padyam-hrudyam

kavitvam

Friday, August 30, 2013

వేదార్థ సమ్రాట్టు!







వేదార్థపు సమ్రాట్టులు!
వేదవ్యాసర్షి హృదయవేద్యులు! గురువుల్!
మేదిని రేమిళ్ళాకా-
శాదిత్యులు! శ్రీ ప్రకాశ శాస్త్రికి ప్రణతుల్!

Wednesday, August 28, 2013

పాడవే ఒకసారి ఓ మధుర మురళీ!



















పాడవే ఒకసారి ఓ మధుర మురళీ!
నేడు నా మది కోరె నీ దివ్య రవళీ........పాడవే...
నీ గాన లహరిలో నే మునిగి పోవాలి
హాయిగా నను నేను మైమరచి పోవాలి........పాడవే...


1.  కల్హార ముకుళమౌ కన్నయ్య పెదవి పై
కమనీయ సుధ గ్రోలి కరగి పోయితివేమొ    = కల్హార =
రాధమ్మ యెదలోన రాగాలు చివురించె
మాధవునికై విరహ బాధతో తపియించె......పాడవే...

2.  నిండు పున్నమి రేయి పండు వెన్నెలలోన
యమునా నదీ తటిని యింపైన నీ పాట       = నిండు =
తీయగా మ్రోగనీ, తీగలై సాగనీ,
అమృతమే కురియనీ, ఆమనై విరియనీ........పాడవే...



Friday, August 16, 2013

శ్రావణమందు సంధ్యలవి సన్నిధి లక్ష్మికి!




శ్రావణమందు సంధ్యలవి సన్నిధి లక్ష్మికి! యామె సత్కృపా
భావము జల్లులై కురిసి భద్రమగున్ మన ధాత్రి! కంగనల్
శ్రావణ గౌరి నోములను శ్రద్ధగ జేతురు! మ్రోయు మంగళా-
రావము లింపు మీర మధురమ్ముగ కన్యల మానసమ్ములన్!

భావిని మా కుటుంబమును భద్రముగా కనిపెట్టి కావవే
శ్రావణ లక్ష్మి నీ కరుణ ఛత్రపు చాయను! నిన్నుతించుచున్
భావము నందు భక్తి మెయి పట్టెద నోముల గౌరి, భారతీ,
శ్రీ వరలక్ష్మి నీవనుచు సేవ లొనర్చెద రంగనామణుల్.

ఈ విధమైన యొంటరిగ నెన్ని దినమ్ముల నీడ్తు? కన్నియన్!
భావికి వేయవే కృపను బంగరు బాటను జేర్చి వేగమే,
నా విభు, నా మనోహరుని, నాదగు తోడగు వాని పాలికిన్
శ్రీ వరలక్ష్మి నన్ననుచు చేతురు మ్రొక్కులు కన్యకామణుల్!


 

Thursday, August 15, 2013

మాయనీకుడు ప్రార్థింతు మాన్యులార !



జాలరి వలనుండి జారి జలమ్మున
........స్వేఛ్ఛగా నీదెడి చేప రీతి!
పంజరమ్మును వీడి బయటి ప్రపంచాన
........చెట్టుపై వాలిన చిలుక రీతి!
పులిపట్టు జార తోపుల జేరి గెంతుతో
........చెంగున నాడెడి జింక రీతి!
హరి చక్రమున వేయ హతమయి మకరమ్ము
........గండము గడచిన గజము రీతి!

ఏండ్ల తరబడి మ్రగ్గుచు నితర జాతి
పాలనమ్మున కడగండ్ల పరితపించి
స్వేఛ్ఛ పొందిన భరతాంబ చిరునగవును
మాయనీకుడు ప్రార్థింతు మాన్యులార !

Saturday, August 10, 2013

వర్షము వచ్చె.............




శ్రావణ మేఘ మాలికలు సాగుచునుండెను నింగి నింపుగా!
బావురుమంచు గ్రీష్మ మదె పారెడి జూడుడు, జేయ ఫెళ్ఫెళా
రావము, నల్లమబ్బురిమి! రంజిలె కర్షక మానసమ్ములున్!
దీవెనలిమ్ము మాభువికి తీయని చిన్కుల జల్లి వర్షమా!

చిటపట రాలు చిన్కులయి! చిత్రముగా జడివాన వెల్లువై!
కటకటలాడి యంబువులకై తపియించెడు ప్రాణికోటి కా
యటమట దీర, హర్షముగ నయ్యదె వర్షము వచ్చె, నెల్లెడన్
చిటచిట దీర! పచ్చనగు చీరను గట్టె వనాంతరమ్ములున్!

Thursday, August 8, 2013

పెళ్లి శుభ వేళ !ఎదలెల్ల త్రుళ్లు వేళ!






మరుగేలరా నీకు మాధవా! యని తెర
.....................చాటున సిగ్గిలు జలజ నయన!
తెర దీయరే చెలి! తరియింప నినుజూచి
......................యెంత సేపని యెంచు కాంతు డివల!
సుముహూర్త మునకింక సుముఖమే యంతయున్
......................రవ్వంత యాగుడన్ బ్రహ్మ గారు!
చూపులు కలసెడు శుభవేళ యెప్పుడో
......................యిరువురకని చూడ నింతులచట!

నాల్గు కన్నులు ప్రేమతో నవ్వు వేళ!
రెండు హృదయాల వలపులు పండు వేళ!
క్రొత్త భావాలు మదులలో కొసరు వేళ!
పెళ్లి శుభ వేళ !ఎదలెల్ల త్రుళ్లు వేళ!

Saturday, August 3, 2013

నీ కృప నావ...........





శ్రీ రఘురామ నీ చరణ శ్రీకర యుగ్మము మానవాళికిన్
నేరుగ త్రోవ ముక్తికిని! నీ కృప నావ భవాబ్ది దాటగన్!
తారక నామ మౌ దురిత తాపము బాపెడు మందు! దీనినిన్
నేరని వారి కేది గతి నిత్యము పుట్టుటొ చచ్చుటో గదా !