padyam-hrudyam

kavitvam

Sunday, February 7, 2021

సుందరవిజయం 11

 


హనుమంతుఁడు రావణ భవనమున సీతను వెదకుట 

ఆ.వె.
కొంతసేపు గెంతి కులికి వానర మణి
స్థిమిత మొంది తిరిగి చింతఁ జేసె
నీమె సీత యైన యెట్లుండు నీ  గతిఁ
బతినిఁ బాసి యామె పరమ సాధ్వి.                                                     11- 1

మ.
ఎంత మహాపచార మిది! యింత విచక్షణ లేక శయ్యపై
యింతిని సీతగాఁ దలచి తెంతటి మూర్ఖుఁడ! స్వామి దూరమై
యింత విలాసభోగముల నే గతి సాధ్వి ధరిత్రిపుత్రి ని
శ్చింత గతిన్ సుఖించు? నని చింతను దేలె కపీశుఁ డయ్యెడన్.     11- 2

శా.
పానీయంబులు ద్రావునా? కుడుచునా? భాషించునా? శయ్యపై
మేనున్ వాల్చున? చందనం బలఁదునా? మేలైన భూషాళి మై
నూనన్ జాలున ? భోగముల్ బుడుకునా?  యూహించునా యింద్రుఁడే
యైనన్ రాముని దక్క యన్యు మదిలో? నా భూజ యిట్లుండునా?   11- 3

కం.
అని దలచి కపివరేణ్యుఁడు
జనెఁ దిరుగగఁ బానశాల జానకి నరయన్
గనె లలన లాడి పాడగ
తను లలయగ మత్తులోనఁ ద్రావి పరుంటన్.                                    11- 4

తే.గీ.
రూప సల్లాప శీలుర, నౌపయికపు
గీత భావార్థ భాషులఁ బ్రీతి తోడ
సమయమునకైన భాషణ ల్సలుపు స్త్రీల
బొంది  శయనించు రావణు పొంక మరసె.                                        11- 5

ఆ.వె.
ఆలశాల లోన నాఁబోతు రీతిని,
నడవి మధ్యలోన నాఁడు కరుల
మధ్యఁ దిరుగు నట్టి మదకరి వోలెను
నెగడె రావణుండు నిద్ర లోన.                                                            11- 6

ఆ.వె.
పాన భూమిలోన బలు జంతు మాంసముల్,
బచ్చడులును, మరియుఁ బాయసాది
భక్ష్య భోజ్యములును, బానీయము, ల్బండ్లు
గానుపించెఁ గపికి మాను గాను.                                                           11- 7

ఆ.వె.
పులుపు లుప్పు లున్న పులుసుల దోడను,
సగము తిని వదలిన *జంగలముల,
శర్కరాసవముల, సౌగంధ చూర్ణాల
పానశాల యొప్పె బాగు గాను.                                                            11- 8

*మాంసముల

ఆ.వె.
చెదరి రాలియున్న యదరైన భూషల,
జిమ్మఁబడిన పూలఁ జిత్ర గతులఁ
బగిలి దొర్లి యున్న పాన పాత్రలఁ గూడి
పానశాల తీరు కాన నయ్యె.                                                                11- 9

తే.గీ.
స్వచ్ఛ వస్త్రాలఁ బరచిన శయ్యలందు
నొండొరులు పెనవైచుక పండియున్న
స్త్రీల నిద్ర మై మరచి నెచ్చెలుల వస్త్ర
ములను దుప్పటి వలె దాల్చు ముదితల గనె.                             11- 10

కం.
చల్లని గంధపు వాసన,
పుల్లని మద్యముల పొలుపు పువ్వుల తావుల్,
ద్రెళ్ళెడి ధూపపు వలపుల
నల్లన వాయువులు  వీచె నంతట యచటన్.                                 11- 11

కం.
హనుమంతు డిట్టు లసుర స
దనమునఁ బ్రతి యంగుళమును దరచి వెదుకగా
ననబోడు లెందరో యటఁ
గనుపించిరి కాని సీత కనఁబడ దాయెన్.                                        11- 12

తే.గీ.
అట్టి స్త్రీలను జూచిన హనుమ మదిని
ధర్మ లోపము జరిగిన *తలకు గలిగె  
నన్య కాంతలఁ జూచిన యఘము సోకె
ననుచు మదిని చింతిలసాగె నాతఁడంత.                                    11- 13

* శంక

తే.గీ.
అపుడు మరియొక చింతన మంకు రించె
స్వేచ్ఛ నిదురించు రావణ స్త్రీల నేను
కామదృష్టితో గమనించఁ గడగ నైతి
నే వికారమ్ము జనియింప నీయ కుంటి.                                        11- 14

కం.
ఏ జాతి ప్రాణి నైనను
నా జాతి ప్రాణు లందు నరయుట తగు గా
భూ జాత నాతి గద స్త్రీ
జాతిని నే వెదుక టొప్పు *శమల మ్మగునే?                                   11- 15

*పాపము

కం.
కనుకను నిర్మల హృదితో
జనకజకై వెదకి తేను సాకల్యముగా
దనుజ విభు సౌధమందున
గన నైతిని సీత ననుచుఁ గపి దలపోసెన్.                                    11- 16

ఆ.వె.
మరల మరల వెదకె మారుతి యచ్చోటఁ
బుడమిపట్టి  నరయు  పూన్కి తోడ
దివిజ  నాగ యక్ష దివ్య కన్యలు దక్క
దొరక దాయె నామె నరయు వీలు.                                                 11- 17

తే.గీ.
పట్టు వదలని పావని యెట్టు లైన
ధరణిజాతను గనుఁగొను తలపు తోడ
పానభూమిని విడనాడి బయలుదేరె
నితర తావుల వెదుకగ నిష్ఠ తోడ.                                                   11- 18

Saturday, February 6, 2021

సుందరవిజయం 10

 

హనుమంతుడు మండోదరిని జూచుట 

మ.

హనుమంతుం డొక రత్న సంభరిత పర్యంకంబు నీక్షించె, దా
నిని దంతమ్ములు  పైడితోఁ బొదిగి వన్నెల్ మీర వజ్రాల  కో
ళ్ళను బట్టీలను గూర్చి మంచి పరపుల్ రమ్యాంబరాలంకృతం
బున శోభిల్లగ మాలలన్ శిరము వైపుం జుట్టి రందమ్ముగా.                     10-1

తే.గీ.
చంద్ర సన్నిభమౌ సితఛ్చత్ర మొకటి
పైడి కామతో మాలలఁ గూడి సూర్య
కాంతితో వెల్గ, నిల్చిరి  కరములందుఁ
జామరమ్ముల విసరుచు భామ లచట.                                                    10- 2

సీ.
ఇరవైన కుండలా లెర్రని కన్నులు
.........గాంచన చేలముల్ గలుగు వాఁడు
చందన చర్చతో సంధ్యారుణచ్ఛవుల్
.........దీపించు మేఘము దీరు వాఁడు
నిద్రించు మందర నిర్ఝరియై యొప్పి
 ........యాభరణమ్ముల నలరు వాఁడు
స్త్రీలతోఁ గ్రీడించి ప్రాలుమాలి పరుండి
......... త్రాగిన మత్తులోఁ దనరు వాఁడు

తే.గీ.
రాక్షస స్త్రీల ప్రియుఁడును రక్కసులకు
మేలుఁ గూర్చెడి వాఁడును మేటి పాము
వోలె నిశ్వసనమ్ములఁ గ్రాలు వాఁడు
నైన రావణుఁ డా శయ్య పైన పండె.                                                          10- 3

తే.గీ.
ఇంద్రచాపము లవి యెన్న, నినుప గదలు,
బ్రక్క పై ప్రాకుచున్నట్టి భయదమైన
పంచ శిరముల పాములు, బలిసి యున్న
బాహువులు కల రావణుఁ బావని కనె.                                                       10- 4

తే.గీ.
పర్వతము వంటి రావణ ప్రభువు మించు
బాహువుల తోడ భాసిల్లె భవ్యమైన
శిఖరములనొప్పు మందర శృంగి వలెను
వాయు సూనుఁ డచ్చెరు వొందె వానిఁ జూచి.                                          10- 5

సీ.
చందన చర్చతో స్వర్ణ హారాలతో
.......విపుల  వక్షఃస్థల విభవ మలర
శ్వేతోత్తరీయముం బీతాంబరములతో
.......మినుముల రాశియై తనువు దనర
భాగీరథికి మధ్య పడుకొన్న మదగజ
.......ప్రాభవ దర్పమ్ము  బరిఢవిల్ల
బంగరు దివ్వెలు ప్రసరించు వెల్గుల
.......మెరపులు గూడిన మేఘ మనగ

తే.గీ.
మణులు ముత్యాలు వొదిగిన మంచి స్వర్ణ
మకర కుండల ద్వయముచే  మండితమయి
నిద్రలోఁ బ్రక్క కొరిగిన నెమ్మొగాన
నొప్పు రావణుఁ గనుగొనె నుత్సుకతను.                                                10- 6

తే.గీ.
సుంద రాస్యలు, వాడని సుమ సరములఁ
దాల్చు నెలఁతలు, నగలతోఁ దళుకు మనుచు 
నృత్య గీతాది కళలలో నేర్పరు లగు 
భార్య లతని కాళ్ళకుఁ జెంతఁ బండుకొనిరి.                                         10- 7

సీ.
నాట్య ప్రవీణయౌ నాతి యొకర్తుక
........నాట్య భంగిమ లోనె నడుము వాల్చె
వైణికురాలైన వనిత యొకర్తుక
........వీణ కౌగిట నుండ మేను వాల్చె
తప్పెట వాయించు తరుణి యొకర్తుక
........పట్టి చేతనె దాని పవ్వళించె
వేణువు నూఁదెడి వెలఁది యొకర్తుక
........గుండెల దానితోఁ గునుకుఁ దీసె

తే.గీ.
పొంకమౌ యంగములతోడ బొదివికొని మృ
దంగమును బండె నొక చాన, దాల్చి యొకతె
డిండిమము నొక చేత వేరొండు కౌగి
లింతఁ బండె, నీ రీతి నిద్రించి రచట.                                                10- 8
 
తే.గీ.
స్వకుచ యుగమును గట్టిగాఁ బట్టినదియు
సోలి తమకాన సవతినిఁ జుట్టినదియుఁ
బతిని వలె వాద్యముల హత్తి పట్టినదియు
మత్తులో నున్న మగువల మారుతి కనె.                                             10- 9

తే.గీ.
అంత దూరాన దివ్య పర్యంక మందుఁ
బండుకొని నిద్ర లోనున్న పడతి నొకతె
నా భవంతికి వెలుగిచ్చు నందగత్తె
నాంజనేయుఁడు వీక్షించె నంతలోనె.                                             10- 10

చం.
మణులును ముత్యముల్ మెరయు మంచి విభూషలఁ దాల్చి, దివ్యమౌ
ఘనతర తేజ సంజనిత కాంతుల సౌధము నింపుచున్, మహ
త్కనక సువర్ణయైన దశకంఠుని పట్టపు రాణియౌ ప్రియాం
గనయును, సుందరాంగి యగు కాంతను బావని జూచి మెచ్చుచున్.  10- 11

కం.
కని మండోదరి నింతిని
ఘనభూషలఁ దాల్చి మించు కాంతా మణినిన్
వనచరుఁ డానందముతోఁ
గనుగొంటిని సీతననుచు గంతులు వేసెన్.                                          10- 12

ఆ.వె.
బుజము లప్పళించె, ముద్దాడె తోకపై,
నటును నిటును గెంతె, నట్టె దూకె
నెక్కి కంబములను, హే యని సాజమౌ
కోతి లక్షణములఁ గూడి హనుమ.                                                          10- 13

Wednesday, February 3, 2021

సుందరవిజయం 9

 


హనుమంతుఁడు రావణాOతఃపురమును దర్శించుట.

ఉ.
లోన మరొక్క సౌధమును రూఢిగఁ జూచెను మారుతాత్మజుం
డా నగరమ్ములో, వెదకె నంతయు భూమిజకై, కనుంగొనెం
బూనిక  నేనుగు ల్భటులు భూరి బలమ్ములు గాపుఁ గాయగా
మానిను లెందరో తిరుగు మాళిగ నొక్కెడఁ గోట లోపలన్.              1

తే.గీ.
అసుర వనితలు, రావణు నతివ, లతని
జేతఁ దేబడిన లలన ల్చేరి యుండ
మకర  ఝష తిమింగల సర్ప నికరములను
బొల్చు సంద్రము వలె సౌధము జిగిఁ దేరె.         2

తే.గీ.
యక్షరాజు కుబేరుఁడు, యముఁడు, వరుణుఁ
డెట్టి సంపత్సమృద్ధులో యెన్న వారి
కన్న నెక్కుడు  భాగ్యము లున్న విచట
ననుచుఁ దలపోసె పావని యరసి వాని.          3

కం.
మారుతి పుష్పక మెక్కెను
గోరి  మురిసి యందమునకు గుప్పున నెగయన్
జోరుగ మత్తు పదార్థపు
సౌరభ్యము లసుర విభుని జాయకుఁ బిలువన్.            4

కం.
మణిమయ  సోపానములుం
గనకపు టవనికలు సూర్య కాంతపుఁ దలముల్
ఘనమగు దంతపు బొమ్మలఁ
గనె పైడిని వెండి నొనరు కంబము లచటన్.             5

సీ.
పక్షుల కలకల స్వనము లింపును గూర్చ
...........నగరు ధూపమ్ములు హాయి నింప
వాంఛలఁ దీర్చెడి వాసిష్ఠ ధేనువై
..........యానంద మొనగూర్చు నట్లు నిలువ
దర్శించు వారికిఁ దరగని ముద మిచ్చు
...........లక్ష్మి పుట్టిల్లుగా రహి వహింప
పంచేంద్రియములకుఁ బరమ సౌఖ్యము నిచ్చు
...........జననియో యన నొప్పు సరణి మెరయ

తే.గీ.
నిశ్చలంబగు దీపముల్ నిష్ఠ తోడ
ధ్యాన మొనరించు చున్నట్టు లీన ఛవుల
దివ్య కాంతుల రావణ తేజ మలర
స్వర్గమో యన దశకంఠు భవన మొప్పె.           6

సీ.
వివిధ వేషంబుల వెల్గెడి భామలు
.........గంబళిన్ గూర్చుండి  కబురు లాఁడ
రాత్రి వినోదాల రమియించు వారెల్ల
........రలసి నిద్రను జార నచట నచట
నంచలు నళులు నిద్రించిన  సరసు నా 
........నిదురించు స్త్రీలతో నీరవ మయి
ముకుళించు ముఖపద్మములఁ గని తుమ్మెదల్
........వికసింప వేచెడి విధము మెరయ

తే.గీ.
తారకల గూడు స్వచ్ఛ సఛ్చారదాభ్ర
సన్నిభమ్మయి శోభించ స్వర్ణ శాల
వెలదులం గూడి రావణ విభుఁడు దోచెఁ
జుక్కలం గూడి వెల్గెడి సోముఁ డనగ.               7

ఉ.
కొందరి తిల్కముల్ జెరగెఁ  గొందరి యందెలు జారిపోయెడిన్
గొందరి హారముల్ జెదరెఁ గొందరి వస్త్రము లూడిపోయెడిన్
గొందరి పూలు వాడె నటఁ గొందరి పైటలు గప్పె మోములన్
సుందరు లిట్లు శయ్యలను సోలిరి వాలిరి చూడ నచ్చటన్.            8

సీ.
జీను విప్పిన యాడు సింహవిక్రమము*లై
........స్వేచ్ఛగా దొర్లెడి స్త్రీల గుంపు
హస్తి పీకిన యట్టి యడవి తీగల బోలు
........మాలలు వాడిన మచ్చె కంట్లు
గుండెల విద్రుమ మండిత  హారాల
......... కలహంసలై తోచు  నలరు బోంట్లు
రొమ్ముల  స్వర్ణ హారమ్ములు మెఱయగ
.........చక్రవాకము లట్లు చంద్రముఖులు
నందాల నగలతో హంసలుం గొంగలై
.........యలరొందు నదులైన యబ్జముఖులు
నదులలో నందంద మది దోచు సైకత
.........శ్రేణులౌ జఘనాలఁ జేడియలును
భూష లబ్జమ్ములై మువ్వలు మొగ్గలై
.........పద్మాకరము లైన  పడతుకలును
మద్యపానపు పరీమళ నిశ్వసనముల
.........దశకంఠు సేవించు తరుణ లతలు
నిద్రలో సవతుల నెమ్మొగమ్ములఁ బతి
.........ముఖమని చుంబించు ముద్దియలును
బాహులతికలను బయ్యెదలను దల
.........దిండ్లుగాఁ బవళించు తీవ బోంట్లు
సవతుల తొడల భుజమ్ముల గుండెలఁ
.........దల లుంచి నిద్రించు తమ్మి కంట్లు
సిగలను గన నళి  శ్రేణులతోఁ గూడు 
.........పూమాలలుగఁ దోచు పువ్వు బోంట్లు

తే.గీ.
రావణాసుర వశమైన రాక్షస పితృ
దైత్య గంధర్వ రాజర్షి దళములకును
జెందు కన్యలతో నిట్లు చిత్రముగను
గానుపించిన దా శాల గపికి నపుడు.             9

* గుఱ్ఱము

ఉ.
దానవుఁ జేత బల్విడిని దారగఁ దేబడి నట్టి లేమయున్  
వానినిఁ దప్ప యన్యు మది భావనఁ జేసెడి కోమలాంగియున్
మానుగ బూర్వమే యొరుని మానసమందున నున్న కన్యయున్
జానకి దప్ప లే దచట చాన యొకర్తెయు నెంచి చూడగా .      10

ఆ.వె.
లేదు కుల విహీన లేదు కురూపియు
లేదు బల విహీన లే దయిష్ట
లేదు వాని సేవ లేక యున్నది కాని
యొక్కతియును  నచట నిక్కముగను.               11

ఆ.వె.
అసుర వరుని కా ప్రియాంగన లే రీతి
మెలఁగుచుండి నారొ వలపు లిచ్చి 
సీత గూడ యటులె చెలగు చుండెడి కదా 
చెలుని గూడి యనుచుఁ దలఁచె హనుమ.    12

ఆ.వె.
రామచంద్రుఁ గూడి ప్రేమతో సుఖియింప
సీత నొప్ప జెప్పి శ్రీకరముగ
చిర యశస్సు నొంది జీవింపడే తాను
రావణాసురుఁ డిల రాజసముగ.           13

శా.
పాతివ్రత్య మహద్విశిష్ట  గుణ సంపత్తిన్ జగన్మాత సం
ప్రీతిం బొందె నరుంధతీ ప్రభృతిాసాధ్వీ సత్కృతం బెన్న నా
మాతన్ రాక్షస బుద్ధి వీడక కటా మాన్యుల్ తుటారించు దు
ర్నీతిన్ దెచ్చెను రావణుం డని విచారించెం గపీశుం డటన్.          14

Tuesday, February 2, 2021

సుందరవిజయం 8

 


హనుమంతుడు పుష్పక విమానమును చూచుట 

ఉ.
భూరి తపోబలమ్మునను బొందెను రావణుఁ డా విమానముం
గోరిన చోటి కేగు నది కోరు విధమ్మున వాయువేగియై,
చేరగ రాని దన్యులకు, శ్రీకర మైనది, శిష్ట కోటి సం
చారము సేయు మందిరపు సాటి కనెం గపి దాని వింతగా.          8- 1

కం. కుండల ధారులు, బెచ్చగు
తిండినిఁ దినువారు, నింగి ద్రిమ్మరు దైత్యుల్
దండిగ, మోయుచు నున్న
ట్లుండిన దా పుష్పకమ్ము నొక చిత్రమునన్.                                 8- 2

ఉ.
పండువు గాగఁ గన్నులకుఁ బర్ణరుహంబు*నఁ బుష్పరాశియో!
నిండగు నా శర ద్విమల నీరజశాత్రవ నిర్మలత్వమో!
మెండగు పుష్పకాలమును మించిన మంజుల సుస్వరూపమో!
మండితమౌ విమానమని మారుతి యెంచెను విస్మితాత్ముఁడై.  8- 3


*వసంతకాలము