padyam-hrudyam

kavitvam

Thursday, January 30, 2014

కైమొగిడ్చెద నాతని కళకు మురిసి............





పిల్లకై  బువ్వను తల్లి గుండెలలోన
...............దాచి యుంచిన యట్టి దయకు నెలవు!
మధుపమ్ము కోసమై మధువును పూలలో
...............కల్పించి యుంచిన కరుణ కిరవు!
విత్తులో జీవమున్ బెట్టి నిద్దుర బుచ్చి
..............మొలకెత్త జేసెడు కళకు మురు!
నేలను  గాలిని  నీటిని జీవరా
................శుల నిల్పి పోషించు  శోభ  కనువు!

విశ్వ నిర్మాణకర్త వైవిధ్య భరిత
సృష్టి శైలిని పరికించి చింత జేసి
మమత  నిండిన శక్తికి మరలమరల
కైమొగిడ్చెద నాతని కళకు మురిసి.

Tuesday, January 21, 2014

గుడిగంట - బడిగంట



గుడిగంట, బడిగంట గుండెలో నిండుగా
...........కొలువున్న పరమాత్మ పిలుపు లగును!
గుడిగంట, బడిగంట గుండెలో నెలకొన్న
...........యజ్ఞాన తిమిరాల కర్కు లగును!
గుడిగంట, బడిగంట కోట్లాది హృదయాల
...........చైతన్య పరచెడు శబ్ద మగును!
గుడిగంట, బడిగంట కొడిగట్టు సంస్కృతీ
...........సంప్రదాయపు దివ్వె చమురు లగును!

ఒకటి యాముష్మికమ్మున కూత మగును,
రెండవది యైహికపు వెల్గు రేక లగును,
రెండు గంటల శబ్దాలు లేని నాడు,
నరుడు చుక్కాని లేనట్టి నావ యగును.

Tuesday, January 14, 2014

సంక్రాంతి హేల!







మకర రాశికి జేరి మార్తాండు డల్లదే
............ఠీవిగా వినువీధి పోవుచుండె!
మకర సంక్రమణంబు మరల వచ్చినదని
............పితృదేవ గణములు ప్రీతి జెందె!
రంగవల్లుల దీర్చి రంగుగా రమణులు
............స్వాగతమ్మన వచ్చె పౌష్యలక్ష్మి! 
భోగిపండ్లను బోయ, బొమ్మకొల్వులు దీర్చ
............పేరటాండ్రందరు జేరినారు!

గంగిరెద్దులు గొబ్బియల్ ముంగిళులను
ప్రభల జిందించె రైతుకు ప్రమదమాయె
పల్లె టూళ్ళెల్ల పర్వమై పరవశించె
రమ్య రాగాల డోల సంక్రాంతి హేల!

**********************************

తెలవారకనె మున్నె కొలువు కేగెడు మాకు
.............భానుని నడకతో పని యదేమి?
అమ్మ నాన్నల నుంచ నాశ్రమా లందున
.............పితృదేవతల కింక బెట్టుటేమి?
ఫ్లాట్లలో లిఫ్టులో పడియుందుమే మేము
.............ముంగిట ముగ్గుల మోజు లేల?
క్లబ్బులు పార్కులు పబ్బుల వింటిమి
.............పేరంటము 
లవేమి వేస్టు టైము?

నెట్లు బ్రౌజింగు చాటింగు నీటు మాకు
గేంసు సినిమాలును షికార్లు క్రేజు మాకు
టౌను లైఫన్న హాయిలే ఔను ఫాక్టు
పొంగలేమిటి సంక్రాంతి పొంగులేమి?

Saturday, January 11, 2014

వైకుంఠ ద్వార దర్శనము


వైకుంఠైకాదశి! నీ 


వైకుంఠము గోరునట్టి భక్తుల కిలలో 


శ్రీకర ముత్తర గుమ్మపు 


నీ కొల్వుకు జేరు ద్రోవ నీరజనాభా!