padyam-hrudyam

kavitvam

Monday, November 4, 2019

శబర శంకర విలాసం





కీ.శే. వెంపరాల సూర్యనారాయణశాస్త్రి గారి శబర శంకర విలాసము అనే కావ్యము నుండి : మొదటి భాగం.

ద్వైతవన వర్ణనము:

ఉ.
శ్రీఫల పారిభద్ర బదరీ క్రముక ప్రియ కాశ్వకర్ణ ధా
త్రీఫలినీ శమీ వట శిరీష తమాల విభీత కాది నా
నాఫల పుష్ప వృక్ష జననక్షమమై యమృతేందిరాక్ష కే
ళీ ఫలకాయితం బయి తలిర్చును ద్వైతవనం బిలాస్థలిన్.

మారేడు, దేవదారు, రేగు, పోక, మద్ది, ఉసిరి, జమ్మి, మఱ్ఱి, శిరీష, చీకటి, వేగిస మొదలైన అనేక రకములైన వృక్షములతో నిండి ద్వైతవనం శోభిల్లుతోంది.

అటువంటి ద్వైతవనం లో శ్రీవిద్యోపాసకులైన మునులు వేదాలు అనే సముద్రాన్ని బుద్ధి అనే మందర పర్వతంతో మథించి దాన్లోంచి వచ్చే సారం అనే అమృత ధారలను శిష్యకోటి చేత త్రాగిస్తూ జగక్షేమ కరంగా కొలువై ఉంటారు.

ఏదో సేలయేరో లేకపోతే జీవనదో ప్రవహిస్తూ ఉంటే దాని ఒడ్డున పర్ణశాలలను నిర్మించుకొని ఇహలోక సౌఖ్యాల పైకి మనసును పోనీక, పారలౌకిక సుఖ వాంఛ లేకుండా ఆ మహర్షులు జీవిస్తున్నారు.  ఎందుకంటే వారికి సంచిత పాపా లేమీ లేవు అందుచేత పారలౌకిక సుఖాలపై కూడా ఆసక్తి లేదు. అంతటి మహానుభావులు.

ఆ మునులు చేసే యజ్ఞయాగాదుల వలన వచ్చే పరిమళాలు దేవతలకు చాల సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆ హోమాగ్ని ధూమాల వల్ల పొగచూరిన చుట్టుప్రక్కల లతలు, పొదరిళ్ళు నల్లగా ఉండి భూమికి దిగివచ్చిన మేఘాలో అన్నట్లుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ ఋషులు శివాభిషేక సమయంలో చేసే శతరుద్రీయ ఘోషలు ఆకాశాన్నంటుతూ ఆనందాన్ని ఇస్తున్నాయి. విరిసిన పువ్వుల సమూహాలు తేనెతో నిండి వాటిపై వాలే తుమ్మెదల ఝన్కారాలు ప్రణవోపాసన చేస్తున్నట్లుగా ఉంది. బ్రహ్మచారులు పెట్టే దర్భలను తిని, ముని కన్యలు ఇచ్చే తీయని నీటిని త్రాగి చెట్ల నీడల్లో నెమరు వేస్తూ కునుకు తీస్తూన్న లేళ్ళు ఆ ఆశ్రమాలలో కనిపిస్తున్నాయి.

కంద మూల ఫలాలతో అతిథి అభ్యాగతులను తృప్తి పరచే ఆతిధేయులు, ఫలాలతోను,దళాలతోను, పువ్వులతోను ఆచార్య పాదాలను సేవించే బ్రహ్మచారులు, సుఖ దుఃఖాను భూతులను ఒకేలా అభ్యసించడం వల్ల అక్కడి సాధు క్రూర మృగాలు అద్వైతాన్ని పాటిస్తున్నవో అన్నట్లు, చెట్ల నీడల్లో చదువుకొనే శిష్యుల పాఠాలను చెట్ల కొమ్మలమీద ఉండే చిలకలు చక్కదిద్దుతూనూ కనిపిస్తున్నాయిట అక్కడ.  యాగాలు చేసే మహర్షులు ఆయా విధానాల్లో ఉండే మంత్ర తంత్రాలపై విచారణ జరుపుతూ ఉండడం, సగుణ నిర్గుణ బ్రహ్మ ప్రసంగ సన్నియోగములు అక్కడ సామాన్యమైన సంగతి.

ప్రభాత సమయాల్లో తోకలు ఊపుకుంటూ చెలవలంపట నురుగులు కారుతూ గాలికి ఎగురుతూ ఉంటే తల్లి ఆవుల పొదుగులను కుమ్మేస్తూ పొదుగులను కరిగించేస్తూ పొట్టలు నింపుకొంటూ ముచ్చట గొలిపేలా అటు ఇటు పరుగులెడుతున్నాయి గోవత్సాలు.

మూర్తీభవించిన శాంతమా అన్నట్లు కనిపించే మహర్షులు శ్రుతులు, స్మృతులు చెప్పే ధర్మ కర్మాలను ఆచరించడమే కాని ఆ కర్మల పట్ల కర్తృత్వము కాని భోక్తృత్వము కాని తలపోయరు. వారి నిష్ఠ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇక ముని కన్యకలు వేకువనే లేచి పర్శాణలలను శుభ్రం చేసి ఏటికి వెళ్లి బిందెలతో నీళ్ళు తెచ్చి లతలకు, మొక్కలకు పోసి అప్పుడు ముంగిళ్ళలో ముగ్గులు పెడుతూ ఉంటారు.

ఆ ఋషి పత్నులు పాతివ్రత్యంలో సతీ అనసూయకే పాఠం చెప్పగల సమర్థులు. మహర్షులు అరిషడ్వర్గమును మర్దించే కళలో శమాది షట్కాన్ని ఆయుధంగా ధరించిన ఆరితేరిన వారు.వేదమూర్తులైన బ్రహ్మచారులు బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతూ బాలభాస్కరుల్లా ప్రకాశిస్తున్నారు. బాలికామణులు శివుని పెండ్లి ఆడడానికి ఎదురుచూసిన గౌరీ దేవుల్లా మెరిసిపోతున్నారుట.  (సశేషం)

Saturday, October 26, 2019

నరకాసుర సంహారం



చం.
నరులను బాధ పెట్టుచును నారుల నెందరినో హరించి యా
నరకుడు హింస బెట్టు నెడ నారిని దోడ్కొని పోరుచేయవే
నరకము బంప రాక్షసుని నారదసన్నుత! యెల్ల తావులన్
నరకులె నేడు చూడ భువి నారిని జేకొని వేగ రా హరీ!

***

సత్యభామ నరకుడిని చంపిందని ప్రచారంలో ఉన్న కథనం. అందుకని...

చం.
నరులను బాధ పెట్టుచును నారుల నెందరినో హరించి యా
నరకుడు హింస బెట్టు నెడ నారి వసుంధర! కోల నేయవే
నరకము బంప రాక్షసుని నాథునితో జని నేడు నీ పయిన్
నరకులె యేడ జూచినను నాశము చేయగ రావె వేగమే.

-దువ్వూరి.

Friday, August 23, 2019

కృష్ణ పాదాలు



సీ.
నందుని నట్టింట నాట్యాల పాదాలు
.....తల్లికి దొరకని బుల్లి కాళ్ళు
రక్కసి గుండెల ద్రొక్కిన పాదాలు
.....బండిని తన్నిన బండ కాళ్ళు
పాల్వెన్నలను దోచి పఱచిన పాదాలు
.....నాలమందల వెంట నాడు కాళ్ళు
కంసుని బడ ద్రొక్కి కడపిన పాదాలు
.....కుబ్జకు వరమైన గొప్ప కాళ్ళు

తే.గీ.
బ్రహ్మ కడిగిన పాదాలు పైడి కాళ్ళు
గంగ పుట్టిన పాదాలు గడుసు కాళ్ళు
పాండవుల రక్షపాదాలు బలుపు కాళ్ళు
బాలకృష్ణుని పాదాలు బ్రతుకు బళ్ళు.


Monday, April 8, 2019

ఉగాది 2019


7-4-2019 న అమలాపురం కామాక్షీ పీఠం లో జరిగిన అనంతచ్ఛంద గ్రూపు సభ్యుల కవిసమ్మేళనం లో నేను వ్రాసి చదివిన పద్యాలు:

మ.

శ్రీ కాంచీ నగరీ విహార రసికా! శ్రీచక్ర సంచారిణీ!
ఏకామ్రేశ్వర మానసాబ్జ నిలయా! హ్రీం మంత్ర బీజాత్మికా!
రాకాచంద్ర సమాన దివ్య వదనా! రాజాధిరాజేశ్వరీ!
శ్రీకామాక్షి! పరాత్పరీ! ప్రణతులో శ్రీమాత! నన్నేలుమా!

ఆది:

నిశలు కృశించ సాగినవి నెమ్మదిగా తన యుక్కు కౌగిటన్
వశ మొనరించుకొన్న హిమ వాతము లారెను భీతి తోడ నా
శిశిరము జారిపోయినది చెట్లు చిగిర్చెను పూలు పూచె న
ల్దిశలు వెలుంగ జొచ్చినవి  దివ్యముగా సు వికారి రాకకై........1

నలుదెసల్ క్రొంగ్రొత్త వెలుగులు నిండగా
...........ధరణికి శోభలు తరలి వచ్చె !
శోభిల్లు ధరణిని జూచిన పవనుండు
...........పరిమళవీచికల్ పంచి పెట్టె !
పరిమళవీచులు పురికొల్ప పులకలై
...........ముదమున మావిళ్ళు మోసులెత్తె !
మావిళ్ళు మోసెత్తి మరిపింప కొమ్మపై
...........కోయిల కూయగా గొంతు నెత్తె!

కూయసాగిన కోయిల హాయి నీయ
పచ్చచీరను ధరియించె ప్రకృతికాంత!
ప్రకృతికాంతను గని తాను వలచి వచ్చె
చూడు డల్లదే వాసంతు డాడి పాడ!.............2

రమ్ము వికారి! డెందముల రమ్యపు టూహల ప్రోది సేయ నీ
విమ్ముగ నిమ్ము మంగళము లెల్ల జనమ్ముల కీ ధరిత్రిలో
సొమ్ములు చాలు సౌఖ్యములు శోభనముల్ చెలగంగ నన్న స్వాం
తమ్ముల మార్చవే దయకు తావు నొసంగవె మానవాళిలో.

ధర్మము నడచిన నేలను
ధర్మమునే నమ్మి భరతధర్మావన స
ద్ధర్మము నెరపెడి విభు నిడి
కర్మల గతి మార్చవే వికారీ! ప్రణతుల్.

మధ్య :

**

కరములు మోడ్చక గుడిలో
చరవాణిని చేత బట్టి సరగున పలు చి
త్తరువుల దీసిన ఫలమే?
పరమాత్ముడు మెచ్చు టెట్లు పలుకు వికారీ!

జాలిని చూపడు సతిపై
జాలపు ముఖపుస్తకమున చాన వగచినన్
చాల విచారించును కద
వేలమువెర్రిని మునింగి వీడు వికారీ!

బండెడు భారము వీపున
నుండును కరములను బాక్సు నుదకపు సీసా
బెండయి నడచును పాపడు
గుండెలు చెరువగును  చూడ గుబులు వికారీ!

రెండ్రెళ్ళెంతని యడిగిన
నుండ్రా యని గూగులమ్మ నొయ్యన నడుగున్
పండ్రెం డ్లేళ్లగు బాలుని
తండ్రియు నేమందు నేటి దత్తు వికారీ.

బడి చదువుల ప్రథముల నే
నడిగితి పాలిచ్చు నేది ఆవా ఎద్దా
నుడువుండన తడబడి రీ
బడి నీ గతి నేటి విద్య వరలు వికారీ!

పూజారి వేద విబుధుడు
బాజారున వర్తకుడును వ్యవసాయియు సూ
కా జాల రర్హు లూఢికి
రోజులు సాఫ్ట్వేరు కివ్వి రూఢి వికారీ.

కన్నెల తలిదండ్రుల నా
డెన్నో కష్టాల బెట్టి హింసించిరిగా
నిన్నను, నేడో మరి యా
కన్నెలదే గాలి కల్ల కాదు వికారీ.

పెద్దల కన్నము బెట్టక
పెద్దగ పఠియించు వేయి విష్ణువు పేర్లన్
సుద్దులు చెప్పును పూజలె
ముద్దని యది పుణ్య మెట్లు ముద్దు వికారీ!

తద్దినముల యూసెత్తక
పెద్దల యాచారములను పెడచెవి నిడుచున్
గద్దరి శ్రీమాతా యని
పెద్దగ నామముల పాడ పెంపె వికారీ?


ఇట్టి వికారములే కను
పట్టును సంఘమున నెట్టి పట్టున నైనన్
మొట్టెదవో కొట్టెదవో
తిట్టెదవో మార్చ వలయు తీరు వికారీ!

అంతం :

అమలాపురము పల్కులమ్మ కాపురముగా
.....విమల యశస్వియై వెలుగు గాక
కోనసీమ వసంత కోకిలాకరముగా
.....కుహుకుహూ రాగాల కులుకు గాక
తూర్పుగోదావరి తోటి కోటుల శుభ
.....తోరణమై తులతూగు గాక
ఆంధ్రప్రదేశము హాయిగా తెలుగుల
.....కానంద నిలయమై యలరు గాక

భరతధాత్రిని ధర్మము ప్రబలుగాక
వసుధ యేక కుటుంబమై వరలుగాక
ఎల్ల లోకాల సుఖశాంతు లెలయుగాక
కోరి దీవించవమ్మ వికారి! నతులు.

తెలుగు పద్యమ్ము నిత్యమై తేజరిల్లి
జనుల నాల్కల నానుత సతము, నాంధ్ర
పద్య కవితా సదస్సు సంపన్న మగుత,
తెలుగు నుడులను జగమెల్ల వెలుగు లగుత.

జయమగు గాక ధారుణికి, చల్లగ దప్పిక దీర్చు నీటికిన్!
జయమగు గాక నగ్నికిని, సన్నగ మెల్లగ వీచు గాలికిన్!
జయమగుగాక మింటికిని, సర్వ చరాచర ప్రాణికోటికిన్!
జయమగుగాక సద్ద్విమల సజ్జనకోటుల కీ వికారిలో.


Saturday, April 6, 2019

స్వాగతమ్ము వికారీ!



మిత్రు లందరికీ ఉగాది శుభాకాంక్షలు.



కమ్మగ పాడె కోయిలలు గాటపు ప్రీతిని మెక్కి మావి జొం
పమ్ముల, నవ్వె మల్లియలు ఫక్కున, వచ్చె వసంతు డల్లదే!
రమ్ము వికారి! డెందముల రమ్యపు టూహల ప్రోది సేయ నీ
విమ్ముగ నిమ్ము మంగళము లెల్ల జనమ్ముల కీ ధరిత్రిలో.

ధర్మము నడచిన నేలను
ధర్మమునే నమ్మి భరతధర్మావన స
ద్ధర్మము నెరపెడి విభు నిడి
కర్మల గతి మార్చవే వికారీ! ప్రణతుల్.

Monday, January 14, 2019

రమ్య రాగాల డోల...



భోగిమంటల జూడ పురవీథి కేగగ
.....పొగలు మంటలు లేక బోసిపోయె
తలయంట్ల కుంకుళ్ళ దలచుచు నడవగా
.....నిద్ర మంచాలపై నెలత లాయె
ముంగిళ్ళ ముగ్గులు మురిపించు ననుకొన్న
.....స్పర్ధలకే యవి పరిమితాయె
గొబ్బియమ్మల గను కోర్కెతో చనుదెంచ
.....గోమయ మంటని భామ లాయె

పట్టణము నందు సంక్రాంతి వట్టి దాయె
పౌష్యలక్ష్మి రాక ప్రజకు పట్టదాయె
చిన్నవోయిన మనసుతో ఖిన్నుడ నయి
పల్లె బాటను బట్టితి బరువుగాను.

*****

తెల్లవారక మున్నె యెల్ల కూడళ్ళలో
.....భోగిమంటల చెంత మూగు జనము
తలయంట్ల నంటగా తల్లులు తలలకు
.....పిడపలతో నొప్పు పిల్ల జనము
రంగవల్లుల దీర్చ రంగుగా రమణులు
.....ముంగిళ్ళ ముత్యాల పొంగు ఘనము
భోగిపండ్ల విహృతి బొమ్మకొల్వుల శోభ
.....తరుణుల పాపల దండితనము

గంగిరెద్దులు గొబ్బిళుల్ ముంగిళులను
ప్రభల జిందించె రైతుకు ప్రమదమాయె
పల్లెపట్టులు పర్వమై పరవశించె
రమ్య రాగాల డోల సంక్రాంతి హేల!

Friday, January 4, 2019

శివశివా



శివ యన నీశ్వరుండగును, చేరి శివా యన చెంత నిల్చు నా
శివునకు రాణి, భేదము వచింపగ శూన్యము శక్తికిన్ సదా
శివునకు, గాన నిర్వురకు చెన్నుగ నొప్పు శివాఖ్య, బుద్ధికిన్
జవళిగ దోచు గాని శశిచంద్రిక లట్లొక రూపు వారిదౌ.

శివుడు శక్తియు పరమాత్మ శివవిభూతి,
శక్తిబీజ మికారము శ కు ఘటింప
దాని శి గ మారు, నీశ్వరు డౌను శక్తి
యుక్తు డని యెంచి ధ్యానింప ముక్తు డగును.