padyam-hrudyam

kavitvam

Friday, April 29, 2011

చిన్మయ రూపిణీ!




















మున్మహిషాసురున్ దునిమి మూడు జగమ్ముల నేలవే కృపన్
సన్ముని దేవ సంఘములు సంస్తుతి సేయ భవాని! చండికా!
జన్మము ధన్యమై, తనువు ఝల్లన, మానస ముల్లసిల్లగా
చిన్మయ రూపిణీ! నిను భజించెడు భాగ్యము నిమ్ము సర్వదా!

Sunday, April 24, 2011

కల్యాణము చూతము రారండీ!



జానకి పద్మ హస్తముల చాయకు కెంపుల కాంతి, రాలుచున్
భాను కులేశు మస్తకము పైనను మల్లెల శోభ, జారుచున్
మేనను యింద్ర నీల మణి మేలగు దీప్తుల నీను సేసలై
శ్రీనిలయమ్ము లిత్తరిని సేయు శుభంబుల నెల్ల దాత్రికిన్ !



Friday, April 22, 2011

చిన్మయ రూపిణీ!




















మన్మథ వైరికిన్ సతివి మాత! భవాని! పరాత్పరీ! శివా!
సన్ముని దేవతా వినుత! శాంకరి! శాంభవి! భద్రకాళికా!
జన్మ శతార్జితాఘపటు జాడ్య విమోచని! జన్మ నాశనీ!
చిన్మయ రూపిణీ! నిను భజించెడు భాగ్యము నిమ్ము సర్వదా!

Sunday, April 17, 2011

చిన్మయ రూపిణీ!





















జన్మము నెత్తి నందులకు చాలు భవత్పద పద్మ రేణువుల్
తన్మయతన్ ధరించెదను తల్లిరొ! నా శిరమందు భక్తి! నా
జన్మ పవిత్రమై చెలగె! సత్యము పల్కుచునుంటి , శాంభవీ!
చిన్మయ రూపిణీ ! నిను భజించెడు భాగ్యము నిమ్ము సర్వదా!

Sunday, April 10, 2011

శేషశాయి





శాంతాకారం! భుజగ శయనం! పద్మనాభం! సురేశం!
విశ్వాధారం! గగన సదృశం! మేఘవర్ణం! శుభాంగం!
లక్ష్మీకాంతం! కమలనయనం! యోగిహృద్ధ్యాన గమ్యం!
వందే! విష్ణుం! భవభయ హరం! సర్వలోకైకనాథం!

Sunday, April 3, 2011

ఖరమునకు స్వాగతం !




















రావోయీ ఖర నామ వత్సరమ! నీ రాకన్ మదిన్ గోరుచున్,
గోవత్సమ్ములు మేత కేగ జననుల్ గోశాల లో వేచు రీ-
తిన్, వేవేలుగ వేచి చూచెడిని నీ దివ్యాగమా కాంక్షతో
మావుల్, మల్లెలు, కోయిలల్, మధుపముల్ మా మానసాబ్జమ్ములున్!

వసంతానికి స్వాగతం





















నిశలు కృశించ సాగినవి, నింబము పూయ నుపక్రమించె, న-
ల్దిశలు వెలార్చె శోభలను దివ్య మధూదయ వేళకై యహ-
ర్నిశలు తపించు మావికిని, నేస్తము కోయిలకున్ శుభంబగున్
శిశిరమ! పోయి రమ్మికను శీఘ్రమె! పంచు నుగాది వేడుకల్.

వచ్చెను వసంత మదిగో!
తెచ్చెను సంతోష ఝరులు దివ్య ధరిత్రిన్!
విచ్చెను ఆశల పువ్వులు!
చెచ్చెర నెమ్మనములందు జీవులకెల్లన్!

గున్న మామిడి కొమ్మ గుబురు లోపల దాగి
.................................పంచమ స్వరములో పాడె పికము!
రంగు రంగుల పూలు హంగుగా ధరియించి
.................................చిరుగాలి నూగెను చెట్టు చేమ!
మలయ మారుత వీచి నల్దిశల్ పయనించి
.................................సుమ సౌరభమ్ముల సుఖము నింపె!
మధువులానగ తేటి మత్తిల్లి తమకాన
.................................లాస్యమ్ము చిందించె లలిత విరులు!

క్రొత్త ఆశలు కోర్కెలు గుండె నింప
మోసికొని వచ్చితీవు ఓ ముద్దుగుమ్మ!
సకల జనముల బ్రతుకుల చక్క దిద్ద
స్వాగతమ్మిదె నీకు వాసంత లక్ష్మి!