padyam-hrudyam

kavitvam

Saturday, March 26, 2011

ద్రౌపది


౧.శాప వశమ్మునన్ భువికి జారిన యప్సర కాంత యేమొకో
భూపతి దించగా వని, తపో వనమందున నున్న సీతయో
పాపము దాసిగా బ్రతుకు భామిని చంద్రమతీ లలామయో
దాపగ లేని ప్రాభవము దాచగ జూచెడి దేవ కాంతయో !

౨.కురులను దువ్వ లేదు మరి క్రొమ్ముడి వేయగ లేదు పాణియం-
దరయగ పాన పాత్ర మది యన్నుల మిన్నకు మోము నందెదో
వెరపును బోలు భావమును విస్తృతమై కనుపట్టెడిన్ కటా!
సరసిజ నేత్రి సోయగపు జాడ కనుంగొన నామె కృష్ణయే!

౩.వరమున బుట్టి పాండు నృపు వంశము మెట్టియు ధర్మ శీలురౌ
పురుషుల బొంది యేవురను భోగములెల్ల త్యజించి దాసియై
విరటుని గొల్వు బాలయెను వింత గదా విధి లీల! రాణికై
సురగొని తేగ కీచకుని చోటుకు పోవుచునుండె దీనయై!

("
పొద్దు" ఖర నామ సంవత్సర యుగాది జాలకవి సమ్మేళన నిర్వాహకుల సౌజన్యంతో)

No comments: