padyam-hrudyam

kavitvam

Friday, July 29, 2011

చిన్మయ రూపిణీ !


కంతుని వైరి నీ సగము కాల విషమ్మశనమ్ము వానికిన్ !
చెంతను గంగ నీ సవతి చిందులు ద్రొక్కుచు నుండు నిత్యమున్ !
దంతి ముఖుండు నీ సుతుడు తానొక మూషిక మెక్కుచుండు ! ఏ
చింత లెఱుంగ వైనఁ భళి! చిన్మయ రూపిణి ! చిద్విలాసినీ !

Friday, July 22, 2011

చిన్మయ రూపిణీ !


మ్రొక్కగ భక్తితో నిలచి మ్రోలను నీ పద మంటి యమ్మరో!
దిక్కవు నీవె యంచు కడు దీనత, చూచుచు మిన్న కుందువా?
ఎక్కడ బోదు? నాకికను యెవ్వరు దిక్కు? జనార్తిహారిణీ !
చిక్కుల బెట్టబోకు మిక చిన్మయ రూపిణి! చిద్విలాసినీ!

Thursday, July 14, 2011

చిన్మయ రూపిణీ !


పలుకుల తల్లి ! నీ కృపకు పాత్రుని జేయవె జ్ఞాన మిచ్చి నన్
కలుముల కాంత ! నీ కరుణ కాంచన మిచ్చి కుబేరు జేయవే
చలువులగట్టు పుత్రి ! భవ జాడ్యము బాపి పరమ్ము జూపవే
చిలుకవె నీ దయామృతము చిన్మయ రూపిణి ! చిద్విలాసినీ !

Friday, July 8, 2011

చిన్మయ రూపిణీ !


మేలిమి బంగరున్, ధనము, మేడలు, మిద్దెలు, భూషణంబులున్,
ఆలును, బిడ్డలున్, సఖులు నన్ని సుఖమ్ము లశాశ్వ తంబులే,
చాలును నీ పదాబ్జముల శాశ్వత సన్నిధి నాకు నంబికా!
శ్రీ లలితా! భవాని! శివ! చిన్మయ రూపిణి! చిద్విలాసినీ!

Friday, July 1, 2011

చిన్మయ రూపిణీ !


నీ కరుణన్ సృజించెడిని నీరజ సంభవు డెల్ల లోకముల్,
నీ కృప నేలు లోకముల నీరజ నాభుడనంత శక్తుడై,
నీ కను లెఱ్ఱ నౌటను త్రినేత్రుడు వాని లయింప జేసెడిన్!
శ్రీకర మౌను నీ రచన! చిన్మయ రూపిణి! చిద్విలాసినీ!