padyam-hrudyam

kavitvam

Friday, February 20, 2015

ఉల్లి హితవు.




ఉల్లి చేయు మేలు తల్లియు జేయదు
ఉల్లి పేదవాని యుట్టి ముద్ద
గుండె బలము నిచ్చి కుదురుగ జేయును
వైద్యు లనెడి మాట వలెను తెలియ.
ఉల్లి తోడి వంట లుల్ల మలరజేయు
ఉల్లి పెసర యట్టు నుల్లి పకొడి
యుల్లి రవ్వ దోసె యుల్లి సమోసాల
నూహ జేయ నోట నూరు నీరు.
ఉల్లి దినిన మనకు నుప్పొంగు తామస
మందు చేత విడువ మంచి యగును
సృష్టి జేసె దీని ఋషి కౌశికుండని
కొంద రందు రయ్య గుణము చెప్పి.
ఉల్లి ధరల మితిగ నుంచుట ప్రభుతకు
గొప్ప చిక్కు దెచ్చు, కూల్చి వేసె
నొక్క నాడు కొంప నోటమి పాల్జేసి
రాజకీయ మందు రచ్చ జేసి.
పొరల నొక్క టొకటి బిరబిరా యొలిచిన
రమ్యమైన యుల్లి రంగు దేరు
నట్లె మానవుండు నాత్మను గప్పిన
పొరల తీసి వైచ మోక్షమగును.
కంట నీరు వచ్చు ఘాటుకు, యుల్లిని
కష్టమైన నొలువ నిష్టమైన
వంటకమ్ము దొరుకు, బ్రతుకున కష్టము
తట్టుకొన్న మనకు గట్టి మేలు.