padyam-hrudyam

kavitvam

Tuesday, November 29, 2016

చందమామ



హరిణాంకు డమ్మకు మరకత మణిమయ
.....కస్తూరికాదుల కరటవమ్ము
మచ్చ కాదది లోని మహనీయ పరిమళ
.....భరితమౌ కస్తూరి పంక మెన్న
శశిబింబమా కాదు జలకమాడగ తల్లి
.....నింపి యమర్చు పన్నీటి కుప్పె
పదునారు కళ లన్న ప్రత్యహమ్మును వాడు
.....పచ్చకర్పూరంపు పలుకు లగును

ప్రతిదినమ్మును వాడ నా బరిణె లోని
వస్తువులు తగ్గుచుంట సేవకుడు నలువ
తిరిగి నింపుచునుండును దీని వలన
కళలలో  హెచ్చు తగ్గులు కాన బడును.

క్షమించాలి. భావనాసౌందర్యం జగద్గురువులది. పద్యం నేను వ్రాసింది.

దండము శివా

దండము దగ్గర న్నిలచి దవ్వున నుండెడు నీకు శంకరా!
దండము కోడెకాడ వును తద్దయు వృద్ధుడవౌ కృపాకరా!
దండము భాగ్యవంతుడవు ధ్వాంక్షుడవై చరియించు నీశ్వరా!
దండము హర్తవున్ జనుల త్రాతవునై విలసిల్లు నో హరా!

బహురాజసమ్మున భవుడవై లీలగా
.........విశ్వమున్ సృజియించు విశ్వరూప!
కడుసాత్వికమ్మున మృడుడవై కరుణించి
.........జనసుఖ మొనరించు శైలనిలయ!
అమితమౌ తమసాన హరుడవై చెలరేగి
.........సంహారముంజేయు శ్యామకంఠ!
గొప్పతేజస్సుతో గుణరహితంబగు
.........పదమున వెలుగొందు పరమపురుష
!

అసితగిరి సమానంబగు మసిని జలధి
కడవ నిడి సురతరుశాఖ కలమును గొని
వాణి భూపత్రమున సదా వ్రాయనైన
నీదు గుణపారమును గనలేదు శర్వ!


Wednesday, November 23, 2016

గాన గంధర్వునికి ఘన నివాళి





నివాళి
********
పలుకు బంగారమై పయనించె దివి వైపు
........భద్రాద్రి రామయ్య పరితపించె
కోనసీమ కడుపు కోతయై విలపించె
........తెలుగుతల్లికి కంట వెలుగు మాసె
మహతీ సురాగమ్ము మహతిని స్థిరపడె
........ప్రతిమధ్యమావతి మతిని బాసె
సలలిత రాగమ్ము చవులను గోల్పోయె
........మౌనమే భాషయై మనసు కుమిలె
చిన్నవోయెను త్యాగయ్య ఖిన్నులైరి
యా సదాశివబ్రహ్మేంద్రు లమరపురిని
కచ్ఛపిని తాక వాణికి యిచ్ఛ లడగె
మంగళంపల్లి యమరుడై మహిని వీడ.
*****
*****
ఆవిరై పోయిన అమృతంపు బిందువు
........సురపురి కేగిన సుధల యేరు
మూగదై పోయిన మురళీ నినాదమ్ము
........తీగలు తెగినట్టి దివ్యవీణ
గాన సరస్వతి కడుపున శోకమ్ము
........తెలుగుతల్లికి కంట తెగని ధార
శాస్త్రీయ సంగీత సంద్రాన బడబాగ్ని
........గమకమ్ము తప్పిన గాన రవము
బెడద భద్రాద్రిరాముని యెడద లోన
త్యాగరాయని కృతులకు దప్పిన కళ
కరవు కుశలంపు పలుకులు సరిగమలకు
మంగళంపల్లి బాలుని స్మరణపదవి.

Tuesday, November 22, 2016

శంకరా




మాగచ్ఛస్త్వమితస్తతో గిరిశ భో మయ్యేవ వాసం కురు
స్వామిన్నాదికిరాత మామకమనః కాంతారసీమాంతరే |
వర్తన్తే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయ
స్తాన్ హత్వా మృగయావినోద రుచితాలాభం చ సంప్రాప్యసి  | 
సదా మోహాటవ్యాం చరతి యువతీనాంకుచగిరౌ
నటత్వాశాశాఖాస్వటతి ఝటితి స్వైరమభితః
కపాలిన్ భిక్షో మే హృదయకపిమత్యన్తచపలం
దృఢం భక్త్యా బధ్వా శివ భవదధీనం కురు విభో.

(ఆది శంకరాచార్యులు )

*******************************************

ఆదికిరాత! శైలనిలయా! శివ! మద్ధృదయాటవిన్ విమో
హాది మదేభసింహనివహమ్ములు వీడక సంచరించెడిన్
రా దయతోడ నా వనికి రాయిడి బెట్టెడి వాని జంపగా
నీది మృగవ్య వాంఛ కద నెక్కొను వాసము జేయు మిచ్చటన్.

సదా చరించు మోహమన్న సానువందు ప్రీతితో
పదేపదే నటించ జూచు భామినీ కుచాద్రులన్
ముదాన నాడు నాశ శాఖముల్ గ్రహించి దూకుచున్
స్యదమ్ముతోడ పర్వు బెట్టు స్వైరిణిన్ వలెన్ దెసల్
మదీయ మానసమ్ము జూడు మర్కటంపు లౌల్యమౌ
సదాశివా కపాలి భిక్షు సత్వరమ్మె యీ కపిన్
కదించవే త్వదీయ పాదకంజయుగ్మ మందునన్
మదమ్మడంగ భక్తి యన్న మంచి గట్టి త్రాడుతో.



Thursday, November 17, 2016




చంపకారుణవర్ణ చంద్రభస్మాభుడు
........చారుధమ్మిల్లయు జటల యోగి
కస్తూరికుంకుమాఘనచర్చితాన్గయు
........శవభస్మలేపనస్థామనుండు
మదనసంజీవని మదనాన్తకుండును
........స్వర్ణకంకణహస్త  సర్పకరుడు
ఝణఝణచ్ఛింజినీచారుపాదాబ్జయు
........ఫణిరాజమండితపదకమలుడు

వికచనీలోత్పలద్వంద్వవిమల నేత్ర
అరుణఫుల్లాబ్జనేత్రత్రయమ్మువాడు
హరిణదివ్యాంబరయును  దిగంబరుండు
గౌరినిన్ విశ్వనాథుని కనగ ముదము.

Saturday, November 12, 2016

అపరాజితుడు

అపరాజితా వృత్తము
నలుపు నరసి గుండె నల్గెను బాధతో
నలుపు నణచి వేయ నాకిది వేళయౌ
నలుపు గొలచు వాని నల్పెద నల్లిలా
నలుపు వెఱచి పోవ నాకిక దవ్వుగా.
నలుపున విలపించు న్యాయము బేలయై
నలుపున కుశలమ్ము నవ్వుల పాలగున్
నలుపున జన మెల్ల నల్గెడి నార్తితో
నలుపును తరుమంగ నావిధి లేచెదన్.
నలుపుల పనిబట్ట నా పనిముట్లతో
సలిపెద సమరమ్ము సవ్వడి లేకనే
సలుపగ తనువెల్ల చావుకు సిద్ధమై
కలుగుల మరుగున్న కర్వము లేడ్వగా.
నలుపున కిక మూడె నమ్ముడు సత్యమే
పలువురు సుఖియింప భాగ్యము లూరెడిన్
నలుగురు కలవండి నమ్మిక నాయెడన్
విలువలు చిగురించు వేగమె యెల్లెడన్.
జనములు నడువంగ సంతస మొప్పగా
తన యెడ గురితోడ తాముగ వెంటనే
చనె నదె సమరమ్ము సల్పగ నల్పుపై
మన ప్రియతమ నేత మాన్యత మించగా.