padyam-hrudyam

kavitvam

Tuesday, September 20, 2016

వల్లభ గణపతీ !



చల్లని వేళలో నెడద ఝల్లన తోచును భావమందు నీ
మెల్లని మందహాసమును మేటి కబంధము వక్రతుండమున్
ఫుల్ల సరోజ నేత్రముల పొంగు కృపారస వాహినీ ఘృణుల్ 
వల్లభదేవిహృత్కమలబంభర! వందనమయ్య దేవరా!

ప్రల్లద మేది నీ చరణ పంకజముల్ శరణన్న వారమే  
చల్లగ జూడు మయ్య మము సారెకు మ్రొక్కుదుమయ్య విఘ్నముల్
త్రెళ్ళగ జేయుమయ్య భవదీయ కటాక్షమె రక్ష మాకు నో
వల్లభ విఘ్నరాజ! మదవారణవక్త్ర! మహా గణాధిపా!  

Sunday, September 4, 2016

మత్తేభాస్యా...







మత్తేభాస్య! మదీయ విన్నప మిదే మా లోక మందెల్లడన్
జిత్తుల్ పొత్తులు నెత్తులున్ క్షణములో ఛీత్కారముల్ గుండెలన్
హత్తుల్ వెన్కను మొత్తు లయ్య కనవో ఆలోచనల్ మానవో
చిత్తుంజేయవొ వాని నీ మహిమతో చిత్తమ్ములన్ మార్చవో.

ఎలుకతేరువాడ యీవేళ నింపైన
కుడుము లిడుదు నీకు నిడుమ కలుగు
లోన జార నీకు లోకువ గా నీకు
చాలునయ్య నాకు చల్లనయ్య.