padyam-hrudyam

kavitvam

Wednesday, May 11, 2016

నేడు శ్రీ శంకరుల జయంతి.



సాంగవేదమ్ములు సద్గురు కృప చేత
.........చదువ బడును గాక సంతతమ్ము
చదువబడిన వేద విదిత కర్మమ్ములు
.........విడువక పాటింప బడును గాక
పాటింప బడు కర్మ  పరమాత్మ పూజను
.........నిష్కామమైనదై నిలుపుగాక
నిష్కామ కర్మచే నిర్మలమై బుద్ధి
.........వాంఛలు  విడనాడ బడును గాక

పాపరాశి దులపబడి పారు  గాక
భవసుఖమ్ము లనిత్య మన్ భావ మగుత
ఆత్మ తత్త్వమ్ము నన్ వాంఛ యగును గాక
స్వగృహమును వీడి వడి వెళ్ళ బడును గాక.

సజ్జనముల మైత్రి సమకూడ బడు గాక
.........దేవుని యెడ భక్తి  దృఢము గాత
శాంత్యాది యుత్తమ సంస్కార గుణములే
.........అభ్యసింప బడుచు నలరు గాక
నిత్య  నైమిత్తిక నిహితమై యుండియు
.........కర్మ సన్న్యాసమ్ము కలుగు గాక
యోగ్యుడౌ విద్వాంసు డొడ గూడ బడు గాక
.........గురుపాదయుగసేవ కూడు గాక

స్వపర భేద రహితమును, సర్వమునను
నొక్కడై యుండియును  నిండి చ్యుతి నెరుగని
బ్రహ్మ మర్థింప బడు గాక ప్రాతచదువు
పదము బాగుగా చర్చింప బడును గాక.

(జగద్గురువుల ఉపదేశ పంచకము నుండి)

Sunday, May 8, 2016

అమ్మ ప్రేమకు ఎల్ల లున్నవే?



తల్లి ప్రేమకు ఎల్ల లున్నవే?
=======================
తల్లి మొగమ్మునం గనుడు తన్మయతన్! తనబిడ్డ వీపుపై
మెల్లగ వ్రాలి, లేతవగు మీగడ తప్పల బోలు చేతులన్
చల్లగ చుట్టగా మెడను, సన్నని పాదములన్ గ్రహించి తా
నల్లన త్రిప్పుచున్న దిట నామె ముదమ్మున కేమి సాటియౌ?
చెట్టుకు కాయ భారమని కాయక మానునె కొమ్మ పిందెలన్?
గట్టిగ బట్టి యుంచు పెనుగాలులకున్ వెర పొందకన్ సదా
పట్టును బట్టి ప్రాణములు పట్టును తప్పెడు దాక, నట్టులే
కట్టుగ తల్లి బిడ్డలను కాచును కష్టములన్ సహించుచున్
తట్టెడు దాక తల్పులను తానుగ మృత్యువు, ప్రేమమూర్తియౌ
నిట్టిది మాత యంచు పరు డెంచి మదిం గదె మాటిమాటికిన్
పుట్టును తల్లి గర్భమున పొందగ మాల్మిని నమ్మ పొత్తిలిన్.