padyam-hrudyam

kavitvam

Friday, March 29, 2013

తల క్రిందులె సర్వమచట............




 

సృష్టికి ప్రతిసృష్టి నిడిన
స్రష్టను వేడను త్రిశంకు స్వర్గము చేరన్
కష్ష్ట తరమైన యొక పర
మేష్టిని చేయించి పంపె నింపుగ నతనిన్.

ఉగ్రంబౌ నా యజ్ఞా-
నుగ్రహమున జేరబోవ నుద్ధతి నా రా-
జాగ్రణి స్వర్గము సుర రా-
జాగ్రహమున ద్రోచి వైచె నంతను వానిన్.

కని విశ్వామిత్రుండది
కనులెర్రగ జేసి పల్కె కనుమిది రాజా
ఘనమౌ మరియొక స్వర్గము
వినువీధిని జేతునీకు వేల్పుల దేలా?

తల క్రిందై పడు రాజున
కిల జేరక మున్నె నమరె నింపౌ స్వర్గం
బలరారె త్రిశంకు దివిగా
తల క్రిందులె సర్వమచట తాపసి మహిమన్.

Wednesday, March 27, 2013

వసంతోత్సవ వేళ.............

 



ప్రకృతి క్రొంజీరకై పలవరించుట జూచి
............శిశిరమ్ము సెలవని చెప్పు వేళ !
తరువులన్నియు రాల్చి దళముల,  క్రొన్ననల్
...........ధరియింప సమకట్టి మురియు వేళ !
నిశలు కృశింపగా నిబ్బరమ్ముగ పవల్
...........వెచ్చదనమ్ము తా నిచ్చు వేళ !
గోపీ సమేతుడై గోవర్ధనోద్ధారి
..........యమునా తటిని క్రీడ లాడు వేళ !

మించ వేడుక లానంద మెల్ల ధాత్రి
రంగు జలముల జల్లుక హంగు గాను
కూర్మి జనములు ప్రకటించు గొప్ప వేళ !
స్వాగతమ్మన రారె వాసంతునకును.


Friday, March 22, 2013

సరసాహ్లాదిని

"సిరి" అనే పదాన్ని
"లక్ష్మి" అనే అర్థంలో ప్రయోగించకుండా
నాలుగు పాదాలలో వేసి
శ్రీదేవిని ప్రార్థిస్తూ  నచ్చిన ఛందస్సులో
పద్యం వ్రాయాలి.



చేసిరి దేవ దానవులు క్షీర సముద్రపు మంథనమ్ము! మేల్
జేసిరి ధాత్రి కిచ్చి నిను శ్రీ కరమౌ కరుణార్ద్ర దృక్కులన్!
చూసిరి శోభనమ్ములను శ్రీలను సేయగ మాకు! స్తోత్రముల్
జేసిరి సర్వులున్ జనని! శ్రీహరి పట్టపు రాణి! శ్రీ సతీ!

Thursday, March 21, 2013

సరసాహ్లాదిని

సమస్య:
కాలము జేసినన్ గలుగు సౌభాగ్యం బశేషమ్ముగా !
 
నా పూరణ:

 
నీతిందప్పని సత్యజీవనమునన్ నిశ్చింతగా సాగుచున్
భీతింజెందక కష్టనష్టములలో విశ్వేశునే నమ్ముచున్
భూతాత్మా! పరమాత్మ! నీలగళ! శంభో! యంచు నిత్యార్చనల్
ప్రాత:కాలము జేసినన్ గలుగు సౌభాగ్యం బశేషమ్ముగా !

Wednesday, March 20, 2013

చిన్మయ రూపిణీ!






పావనాంఘ్రి యుగమ్ము గొల్చెడు భాగ్యమీయవె సత్కృపన్
నీవెగా యిహమున్ పరమ్మును  నిశ్చయమ్ముగ నాకికన్
గోవు వెంటను వీడకన్ జను కోడె భంగిని వత్తు నే
నీ విభూతుల జూపుచున్ మది నుండు చిన్మయ రూపిణీ!

Tuesday, March 19, 2013

సరసాహ్లాదిని

సమస్య:
గత జల సేతు బంధనము కాలుడు డాసిన వేళ దల్చినన్!
 పూరణ: 

సతతము కుర్ర చేష్టలను సాగును బాల్యము, యౌవనమ్ములో
నతిమద గర్వితుండగును, వ్యాధుల క్రుంగును వార్ధకమ్మునన్
మతి జెడు నన్ని కాలముల మానవు డెన్నడు దల్ప డీశ్వరున్,
గత జల సేతు బంధనము కాలుడు డాసిన వేళ దల్చినన్!


Saturday, March 16, 2013

చిన్మయ రూపిణీ!



అద్రిజాత్మజ! ఆగమార్చిత! అంబ! శంభుమనోహరీ!
భద్రకాళి! పరాత్పరీ! భవబంధమోచని! శాంకరీ!
రుద్రురాణి! మహోగ్రరూపిణి! క్రూరదైత్య వినాశినీ!
భద్రమీయవె పాద మంటెద పాహి! చిన్మయరూపిణీ!

Friday, March 15, 2013

ఇల్లు - ఇల్లాలు

పిల్ల పాపల చిన్ని యల్లరితో నొప్పు
..........చల్లని యిల్లెగా స్వర్గ సీమ!
పతిని చతుర్విధ గతులను సేవించు
..........సతియెగా భాగ్యమ్ము భర్త కిలను!
అతిథి యభ్యాగతు లాదర మొందెడి
..........యిల్లు లక్ష్మికి వాస మెంచి జూడ!
అత్తమామల పట్ల ననురాగమును జూపు
..........యిల్లాలితో వెల్గు నింటి శోభ!

ఇల్లు నిల్లాలు వరము లీ యిలను వినుము
పురుషునకు, గౌరవము తోడ నరయ వలయు
వాని నాతడు గేస్తుగా, లేని యెడల
ధర్మ కామార్థ మోక్షముల్ దరికి రావు.


Thursday, March 14, 2013

సరసాహ్లాదిని

దత్తపది: 

చరణము, భరణము, వరణము, తరుణము  -  ఈ పదాలనుపయోగించి భారాతార్థంలో
పద్యం వ్రాయాలి.

నా పద్యం:

రాజసూయ యాగం సందర్భంలో అగ్రపూజకు శ్రీకృష్ణుడే తగిన వాడని భీష్మ పితామహుడు పల్కిన పలుకులు:


చరణము పాప భంజనికి జన్మము నిచ్చిన చోటు! కౌస్తుభా-
భరణము నీడ యా కమల వాసిని కింపగు తావు! కుక్షి యా-
వరణము సర్వ సృష్టికిని!  వందిత వేదుని, గృష్ణు తొల్త నీ
తరుణము  నందు గొల్చుటలు ధర్మము నీకగు ధర్మ నందనా!

Tuesday, March 12, 2013

సరసాహ్లాదిని

సమస్య :

సంజ్ఞ ను చేయ పార్వతియే చక్కగ రావణు జేరె నుధ్ధతిన్.

పూరణ : 


సంజ్ఞ సమస్త జీవులకు స్పష్టత నిచ్చును భావ మెంచుచో,
సంజ్ఞ యుపాయమయ్యె జర సంధుని గూల్చెడు వేళ, యిప్పుడున్
సంజ్ఞను చేయ పార్వతియె,  చక్కగ రావణు జేరె నుద్ధతిన్
సంజ్ఞ గ్రహించి సుందరియు, సంతస మొందగ నెల్ల లోకముల్!


(సుందరి = మండోదరి)

Sunday, March 10, 2013

చేతును శివ రాత్రి ప్రీతి నతులు....






సగ మేనన్ ముదమార నీ ప్రియ సతిన్ శైలేంద్రజన్ దాల్చి! ప
న్నగముల్ మేనను గ్రీడ లాడఁ దలపై నాట్యమ్ముఁ జేయన్ సురా-
పగ జాబిల్లి వెలుంగు లా జలములన్ భాసింపఁ దళ్కొత్తుచున్!
జగముల్ బాలన సేయుచుందువుగదా!  సర్వజ్ఞ! శంభో! శివా!

అర్థ భాగమ్మున నమ్మను దాల్చిన
..........సాంబ సదాశివా! శరణు! శరణు!
తలపైన గంగమ్మ తైతక్క లాడెడు
..........గంగాధరా! నీకుఁ గైమొగిడ్తు!
కాటిని వసియించి కడతేరు వారికి
..........తోడుండు రుద్ర! నతుల నొనర్తు!
పాములాడగ మేన బాముల హరియించు
..........పరమ దయాళు! నీ పదము గొల్తు!

భక్తి భిక్షను గోరుచు  ముక్తి  నిచ్చు
శంకరా! నన్ను గావగ శంక వలదు
నీవె తల్లివి తండ్రివి నీవె గురువు
యేడుగడ నాకు నీవె సర్వేశ శరణు.

అమ్మను దూర ముంచిన భవాబ్ధిని మున్కలు వేయుచుండి ని-
త్యమ్మును వేదనల్ బడుచు తల్లి యొడిన్ శ్రమ దీర గోరు భా-
గ్యమ్మును గోలుపోదురను కారుణితో తన మేన దాల్చె మా-
యమ్మను ధాత్రికిన్ జనకు డాతని కెంతటి మాల్మి బిడ్డలన్!

ఎపుడే యాపద వచ్చునో కుపితుడై యే బిడ్డలం జూచునో
యపరాధం బొనరించె నంచు పితరుండా నిప్పు కంటన్, కటా!
అపుడీ తల్లి యెడంద తల్లడిలగా నెట్లోర్చునో యంచు తా-
నెపుడున్ వీడక యుండె మేన సగమై యీ జీవులన్  గాచుచున్.

సగము సగము కలసి సర్వలోకములకు
తల్లి దండ్రు లగుచు తరుగనట్టి
పరమ దయను జూపు పార్వతీ శివులకు
చేతును శివ రాత్రి ప్రీతి నతులు.

Monday, March 4, 2013

సరసాహ్లాదిని

సమస్య:
రంభాహృదయాబ్జభృంగ! రామా! యనియెన్ !

నా పూరణ:

శూర్పణఖ శ్రీ రామునితో-

శుంభుండును  సరసుండు ని-
శుంభుండును సాటి రారు శోభల నీకా
కుంభిని సుతయా? రతిసం-
రంభా! హృదయాబ్జభృంగ! రామా! యనియెన్ !

   

Sunday, March 3, 2013

సరసాహ్లాదిని

సమస్య   :
పసిబాలుడు మద్య మడిగె పాలొల్ల ననెన్.
============================

పూరణ:

త్రాగుడుకు బానిసై బాధలు పెడుతున్న మగనితో నొక భార్య ఆవేదన:

పొసగదు నీకున్నాకును
పసిబాలుడు మద్యమడిగె పాలొల్లననెన్
వ్యసనముకు బానిసై మా
యుసురును తీసేవు చాలు  యోరిమి చచ్చెన్.

Friday, March 1, 2013

సరసాహ్లాదిని

సమస్య:
సీతా! రాముని గుండెఁ జీల్చితివి రాశీభూతపాపాగ్నివై.

పూరణ:
ప్రీతిన్నీ యొడిలో శిరమ్ము నిడి నిద్రింపంగ నో కాకి యీ
రీతిన్ గాయము జేయ నోర్చితివె నిర్భీతిన్! కటా! నా ప్రియా!
సీతా! రాముని గుండెఁ జీల్చితివి రాశీభూతపాపాగ్నివై
సీతన్  గాదిది వాయసాధమమ! యిస్సీ నీకిదే మూడెడిన్.