్సవాలలో మూడవరోజున ఈమె విగ్రహానికే పూజాపురస్కారాలు జరుగుతాయి. ఈ స్వరూపము మిక్కిలి శాంతిప్రదము, కల్యాణ కారకము. ఈమె తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘాంటాకృతిలో ఉండటంవల్ల ఈమెకు ‘చంద్రఘంట’ అనే పేరు స్థిరపడింది. ఈమె శరీరకాంతి బంగారువన్నెలో మిలమిలలాడుతుటుంది. తన పది చేతులలో – ఖడ్గము మొదలయిన శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించి ఉంటుంది. సర్వదా సమరసన్నాహయై యుద్ధముద్రలో ఉండే దివ్య మంగళ స్వరూపం. ఈమె గంటనుండి వెలువడే భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులైన దుష్టులు గడగడలాడిపోతారు.
నవరాత్రి దుర్గాపూజలలో మూడవ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది. ఆ రోజు సాధకుని మనస్సు మణిపూరక చక్రాన్ని ప్రవేశిస్తుంది. చంద్రఘంటాదేవి కృపవలన ఉపాసకునికి దివ్య వస్తు సందర్శనం కలుగుతుందని చెబుతారు. దివ్య సుగంధ అనుభవము కూడా సిద్ధిస్తుంది. అలాగే వివిధాలైన దివ్యధ్వనులు కూడా వినిపిస్తాయి. ఈ దివ్యానుభవ అనుభూతికొరకు, సాధకుడు సావధానుడై ఉండాలి.
ఈ మాత కృపవలన సాధకుని సమస్త పాపాలూ, బాధలూ తొలగిపోతాయి. ఈమె ఆరాధన సద్యః ఫలదాయకము. ఈమె నిరంతరమూ యుద్దసన్నద్ధురాలై ఉన్నట్లు దర్శనమిస్తుంది కనుక భక్తుల కష్టాలను అతి శీఘ్రముగా నివారిస్తుంది. ఈ సింహవాహనను ఉపాసించేవారు సింహసదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉంటారు. ఈమె ఘాంటానాదము సంతతము భక్తులను భూతప్రేతాది బాధలనుండి కాపాడుతూ ఉంటుంది. ఈమెను సేవించినంతనే శరణాగతుల రక్షణకై అభయఘంట ధ్వనిస్తూ ఉంటుంది.
ఈ దేవీ స్వరూపము దుష్టులను అణచివేయటంలో, హతమార్చుటంలో అను క్షణమూ సన్నద్ధురాలై ఉండునదే; అయినప్పటికీ భక్తులకూ, ఉపాసకులకూ ఈమె స్వరూపము మిక్కిలి సౌమ్యముగానూ, ప్రశాంతముగానూ కనబడుతూ ఉంటుంది. ఈమెను ఆరాధించడంవల్ల సాధకులలో వీరత్వ నిర్భయత్వములతోపాటు సౌమ్యతా, వినమ్రతలు పెంపొందుతుంటాయి. వారి నేత్రాలలోని కాంతులు, ముఖవర్చస్సు, శరీర శోభలు ఇనుమడిస్తూ, సద్గుణములు వృద్ధిచెందుతుంటాయి. వారి కంఠస్వరములలో అలౌకికమైన దివ్యమాధుర్యము రాశిగా ఏర్పడుతుంది. చంద్రఘంటాదేవిని భజించేవారు, ఉపాసించేవారు ఎక్కడికి వెళ్ళినా వారిని దర్శించిన వారందరూ సుఖశాంతులను పొందుతారు. ఇలాంటి ఉత్తమ సాధకుల శరీరాలనుండి దివ్యమూ, ప్రకాశవంతమూ అయిన తేజస్సు బహిర్గతము అవుతూ ఉంటుంది. ఈ దివ్య ప్రక్రియ సామాన్యులదృష్టికి గోచరించదు. కానీ ఉత్తమ సాధకులూ, వారి అనుయాయులు మాత్రము వీటిని గ్రహించి, అనుభూతిని పొందగలరు.
మనము త్రికరణశుద్ధిగా విధ్యుక్తకర్మలను ఆచరిస్తూ, పవిత్రమైన అంతఃకరణ కలిగి చంద్రఘాంటాదేవిని శరణుజొచ్చి, ఆమెను ఉపాసించడానికీ, ఆరాధించడానికీ తత్పరులమై ఉండాలి. అలాంటి ఉపాసన ప్రభావము వల్ల, మనము సమస్త సాంసారిక కష్టములనుండి విముక్తులమై, సహజంగానే పరమపద ప్రాప్తికి అర్హులమవుతాము. నిరంతరమూ ఈ దేవి పవిత్రమూర్తిని ధ్యానిస్తూ మనము సాధనలో అగ్రగణ్యులమవ్వటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దేవి ధ్యానము మనకు ఇహపర లోకాలలో పరమ కల్యాణదాయకమై సద్గతులను ప్రాప్తింపజేస్తుంది.
(తెలుగులో నా భావాలు .......సౌజన్యంతో)

Thursday, September 25, 2014

శైలపుత్రి

శూలికి నైన కోమలివి! సొంపుగ శిష్టుల నేల, నెద్దుపై ,
శూలము దాల్చి దుష్టులను శోధన జేయుచు, నుగ్ర రూపివై
కూలగ నేయవే తృటిని! కోరి శరన్నవ రాత్రులందు నీ
మ్రోలను నిల్చి మ్రొక్కెదను మోదముతోడను శైలపుత్రికా!
**********************************************************
దుర్గామాత మొదటి స్వరూపము ‘శైలపుత్రి’ నామముతో ప్రసిద్ధికెక్కినది. పర్వత రాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు ‘శైలపుత్రి’ అనే నామము ఏర్పడినది. వృషభవాహననారూఢయైన ఈ మాత కుడి చేతిలో త్రిశూలమూ, ఎడమచేతిలో కమలమూ విరాజిల్లుతుంటాయి. ఈ అవతారమే నవదుర్గలలో మొదటిది.
పార్వతి, హైమవతి అన్నవి కూడా ఆమె పేర్లే. ఉపనిషత్తులోని ఒక కథను అనుసరించి, ఆమె హైమవతీ రూపంలో దేవతల గర్వాన్ని ఆణచివేస్తుంది.
‘శైలపుత్రి’ అవతారములో ఆమె పరమేశ్వరుణ్ణే పరిణయమాడుతుంది. పూర్వజన్మలో లాగానే ఈ అవతారంలో కూడా శంకరునికి ‘అర్ధాంగి’ అవుతుంది. నవదుర్గలలో మొదటి అవతారమైన ‘శైలపుత్రి’ యొక్క మహిమలూ, శక్తులూ అనంతములు. నవరాత్రి ఉత్సవములలో మొదటిరోజున ఈ దేవికై పూజలూ, ఉపవాసాలూ జరుపబడుతాయి. మొదటి రోజున యోగులు ఉపాసనద్వారా తమ మనస్సులను మూలాధారచక్రంలో స్థిరపరుచుకుంటారు. దీనితోనే వారి యోగ సాధనలు ఆరంభమవుతాయి.
(తెలుగులో నా భావాలు .......సౌజన్యంతో)

Tuesday, September 16, 2014

కాదేదీ కవితకనర్హం ............అగ్గిపుల్ల

కాదేదీ కవిత కనర్హం..........అగ్గిపుల్ల..........
============================
సిగరెట్టు ముట్టించి చిద్విలాసమ్ముగా 
...........రింగుల పొగలూద హంగు నీవు !
కటిక పేదకు పొయ్యి కట్టెను రాజేసి
...........వంటను జేయగా బలము నీవు !
గడ్డివాముల, పాక లడ్డముగా గాల్చి
...........వైషమ్యముల బెంచ వాటమీవు !
కాలిపోవగ తల, కట్టె పుల్లగ నుండి
...........చెవుల శుభ్రము జేయు చెలివి నీవు !
పెద్ద నిద్దుర వోవ పిడికెడు బూదిగా
.....మనిషిని మార్చెడు మహిమ నీవు!
" నిప్పుతో చెలగాటము ముప్పు మనకు,
నిప్పు కనిపెట్ట నరునకు ముప్పు వచ్చె "
కన్ను కుట్టిన వారందు రెన్న నిట్లు
నీకు నగ్గిపుల్లా! నుతుల్ నేనొనర్తు.
తలను బాదు కొనుచు ధన ధనా పెట్టెకు
తగుల బడుదు వీవు తాపమొదవ !
స్వార్థ మెరుగ బోని జన్మ నెత్తితి వమ్మ!
అగ్గిపుల్ల! జోత లమరజీవి!

Thursday, September 11, 2014

మహాలయం

అపవర్గతృషితుల కాహ్వానమును పల్కి 
..........యర్చించి సద్గతు లందు వారు
తాత ముత్తాతల తలచుక శ్రద్ధతో 
..........పిన్డప్రదానముల్ బెట్టు వారు 
తిలతర్పణమ్ముల సలిపి పితౄణము
.........తగ్గినదని మది దలచు వారు 
ఈ యేటి కీ తీరు, పై యేటికిని మాకు
.........పిలుపు రాగలదను పెద్దవారు

భారతీయార్ష సంస్కృతీ ప్రేరితులరు
'పితరు లను మాట మరచిన బిడ్డలెల్ల'
సిగ్గు జెంద పైవారి నర్చించి తనుపు
భాద్రపద మహాలయ దివ్య పక్షమిద్ది.


Photo: అపవర్గతృషితుల కాహ్వానమును పల్కి 
..........యర్చించి సద్గతు లందు వారు
తాత ముత్తాతల తలచుక శ్రద్ధతో  
..........పిన్డప్రదానముల్  బెట్టు వారు 
తిలతర్పణమ్ముల  సలిపి పితౄణము
.........తగ్గినదని మది దలచు వారు 
ఈ యేటి కీ తీరు, పై యేటికిని మాకు 
.........పిలుపు రాగలదను పెద్దవారు 

భారతీయార్ష సంస్కృతీ ప్రేరితులరు  
'పితరు లను మాట మరచిన బిడ్డలెల్ల' 
సిగ్గు జెంద పైవారి  నర్చించి తనుపు  
భాద్రపద మహాలయ దివ్య  పక్షమిద్ది.

Wednesday, September 3, 2014

బాపు లేడని........



'బాపు బొమ్మ' యేడ్చె బావురు మంచును  
'కుంచె' కుమిలి పోయె  గొల్లు మనుచు 
కళలు తప్పి పోయె 'కాన్వాసు' మూగయై 
'రంగు' మాసి  పోయె రంగు వెలసి .