padyam-hrudyam

kavitvam

Wednesday, December 7, 2022

దత్తా




ఘనునకు నత్రిపుత్రునకుఁ గామిత దాయికి నా దిగంబరాం
గునకును భస్మ లేపిత సుకోమల దేహికిఁ బాపహారికిన్    
అనఘనుఁ గూడి దివ్య దరహాస సముజ్జ్వల దీప్త చంద్రికల్ 
దనరఁగ బ్రహ్మ విష్ణు శివ తత్త్వములం బ్రకటించు మూర్తియై 
"మనమున నార్తితోఁ దలఁచు మాత్రనె నేఁ జనుదెంచు వాఁడఁ ద 
త్క్షణమునె, స్మర్తృగామి నిల, దత్తుఁడ నైతిని సాధుకోటి" కం 
చని యభయమ్ము నిచ్చి, శరణన్న కుబుద్ధుల నైన ప్రేమతోఁ 
దన దరిఁ జేర్చి దుష్ట కలి తాపములన్ హరియించు స్వామికిన్ 
బ్రణతు లొనర్తు భవ్య పదబంధము నిమ్మని నాకు సత్కృపన్
వినయము మీర మ్రొక్కెదను వీడక నన్ను ననుగ్రహించుకై.

Monday, October 24, 2022

దీపావళి 2022

 


నరకునిఁ బరిమార్చి ధరఁ గాచి పరమాత్మ 

...కరుణను గురిసిన పరమదినము

వనజనాభుని రాణి వసుధలో నింటింటఁ 

...గొలువయి సిరులను గురియు దినము 

దీపాల కాంతిలో దేదీప్యమానమై 

...భువి పొంగిపోయెడు పుణ్యదినము 

బాణసంచా కాల్చు బాలపాపల కన్ను 

...లానంద వార్ధుల నూను దినము 


పుడమి వానల చెమ్మకుఁ బుట్టు క్రిములు 

నాశమై నేల శుభ్రమౌ నీటు దినము 

రమ్య దీపావళీ మహద్రాజసంపు 

నెలవు భారతజనయిత్రి నిండుమనము.


Monday, August 15, 2022




నింగిని స్వేచ్ఛగా నెగురు నిద్దపు వన్నెల జాతి గుండె లు ప్పొంగెడు రీతి భారత విభూతులఁ జాటుచు విశ్వ మెల్ల యీ
బంగరు నేలకుం దగిన భవ్య పతాకపు రూపశిల్పి! యో
పింగళి వెంకయార్య! నినుఁ బ్రీతిఁ దలంతు మెడందల న్సదా.

*****

డెబ్బది యైదేండ్లైనది
అబ్బో మనకెదురులేదు ఆహా ఓహో
ఇబ్భరతావని నని మన
ముబ్బుట సరి యౌనె స్వేచ్ఛ యున్నదె నిజమై?

నేతి బీర లోని నేయి ౘందము కాదె
నేటి స్వేచ్ఛ గనగ నిజముగాను
దొరలు మారలేదు దొరల రంగే మారె
పాలకులను దేశ భక్తి డొల్ల.

*****

నేతల చిత్తవృత్తులను నీతి నిజాయితి నిర్మలత్వమున్
బ్రీతియు దేశభక్తి ప్రభవిల్లుత, దేశపు భాగ్యమే సదా
చేతల బల్లవించుచును స్వేచ్ఛకు మాన్యత దక్కుగాత, యే
భీతులు లేక పౌరులు వివేకముతో గురితించి బాధ్యతల్
పాతర వేయుగాత తమ భావికి కైదువ యోటు హక్కుతో
మేతల కాలవాలమయి మెక్కుచు స్వార్థపుటూహలెక్కువై
జాతి సుసంపదన్ పదవి చాటున రెచ్చెడి దుష్టబుద్ధులన్,
పూతలు గాత భారతికి మోమున వాడని స్మేరపుష్పముల్.


Wednesday, July 13, 2022

గురుపౌర్ణమి 2022

 


సాత్యవతేయునిం దలతు సచ్చరితుం బటుసౌమ్యుఁ గౌరవా
పత్యపుఁ గారణుం శ్రుతివిభాజనుఁ బంచమవేదకర్తనున్
నిత్య విరాగ మూర్తి శుకు నెయ్యపుఁ దండ్రిని బాదరాయణుం
జిత్యభిరక్తు భారత విశిష్ట సనాతన ధర్మకేతువున్.


సారము లేని సంసృతినిఁ జచ్చుచుఁ బుట్టుచు దారి గానకన్
వారును వీరనంచు నలువంకలఁ జూచెద రేలొ వ్యర్థులై
చేరక సద్గురూత్తముని శ్రీపద కంజయుగమ్ము శక్యమే
పారముఁ గానఁబోని భవ వార్థిఁ దరించగ నెట్టి వారికిన్.


గురు వన ధాత్రిపై నడచు కూరిమి దేవుడు జ్ఞానమార్గమున్
గరపు విశిష్ట బోధకుఁడు గానక ధర్మపథమ్ము  ఖిన్నతన్
దిరిగెడు వేళ ధైర్యమిడి తిన్నని  మార్గముఁ జూపు దివ్వె స
ద్గురు వును సాటి మానవుని కోపు దలంచుట పాతకం బగున్.
 ‌‌

Sunday, July 10, 2022

శయనైకాదశి

 



లోకము లేలు స్వామివి విలోకన కార్యము మాని పండినన్

లోకము లేమి కావలెను లోకపతీ! మముఁ జూచునప్పుడే 

నీ కనుఁగప్ప నెంచుదుమె నిద్దుర వోయినఁ బట్ట శక్యమే

యీ కలి కాలబుద్ధుల నికే గతిఁ గాతువొ చెప్పు శ్రీహరీ!

Saturday, July 9, 2022

జానకీ వధూటి

 



రామచంద్రోపాఖ్యానము అనే కావ్యం లోని ఒక సుందరమైన పద్యం. కవి పేరు : శ్రీ వారణాసి వేంకటేశ్వర కవి. ద్వితీయాశ్వాసం లోని 131 వ పద్యం.

సందర్భం: సీతారాముల కల్యాణ సమయంలో సీతావధూటిని పెండ్లికూతురును చేసే ఘట్టం.

సీ. అబ్దచంద్రశరాస నాబ్జాబ్దశష్కులీ

..కచముఖభ్రూనేత్ర గండకర్ణ

హీరకందుకబింబ కీరచంపకచంద్ర

..రదచుబుకోష్ఠవా గ్ఘ్రాణహాస

దరబిసపల్లవ ధరతరంగమృగేంద్ర

..గళభుజకరకుచ వళివలగ్న

మహికరతూణక మఠదంతితారకా

..కటిసక్థిజంఘాంఘ్రి గమననఖర


తే.గీ. కాంచన శిరీష కుసుమ సత్కాంతిదేహ

మాంగళిక దివ్య లక్షణ మహిత యగుచు

రఘుకులోద్భవు సామ్రాజ్య రమ యనంగ

జనకసుత యొప్పెఁ బరిణయ సమయ మందు. 

పద్యం క్రమాలంకారంలో శోభిస్తోంది. 1, 3, 5, 7 సీసపాదాల్లో ఉపమానాలను, 2, 4, 6, 8 సీసపాదాల్లో ఉపమేయాలను చెప్పారు కవి.

అన్వయం:

అబ్ద(మేఘం)-కచ, చంద్ర-ముఖ, శరాసన(విల్లు)-భ్రూ, అబ్జ-నేత్ర, అబ్ద(అద్దం)-గండ(చెక్కిలి) శష్కులీ(చక్కిలము)-కర్ణ

హీర(వజ్రం/రవ్వ)-రద(పలువరుస), కందుక-చుబుక, బింబ-ఓష్ఠ, కీర-వాక్, చంపక-ఘ్రాణ, చంద్ర-హాస

దర(శంఖము)-గళ, బిస(తామరతూడు)-భుజ, పల్లవ-కర, ధర(కొండ)-కుచ, 

తరంగ-వళి, మృగేంద్ర-వలగ్న(నడుము)

మహి(భూమి)-కటి, కర(తొండము)-సక్థి, తూణ(అమ్ములపొది)-జంఘ, కమఠ-అంఘ్రి, దంతి-గమన, తారకా-నఖర

కాంచన శిరీష కుసుమ సత్కాంతిదేహ

మాంగళిక(ప్రణవము) దివ్య లక్షణ మహిత యగుచు

రఘుకులోద్భవు సామ్రాజ్య రమ యనంగ

జనకసుత యొప్పెఁ బరిణయ సమయ మందు.

భావం:

పెండ్లి వేళ సీతాకుమారి 

మేఘము వంటి నల్లనైన కబరీ బంధముతోను, చంద్రుని వంటి ముఖమండలము తోను, వింటిని బోలిన కనుబొమలముడి తోను, పద్మముల వంటి కన్నుల తోను, అద్దాలవంటి చెక్కిళ్ళతోను, ౘక్కిలాల వంటి చెవులతోను ప్రకాశిస్తోంది.

ఆమె పలువరుస వజ్రాల్లాగ, చుబుకం చెండులాగ, పెదవులు దొండపండ్లలాగ, వాక్కులు చిలుకపలుకుల్లాగ, నాసిక చంపకపుష్పంలాగ, చిరునవ్వు చంద్రహాసం లాగ వెలిగిపోతున్నాయి. 

జానకీదేవి కంఠం శంఖం వలెను, భుజాలు తామరతూడుల వలెను, చేతులు చివుళ్ళ వలెను,  కుచయుగ్మము  కొండలవలెను, వళులు అలల వలెను, నడుము సింహ మధ్యము వలెను అందగిస్తున్నాయి.

ఆమె కటిభాగం విపులంగాను, తొడలు ఏనుగు తొండాలుగాను, కాలి పిక్కలు అమ్భులపొదులుగాను, పాదాలు తాబేటి చిప్పలుగాను, నడకలు గజగమనాలుగాను, గోళ్ళు తారకలుగాను కాంతు లీనుతున్నాయి,

వైదేహి తనూలత బంగారు దిరిసెన పువ్వు వంటి మంచి కాంతితో భాసిస్తోంది. 

ఓంకారము వంటి గొప్ప దివ్య లక్షణముతో రఘుకులోద్భవుడైన రామచంద్రుని సామ్రాజ్య లక్ష్మియా అన్నట్లుగా జనకసుత యైన సీతామాత శోభ లీనుతోంది.

-శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ సౌజన్యం తో..

Monday, May 16, 2022

అన్నమయ్య



అదివో అల్లదివో యటంచు తన నేత్రాబ్జంబులన్ గట్టి వై
చి దివారాత్రులు శ్రీనివాసమును సంసేవించుచున్ శ్రీహరిన్
మదిలో బాడుచు వేంకటాధిపుని ప్రేమ న్భక్తిని న్వేదనన్
తుది దాక న్మన అన్నమయ్య చనె నస్తోకంపు గైవల్యమున్.

ఒకచో నార్తిని వేడు వేరొకెడ తా నూగు న్మహోన్మాదియై
ఒకచోటం గని ముద్దు సేయు హరి నోహో  బిడ్డడా యంచు నిం
కొకచో నాట్యము సేయు ప్రేమికగ తన్నూహించుక న్భర్తగా
నిక సర్వస్వము నీవ  యంచు మిగులు న్నిర్వేదియై యొక్కెడన్.

అచ్చ తెనుంగు భాష కొక అద్దము సూడగ అన్నమయ్య తా
మెచ్చి రచించినట్టి పలు మేల్మిపదాల్ మరి యంతె కాదు సూ
నచ్చిన సంస్కృతంబునను నాణ్యత వొంగులువార నెన్నియో
వచ్చె పదాలు  వాక్కునను వాహినులై మన అన్నమయ్యకున్.

పదకవితా పితామహుడు భవ్యపదమ్ముల వేంకటాధిపున్
హృదయపు లోతులందు జనియించిన భక్తిని జేసె సన్నుతిన్ 
పదముల బట్ట జాలు మన స్వామిని బుట్టుట సున్న మోక్ష స 
త్పద మది చేతి కందు నని పాడెను వేడెను బొందె ముక్తినిన్.


Sunday, April 10, 2022

కల్యాణం కమనీయం




 నేటికిపండె నా తపము నీలమనోహరదేహు జేర్చి తి
చ్చోటికి నప్పగించితిని సుందరి సీతకు నామె దన్నుతో
మేటి ధనుర్ధరుండు పరమేష్ఠికి దండ్రి వధించి రావణున్
గాటపు మేలొనర్చును జగమ్ముల కంచు దలంచె మౌనియున్.

ఇనకుల సోము డెక్కిడె మహేశునిచాపము నేడు నా కహో
ముని పచరించె సత్కృతము పుణ్యము పండిన దిచ్చి వీర్యశు
ల్కను రఘురామమూర్తి కిక కన్నులపండువుగా వివాహమున్
బొనరిచి  ధన్యు నయ్యెదని పొంగె గడుంగడు బ్రహ్మవేత్త దాన్.

ఎప్పుడు వచ్చునో ధనువు నెప్పుడు త్రుంచునొ నా మనోహరుం
డెప్పుడు లంక కేగుదునొ యెప్పుడు రావణు డీల్గునో యటం
చెప్పటి కప్పుడే కనుల నింతలు చేసుక చూచుచుంటి నా
కిప్పుడు పండె నోములని యెంతయు జానకి పొంగె బ్రేమతో.

హరుని ధనుస్సు జేగొనిన యా క్షణకాలము వేదిపై మనో
హరిని గనంగ తీయనయి యాగిన, దే గతి నెక్కుపెట్టితిన్
శరమును, లాగితిన్ గుణము, జయ్యన ద్రుంచితి నే నెఱుంగ నా 
సరిజవరాలి జూచి వివశత్వము నొంది యనెంచె రాముడున్.

కుశలము గూర్చె గుఱ్ఱలకు గూర్మిని గౌశికు డెన్న మౌనికిన్
వశ మొనరించి బాలురను వంతను బొందితి గాని చూడ స ద్యశ మది నాకు వియ్య మన నా మిథిలేశునితోడ నంచు దా
దశరథభూపు డెంతయు ముదమ్మున నేగె విదేహభూమికిన్.

దివ్యమౌ పెండ్లిని దిలకించ తారకల్ 
...దిగివచ్చి ముత్యాల తీరు నొప్పె!
పద్మాక్షి జానకి పద్మ హస్తాలలో 
...బద్మ రాగాలనే భ్రాంతి గల్గె!
శ్రీ రామచంద్రుని శిరసుపై రాలుచో 
...దెల్ల మల్లెల వోలె జల్లులాయె!
నీల దేహమ్ముపై జాలువారెడు వేళ 
...నింద్ర నీలమ్ములై యింపు గొలిపె!

జానకీ రామచంద్రుల శుభ వివాహ 
సమయమున నొండొరుల్ వేడ్క సందడించ
బోసికొను తలబ్రాలిట్లు భాసమాన 
మగుచు కల్యాణకరములై జగతి గాచు.

Saturday, April 2, 2022

శుభకృత్




విభవము పండ కర్షకులు వేసిన పంటలు పైర్లు వృద్ధియై
ప్రభలు సెలంగ వర్ణమయ పత్రసుమాళి వనాల రాజిలన్ 
శుభ మగు గాత ధాత్రి మను స్థూల సుసూక్ష్మ చరాచరాళికిన్
శుభకృతు రాకతో వసుధ శోభిలు గాత వసంత వాసమై.

శుభతరపూరితాంభముల శుభ్ర సువాహినులై నదుల్ పున
ర్విభవము నొందుగాత జల వెల్లువలై భువి గర్భమందు లో
టుభయము మాసి నీటికి బటుత్వము హెచ్చుత బ్రాణి వర్థిలన్
శుభకృతు రాకతో జలము శోభిలు గాత మరంద మాధురిన్.

శుభఫలదాతృ యజ్ఞముల సోమమఖాదుల బ్రజ్వలించుతన్
బ్రభ లుడుగంగ గేహ వన ప్రాంతములన్ దహియించు వేళలో
నభయము నీయ గీలలు రయమ్మె యడంగుత మేలుగూర్చుతన్
శుభకృతు రాకతో నగిని శోభిలు గాత మహత్త్వ రోచులన్.

శుభసుమగంధ మాధురుల సొక్కగ జీవులు మందవీచులన్
విభవము మీర బంచుచును వీడి ప్రచండ ప్రమాద ధోరణుల్
సుభగములై చరించుత ప్రచోదన మిచ్చుత మేఘపంక్తికిన్
శుభకృతు రాకతో తతము శోభిలు గాత మనోజ్ఞ వీచియై.

శుభదములౌ గ్రహమ్ములను సొంపగు తారల సూర్యచంద్రులన్
రభసము గూర్చ బేర్చుచును రట్టొనరించెడు దుష్ట శక్తు లే
యభముల నీని రీతిని నియంత్రణ జేయుచు వెల్గు గావుతన్
శుభకృతు రాకతో నభము శోభిలు గాత శుభాలవాలమై. 


పంచభూతములును బంచ శుభమ్ముల

మంచి జేయుచుండి త్రుంచి చెడును
మించు జీవనమ్ము లంచు దలంచెద
నెంచు మిది శుభకృతు కొంచె మెదను.




వచ్చుగాక యుగాది...

పిచ్చి పట్టి పుతిన్ సమస్తము  బ్రేల్చి వేయగ నుక్రెయిన్

చిచ్చులో బడి బూది గాగ వసించు తావులు మోదమై

రెచ్చిపోవుచు నాట్య మాడగ మృత్యుదేవత యెల్లెడన్

వచ్చుగాక వసంత మే గతి బాడు గోయిల విచ్చు బూల్?



Tuesday, January 25, 2022

శ్రీ శ్రీ శ్రీ జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి స్తుతి




 శ్రీ శ్రీ శ్రీ జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారిని స్మరించుకుంటే   వారు  సనాతన ధర్మానికి దేశానికి చేసిన కృషి కి కృతజ్ఞత ఇచ్చినట్లుగా భావించాలి.

 వారిపై ఎందరో స్తోత్రాలు వ్రాసారు. అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ వారి పరంపరలో వచ్చిన శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామి వారు ఒక 10 శ్లోకాలు వ్రాసారు.

 "ఆత్మావై పుత్ర నామాసి" అని తండ్రికి కొడుకుకి భేదం లేదంటారు. అలాగే ఆ ఆచార్య పరంపరలో శ్రీ చంద్రశేఖరులకు శ్రీ విజయేంద్రులకు భేదం లేదనిపిస్తుంది.

 ఈ శ్లోకాలు ప్రధానంగా చిత్తశుద్ధిని ఇమ్మని ప్రార్థిస్తూ ఉంటాయి. నిజానికి కావాల్సింది అదే. అది ఉంటే జీవితం సార్థకమే. 

***

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం; చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం  

***

శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్తుతి


శృతిస్మృతిపురాణోక్త ధర్మమార్గరతం గురుమ్ |

భక్తానాం హితవక్తారం నమస్తే చిత్తశుద్ధయే || ౧ || 


అద్వైతానందభరితం సాధూనాముపకారిణమ్ |

సర్వశాస్త్రవిదం శాంతం నమస్తే చిత్తశుద్ధయే || ౨ ||


ధర్మభక్తిజ్ఞానమార్గప్రచారే బద్ధకంకణమ్ |

అనుగ్రహప్రదాతారం నమస్తే చిత్తశుద్ధయే || ౩ ||


భగవత్పాదపాదాబ్జవినివేశితచేతసః |

శ్రీచంద్రశేఖరగురోః ప్రసాదో మయి జాయతామ్ || ౪ ||


క్షేత్రతీర్థకథాభిజ్ఞః సచ్చిదానందవిగ్రహః |

చంద్రశేఖర్యవర్యో మే సన్నిధత్తా సదా హృది || ౫ ||


పోషణే వేదశాస్త్రాణాం దత్తచిత్తమహర్నిశమ్ |

క్షేత్రయాత్రారతం వందే సద్గురుం చంద్రశేఖరమ్ || ౬ ||


వేదజ్ఞాన్ వేదభాష్యజ్ఞాన్ కర్తుం యస్య సముద్యమః |

గురుర్యస్య మహాదేవః తం వందే చంద్రశేఖరం || ౭ ||


మణివాచకగోదాది భక్తివాగమృతైర్భృశం | 

బాలానాం భగవద్భక్తిం వర్ధయంతం గురుం భజే || ౮ ||


లఘూపదేశైర్నాస్తిక్యభావమర్దన కోవిదమ్ |

శివం స్మితముఖం శాంతం ప్రణతోఽస్మి జగద్గురుమ్ || ౯ ||


వినయేన ప్రార్థయేఽహం విద్యాం బోధయ మే గురో |

మార్గమన్యం న జానేఽహం భవంతం శరణం గతః || ౧౦ ||


ఇతి శ్రీ విజయేంద్ర సరస్వతీ రచితం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్తుతి సంపూర్ణం.


🙏🙏🙏🙏🙏


సేకరణ శ్రీ Svsn Sarma