padyam-hrudyam

kavitvam

Friday, January 8, 2016

తుమ్మెదా ఒకసారి...
==============

' తుమ్మెదా ఒకసారి మోమెత్తి చూడమని చెప్పవే రాచిలుక తోడ'  అంటూ పాడడం ప్రారంభించా డో గాయక శిఖామణి. తుమ్మడాన్ని గురించి ఎందుకు పాడవలసి వచ్చిందో నా కర్థం కాదు.  బహుశా ఆయనకు తను బాగా తుమ్మగలనని గర్వం అయి ఉండవచ్చు.  అసలు  నన్నడిగితే బాగా తుమ్మగలనని గర్వం కలిగి ఉండడంలో అర్థం లేదు.  కానీ మనుష్యులనేక రకాలుగా ఉంటారు.  వాళ్ళ కనేక రకాల గర్వాలుఉంటాయి. మనమేమీ అనడానికి వీల్లేదు.

నిజంగా ఆయనకు గర్వమే ఉంటే అవకాశం ఉన్నప్పుడల్లా తుమ్మడానికి ప్రయత్నించాలి. తుమ్ములు వస్తే అప్రయయత్నంగానే తుమ్మాలి.  తుమ్ములు రాకపోతే అధవా ముక్కుపొడుం పీల్చయినా తుమ్మాలి.  ఊహూ ! ఆయన అల్లా చేయడట. తుమ్మితే ఒకసారి మాత్రమె తుమ్ముతాడట!  ' తుమ్మెదా ఒకసారి' మాత్రమే  అంటూ మనల్ని జడిపిస్తున్నాడు.  ఆయన తుమ్ము ఎదో పేద్ద విలువ గలదయినట్లు,  మనం దాన్ని వేస్టు చేసి పారేస్తామేమో అన్నట్లు!

ఇంతే కాదు 'మోమెత్తి చూడమని' అంటున్నాడు.  ఎవరి మోము అన్నది ప్రశ్న. తుమ్మేటప్పుడు కర్త, అంటే ఆ తుమ్మే  
పెద్దమనిషి, తలకాయ దింపి తుమ్మడు కదా!   తనకి ఇష్టమున్నా లేకపోయినా తలకాయ ఎత్తి తుమ్మవలసిందే. ఇంకా 'మోమెత్తి' అనడంలో అర్థమేమిటి?   లేదా నేను తుమ్ముతాను నువ్వు నీ మోమెత్తి చూడు అని అతని ఉద్దేశ్యం అయి ఉండవచ్చు.  అయితే దానికి చాలా అభ్యంతరాలు ఉంటాయి.  ఒకటి తుమ్మడానికి ఎత్తిన మోమును ఇంకా ఎత్తి చూడడం అసంభవం. రెండోది ఒక ప్రక్కన తుమ్ము తుఫానులా మున్చుకొస్తుంటే సరిగమపదనిసా అని పాడుతూ తన మోమెత్తి చూడమని ఎదటి వాళ్ళను అడిగేవరకూ అవకాశం ఎక్కడుంది?

ఇంతవరకూ కర్తను గురించి చెప్పుకొన్నాం.  ఇక కర్మను గురించి కూడా ఆలోచిద్దాం.  ' తుమ్మెదా ...చెప్పవే' ఎవరితోటి? 'రాచిలుక' తోటి!  మిమ్మల్ని అడుగుతున్నానని ఏమనుకోకండి కానీ,  మీ రెప్పుడయినా చిలకతో తుమ్మడాన్ని గురించి మాట్లాడే వాళ్ళని చూశారా?  నేను చూడలేదు.

అయితే మనకు స్పష్టం అయిన విషయం ఏమిటంటే చిలక అంటే అది ఒక స్త్రీయొక్క సర్వనామం అని. మరి చిలక ఆడ దయితే రాచిలక మాత్రం కాదాయేం?    కర్త పాడుతున్నాడు 'నేను తుమ్ముతున్నాను, మోమెత్తి చూడు' అని. చూడవలసింది ఎవరు?  ఒక రాచిలక అంటే ఒక స్త్రీ.  ఇంతకంటే అఘాయిత్య మేమైనా ఉందా?  తుమ్మేటప్పుడు మొహం అష్టవంకర్లూ తిరుగుతుంది కదా.  ఆత్మగౌరవం ఉన్న ఏ  మగాడయినా ఆడ వారి ఎదుట తుమ్మడు.  ఈ పెద్దమనిషి ఈ విధంగా తుమ్ముతాచూడు అంటూ పాటలు పాడతాడా?

ఆ పాటలో ఒక ద్విగుసమాసం కూడా ఉంది.  అదే పాట కంతటికీ ప్రధాన మయింది.  అది అర్థం చేసుకొంటే కర్తగారి మనస్తత్వం కూడా చక్కగా బోధ పడుతుంది.  ఆ సమాసం ఎదో చెప్పమంటారా?  వినండి. అదే ' ఒకసారి '.

మీకు తుమ్ములో నమ్మకముందో లేదో తెలియదు.  ఉన్నా లేక పోయినా తుమ్ము వచ్చినప్పుడు తుమ్మి తీరవలసిందే అనుకోండి.  నేనడిగేది  ఏదయినా పని మొదలెట్టి నప్పుడు ఎవరేనా తుమ్మితే పని పాడవుతుందనీ, ఫలానా వాడు తుమ్మితే పని నాశన మవుతుందనీనూ మీకేమైనా నమ్మకాలు ఉన్నాయా అని.

మీకు చెప్పదలచుకొన్న దేమిటంటే ఒకసారి తుమ్మడానికీ, రెండు సార్లు తుమ్మడానికీ చాలా తేడా ఉందని.  సామాన్యుల విషయంలో ఒకసారి తుమ్మడం చాలా హానికరమన్న దని ఒప్పుకోక తప్పదు.  ఇందాకా చెప్పిన గాయక శిఖామణి పాడేడు ' తుమ్మెదా ఒకసారి' అంటూ.    ఒక్క విషయం ఆలోచించండి.  తుమ్మడానికి ముందు ఎన్నిసార్లు తుమ్మగలమో తెలుస్తుందా మనకు?  తెలియదు, తెలియడానికి అవకాశం లేదు.  అయినప్పుడు ఆ పెద్దమనిషికి ఒకసారి తుమ్మబోతున్నట్లు ఎలా తెలుసు?

దీని కంతటికీ అర్థం ఒకటే ఉంది.  ఆ రాచిలుక ఎవరో నాకు తెలియదు.  కానీ ఆ రాచిలుక అంటే ఈ కర్తకు యిష్టం లేదని మాత్రం నాకు తెలుసు.  ఆమె అంటే యితనికి పడదు.  ఆమె పని పాడుచేయాలని నిశ్చయం చేసుకొన్నాడు.  అతనికి తుమ్ముల్లో నమ్మకం ఉందా లేదా అన్నది సందేహాస్పదమైన విషయం.  ఆమెకు ఉందా లేదా అన్నది కూడా సందేహమే. తుమ్ముల్లో నమ్మకం ఉన్నా లేక పోయినా మనం ఏదైనా పని ప్రారంభిస్తున్నప్పుడు  ఎవరైనా తుమ్మాలని అనుకోం గదా. అదేవిధంగా పాపం ఆ రాచిలక ఎవరైనా, ఏదైనా శుభకార్యం ప్రారంభిస్తా నన్నట్లుంది.  అది పాడుజేద్దామనే ఉద్దేశంతో ఈయన ' తుమ్మెదా '  'తుమ్మెదా' అంటూ పాడుతున్నాడు. అందులోనూ ఒకసారి తుమ్ముతాననడడం!

నేను కర్తను ప్రార్థిస్తున్నాను. ఆయన ఎవరో నాకు తెలియదు. ఈ విధంగా దురుద్దేశ్యంతో ఒకసారి తుమ్మడం తగదు. అసలు సాధ్యమై నంతవరకూ తుమ్మనే తుమ్మవద్దు.  కానీ తప్పనిసరి అయితే మాత్రం అధమం రెండుసార్లయినా తుమ్మాలి.

అతిత్వరలోనే 'తుమ్మెదా రెండుసార్లూ.....' అంటూ పాటను వినే అవకాశం కలుగుతుందని విశ్వసిస్తున్నాను.

(శ్రీ తురగా కృష్ణ మోహనరావు గారి వ్యాసం -  ఆంధ్ర సచిత్రవార పత్రిక ఆగస్టు 1955 సంచిక - నుండి)