padyam-hrudyam

kavitvam

Tuesday, March 8, 2011

రామ తారక శతకము 16

76 . నీల మేఘ శ్యామ నిగమ గోచర రామ - ఫాల లోచన వినుత పరమ పురుష
దశరథ నందన తాటకి మర్దన - ఇందీవరేక్షణ యిన కులేశ
అయ్యోధ్య పూరి వాస యాశ్రిత జన రక్ష - కల్యాణ గుణ భర కంస హరణ
విధి శివ రక్షక విష్ణు స్వరూపక - బుధ జన పాలక పుణ్య పురుష

జానకీ నాథ మీకును జయము జయము - సకల బ్రహ్మాండ నాయక శరణు శరణు
కాచి రక్షించు నన్నును కామ జనక - రామ! తారక! దశరథ రాజ తనయ!

77 . రామ నామామృత రసము ద్రావియె కదా - మున్నజా మీళుడు ముక్తు డగుట
రామ నామామృత రసము ద్రావియె కదా - ముని పత్ని శాప విముక్త యగుట
రామ నామామృత రసము ద్రావియె కదా - కలికి చిలుకను బెంచ గలిగె ముక్తి
రామ నామామృత రసము ద్రావియె కదా - యప వర్గ మబ్బె ఖట్వాంగు నకును

రామ నామామృతంబు సంరక్ష సేయ - ముక్తి మార్గంబు గల్గును మూఢు లకును
రామ నామామృతంబున రసికులకును - రామ! తారక! దశరథ రాజ తనయ!

78 . పంకజాక్షుని పూజ పలుమారు జేయక - పరుల నిందించుట పాటి యగునె
విష్ణు సంకీర్తనల్ వీనుల వినకను - పరుల మెచ్చుట నీకు భ్రాంతి యగునె
శేష శయనుని చాల చెలగి కీర్తించక - పరుల కీర్తించుట భవ్య మగునె
నారాయణ స్మరణ నమ్మక యుండక - పర దేవతల భజన పాటి యగునె

శ్రీ రమా నాథు డెప్పుడు జిహ్వ యందు - పుణ్య వరులైన జనులెల్ల పొందు మీర
తలచు వారికి మోక్షంబు తథ్య మరయ - రామ! తారక! దశరథ రాజ తనయ!

79 . సాకేత పూరి రామ శరణు జొచ్చితి నీకు - రక్షింపవే మమ్ము రామచంద్ర
దయతోడ బ్రోవవే దశరథాత్మజ నన్ను - కరుణతో బ్రోవవే కమల నయన
కౌసల్య సుత నన్ను కాచి రక్షింపవే - మన్నించవే నన్ను మదన జనక
జానకీ పతి చాల సత్కృపతో నాకు - విజయంబు నీయవే వేద వేద్య

పరమ పద రామ గోవింద పద్మ నాభ - భక్త వత్సల లోకేశ పరమ పురుష
ధర్మ చరితార్థ దనుజ విదార శూర - రామ! తారక! దశరథ రాజ తనయ!

80 . జప హోమ నిత్యాగ్ని తపములు జేసిన - సరి రావు మీనామ స్మరణ కెన్న
తీర్థ యాత్రలు గొన్ని తిరిగి సేవించిన - సరి రావు మీ నామ స్మరణ కెన్న
నుపవాస వ్రతములు నుడుగక జేసిన - సరి రావు మీ నామ స్మరణ కెన్న
నశ్వమేథంబులు నమితంబు జేసిన - సరి రావు మీ నామ స్మరణ కెన్న

నడవి లోపల నాకు లలములు దినుచు - సంచరించిన నది యేమి సన్నుతికిని
నెంచి చూచిన నవి యెల్ల నేమి ఫలము - రామ! తారక! దశరథ రాజ తనయ!

No comments: