padyam-hrudyam

kavitvam

Saturday, September 30, 2023

పితృస్తుతి

 బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృ స్తుతి


బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి. ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజూ ఎవరు చదువుతారో వారికి ఈతిబాధలు ఉండవు. ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాక వారు చదివిన వారిని అనుగ్రహిస్తారు. దీనిని ఎవరైతే వారి పుట్టినరోజునాడు తండ్రికి నమస్కరించి వారివద్ద చదువుతారో వారికి పితరుల అనుగ్రహం లభిస్తుంది.

బ్రహ్మ ఉవాచ:

౧. నమో పిత్రే జన్మదాత్రే సర్వ దేవమయాయ చ!

సుఖదాయ ప్రసంనాయ సుప్రీతాయ మహాత్మనే!!

ఎవరివలన ఈ జన్మ వచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు.

౨. సర్వ యజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే!

సర్వతీర్థావలోకాయ కరుణాసాగారాయ చ!!

సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణాసముద్రులైన పితరులకు నమస్కారములు. 

౩. నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః!

సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ!!

సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారైన శివరూపులకు నమస్కారము. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు.

౪. దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మాయా వపుః!

సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమోనమః!!

ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరివలన లభించిందో ఆ పితృ దేవతలకు నమస్కారములు.

౫. తీర్థ స్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం!

మహా గురోశ్చ గురవే తస్మై పిత్రే నమోనమః!!

ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు. 

౬. యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం!

అశ్వమేధ శతైః తుల్యం తస్మై పిత్రే నమోనమః!!

ఎవరిని నమస్కరించినా, తర్పణాదులు చేసినా అవి వందలకొలది అశ్వమేధ యాగములతో సమానమో అటువంటి పితరులకు నమస్కారము.

ఫలశ్రుతి:

ఇదం స్తోత్రం పిత్రుః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః!

ప్రత్యహం ప్రాతరుత్థాయ పితృశ్రాద్ధదినోపి చ 

స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా 

న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితమ్ 

నానాపకర్మకృత్వాపి యఃస్తౌతి పితరం సుతః 

సధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్ 

పితృప్రీతికరైర్నిత్యం సర్వ కర్మాణ్యధార్హతి!!


(కూచిభొట్ల వారి సౌజన్యంతో)


Saturday, September 23, 2023

రాధామాధవం




రాధామాధవం :

శ్రీ డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ వారి సౌజన్యంతో...

********

కృష్ణాష్టమి - బృందావనం

' రాధా! ఈ రోజు నా పుట్టినరోజు. ఏమైనా కోరుకో. ఏదైనా ఇస్తాను.' 
'మాధవా! నువ్వు నా స్వంతం. నాకే చెంది ఉన్నావు, ఔనా?' 
'అవును రాధా!' 
'నా దగ్గర లేనిది, వెలకట్టలేనిది, నీకన్నా విలువైనది నాకు కావాలి. ఇవ్వగలవా కృష్ణా?' 

చెప్పడానికి గోపాలుని వద్ద సమాధానం లేదు. ఆశ్చర్యంగా చూస్తున్నాడు. రాధ మెల్లగా కృష్ణుని దగ్గరకు వచ్చింది. అతని చరణాలు ముట్టుకుంది. విశ్వసుందర పాదారవింద యుగళిని తనివితీరా ముద్దాడింది. శశాంకశీతల మనస్కుని కంఠాన్ని తన మృదుకర ద్వయంతో బంధించింది. గోవిందుని గట్టిగా హత్తుకుంది. 
'నిన్ను పొందిన తర్వాత నాకిక పొందవలసినదేముంది సర్వేశా!'

***

రాధాష్టమి - అదే బృందావనం 

ప్రణయ మకరందమాధురీ భరితలోచనాలు కడు చిత్రంగా తిప్పుతూ రాధ ఇలా అంటున్నది 
'కృష్ణా! ఈ రోజు ఎంత అందంగా వెలిగిపోతున్నావో తెలుసా! నీ పుట్టినరోజునాడు నేను ముస్తాబై వచ్చాను. నా పుట్టిన రోజున నువ్వు అలంకరించుకున్నావు. బలే విచిత్రంగా ఉంది కదూ! ఇంత సమ్మోహనకరంగా ఎప్పుడూ నిన్ను చూడలేదు . నువ్వు నా అద్దానివా? నన్ను నేను చూసుకుం టున్నానా?'.. సరస భాషిణి, సహజ చమత్కారి కదా రాధ. 'ఈ సంతోష సమయంలో, నీకొక వరం ఇవ్వాలనిపిస్తోంది. నీ పుట్టిన రోజున నేను కోరుకున్నా. నా పుట్టిన రోజున నువ్వు కోరుకో కృష్ణా!'

ఆశ్చర్యచ కితుడయ్యాడు కృష్ణుడు తేరుకుని, వొకింత ఆలోచించి, ఆమె చమత్కారాన్ని ఆమెకే అప్పగిస్తూ ఇలా అన్నాడు. 
'ఏదైనా నువ్వే నన్ను కోరుకో. ఇదే నా కోరిక రాధికా! అన్నట్లు రాధా! నాకన్నా విలువైనది కోరుకోవాలి సుమా!
'గలగలా నవ్వింది రాధ. 
'నీకన్నా విలువైనది నేనే గోపాలా!' 
హతాశుడయ్యాడు కృష్ణుడు! ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. 'ఏమంటున్నావు రాధా! నువ్వు నాకంటే విలువైనదానివా? ఎలా?' 
'భక్తుడికి, భగవంతుడు దాసుడు కాదా, వాసుదేవా!' 'అవును' 
'నువ్వు ప్రేమకు బానిసవు కదా కృష్ణా' 
'నిజం' 
'నువ్వు నా ప్రేమకు బానిసవు కదా ప్రియా!' 'అనుమానమెందుకు రాధా!' 
'నువ్వు బానిసవు. నేను యజమానురాలిని. నేనే గొప్ప కదూ' 
'ఒప్పుకున్నాను రాణీ! మరి నిన్ను నువ్వే ఎలా కోరుకుంటావు?'
'ఎప్పటికీ నువ్వు బానిసగానే ఉండాలి, నేను యజమానురాలుగానే ఉండిపోవాలి. ఇదే నా కోరిక జగన్నాథా'

కృష్ణుని హృదయం ద్రవించింది. ఒకరిని బానిసగా మార్చగలిగిన ప్రేమ సామాన్య ప్రేమ కాదు. పరమ పవిత్ర ప్రేమ. ఏ కారణం లేనిది, ఏ అవసరం లేనిది, ఏ షరతులు లేనిది రాధ ప్రేమ. అటువంటి ప్రేమను కృష్ణునికి ఇస్తున్నది రాధ. అతనికింకేమి కావాలి! కృష్ణుణ్ణి పూజించే వారెందరో, ఆరాధించే వారింకెందరో. కానీ, ఆ రాధ మాదిరిగా ప్రేమించేవారేరీ? రాధకు కృష్ణుడి అవసరం కంటె, కృష్ణుడికే రాధ అవసరం అధికం. రాధ కృష్ణుడిపై ఆధారపడి ఉందో, లేదో కానీ కృష్ణుని ఉనికి మాత్రం పూర్తిగా రాధపైనే ఆధారపడి ఉంది. ఈ క్షణంలో కృష్ణుని అవతారానికి సార్ధకత లభించింది. కన్నయ్య పాదాలకు రాధ నమస్కరించబోయింది. వద్దని రాధను వారించాడు. రాధ పాదాలకు తానే మోకరిల్లాడు నందనందనుడు. సాష్టాంగ ప్రణామం చేశాడు. 

'ఏ.. ఏమిటిది!.. మా.. మాధవా!'
రాధ కంఠం గద్గదమయింది. ఆ ప్రణయమూర్తి మూగదయింది. 
'బానిస, యజమానికి నమస్కరించాలి కదా!' 
కృష్ణుని వినయసౌశీల్య వచనాలు విన్న బృందావనం అతనికి ప్రణమిల్లింది. రాధ పాదాల స్పర్శకు కృష్ణునిలో విద్యుత్తు ప్రవహించింది. కృష్ణుడు మోకాళ్లపై కూర్చున్నాడు. మాధవుని కళ్లలో నీళ్లు... రాధ కళ్లల్లో నీళ్లు.. అతని చుబుకాన్ని పైకెత్తి, సూటిగా కృష్ణుని కళ్లల్లోకి రాధ చూసింది. ఆమె కన్నీటి చుక్కలు అతని కళ్లలో కురిశాయి. అతని కన్నీటితో ఆమె కన్నీరు సంగమించింది. మాధవుని చెక్కిళ్లపై ధారలు ప్రవహిస్తున్నాయి.

ఆ పవిత్ర జలాన్ని దోసిలితో పట్టి, తీర్థంగా స్వీకరించి యమున తరించింది.
పొన్నలు వెన్నలుగా కరిగి నీరయ్యాయి. 
జాబిల్లి కళ్ల నుండి జాజులు వర్షించాయి. 
ఆ అమల ప్రేమికులను, ఆ అమర ప్రేమికులను అభిషేకించాయి.

యశోదా ప్రియసుతుడు, ఉదయచంద్ర వదనుడు, సౌమ్య, సౌజన్యగుణధాముడు శ్రీకృష్ణుడు. 
అద్వితీయ సౌందర్యరాశి, అనుపమాన ప్రేమవారాశి రాధాదేవి. 
అనిర్వచనీయం, వర్ణనాతీతం, అలౌకికం, జగదేక ప్రేమకావ్యం 'రాధామాధవం'.

నేడు రాధాష్టమి

 



గోలోకమ్మున కృష్ణమూర్తి సఖివై కోట్లాది బ్రహ్మాండముల్

లీలామాత్రపు దృక్కులన్ బరపి పాలించంగ నీవే కదా

హేలన్ లోకహితైషిణీ!జనని! నీకేలా యుపేక్షించ బృం

దాలై దుష్టులు ధర్మమున్ జెరుప రాధారాణి! శిక్షించవే.

Friday, August 25, 2023

వరలక్ష్మీ నమోస్తుతే

 



పద్మాలయమునందు భాసించు పద్మోరు

...పద్మాస్యమునఁ జిందఁ బసిఁడి నగవు

పద్మహస్తములందుఁ బద్మాల ధరియించి

...అభయంపుముద్రతో నలరుచుండి

పద్మదళాయత భవ్యనేత్రమ్ము ల

...పాంగవీక్షణములఁ బఱచుచుండ

పద్మసంభవుఁ డాది ప్రముఖామరవరులు

...పద్మనాభప్రియా ప్రణతు లనఁగ


పద్మినీదేవి జగముల పాలనమ్ము

సేయు నింటింట సంపదల్ సెలఁగ భువిని

కన్న తల్లి యీ కలుముల కల్పవల్లి

రండు వరలక్ష్మి నర్చించఁ బండు బ్రతుకు.


Friday, July 28, 2023

కలాం గారికి నివాళులు

క్షిపణిపితామహా! క్షితిని చివ్వున వీడి నభమ్ము నేగితే

క్షిపణిని మించు వేగమున చివ్వున నశ్రులు చింద? నేదయా

క్షిపణి భయంకరా! రిపుల చీల్చెడి ప్రేల్చెడి ప్రేరకమ్ము మా

క్షిపణులకింక? నౌను గద శ్రేయము గూర్చెడు నీ తలంపులే. 


శాస్త్రజ్ఞు డందుమా చక్కని పాఠాల 

.........గరపెడు పూజ్యుడౌ గురువితండు!

గురువందుమా సదా యెరుకకై తపియించు

.........నాదర్శవంత విద్యార్థి యితడు!

విద్యార్థి యందుమా విశ్వగుర్వన దగు 

........భరతావని ప్రథమ పౌరు డితడు! 

పౌరుడే యందుమా ప్రగతికి బలమిచ్చు 

........నావిష్కరణలకు నాద్య మితడు !


కవి, విరామమెరుమంగని కార్మికుండు,

దేశభక్తికి నిలువెత్తు దివ్య రూపు,

బోధనాతృష్ణ బాయని బుద్ధిజీవి,

పరువు పదవిఁ, కలామన నురు యశస్వి.

Tuesday, July 4, 2023

గురు పూర్ణిమ 2023

హరిహరులు నబ్జసంభవుఁ

డరయఁగ గురు వనిన ధరణి నమరిన సాక్షా

త్పరమాత్మ యట్టి శ్రీ స

ద్గురువున కే నంజలింతు గురుతర భక్తిన్.


***


మునిమనుమఁడున్ వసిష్ఠున,

కనుంగు మనుమఁడును శక్తి, కాత్మజుఁడు మహా

మునియౌ పరాశరునకు, శు

కుని పిత నా బ్రహ్మనిధినిఁ గొలుతును వ్యాసున్.

Wednesday, May 3, 2023

నమామి గంగే

 


శ్లేష్మాశ్లేషణయానలే అమృతబిలే శోకాకులే వ్యాకులే 

కంఠే ఘర్ఘర ఘోషనాద మలినే కాయేచ సంమీలతి 

యాం ధ్యాయన్నపి భారభంగురతరాం ప్రాప్నోతి ముక్తిం నరః 

స్నాతు శ్చేతసి జాహ్నవీ నివసతీ సంసారాసంతాపహృత్.

                                                           - మహాకవి కాళిదాసు 

Tuesday, May 2, 2023

పాపహారి పునాతు మాం

 


గాంగం వారి మనోహారి మురారిచరణచ్యుతం 

త్రిపురారిశిరశ్చారి  పాపహారి పునాతుమాం.

 

పాపాపహారి దురితారి తరంగధారి 

శైలప్రచారి గిరిరాజగుహావిదారి 

ఝమ్కారకారి హరిపాదసరోజవారి 

గాంగం పునాతు సతతం శుభకారి వారి. 

                             - మహర్షి వాల్మీకి 

Monday, May 1, 2023

మాతర్జాహ్నవీ నమోస్తుతే


 

మాత ర్జాహ్నవి శంభుసంగమిళితే మౌళౌ నిధాయాఞ్జలిం 

త్వత్తీరే వపుషోవసానసమయే నారాయణాంఘ్రిద్వయం 

సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణప్రయాణోత్సవే 

భూయాద్భక్తి రవిచ్యుతా హరిహరాద్వైతాత్మికా శాశ్వతీ.

                                                          - ఆదిశంకరాచార్య 

Sunday, April 30, 2023

జహ్నుమునీంద్రనందినీ విజయతే

 


వాచాలం వికలం ఖలం శ్రితమలం కామాకులం వ్యాకులం 

చండాలం తరళం నిపీతగరళం దోషావిలం చాఖిలం 

కుంభీపాకగతం తమంతకకరా దాకృష్య క స్తారయే 

న్మాత ర్జహ్నుమునీంద్రనందిని తవ స్వల్పోద బిందుమ్ వినా. 

                                                                   - మహాకవి కాళిదాసు 

Saturday, April 29, 2023

విజయతే త్రిపథగే భాగీరథీ

 


కాకై ర్నిష్కుషితం శ్వభిః కబళితం గోమాయుభి ర్లుంఠితం 

స్రోతోభి శ్చలితం తటాంబు మిళితం వీచీభి రాందోళితం 

దివ్యస్త్రీకరచారుచామరమరుత్సంవీజ్యమానః సదా 

ద్రక్ష్యేహం పరమేశ్వరి త్రిపథగే భాగీరథీదం వపుః.

                                                       - మహర్షి వాల్మీకి 

Friday, April 28, 2023

గంగే ప్రసీద

 


భగవతి తవ తీరే నీరమాత్రాశనోహం

విగతవిషయతృష్ణః కృష్ణ మారాధయామి    

సకలకలుషభంగే స్వర్గసోపానసంగే  

తరళతరతరంగే  దేవి గంగే ప్రసీద.

                         - ఆది శంకరాచార్య 


Thursday, April 27, 2023

నిజజలే మజ్జజ్జనోత్తారిణీ

 


విష్ణో స్సంగతికారిణీ హరజటాజూటాటవీచారిణీ

ప్రాయశ్చిత్తనివారిణీ జలకణైః పుణ్యౌఘవిస్తారిణీ 

భూభృత్కందరదారిణీ  నిజజలే మజ్జజ్జనోత్తారిణీ 

శ్రేయస్సర్గవిహారిణీ విజయతే గంగా మనోహారిణీ.

                                              -  మహాకవి కాళిదాసు 

Wednesday, April 26, 2023

జయతు జయతు గంగే

 


త్వత్తీరే తరుకోటరాంతరగతో గంగే విహంగో వరం 

త్వన్నీరే నరకాంతకారిణి వరం మత్స్యోథవా కచ్ఛపః 

నైవాన్యత్ర మదాంధసింధురఘటాసంఘట్టఘంటా రణ 

త్కారత్రస్తసమస్త వైరివనితాలబ్ధస్తుతిర్భూపతిః .

                                                   -  మహర్షి వాల్మీకి 

Tuesday, April 25, 2023

విజయతే గంగా మనోహారిణీ

 


శైలేంద్రా దవతారిణీ నిజ జలే మజ్జజ్జనోత్తారిణీ 

పారావారవిహారిణీ  భవభయశ్రేణీసముత్సారిణీ 

శేషాహే రనుకారిణీ హరశిరోవల్లీదళాకారిణీ 

కాశీప్రాంతవిహారిణీ విజయతే గంగా మనోహారిణీ.

                                                - ఆదిశంకరాచార్య   

Monday, April 24, 2023

గంగే దేవి నమోస్తుతే

 


గంగాతీర ముపేత్య శీతలశిలా మాలంబ్య హైమాచలీం 

యైరాకర్ణి కుతూహలాకులతయా కల్లోలకోలాహలః 

తే శృణ్వన్తి సుపర్వపర్వతశిలాసింహాసనాధ్యాసిన 

స్సంగీతాగమ శుద్ధసిద్ధ రమణీ మంజీర ధీర ధ్వనిమ్.

                                                       -మహాకవి కాళిదాసు 

Sunday, April 23, 2023

భాగీరథీమ్ ప్రార్థయే


మాత శ్శైలసుతాసపత్ని వసుధాశృంగారహారావళి 

స్వర్గారోహణవైజయంతి భవతీం భాగీరథీం ప్రార్థయే 

త్వత్తీరే వసత స్త్వదంబు పిబత స్త్వద్వీచిషు ప్రేంఖత 

స్త్వన్నామ స్మరత స్త్వదర్పితధియ స్స్యాన్మే శరీరవ్యయః 

                                               

                                                  -మహర్షి వాల్మీకి 


Saturday, April 22, 2023

నమామి గంగే



 బ్రహ్మాండం ఖండయంతీ  హరశిరసి జటావల్లి ముల్లాసయంతీ 

 స్వర్లోకా దాపతంతీ కనకగిరి గుహా గండ శైలాత్ స్ఖలంతీ 

 క్షోణీ పృష్ఠే లుఠంతీ దురితచయచమూం నిర్భరం మర్దయంతీ 

 పాథోధిం పూరయంతీ సురనగర సరిత్పావనీ నః పునాతు 

                                                         -ఆదిశంకరాచార్య 

 

Thursday, March 30, 2023

సంక్షిప్త రామాయణము







సింహరేఖ  


శైలజాత్మజా! ప్రణామా

లేలుకో,  నమస్సు వాణీ!

నాలుక న్వసించవే, దం

డాలు సద్గురూ! మహేశా!


ఆ.వె. 


శ్రీపతి దరి జేరి చేసి నమస్కృతుల్

సురలు మునులు స్వామి చూడ లేదె

పంక్తికంఠుడు చెఱపట్టి లోకాలను

బాధపెట్టుచుండె బాపు కీడు. 2


తే.గీ.


అనుచు మ్రొక్కగా హరి మంద హాసు డగుచు

నవని నరుడనై దిగి వచ్చి యసురు ద్రుంతు

మీ సదంశల మీరును మేదిని నగు

డని యభయ మిచ్చి పంపెను గనికరమున. 3


సీసము  


రాముడై దశరథరాజుకు పుత్రుడై

..కౌసల్య గర్భాన గలిగెను హరి

రాముని తమ్ములై లక్ష్మణ శత్రుఘ్ను

..లతివ సుమిత్రకు నైరి వరుస

మరియొక తమ్ముడై భరతుడు జనియించె

..కైకకు నినవంశ ఘనత వెలయ

బాలురు నల్వురు బాల్యోచితక్రీడ

..లను మురిపించుచు రాజు మదిని


తే.గీ.

పెరుగుచుండి వసిష్ఠ సద్గురువు నొద్ద

సకల శస్త్రాస్త్ర విద్యల చతురు లైరి

పంక్తిరథు డనంతానంద భరితు డగుచు

గడుప గాలము వచ్చెను కౌశికుండు. 4


చంపకమాల  


చనియెను తండ్రియానతిని సంయమికౌశికు వెంట రాము డా

వనమున దాటకిందునిమి పాచి సుబాహుని గాచి యిష్టి ధూ

ళిని బడి యున్న గౌతముని లేమకు రూపము నిచ్చి విద్యలన్

ఘన పరిపాకముం బడసె గాటపు రక్తిని గూడి లక్ష్మణున్.5


ఉత్సాహ  


చనిరి దాశరథులు మిథిల సంయమీంద్రు వెంట నా

జనకరాజు మోద మంది సలిపి పూజ మౌనికిన్

గని రఘూద్వహద్వయమ్ము గారవమ్ము సేసి చూ

పెను గృహమ్ము నందు నున్న పెద్ద శంభు చాపమున్. 6


సుగంధి 


వింటి జూపి పల్కె నిట్లు వేడ్క రాజు చాపముం

గంటిరే మహేశు దివ్య కార్ముకమ్ము దీని నే

బంటు బాణ మెక్కు పెట్టు వాని కిత్తు కూతు మా

కంటి వెల్గు సీత నంచు గట్టి బాస చేసితిన్. 7


మాలిని


అనిన జనకు మాటన్ హర్షుడై మౌనివర్యుం

డిన కుల తిలకున్వీక్షించ స్మేరాననుండై

చని రఘువరు డంతన్ జాపమున్ బైకి లేపన్

ఘనతర రవమాయెన్ గంపమాయెన్ ధరిత్రిన్. 8


ద్విపద 


ఫెళ్ళున దిక్కులు పిక్కటిలంగ

పెల్లగు ధ్వనితో విల్లు విడంగ

కళ్ళను కాంతులు కౌశిక మునికి

ఝల్లని పుల్కలు జానకి మెయికి. 9


కందము


జానకి రాముని తలపై 

జానకి తలపైన రామచంద్రుడు వేడ్కన్

బూనుచ ముత్తెపు సేసల

నానా వర్ణముల మించినా రట పెండ్లిన్.


తోటకము  


కొని నూత్న వధూ వర కూటమినిం

జన బంక్తిరథుండు ప్రచండ రుషన్

గనిపించిన భార్గవు గర్వమడం

చెను రాముడు తండ్రికి సేమ మిడెన్. 11


ఉత్పలమాల  


తోచెడి వార్థకంపు బలు దోరపు జాయలు మేన రాజ్యముం

గాచగ లేను రామునకు గట్టెద బట్టమ టంచు దెల్పగా

నూచిరి మేలుమే లనుచు నుల్లము లుల్లసిలంగ బౌరులున్

దా జిన భార్యకుం దెలిపె దానిని వృద్ధవిభుండు వేడ్కమై.12


మత్తకోకిల 


రామునంపు డరణ్యవాసము రాజు జేయుడు నా సుతున్

గామిత మ్మిది తీర్చు డంచన గైక గూలె హతాశుడై

భూమిపాలుడు రామలక్ష్మణ భూమిజల్ వన మేగగా

నోమె గైకసుతుండు రాజ్యము నుంచి రామునిపాదుకల్.13


మత్తేభము 


తరియించెం జదలేఱు భిల్లపతినిం దన్పెన్ ససౌమిత్రియై

ధరణీజాతను గూడి ఘోరగహనాంతర్వర్తియై తాపసుల్

బరితోషించగ రాక్షసాళి దునుమన్ బద్ధుండయెన్ రాముడు

క్కరియై పంచవటిన్ వసించె సుఖియై కాలంబు సాగన్ వడిన్. 14


స్రగ్విణి 


కామినిన్ జుప్పనాకన్ వికారించగా

రామునిన్ వేలలో రాక్షసుల్ దాకగా

నేమియున్ జంకకే యేసె దా నొక్కడే

భూమిజానాథుడా పోరునన్ శూరుడై. 15


తరళము  


చెనటి రావణు డంపె మాయల జింక నొక్కటి సీత తా

వునకు బట్టగ దాని రాముడు వోయె దూరము దొంగ భి

క్షుని విధమ్మున వచ్చి భీతను క్షోణిజన్ జెరబట్టి పా

రెను జటాయువు పోర రెక్కల వ్రేసి లంకకు ధూర్తుడై. 16

  

మానిని  


శ్రీ వసుధాత్మజ గానక రాముడు చింతను సాగుచు దమ్మునితో

నా వనసీమల జంపి కబంధుని నారసి వృద్ధతపస్విని సు

గ్రీవుని మైత్రిని వాలిని గూలిచి కేసరి పుత్రుని దూతగ నా

రావణుజెంతకు బంపగ మారుతి లంకనుగాలిచె సీత గనెన్. 17


అంబురుహము  


చేరె విభీషణు డాశ్రయ మిమ్మని శ్రీ రఘూత్తము చెంతకున్

వారధి గట్టిరి సంద్రము దాటిరి వానరుల్ పెనుమూకలై

పోరిరి రాక్షస కోటుల నేసిరి పోటుకాండ్లయి లంకలో

బోరున రావణు బంధువు లందరు బోయి రంతకు పాలికిన్.

18


మేఘవిస్ఫూర్జితము


అమాంతం బగ్నిజ్వాల బడు శలభా లట్లు దైత్యాళి వ్రాలన్

సమీపాన న్రామాస్త్రముల భయద జ్వాలలం భస్మమయ్యెన్

భ్రమల్మాసెన్ బ్రహ్మాస్త్రమున బడె నా రావణుం డాజిలో లో

కముల్సర్వంబున్ హర్షమున  బొగడంగాను శ్రీ రామచంద్రున్. 19


మంగళమహాశ్రీ  


జానకి పునీత ఘనసాధ్వి యన బావకుడు 

....సంతసమునం ధరణిజాతన్

బాణిగొని పుష్పకము పై జని యయోధ్యకు 

....శుభం బన సురర్షినరసంఘాల్

బూనికను ధర్మమును భూమి నలు దిక్కులను 

....బూన్చి పరిపాలనము జేసెన్

దాను హరి రాముడయి ధర్మ విభుడై నిలిచె 

....ధాత్రి పలు వేల ఋతువృత్తుల్. 20


మధ్యాక్కర   


చదువ రామకథను వాగృషభుడౌను విప్రుడు రాజ

పదవి నలంకరించు ధర బఠియింప దీని క్షత్రియుడు

పొదలును వణిజున కిలను బొల్పుగ బణ్యఫలత్వ

ము దొఱయు సుఖము శూద్రునకు భూమిని సత్యవాక్కు లివి. 21

Wednesday, March 22, 2023

శోభకృత్ రమ్ము




తూరుపు దిక్కునం బ్రభలు దోచెను క్రొత్తగ గాలితెమ్మెరల్

జోరుగ సాగె నవ్య సుమ సుస్మిత సౌరభ వాహ పంక్తులై

భూరుహ పంక్తి లేజివురు భూషల వెల్గె వసంత మాయె నీ

ధారుణిపై పరాత్పర సుధామయ దృక్కులు సోకి నట్లుగా.


ప్రాభవ మొప్ప నల్దెసల భవ్య మనోజ్ఞ వసంత రాగ స

చ్ఛోభన దీప్తులన్ గరపి క్షోణితలమ్మును భూతకోటికిన్

శోభలఁ గూర్చు ధామముగఁ జొప్పడఁ జేయఁగ రమ్ము నీకిదే

శోభకృతాఖ్య నూత్నయుగసుందరి! స్వాగత మందుఁ బ్రేమతో. 



Sunday, March 12, 2023

ధ్రువానుగ్రహము




బాలుడ నంచు నెంచకుము భక్తిని నీ కొఱకై తపించితిన్ 

మాలిమి జూడవే ధ్రువుని మాధవ! దీనజనావనా! హరీ!

ఏలను రాజ్యభోగము లికేలను సంపద లేల బంధువుల్ ?

చాలదె నీ పదంబు లిడు శాశ్వత దివ్య పదంబు కేశవా!


********************************


బాల్యము నందు నన్ మదిని భావన జేయుచు వీడి లోని దౌ-

ర్బల్యము, సంయమీంద్రులను రాయిడి పెట్టెడి యింద్రియాల చా-

పల్యము త్రొక్కి పట్టి, కడు భక్తి తపంబొనరించినావు కై- 

వల్యము గోరి, మెచ్చితి ధ్రువా! పరమార్థము నీకు నిచ్చెదన్.


*********************************

మత్స్యరూపమున సోమకుని ద్రుంచితి వీవు 

.......కూర్మమై మోసితి గిరిని నీవు 

వారాహరూపివై పైడికంటిని జంపి 

.......నరహరి! రాక్షసు నణచి నావు 

వామన మూర్తివై బలి గర్వ మడగించి

.......పరశురాముడ వయి బరగినావు 

హరిహరీ యని పిలువ నరమరికలు లేక 

.......అందరి గాతువో ఆదిపురుష!


నేడు బాలుని గావగా నీలమేఘ- 

దేహ! దిగి వచ్చి నావయ్య దివిని వీడి 

నన్ను మించిన శ్రీమంతు డెన్న  నెవరు 

శరణు శరణయ్య శ్రీహరీ! శరణు శరణు!  


**********************************


భక్తి హరిని గొల్వ బాల్యమ్ము గీల్యమే 

అతని జేరు తపన యంకురింప 

దివ్య పదము నిచ్చి దీవించి పంపడే

హరి కరుణకు నెన్న హద్దు గలదె?

==============================={==={

మూడు, ఆరు, ఏడు, పది - ఈపదాలను స్వార్థంలోను అన్యార్థంలోను ఒకేపద్యంలో ఉపయోగిస్తూ సీత రావణుడితో అవ్నట్లుగా రామాయణార్థం వచ్చేలా వ్రాసిన పద్యం:


మూడును రావణా మూడింట నీకింక

......సీతను నన్నిట్లు చెరను బట్ట

నారును నీలోని యారును నీచుడా

......రామ బాణాగ్నికి రాలి పడిన

నేడేడు లోకాలు నేడువ మేలొకో

......నీ దుష్ట కర్మ లవేల మాను 

పది దిక్కులను కీర్తి పదిలముగా వెల్గు

......రామునితో మైత్రి రహిని గూర్చు


ప్రాణమూడు బొంది పడు భువి నీదింక  

నారు లంక దివ్వె లన్ని వేగ

నేడుకాల మంటి వేమి యో రావణా!

అగుదువేమి పదిల మంత గడువు?

Saturday, January 14, 2023

మకర సంక్రమణ పుణ్యకాలం

 






🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼

చకచక సాగుచుండె నదె చాయమగండు విలాస దీప్తులన్ 

మకరము వైపు ధాత్రికి సమాదర మొప్పెడి యుత్తరాయణ 

ప్రకటిత పుణ్యకాల మిడి భాసిలఁ జేసెడి దివ్య దీక్షతో 

సకల చరాచర ప్రకృతి సంతస మొందుచు నంజలించఁగన్. 

***

మకర రాశికిఁ జేరె మార్తాండు డల్లదే

............ఠీవిగా వినువీధి ఠేవ మీర 

మకరసంక్రమణమ్ము మరల వచ్చినదని

............పితృదేవ గణములు ప్రీతిఁ జెందె

రంగవల్లుల దీర్చి రంగుగా రమణులు

............స్వాగతమ్మన వచ్చె పౌష్యలక్ష్మి

భోగిపండ్లను బోయ, బొమ్మకొల్వులు దీర్చ

............పేరటాండ్రందరు జేరినారు


గంగిరెద్దులు గొబ్బియల్ ముంగిళులను

ప్రభలఁ జిందించె రైతుకు ప్రమదమాయె

పల్లె టూళ్ళెల్ల పర్వమై పరవశించె

రమ్య రాగాల డోల సంక్రాంతి హేల!

🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼