padyam-hrudyam

kavitvam

Thursday, January 26, 2012

చిన్మయ రూపిణీ !


కాలుని దూతలెట్లు నను కాల్పురి దోడ్కొని పోగలారు పా-
పాలు నశించి పోయినవి పావనమయ్యెను జన్మమింక నీ
శ్రీ లలితాంఘ్రి రేణువుల శీర్షమునన్ ధరియించుటన్ జుమీ
చాలిక జన్మ బంధములు చాలును చిన్మయ రూపిణీ! పరా!

Saturday, January 21, 2012

చిన్మయ రూపిణీ !


ప్రాతస్సంధ్యను గొల్తు నిన్ను జననీ పాపఘ్ని గాయత్రిగా!
మాతా దల్చెద నిన్ను నా యెడదలో మధ్యాహ్న మందంబగా!
జోతల్ సాయపు సంధ్యఁ వేళ శుభ తేజోమూర్తి వౌ లక్ష్మిగా !
చేతల్, చిన్మయ రూపిణీ! పలుకు, నా చిత్తమ్ము నీవే సుమా!

Thursday, January 19, 2012

పసిదనాల జాలు




పట్టు పరికిణీయు, పాపట బొట్టును,
పూల జడయు, కుచ్చు, వాలు చూపు,
చిలిపి నవ్వు రువ్వు చిట్టి మైథిలి! మురి-
పాల పసి దనాల జాలు నువ్వు.

Sunday, January 15, 2012

రమ్య రాగాల డోల సంక్రాంతి హేల


ఉత్తరాయణ పుణ్యకాలోద్భవమున
మకర సంక్రాంతి పురుషుడు సకల జీవ
కోటి కిడుగాక శుభముల కోటి నుర్వి
ననుచు కాంక్షింతు మనసార ననఘులార.

రంగుగ రంగవల్లులను రాజిలు గొబ్బియలుంచి కన్నియల్
హంగగు పట్టు పుట్టముల నాడుచు పాడుచు పూజసేయుచున్
పొంగుచు పొంగలిన్ దినెడి పొల్పగు సంక్రమణంపు వేళలో
ముంగిలి పర్వ శోభలను మోదము గూర్చెడు నెల్లవారికిన్.

వందన మాచరింతు నపవర్గతృషీతుల కంజలించెదన్
ముందుగ మాకు నందరికి పూర్వులు పూజ్యులు భక్తి నా మదిన్
సందడి చేయగా మకర సంక్రమణంబున తర్పణంబులన్
పొందుగ నిచ్చి దీవెనల పొందెద వృద్ధిని పొంద సంపదల్

Friday, January 13, 2012

చిన్మయ రూపిణీ !


శ్రీమాతా! భువనైకరాజ్ఞి! ధరణీసింహాసనాధిష్టితా!
కామారీతనుతాపహారిణి! మహాకైలాసవాసప్రియా!
శ్యామాభా! జలజాసనా! సులలితా! శాకంబరీ! శాంకరీ!
రామా! చిన్మయరూపిణీ ! శరణమో రాజీవపత్రేక్షణా!

Friday, January 6, 2012

చిన్మయ రూపిణీ !




శంకరి! శాంభవీ! విజయ! చంద్రకళాధరి! చారుహాసినీ!
పంకజలోచనీ! పరమ పావని! భక్తజనార్తి హారిణీ!
సంకటమోచనీ! దనుజ సంగర రోషిణి! దుఃఖ నాశనీ!
శంకలు మాని యేలగను జాలమె? చిన్మయ రూపిణీ! శివా!

Sunday, January 1, 2012

ఆంglaవtsaరాdi


కం. విష్యూ హ్యాపీ న్యూ యియ-
రిష్యూ సాల్విల్బి సాల్వు డెర్లీ దిసియర్
బిష్యూర్ టూస్పెండ్
క్రంచింగ్
కాష్యూస్ మైఫ్రండు! టైము కంఫర్టబ్లీ !
*********************************************

wish you happy new year
issues all will be solved early this year
be sure to spend crunching
cashews my friend!
time comfortably !