padyam-hrudyam

kavitvam

Monday, March 7, 2011

రామ తారక శతకము 15

71 . శ్రీ రామ జయ రామ సింధు బంధన రామ - కారుణ్య సింధుగంభీర రామ
వారిజోద్ధర రామ వైకుంఠ పతి రామ - దీన నాయక దేవ దేవ రామ
కౌసల్య సుత రామ కాకుత్థ్స కుల రామ - కంస మర్దన శుభాకార రామ
. మా వధూవర రామ మానవేశ్వర రామ - ఆదిత్య కులజ సర్వాత్మ రామ

కర్మ భంజన లోక లోకాభిరామ - నిర్మలాత్మక యయోధ్య నిలయ రామ
నీవె గతి మాకు రక్షించు నిగమ వినుత రామ - రామ! తారక! దశరథ రాజతనయ !

72 . ఎన్ని జన్మంబుల నెత్తితినో కాని - మాధవు దలపక మంద మతిని
వెతల బొందితి గాని యవని మీదను నిప్డు - కాకుత్థ్సు గానక గర్వ మతిని
కాయంబు లన్నియు మాయంబు లాయెనో - గోపాలు నుతి లేక గూలు క్షితిని
ఎందరు తలి దండ్రు లేమైరి యెప్పుడు - రాఘవు దలచక రట్టు వడితి

యింకనైనను రఘు రాము నిపుడు మదిని - బుద్ధిలో నన్య మార్గంబు బొడమ నీక
నను దినంబును శ్రీ రాము నాత్మ దలతు - రామ! తారక! దశరథ రాజతనయ !

73 . ఓర్పు గనుగొన దలచి యొరసి చూచెద వేమొ - పట్టవలసిన కొమ్మ బట్టినాను
వదల వలెనని బహు యుపములు జేసితే - మేల్కొని గట్టిగా మెదలు వాడ
నీ లాగు గాదని యాయాస బెట్టితే - ముకుళిత హస్తుడై మ్రొక్కు వాడ
మ్రొక్కిన గైకొనక మోస పుచ్చెద నంటె - పాదార విన్దముల్ పట్టు వాడ

తల్లి వైనను నీవె నా తండ్రి వైన - దాత వైనను నీవె నా దైవ మనుచు
పాహి పాహని పలుమారు బలుకు వాడ - రామ! తారక! దశరథ రాజతనయ !

74 . వాసుదేవుని పూజ వదలక జేసితే - వైభవంబులు గలుగు వసుధ లోన
గోవిందు నెప్పుడు కొలిచి సేవించితే - సంపద లెప్పుడు చాల గల్గు
నారాయణ స్మరణ నమ్ముక యున్నచో - భుక్తి ముక్తి యు రెండు పొసగ నిచ్చు
విష్ణు సంకీర్తన విడువక జేసితే - దారిద్ర్య దు:ఖముల్ దగుల కుండు

నరులకెల్లను హరి సేవ నయము సుమ్ము - అఖిల సంపదలును గల్గు నాశ్రితులకు
సకల దురితములెల్లను సమసి పోవు - రామ! తారక! దశరథ రాజతనయ !

75 . పంకజాసన జనక బ్రహ్మాండ నాయక - పంకజ లోచన పరమ పురుష
శంకర వందిత సంకర్ష ణవతార - పంకజాక్ష విలోల పద్మ నయన
లక్ష్మీశ యోగీశ లక్ష్మణాగ్రజ రామ - ధాత్రీశ యోగీశ ధర్మ హృదయ
సకల లోకాతీత సర్వజ్ఞగుణ శీల - యకలంక సూర్య కోటి ప్రకాశ

సకల జీవ దయాపర సార్వభౌమ - క్షీర సాగర శయన రక్షించుమయ్య
నిన్ను నే నమ్మి యున్నాను నీరజాక్ష - రామ! తారక! దశరథ రాజతనయ !

No comments: