padyam-hrudyam

kavitvam

Saturday, September 30, 2017

దేవీ మహిమన స్తోత్రం - 9




శ్రీ దూర్వాస మహర్షి విరచిత దేవీ (త్రిపురా) మహిమ్న స్తోత్రము నుండి:
వివరణ - బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు

***

శృంగారాది రసాలయం త్రిభువనీ మాల్యై రతుల్యై ర్యుతం
సర్వాంగీణ సదంగరాగ సురభి శ్రీమద్వపు ర్దూపితం
తామ్బూలారుణ పల్లవాధరయుతం రమ్యం త్రిపుండ్రం దధ
త్ఫాలం నందన చందనేన జనని ధ్యాయామి  తే మంగళం.

***

అమ్మా! నీ స్వరూపము శృంగారము మొదలైన నవరసములకు నిలయము.(శృంగార రససంపూర్ణా జయా జాలంధిరస్థితా .... లలితా సహస్రనామం ) అందుకే ఆవిడకు శృంగార నాయిక అని పేరు.  ప్రపంచము అమ్మవారి యొక్క సగుణ స్వరూపము.  ఈ ప్రపంచం లోని అనుభూతులన్నీ అమ్మవారి చైతన్యము యొక్క విభూతులు.  ముల్లోకముల లోని దివ్యమైన పుష్పములతో కూర్చిన మాలను ధరించినది. సర్వాన్గాములును చందనాది సుగంధలేపనములతో కూడినవి.  పరిమళ ధూపితమైనవి . తాంబూలము చేత ఎర్రనైన చిగురు వంటి పెదవులు కలిగియున్నది.(కర్పూర వీటికామోద సమాకర్షి ద్దిగంతరా...లలితా సహస్రం,   కర్పూర వీటీ సౌలభ్య కల్లోలిత కకుప్తటా....త్రిశతి).   ఎర్రని తల్లి, ఎర్రని పెదవులు, తాంబూలంతో మరింత ఎర్రనైనవి. రమ్యమైన త్రిపుండ్రములను ధరించిన ఫాలభాగము ప్రకాశిస్తున్నది. (భస్మరేఖామ్కిత లసన్మస్తకాయై నమః ...లలితా అష్టోత్తరం).  మరియు చందనాది పూతలతో ఆ నుదురు ప్రకాశిస్తున్నది.  అట్టి నీ దివ్య మంగళ స్వరూపమును ధ్యానించు చున్నాను.

***

శృంగార ప్రభృతమై చెన్నొందు రసముల
....కాలయమై నట్టి యద్భుతమ్ము
ముల్లోకములలోని ముఖ్యపుష్పమ్ముల
.....మాలతో సుందరమండితమ్ము
భవ్యాంగ సర్వమ్ము దివ్యాంగరాగమై
.....పరిమళ ధూపిత ప్రకటితమ్ము
కర్పూరవీటికా కలితారుణమ్మైన
.....పల్లవాధరయుత పరవశమ్ము

రమ్య భస్మ త్రిపుండ్ర సంరాజితమ్ము
నగరులేపితమౌ తిలకాశ్రయమ్ము
నిట్లు మంగళాకారమై యెసగు జనని
నిన్ను ధ్యానింతు నిరతమ్ము నేను మదిని.


Friday, September 29, 2017

దేవీ మహిమ్న స్తోత్రం - 8



శ్రీ దూర్వాస మహర్షి విరచిత దేవీ (త్రిపురా) మహిమ్న స్తోత్రము నుండి:
వివరణ - బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు

***

చాప ధ్యాన వశా ద్భవోద్భవ మహామోహస్య విజ్జృంభణం
ప్రఖ్యాతం ప్రసవేషు చింతన వశాత్త త్త చ్ఛరవ్యం సుధీ:.
పాశ ధ్యాన వశాత్సమస్తజగతా మృత్యోర్వశత్వం మహా
దుర్గస్తంభమహాంకుశస్య మననాన్మాయా మమేయాం తరేత్

***
.
తల్లీ నీ చేతిలోని ధనుస్సును ధ్యానించిన వానికి సంసారం వలన పుట్టే మహా మోహము యొక్క తీవ్రత నశిస్తుంది.  బాణములను స్మరించిన వానికి ధర్మబద్ధమైన అభీష్టము లన్నీ నెరవేరుతాయి.  పాశమును తలచుకొనే వాడికి  సమస్త లోకములలోను మృత్యువు వశమై పోతుంది. (అపమృత్యువు కలుగదు).  అమితమైన బాధలను అణచే అంకుశమును ధ్యానిస్తే మాయకు చిక్కుపడడు.

అంటే అమ్మవారి ఆయుధాలను ధ్యానించే వారు మోహం నాశనమై పోయి, న్యాయమైన కోర్కెలు తీరి, అపమృత్యు భయం లేక, మాయను తరించ గలుగుతారు.


బ్రహ్మజ్ఞానం కలగాలంటే అమ్మవారి చేతులలోని ఆయుధములను ధ్యానించాలి అని పెద్దల వాక్కు.  అదే ఈ శ్లోకంలోని సారాంశం.

***

చాపమున్ ధ్యానింప సంసార భవ మహా
.....మోహవిజ్జృంభణ ముడిగిపోవు
నారాచముల  దల్ప న్యాయ బద్ధంబైన
.....చింత లన్నియు దీరి సంతస మగు
పాశమున్ ధ్యానింప పదునాల్గు భువనాల
..... మృత్యువు వశమగు మేలు కల్గు
అత్యుగ్ర వేదన నణచెడు నంకుశ
.....మును దల్ప మాయలో మునుగ బోడు

ధూర్తులకు భీతి గలిగించు నార్తి బాపు
నర్థులకు నమ్మ హస్తాల నాయుధములు
మోహ ముడుగును నెరవేరు నైహికములు
మృత్యు వంటదు మాయ తరించ గలుగు.





Thursday, September 28, 2017

దేవీ మహిమ్న స్తోత్రమ్ - 7



శ్రీ దూర్వాస మహర్షి విరచిత దేవీ (త్రిపురా) మహిమ్న స్తోత్రము నుండి:
వివరణ - బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు

***

జాతీ చంపక కుంద కేసర రజో గంధోత్కిరత్కేతకీ
నీపాశోకశిరీష ముఖ్య కుసుమై ప్రోత్తంసితా ధూపితా
ఆనీలాంజన నీల మత్త మధుపశ్రేణీ ప్రవేణీ తవ
శ్రీమాత శ్శ్రయతాం మదీయ హృదయామ్భోజం సరోజాలయే.

***

సంపెంగ, మొల్ల, సుగంధభరితమైన పుప్పొడులను వెదజల్లు మొగలి, కడిమి, అశోకము, శిరీషము మొదలైన దివ్యమైన పుష్పములతో అలంకరింపబడి అగరు ధూపములు వేయబడిన (చంపకాశోకపున్నాగసౌగంధిక లసత్కచా ...లలితాసహస్రము) కాటుక వలె నల్లనైన, మదించిన తుమ్మెదల బారు వలె యొప్పుతున్న నీ సర్పాకారపు జడ ఓ శ్రీమాతా! పద్మాలయా! నా హృదయపద్మంలో ఎల్లపుడూ ధరించబడు గాక. (అమ్మవారి కేశపాశములను ధ్యానించేవారికి మృత్యుభయం ఉండదని ఆదిశంకరాచార్యుల వారి వాక్కు.)

***

సంపెగ, మొల్ల, పుప్పొడుల జల్లెడి కేతకియు న్నశోకముల్
యింపగు మంకెనల్ సుమ కళింగము బోలు సుగంధ పుష్పముల్
సొంపుగ గూర్చి, ధూపముల జూపగ కాటుక బోలి, తుమ్మెదల్
గుంపుగ జేరినట్లుగను గొప్పగ భాసిలుచుండు  నీదు నీ
లంపు ప్రవేణి యో సరసిజాలయ నా యెద తమ్మి నిల్చుతన్.గ, 

Wednesday, September 27, 2017

దేవీ మహిమ్న స్తోత్రం - 6



శ్రీ దూర్వాస మహర్షి విరచిత దేవీ (త్రిపురా) మహిమ్న స్తోత్రము నుండి:
వివరణ - బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు

***

తప్త స్వర్ణ కృతోరుకుండలయుగం మాణిక్య ముక్తోల్లస
ద్ధీరాబద్ధ మనన్యతుల్య మపరం హైమం చ చక్రద్వయం
శుక్రాకార నికారదక్ష మమలం ముక్తాఫలం సుందరం
బిభ్రత్కర్ణయుగం భజామి లలితం నాసాగ్రభాగం శివే.

***

కరుగుతున్న బంగారము వెలిబుచ్చు కాంతి వంటి కాంతితో కెంపులు, ముత్యములు అలంకరించిన వజ్రాలతో పొదగబడిన ( కెంపులు సూర్య సంబంధమైనవి, ముత్యాలు చంద్ర సంబంధ మైనవి.....తాటంక యుగళీభూత తపనోడుప మండలా...లలితా సహస్రం)
కుండలములను ధరించిన నీ కర్ణద్వయమును,   ముత్యముతో పొదగబడి వేగుచుక్క(శుక్రతార) యొక్క ప్రకాశమును కూడా ఓడింప సమర్థమైన అందమైన బంగారు బులాకీని ధరించిన నీ నాసాగ్రభాగమును ( నాసాగ్రే స్వమౌక్తికం...) ఓ శివా! నేను స్మరిన్చుచున్నాను.

***

కరగిన బంగారు ఘనమైన కుండలాల్
.....ముత్యాల  కెంపుల మురువు దాల్చి
పొదిగిన వజ్రాల పొల్పగు కాంతుల
.....ననుపమ రీతుల నమరియుండె
ముత్యము పొదిగిన పోడిమి నలరుచు
.....మురిపించు చక్కని ముక్కుపుడక
వేగుచుక్కను మించు  వెలుగుల ప్రసరింప
.....జాలుచు రమ్యమై వ్రేలుచుండె

నిట్టి రమణీయ భూషల కిరవు గూర్చి
లలితమై యొప్పు కళలచే కలిత మైన
నీదు కర్ణనాసాగ్రాల నియత భక్తి
నాదు మది నెంతును శివాని నతులు నీకు.


Tuesday, September 26, 2017

దేవీ మహిమ్న స్తోత్రం - 5




శ్రీ దూర్వాస మహర్షి విరచిత దేవీ (త్రిపురా) మహిమ్న స్తోత్రము నుండి\
 వివరణ : బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు

***

ఉద్యత్పూర్ణ కళానిధి ప్రవదనం భక్తప్రసన్నం  సదా
సంఫుల్లాంబుజపత్రకాంతి సుషుమా ధిక్కార దక్షేక్షణం
సానందం కృతమందహాసమసకృత్ప్రాదుర్భవత్కౌతుకం
కుందాకార సుదంత పంక్తి శశిభాపూర్ణం స్మరామ్యంబికే.

***

ఓ తల్లీ! ఉదయిస్తున్న పూర్ణ చంద్రుని శోభతో భక్తులపట్ల ప్రసన్నతతో, నిత్యమూ సంపూర్ణముగా వికసించిన పద్మముల రేకుల యొక్క శోభను ధిక్కరించగలిగి ప్రకాశిస్తున్న రమ్యమైన నేత్రములతో, జ్ఞానానందముతో కూడిన ప్రసన్నమై, మల్లెమొగ్గలవలె ఉన్న పలువరుసనుండి వెలువడే  వెన్నెల వలె తెల్లగా ప్రకాశిస్తున్న చిరునవ్వుతో కూడిన నీ వదనమునకు నమస్కరించుచున్నాను. (దరస్మేర ముఖామ్బుజా).

***

ఉదయేందు ద్యుతి శోభనం, బతి కృపోత్కృష్టంబు, భక్తాళికిన్
ముదమున్నిత్యము, పూర్ణమై విరియు నంభోజాతపత్రప్రభన్
పదటుం జేయగ జాలు నేత్రయుతమున్, బ్రహ్మానుమోదార్హమున్,
హృదయోత్పాద నిరంతరాగ్ర హసితాహృష్టమ్ము, కుందాకృతీ
రదనశ్వేత ప్రకాశ పూర్ణమును   నీ రమ్యాస్యమున్ దల్చెదన్.

Monday, September 25, 2017

దేవీమహిమ్న స్తోత్రం - 4




శ్రీ దూర్వాస మహర్షి విరచిత దేవీ (త్రిపురా) మహిమ్న స్తోత్రము నుండి


శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి వివరణ :

***

ముక్తారత్న విచిత్రకాంతి లలితై స్తే బాహువల్లీ రహం
కేయూరాంగద బాహుదండ వలయై ర్హస్తాంగుళీ భూషణైః
సంపృక్తాః కలయామి హీరమణిమన్ముక్తావళీకీలితం
గ్రీవాపట్ట విభూషణేన సుభగం కంఠం చ కంబుశ్రియం.

***

ఓ తల్లీ! ముత్యములతో పొదగబడి విచిత్రమైన కాంతితో ప్రకాశిస్తున్న,  కేయూరములతోను, అంగదములతోను, కంకణములతోను, ఉంగరముల తోను భాసిస్తున్న కల్పవృక్షపు తీగలవలె యున్న నీ నాలుగు బాహువులకు నమస్కరించుచున్నాను.  వజ్రములతోను ముత్యములతోను కూడిన మెడపట్టెడతో ప్రకాశిస్తూ  శంఖ శోభతో అలరారుచున్న  నీకంఠమునకు నమస్కరించు చున్నాను.

***

పొదిగిన ముత్యముల్ మెరుపు పూవుల వోలెను కాంతు లీన నం
గదములు కేయురమ్ములును కంకణముల్ బటువు ల్రహించగా
ముదమిడు బాహువల్లరుల మ్రొక్కుదు వజ్రము లాణిముత్యముల్
పదపడు పట్టెడన్ వెలుగు వారిజ శోభల నొప్పు కంఠమున్
మది దలతున్ ప్రణామములు మాటికి సేతును భక్తి నమ్మరో.

Sunday, September 24, 2017

దేవీ మహిమ్న స్తోత్రం - 3




శ్రీ దూర్వాస మహర్షి విరచిత దేవీ (త్రిపురా) మహిమ్న స్తోత్రము నుండి
శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి వివరణ :

***

శింజన్నూపుర పాదకంకణమహా ముద్రాసు లాక్షారసా
లంకారాన్కితమంఘ్రిపంకజ యుగం శ్రీ పాదుకా లంకృతం
ఉద్భాస్వన్నఖచంద్ర ఖండ రుచిరం రాజజ్జపా సన్నిభం
బ్రహ్మాది త్రిదశా సురార్చిత మిదం మూర్ధ్ని స్మరామ్యంబికే.

ఓ తల్లీ! ధ్వనిస్తున్న నూపురములను కడియాలను ధరించి, వివిధవర్ణములతో ముద్రలు తీర్చిదిద్దబడియుండి,  లత్తుకరసముతో పారాణి పెట్టబడి యుండి,  శ్రీపాదుకలను (చింతామణి పాదుకలను) ధరించియుండి, నెలవంక  ముక్కల వలె మనోహరంగా ప్రకాశించుచున్న  గోళ్ళను కలిగియుండి,  జపా కుసుమముల వలె ఎర్రగా వెలుగొందుతూ, బ్రహ్మవిష్ణు మహేశ్వరుల చేతను దేవేంద్రాది సురల చేతను పూజింపబడు చున్న నీ పాదపద్మముల జంటను నా శిరస్సు మీద ధ్యానించుచున్నాను.

***

ఘలుఘల్లు మని మ్రోయు గజ్జెలు కంకణాల్
.....గొప్పవౌ ముద్రల నొప్పు చుండి
లత్తుక రసముతో నొత్తుగ పారాణి
.....భాసింప దాల్చి శ్రీ పాదుకలను
నెలవంక ముక్కలై నెలకొనె నను రీతి
.....నఖము లుద్దీపింప నవ్యమైన
దాసాని పూవుల దత్తుగ నెఱ్ఱనై
.....వెలుగొందుచుండి శ్రీ విభవ మలర

బ్రహ్మవిష్ణుమహేశ్వరుల్ ప్రణతి సేయ
భక్తితో చెంగట న్నిల్చు వాసవాది
సురల పూజల గొనుచున్న చరణయుగళి
నాశిరస్సున ధ్యానింతు నియతి నంబ!

దేవీమహిమ్న స్తోత్రం - 2




ఆ తామ్రార్క సహస్రాదీప్తి పరమా సౌన్దర్యసారై రలం
లోకాతీత మహోదయై రుపయుతా సర్వోపమా గోచరైః
నానానర్ఘ్య విభూషణై రగణితై ర్జ్వాజ్వల్యమానాభిత
శ్శ్రీ మాతస్త్రిపురారిసుందరి కురు స్వాన్తే నివాసం మమ.

***

చక్కని ఎర్రని కాంతి గల వేలకొలది సూర్యుల ప్రకాశము వంటి ప్రకాశముతో సంపూర్ణమైన సౌందర్యసారముతో లోకముల కతీతమైన గొప్పదనము గలిగి ఎట్టి పోలికకు దొరకని సర్వాలంకార భూషితమై అగణితమైన మహా తేజస్సుతో అలరారుచున్న శ్రీమాత త్రిపురాన్తకుడైన మహాశివుని ప్రియసతి నా మనస్సును నివాసముగా చేసుకొనుగాక.

***

అరుణాదిత్య సహస్ర సన్నిభ మహాభా! పూర్ణ సౌందర్యసా
ర రుచిన్ లోకములందుకో దగని సంప్రస్థానమున్ బొంది మా
దిరికిం జిక్కని సర్వభూషణములన్ దివ్యచ్ఛవిన్ బొల్చు నో
పురవైరిప్రియపత్ని! నా హృదిని కొల్వుండం గదే మాతరో.

Friday, September 22, 2017

త్రిపురా మహిమ్న స్తోత్రం. 1




శ్రీ దూర్వాస మహర్షి విరచిత దేవీ (త్రిపురా) మహిమ్న స్తోత్రము నుండి
శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి వివరణ :

***

శ్లో.
శ్రీ మాత స్త్రిపురే పరాత్పరతరే దేవీ త్రిలోకీ మహా
సౌందర్యార్ణవ మంథనోద్భవసుధా ప్రాచుర్య వర్ణోజ్వలమ్ |
ఉద్యద్భానుసహస్ర నూతన జపా పుష్పప్రభం తేవపుః
స్వాంతే మే స్ఫురతు త్రిలోకనిలయం జ్యోతిర్మయం వాఙ్మయమ్ ||

ఓ శ్రీ మాతా!  త్రిపురసుందరీ! గొప్పవైన అన్నిటి  కన్న గొప్పదానవైనదానా! దేవీ! ముల్లోకములలోని మహా సౌందర్యము అనే సముద్రమును మథించగా పుట్టిన అమృతపు ముద్ద యొక్క రంగు వంటి రంగుతో ప్రకాశిస్తున్న తల్లీ! ఉదయించుచున్న వేలకొలది సూర్యుల వంటి, అప్పుడే వికసించిన ఎర్రనైన జపాకుసుమము వంటి కాంతితో వెలుగొందుచున్న శరీరము కలదానా! త్రిలోకములకు నిలయమైన (ఆధారభూతమైన) దానా! సూర్యచంద్రాగ్ని మయమైనస్వయంప్రకాశము గల జ్ఞానరూపమైన దానా! అక్షరరూపమైన మంత్రరూపమైన పరా పశ్యన్తీ మధ్యమా వైఖరీ రూపములలో ప్రకాశించు దానా! అట్టి నీ స్వరూపము నా హృదయమందు స్ఫురించు గాక.

***

సర్వలోకమ్ముల సౌందర్య జలధుల
.....మధియించ వచ్చిన సుధల ముద్ద
రమ్యమౌ వర్ణము రాజిల్లు తీరున
.....దేహప్రభారాశి తేజరిల్ల
వేలబాలార్క సంవికసిత జపపుష్ప
.....తామ్రవర్ణద్యుతిన్ తనువు చెలగ
త్రిభువననిలయ! జ్యోతిర్మయి !వాఙ్మయి !
.....శ్రీమాత !త్రిపురారిప్రేమపత్ని!

ఓ పరాత్పరతరి! శివా! ఓ భవాని!
దేవి ! యీరీతి నీదగు దివ్య రూపు  
నాదు డెందము నందున మోద మలర
నిత్యమున్ స్ఫురియించుత నీదు కరుణ.

Monday, September 18, 2017

మహాలయ అమావాస్య



నేడు మహాలయంపు మహనీయ సుదర్శ, ధరాతలమ్మునన్
కూడుదు రెల్ల మానవులకున్నపవర్గము గొన్న పెద్ద లీ
నాడు, తరింప జేయుటకునై తమ సంతున కిచ్చి దీవెనల్,
గాఢపు భక్తితో గొలువగా నగు వారల శ్రాద్ధ కర్మలన్.

శ్రాద్ధము జేయ మంచిదగు, సాధ్యము కానిది యైన, లేక స
న్నద్ధులు కానిచో,  పితృ గణాల క్షమాపణ గోరి యర్హులున్
శ్రద్ధను తర్పణమ్ము లపరాహ్నపు వేళ చరించ నూవులన్
పెద్దలు మేలు మేలనుచు స్వీకృతి చేసి శుభంబు గూర్తురే.

జానకీ నాయకా



శ్రీ మదొంటిమిట్ట రఘువీర శతకము : అయ్యలరాజు త్రిపురాంతక కవి.
( శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారిచే పరిష్కృతము )

***

శ్రీకల్యాణగుణాభిరామ! విబుధశ్రేణీ కిరీటద్యుతి
వ్యాకీర్ణాంఘ్రి సరోరుహద్వయ! సహస్రాక్షస్తుతా! యచ్యుతా!
నాకుం బ్రాపును దాపు నీవె యగుచున్ నన్నేలుమీ రామభ
ద్రా! కారుణ్యసముద్ర! ధీర! రఘువీరా! జానకీనాయకా!