padyam-hrudyam

kavitvam

Saturday, April 14, 2018

సత్తిబాబు




సౌమ్యుడు, సాధువర్తను, డసత్యము నేరని వాడు, ప్రజ్ఞలో
సామ్యము లేని జ్యోతిషుడు, సర్వ హితైషియు సత్తిబాబు తా
రమ్య వచస్కుడై సతము రాజిలి చప్పున నేగె మోక్షపుం
గమ్యము జేర బంధుల నగమ్యము పాలొనరించి అయ్యయో.

పిలుపు వచ్చిన వెంటనే వెడల వలెనె
ఖిన్నులై పెద్ద లందరు క్రింద నుండ?
చిన్నవాడవు న్యాయమే చేర పైకి?
రావె యొకసారి మాకయి బావమరది?

తప్పక ధర్మ మెన్నడును, దక్కిన దానికి తృప్తి జెందుచు,
న్నెప్పుడు చిత్త మందు జొరనీయక నీసు లసూయ లింతయున్,
ముప్పుగ మారినన్ సుఖము, మ్రొక్కుచు దేవుని సాగినట్టి నిన్
తప్పక దల్చుకొందు మయ తథ్యము నిత్యము సాధుజీవనా.

భగవంతు డిచ్చు సుగతుల
నొగి నిను తన అంకమునను నుంచుక మాల్మిన్
జగతిని పుట్టుచు గిట్టెడి
వగపుల సుడి బాపి నీకు పరము నొసంగున్.