padyam-hrudyam

kavitvam

Sunday, October 30, 2016

నాటి దీపావళి.



నాటి దీపావళి 


కల్వము పొత్రము కాగితాల్ లైపిండి
.........చిన్న కర్రయు బట్ట సేకరించి
కర్రకు మెల్లగా కాగితాలను చుట్టి
.........గొట్టములను చేసి కోమలముగ
సూరెకారమ్మును చూర్ణముగా చేసి
.........గంధకమ్మును కూడ కలిపి నూరి
వస్త్రగాయితమును వడుపుగా గావించి
.........మెత్తని చూర్ణముల్ మెదప జేసి
పాళ్ళకు తగినట్లు పై రెండు బీడుతో
..........హత్తించి చేరిచి క్రొత్త ముగ్గు

ఆముదముతోడ పదునుగా నన్ని కలిపి
కొద్ది మందును గొట్టాన కూరి నంత
తలుపులను వేసి కాల్చి ముత్యాలు రాల
మంచి ముత్యాల్మతాబుల మందు కుదురు.

ముదురు జిల్లేడు మొక్కల మొదలు త్రవ్వి
పూర్తిగా యెండ కాలిచి బొగ్గు చేసి
గంధకము బొగ్గుపొడి సూరెకారములను
పావు రెండును నారుగా పాళ్ళు కలుప
కుర్రకారు కేరింతల గోలజేయు
ముదితలను పెద్దలను సిడిముడిని జేయు
చివ్వునను గెంతు చిటునటు స్థిరము లేని
చిలిపి తూనీగలకు మందు సిద్ధమగును.

తాటాకు టపాకాయలు
పోటీ జువ్వలును చిచ్చుబుడ్లు సిసింద్రీల్
మేటి మతాబులు త్రిప్పు ప
టాటోపపు పొట్లములును ఢంఢమ దినుసుల్.

దీపావళి యింకా దరి
దాపులకే రాక మున్నె తత్సంబంధం
బౌ పనుల మునిగి పోదురు
పాపలు పెద్దలును స్త్రీలు పదుగురు నొకటై.

నవ్వు పువ్వుల రివ్వున రువ్వుకొనుచు
నొక్కెడన్ గూడి ఆనంద మురక లేయ
బాణసంచా తయారిని పాలుగొనుట
నాడు దివ్యానుభూతి! యీ నాడు సున్న.


Tuesday, October 11, 2016

భండాది ప్రముఖామరారి తతులన్ భంజింపవే తల్లి! బ్ర-
హ్మాండంబుల్ పరిరక్ష సేయుటకునై మాల్మిన్ మహా కాళి! పిం-
డాండంబుల్ మనలేవు నీ కనులలో నగ్నుల్ జ్వలింపంగ నో
చండీ! చిన్మయ రూపిణీ ! కరుణతో సౌమ్యాకృతిన్ దాల్పవే!

నీ లలితాధరమ్మునను నిండుగ పూచిన నవ్వు పువ్వునే
నీల గళుoడు చంద్రునిగ నిత్యము దాల్చు శిరమ్ము నందు నే 
రాలకునైన జీవమిడు రాజిలు నీ దరహాస చంద్రికల్
మాలిమి పొంగుచుండుటను మానుగ చిన్మయ రూపిణీ ! శివా








Monday, October 10, 2016

శవరీం...

లుఠద్గుఞ్జాహారస్తనభరనమన్మధ్యలతికా
ముదఞ్చద్ఘర్మామ్భఃకణగుణితనీలోత్పలరుచమ్,
శివం పార్థత్రాణప్రవణమృగయాకారగుణితం
శివామన్వగ్యాన్తీం శవరమహమన్వేమి శవరీమ్.
(కాళిదాస విరచిత సకలజననీస్తవము నుండి)

పార్థ త్రాణ = అర్జునునికి పాశుపతాస్త్రాన్నిచ్చి రక్షించటానికి, ప్రవణ = పూనుకొని, మృగయా కార గుణితమ్ = తదనుగుణంగా వేటను కల్పించుకొనిన,శవరమ్ = కిరాతవేషం ధరించిన, శివమ్ = శివుని, అన్వగ్యాన్తీమ్ = వెంటనంటిన, శవరీమ్ = శబరవనితగా వేషం ధరించిన ఆమెను, లుఠత్ = దొరలుతున్న, గుఞ్జా హార = గురువిందగింజల పూసలదండతో, స్తన = చన్నుల, భర = బరువుచే, నమత్ = వంగిన, మధ్య లతికామ్ = మధ్యభాగం కలిగిన ఆమెను, ఉత్ అఞ్చత్ = బయలువెడలుతున్న, ఘర్మ అమ్భః కణ = స్వేద బిందు కణములచే, గుణిత = ద్విగుణితమైన, నీల ఉత్పల రుచమ్ = నల్ల కలువ వంటి కాంతి కలిగిన ఆమెను, శివామ్ = శుభాలను కలిగించే ఆమెను, అహమ్ = నేను, అన్వేమి = అనుసరిస్తున్నాను.
విశేషాలు:
(౧) తాను ధరించినది కిరాతవేషం. కాబట్టి అలంకారం కూడా దానికి అనుగుణంగానే గురువిందగింజల వంటి పూసలతో చేసిన దండ. అలా వేసుకున్న పూసలదండ ఎలా ఉందంటే ఆవిడ శరీరాకృతి ఎలా వంపులు తిరిగిందో అలాగే ఆ పూసలదండ కూడా వంపులు తిరిగింది.
(౨) కిరాతవేషం వేసినా, ఎలా ఉన్నా, ఎప్పుడూ శివుణ్ణి అంటిపెట్టుకునే ఉంటుంది అమ్మవారు. అర్ధాంగి.
(౩) తాను అనుసరిస్తున్నది కిరాతవేషంలో ఉన్న శివుణ్ణి. ఆ శివుడో వేటాడుతున్నాడు. ఆ వేట శ్రమతో కూడినది. తాను అయ్యవారినే అనుసరిస్తోంది కాబట్టి తనూ శ్రమపడుతోంది. ఆ శ్రమవలన చెమట పడుతోంది. కిరాతవనిత కాబట్టి వేటకు వెడుతోంది కాబట్టి ఆమె సహజంగానే నీలవర్ణంలో ఉంది. ఆపై చెమట పట్టి శరీరకాంతి రెట్టింపు ఔతోంది.

(వ్యాఖ్యాత: శ్రీ  ముక్కు  రాఘవ  శ్రీకిరణ్)

Sunday, October 9, 2016

సిద్ధిధాత్రి



సిద్ధిధాత్రి
**************ఇద్ధర తన సాధకులకు
సిద్ధుల నిడు సిద్ధిధాత్రి చెరుగని కరుణన్
సిద్ధసురాసురవందిత 
వృద్ధిక్షయముల కతీత వేడుడు భక్తిన్.

శివునకే సిద్ధుల నిడెను సిద్ధిధాత్రి
అర్థ భాగ మాయెను తల్లి యతని మేన
నర్థ నారీశ్వరుండను ఖ్యాతి దెచ్చె
మాత కృపయున్న వశము బ్రహ్మాండ మెల్ల.
సిద్ధిధాత్రి కృపకు చేరువ యైనచో
వాంఛ లుడిగి దేవి పాదపద్మ
యుగళి సంచరించు మొగరంభమై వెల్గి
పరమపదము నొందు నరుడు తుదకు.

Saturday, October 8, 2016

మహాగౌరి

మహాగౌరి

గౌరవర్ణకలిత కమనీయ దేహమ్ము
నష్ట వర్ష తరుణ మభయ కరము 
శాంత వదన మతుల సౌమ్య స్వరూపమ్ము 
గౌరి స్త్రీల  పాలి కల్పవల్లి.

కఠిన తపమొనర్చ కాలకంఠుని గూర్చి
నల్ల నాయె కమిలి తల్లి తనువు
పరమశివుడు మురిసి పాణిని గ్రహియించి
కౌగిలించ స్వర్ణ గౌరి యాయె.

శ్రేయస్కరము మహాగౌ
రీ యర్చనమున శరత్తు రేలను ప్రత్యా
మ్నాయము లేదిల మంగళ
దాయకము శుభప్రదమ్ము తల్లి విభూతుల్.

Friday, October 7, 2016

కాళరాత్రి





కాళరాత్రి
************
కాళరాత్రి భయంకరి ఖరతురంగ
కాలకేశిని కౌశికి ఖడ్గహస్త
నీలలోహిత నిర్మల నిర్వికార
ఫాలలోచని మాలిని పాపహారి.
కఠిన చిత్తుల పాలిటి కాళరాత్రి
యెన్న భక్తుల కీ తల్లి వెన్నెల నిశి
దుష్ట శిక్షణ నొనరించి శిష్ట జనుల
గాచు చల్లగా నీ శుభంకరి సతమ్ము.
నవరాత్రులలో నిష్ఠను
ప్రవిమల హృది కాళరాత్రి పరిచర్యల నే
డవ నాడు గడుపు వారికి
లవలేశము సంకటములు రావు ధరిత్రిన్.

Thursday, October 6, 2016

కాత్యాయనీదేవి

కాత్యాయనీదేవి
******************
కన్య కాత్యాయనర్షికి కమలనయన
భాద్రపద చతుర్దశి నాడు ప్రభవ మంది
ఆశ్వయుజ శుక్లమందున నర్చన గొని
విజయదశమిని మహిషుని పీడ బాపె.
మహిత శక్తుల నార్జించి మహిషు జంపి
భూమి భారము బాపిన పుణ్య మాత
గోపికలు వ్రత మొనరింప కూర్మి జూపి
నంద నందను పొందిచ్చి విందు జేసె.
కాత్యాయని నర్చించిన
నత్యంత శ్రద్ధ తోడ నవరాత్రములన్
నిత్యశుభమ్ముల నిచ్చును
సత్యమ్మిది శాస్త్రవాక్కు సంకట హరమౌ

Wednesday, October 5, 2016

స్కందమాత


స్కందమాత

అందమగు నారు మొగముల
స్కందుం డాడగను తల్లి చల్లని యొడిలో 
విందొనరించునుభక్తుల  
కందరకును స్కందమాత కమనీయముగా.

సింహవాహి చతుర్భుజ శృంగ వాసి
వామ హస్తాల పద్మము వరద ముద్ర
స్కందు చేబట్టు దక్షిణ కరముతోడ 
భక్త జన సంకటమ్ముల బాపు తల్లి.

ఐదవ దినమున మదిలో 
మోదముతో స్కంద మాత మూర్తిని గొలువన్
బాధల బాపును కరమిడి 
చేదుకొనున్ దేవి మనను చెంతకు దయతో.

Tuesday, October 4, 2016

కూష్మాండ



సృష్టి లేని ముందు చిమ్మచీకటి నిండ
చిన్న నవ్వు నవ్వి చేసి మాయ
లిప్తలో సృజించె లీలగా కూష్మాండ 
ఆది శక్తియై యజాండములను.
సూర్య మండలాంతర్వర్తి శుభపదాబ్జ
భాను కిరణప్రభాభాసమాన తేజ
మాత అష్టభుజాదేవి మహితశక్తి
భక్తమందార కూష్మాండ భయవిదూర.
నవరాత్రి పండుగల నా
ల్గవ దినమున పూజ చేసి కడు శ్రద్ధను మా
నవు డిడ కూష్మాండ బలిని
భవ ముడుగును తుదకు పరమపదము లభించున్.

చంద్రఘంట





అర్థ చంద్రుడు శిరమందు నాడుచుండ
ప్రమదమున ఘంట రూపాన స్వర్ణ కాంతు
లీను మేనితో సౌమ్యయై యిలను నేలు
చంద్రఘంటను భజియింప జాల శుభము.
పది చేతులతో నొప్పుచు
పదునౌ ఖడ్గమ్ము వంటి పలు శస్త్రములన్
కదనోత్షాహిగ నొప్పుచు
ముదమౌ భక్తులకు భయదమును దుష్టులకున్.
యుద్ధ సన్నద్దు రాలయి యున్న కతన
శీఘ్రముగ భక్తకోటికి చింత లణచ
సర్వదా చూచు చుండును చంద్రఘంట
కొలువ నవరాత్రముల నీమె కొంగు పైడి.

బ్రహ్మచారిణి





హిమవత్పర్వత పుత్రిక
యుమ నారదు హితవు నెంచి యుడుగని దీక్షన్
ప్రమథపతి నుంచి మది నను
పమ తపమును నాచరించె పలువత్సరముల్.
బ్రహ్మచారిణియై తపో వనమునందు
బ్రహ్మమును గూర్చి తపియించె పర్వత సుత
బ్రహ్మ మన తపంబని పల్కె ప్రాతచదువు
బ్రహ్మమున తాను పొందెను భవుని యుమగ.
బ్రహ్మమే తానుగా నొప్పు భవునిరాణి
బ్రహ్మ మొనరించె లీలగా బ్రహ్మచారి
ణిగను భక్తుల నేలగ నిరుపమ కృప
కొలువ నవరాత్రులందున కలుగు శుభము.

Saturday, October 1, 2016

శైలపుత్రి

శైలపుత్రి 


ఘన ధాతు సంచయమునకు
ననువౌ హిమశైలమునకు నా మేరువు నం
దిని మేన పత్ని వారికి
తనయలు గంగయును నుమయు తనరుదు రిలలో.

ఉమ శివుని పతిగ గొన నను
పమ గతి కటు నియమమున తపమున గడుప కా
లము పరచె జనకు డతివకు
ప్రమథపతికి పరిణయమును ప్రమదము గదురన్.

నవదుర్గలలో మొదటిది
భవహారిణి శైలపుత్రి భవసతి భక్తిన్
నవరాత్రులలో కొలిచిన
శివముల నిడి బ్రోచు తల్లి చిరకాలమ్మున్.