padyam-hrudyam

kavitvam

Wednesday, May 21, 2014

చేరి శరణని మ్రొక్కరే.........

ఈ దెస జనకుడు నా దెస జననియు 
..........నిచట తా నయ్యయు నచట నమ్మ !
ఈ వంక భర్గుడు నా వంక భార్గవి
..........యిచ్చట శివుడును నచ్చట శివ !
ఈ వైపు గిరివాసు డా వైపు గిరిజయు 
..........నిచట నీశానుండు నచట నీశ !
ఈ ప్రక్క శంభుడు నా ప్రక్క శాంభవి
..........యిచ్చట పరమేశు దచ్చట పర !

ఇతడు చంద్రశేఖరుడాయె నిదిగొ కనగ !
నామె శశికళా ధరియగు నదిగొ చూడ !
నిరువు రొక్కటై దయజేసి రింపు మీర !
జేరి శరణని మ్రొక్కరే తీరు చింత. 

Sunday, May 18, 2014

కాదేదీ కవిత కనర్హం....

కాదేదీ కవిత కనర్హం..................కుక్కతోక
=========================
కుక్క తోకకు గల ఖ్యాతి మిక్కుటముర
దాని వంకర సరిజేయ తరము గామి
వక్ర బుద్ధిని శ్వానపు వాలమనుట
లోక మందున వాడుక నీకు తెలుసు.

కుక్క తోక ప్రయోజన మొక్కటియును
లేదు, యీగల త్రోలగా లేదు, దాని
మాన మైనను కప్పగా బోని దగుట
వ్యర్థు నందురు భైరవ వాల మనుచు.

కుక్క తోకను చేబట్టి గొప్పదైన
నదిని గోదావరిని దాట నగునె ధరణి?
అల్ప బుద్ధుల యండతో సల్ప లేమి
పనుల నట్టి వారిని కుక్క వాల మనుట.

ఇన్ని సూక్తుల ప్రకటించు నిలను చూడ
కుక్క వంకర తోకయే నిక్కమిద్ది !
హీనముగ పైకి లోకాన కానుపించు
నెన్నియో పాఠముల జెప్పు నెన్న మనకు.