padyam-hrudyam

kavitvam

Wednesday, March 9, 2011

రామ తారక శతకము 17

81 . నేత్రముల్ గల ఫలము నెమ్మితో మీ చూపు - సుస్థి రత్వంబును చూడ నైతి
జిహ్వ కల్గిన ఫలము శ్రీ హరి నామంబు - తాల్మితోడుత నెపుడు తలచ నైతి
శిరము కల్గిన ఫలము క్షితి మీద సాష్టాంగ - ముగ చక్కగా సాగి మ్రొక్క నైతి
కర్ణముల్ గల ఫలము ఘనమైన మీ కథల - వివరించి బుధులచే వినగ నైతి

హస్తములు గల్గి మిము చాల నను దినంబు - శాంత మొనరంగ పూజలు సల్ప నైతి
చరణముల్ గల్గి మీ సేవ జేయ నైతి - రామ! తారక! దశరథ తనయ!

82 . నాసా పుటము గల్గి నను గాని యేరోజు - తులసి వాసనల నే తెలియ నైతి
సంసారమను మహా సాగరంబున మున్గి - శ్రీ రామ భజన నే జేయ నైతి
బాల్యంబునను దోర బాధ కత్వము జెంది - నీ యందు భక్తియు నిలుప నైతి
యవ్వనంబున కామ్య మానందమును - వొంది కూహ కంబున బుద్ధి కుడువ నైతి

నెంత పాపినో గాక నే నెన్న డైన - దేవు డని నీవె దిక్కని దెలియ నైతి
గాన దుష్కృత మెంచక గావు నన్ను - రామ! తారక! దశరథ తనయ!

83 . శ్రీ రామ వినుము నే క్షితిని జన్మించిన - విధము నెవ్వరి తోడ విన్నవింతు
తల్లి దండ్రులు నాత్మ తనయులు బంధువుల్ - అన్న దమ్ములు దేహ మాత్మ సఖులు
అక్కలు చెల్లెండ్రు నాప్తుల నాప్తులు - నితర బంధువు లెల్ల నిష్ట సఖులు
పరులు నా వారని పాటించి యెప్పుడు - జన లోకముల నెల్ల సత్య మనుచు

భార్య రతి కేళి సంబంధ భరిత మమర - రాజు కిష్టాభి మానుండు రాజసమున
మంత్రి కార్యా వలోచన నాచరించు - రామ! తారక! దశరథ తనయ!

84 . ఇలను బుట్టిన వార లెన్తేసి ఋషు లైరి - వీరితో నెటు వలె విన్న విన్తు
తల్లివి దండ్రివి దాతవు భ్రాతవు - ప్రభుడవు గురుడవు బాంధ వుడవు
నీవు దక్కగ నింక నెవ్వరి తో నేను - బల్కుదు నెటు వలె పరమ పురుష
ఆత్మ రక్షక నిన్నె యాశ్రయిన్చితి దేవ - కాచి రక్షించుమీ కమల నయన

నీదు లాభంబు గోరిన నెన్న డైన - గోర్కె లెల్లను నాకు చేకూరు చుండు
దీన రక్షక నాకును దిక్కు నీవె - రామ ! తారక! దశరథ తనయ!

85 . తోచి తోచక నేను తొడరి మీ చింతన - జేయక సంసార జలధి మునిగి
నడచి నడ్వక బహుళా హార వాంచను - పదపడి మోహ సంభ్రాంతి జెంది
తెలిసి తెలియక కర్మ దేహ వాసన జెంది - తరి గోరి మిమ్ముల దలప నైతి
మరచి మరువక నిత్య మార్గంబులను మిమ్ము - దలచక నింద్రియ తతుల దగిలి

యిట్టి పాపాత్ముడను నన్ను నెలమి నెపుడు - కాచి రక్షించు మన్నించు ఘనత మీర
కృపకు పాత్రునిగా జూడు కువలయేశ - రామ! తారక! దశరథ తనయ!

No comments: