padyam-hrudyam

kavitvam

Wednesday, March 2, 2011

రామ తారక శతకము 10

46 . అల్పుల మాటల కాస పడగ నేల - ఫలము బూరుగు చూచి భ్రమసినట్లు
నీచుల మాటల నిశ్చయింపగ నేల - నీరు గట్టిన మూట నిలిచి నట్లు
గుణ విహీనుని మాట గురి సేయగా నేల - గొడ్డు గోవుల పాలు గోరి నట్లు
కపట ఘాతకు మాట కాంక్ష సేయగ నేల - కలలోన మేలు దా గన్న యట్లు

పామరుల మాట నెంతయిన పాటు జేసి - అడుగ గోరెడి వారిదే యల్ప బుద్ధి
నీతిమంతుల కివి యెల్ల నిశ్చయములు - రామ! తారక! దశరథ రాజ తనయ!

47 . శ్రీ రామ నామంబు చిత్తాబ్జమున నిల్పి - వామ లోచన భవుడు వార్త కెక్కె
కాకుథ్స తిలక నీ కరుణా రసంబున - కల్పాంతర స్థితి కపి వహించె
ఖర వైరి పద రజ కణములు సోకిన - కలుషముల్ వాసెను కాంత కపుడు
పులుగుల రాయడు రఘు పుంగవు నుతించి - నిర్వాణ పదమందు నిలచె వేడ్క

హాటకామ్బరు లక్ష్మీశు నాత్మ దలచి - కూర్మి నరులార మోక్షంబు కొల్ల గొనుడి
రామ నామామృతంబున కేమి సమము - రామ! తారక! దశరథ రాజ తనయ!

48 . సకల భూత వ్రాత సంఘ విధ్వంసంబు - రామ తారక మంత్ర రాజ మరయ
సకల రాక్షస వీర జాల నిర్మూలంబు - రామ తారక మంత్ర రాజ మరయ
సకల పురాణాది సన్నుత తత్త్వంబు - రామ తారక మంత్ర రాజ మరయ
సకల తీర్థామ్నాయ సార సంగ్రహ వేది - రామ తారక మంత్ర రాజ మరయ

సకల ముని జన చిత్తాబ్జ సార భృంగ - మైన శ్రీ రామ నామంబు నను దినంబు
స్మరణ జేయుడి జనులార సత్ఫలంబు - రామ! తారక! దశరథ రాజ తనయ!

49 . గాధి నందను యఙ్ఞకార్యంబు సమగూర్ప - ప్రకటి తంబైన యా ప్రాభవంబు
వాసవ తనయుని వసుధపై బడవైచి - వర్ణన కెక్కిన వైభవంబు
రావణుండాదిగా రాక్షసావళి నెల్ల - నాశ మొనర్చిన నైపుణంబు
................................................................................................................

నిట్టి కార్ముక దీక్షా ధురీణుడైన - భూమిజాధీశ మిమ్మును బుద్ధి యందు
దలచి కైవల్య మందిరి తత్త్వ విదులు - రామ! తారక! దశరథ రాజ తనయ!

50 . నా ముద్దులయ్యను నా దేవదేవుని - నా పిన్న యన్నను నా మురారి
నా రత్నమును పట్టి నా బంగరయ్యను - నా నిధానము రాము నాదు విష్ణు
నా కూర్మి శౌరిని నా బ్రహ్మ తండ్రిని - నా దీన నాధుని నాదు విభుని
నా మనో నాధుని నా నోము ఫలమును - నా జానకీ ధవు నా మహాత్ము

వెదకి కీర్తించి హర్షించి వేడుకొనిన - నఖిల సంపద లిప్పుడు నమరి నట్లు
తప్పు ద్రోవల బోయిన ధన్యు డగునె - రామ! తారక! దశరథ రాజ తనయ!

No comments: