padyam-hrudyam

kavitvam

Saturday, June 20, 2015



రండి బావ గారు రంజిల్లె మా మది
మీదు రాక నేడు మేలు మాకు
మేము కన్న బిడ్డ మీ యింట కాలూన
ధన్య మౌను బ్రతుకు దాని కింక.

చదువు లోన నెపుడు మొదటనే యున్నది
గుణ గణమ్ము లెన్న మణియె బిడ్డ
అంద చంద ములను నామె యెట్లున్నదో 
మెచ్చుకొన గలారు మీరె చూచి.

తల్లి పెంపకాన తనరెను యొద్దిక
నిల్లు చక్క దిద్దు నేర్పు గలదు
పెద్ద వార లన్న వినయము ప్రకటించు
ప్రేమ తోడ జూచు పిన్న వారి.

మాయింటి యాడు బిడ్డకు
మీ యింటను చోటునిండు మేలగు మీకున్
హాయిగ మాకును పెండ్లిని
చేయ గలము వైభవముగ చెప్పిన చొప్పున్.

*******

వేడ్క బావగారు! వియ్యము మీతోడ
మాకు కుదిరెనేని, మా తనయుడు
చదువులందు మిన్న మొదటినుండియు కూడ
చక్కనైన కొల్వు సద్గుణములు.

అంద చందములకు నంత మేమున్నది 
గుణగణముల ముందు కొద్ది గావె
మంచి వంశ మంచు మాకెరుకాయెను 
పిల్ల తీరు జూడ నుల్ల మలరె.

లక్ష్మి వంటి మంచి లక్షణముల యీమె
మెట్టి నంత మాకు మేలు కలుగు 
మాకు నచ్చె నామె మంచి ముహూర్తాన
తమ్ములమ్ము లీయ తనర గలము. 

******

ఎంత మంచిమాట నింపుగా నని నారు
ధన్యమైతి మయ్య తమరి దయను
మాదు పెద్ద వారి మాల్మిని మీదు సం-
బంధ మొనరె మాకు భాగ్య మిద్ది.

Tuesday, June 16, 2015

దొంగాట లేలరా కన్నయ్యా?


వెన్న కాజేసెదో కన్నెల జూసెదో
....మరుగేలరా నీకు మదనతాత!
పూతన వచ్చెనో మాత రావచ్చునో
....నక్కితి వేలరా నళిన నయన!
బండి కన్పట్టెనో పాము పైకొట్టెనో
....దాగితి వేలరా దనుజవైరి!
ద్రౌపది పిలిచెనో రాధమ్మ వలచెనో
....చాటుమాటేలరా చతురవచన!

మధుర కేగెడి వేళాయె మాధవ యని
వచ్చెనా యేమి యక్రూరు డిచ్చటకును!
చాలు దొంగాట లికచాలు నీలవర్ణ!
నీవె దొర వేలరా మమ్ము నెమ్మది గని !

Friday, June 12, 2015

ఉత్తమే క్షణ కోపస్యాత్ = ఉత్తముల కోపం క్షణకాలమే! 2

ఉత్తమే క్షణ కోపస్యాత్ = ఉత్తముల కోపం క్షణకాలమే! 2
******************************************************
రామదండు సముద్రతీరమ్ము జేరె
నందరును దాటి వార్నిధి నరుగవలెను
లంక, కత్యుగ్రరీతి భయంకరముగ
నలలు పడిలేచుచుండిన వప్పు డరయ.
విని విభీషణు సూచన నినకులశశి
రాము డుదధిని ప్రార్థించె లంక కేగు
మార్గ మీయ సముద్రుడు మాట వినక
నెగసి పడుచుండె కెరటాల సెగల తోడ.
కోపమును రాము డడచుక కూర్మితోడ
దర్భశయనము గావించె దమము పూని
మూడు దినములు గడచె సముద్రఘోష
సుంతయును తగ్గదాయెను పంతమేమొ!
కాలాగ్నిరుద్ర సముడై
లీలామానుషుడు పల్కె లిప్తను జలధిన్
హేలాగతి నింకించెద
నీ లాంగూలములు నడచి యేగగ నటకున్.
కట్టలు త్రెంచుక కోపము
బిట్టురుకగ రామమూర్తి వింటిని చేతం
బట్టెను బ్రహ్మసమాస్త్రము
గట్టిగ సంధించె సృష్టి గడగడలాడన్.
యోజనము లోపలికి నేగె నొక్కసారి
జలధి వడవడ వడకుచు కలగిపోయె
వెడలి వచ్చెను సాగరు డడలి పోయి
రామపాదాల వ్రాలె శరణము గోరి.
వననిధి గడచు నుపాయము
నినకులమణి కెరుక జేసె, నిముషము లోనన్
తను సంధించిన యస్త్రము
ననిపెను దస్యులను ద్రుంచ నంతట కరుణన్.
శాంతి వహించెను రాఘవు
డంతకసముడయ్యు లిప్త నత్తరి గనిరే!
యెంతటి మహనీయమొ కన
లింతయు దుర్గుణము కాని దేదిన తృటిలో.
— with Ram Chandran and తెలుగు సాహితీ పీఠము.


Thursday, June 4, 2015

ఉత్తమే క్షణ కోపస్యాత్ = ఉత్తముల కోపం క్షణకాలమే!


వాలి గతించె రాజ్యమును వాని సహోదరు డేలుచుండె తా
నాలిని వీడి రాఘవు డనంత వ్యథాంబుధి నీదుచుండగా
కాలము భారమై గడచె కజ్జలముల్ చనె శారదాభ్రముల్
రేలను నేలుచుండె కపిరేడు సహాయము మాట నెన్నడే!
కోపము చెంది రాఘవుడు గొబ్బున తమ్ముని బిల్చి లక్ష్మణా!
నా పలుకుల్ వచింపు చని యా కపిరాజుకు 'నన్న వాలికిన్
జూపిన మార్గమే తనకు జూప గలాడ సబాంధవమ్ముగా
నా పని జూడకున్న' ననె యాతడు నేగెను కృద్ధుడై వెసన్.
చేరి కిష్కింధ సుగ్రీవు జీరి జెప్పె
లక్ష్మణుం డన్న పల్కుల లక్షణముగ
వడకె వానర రాజంత పుడమి గల్గు
కోతి భల్లూక తతులను గూడ బిలిచె.
మన్నింపుము నా తప్పును
నన్ను ననుగ్రహముతోడ నయముగ గన మీ
కన్నను దిక్కెవరని యత
డన్నను శ్రీరామమూర్తి కంజలి తోడన్.
అరగడియ క్రితము క్రోధము
తెరలగ మది రగిలినట్టి దేవుడు కని వా
నరరాజు నందె హర్షము
కరగెను మది కరుణ కురియ కౌగిట జేర్చెన్.
'వాన కురిపింప సురపతి, పూని తమము
బాప దినకరుడును మించు భాతి నీకు
పర హితార్థము సహజమౌ పరమగుణము
సఖుడ! తెలియును' నాకనె స్వామి యపుడు.