padyam-hrudyam

kavitvam

Saturday, August 29, 2020

తెలుగు భాషా దినోత్సవం





సీ.
భాస్కరు డుదయించె ప్రాగ్దిశనే నాడు
...నేటికిఁ దప్ప డా నియతి నతఁడు
ప్రమదలే బిడ్డల ప్రసవించి రా నాడు
...నేటికి నా రీతి నెగడు చుండె
భూమి పైననె నాడు పుట్టిరి మానవుల్
...నేటికి నేలయే చోటు మనకు
తెలుగుననే నాడు పలికిరి మన వాళ్ళు
...నేటికి మన కదే నోట మాట 

తే.గీ.
ఆధునికులమై యే మార్పు లాయె మనకు
మాతృ భాషలో కొరగాని మార్పు లేల?
నాడు పెద్దలు నేర్పిన నాణ్యమైన
కైత లల్లెడి విద్య న్వికార మేల?

Wednesday, August 26, 2020

రాధాష్టమి



ఈరోజు రాధాష్టమి యని....

సీ.
హరి పరతత్త్వమౌ హ్లాదినీ శక్తియే
...అవతారమును దాల్చి యవనిఁ జేరె
గోలోక సామ్రాజ్ఞి గోకులమ్మును జేరి
...గోపాల బాలునిఁ గూడి యాడె
నీలమేఘశ్యాము నీడయై వెన్నంటి
...ప్రణయ సామ్రాజ్యంపు రాణి యాయె
గూఢ నాయిక యౌచుఁ గూర్మి భాగవతంపు
...కథ నడిపించిన కాంత యాయె

తే.గీ.
రాసలీలకు కేంద్రమౌ ప్రాణశక్తి
మధుర బృందావనీ సీమ మహిత దీప్తి
గొల్ల కన్నియ కాదు వైకుంఠ లక్ష్మి 
రాధ మనతల్లి రాగాల రమ్యవల్లి.

Sunday, August 16, 2020

మాయ చేసెడు దేవుడు





సీ.
మొక్కకు వేళ్ళిచ్చి భూమి లోపలి తిండి 
...గ్రహియించు శక్తినిఁ గలిపె నెవఁడు 
సిరలను ధమనుల సృజియించి దేహాన
...నిలఁబెట్టు శక్తిని నిలిపె నెవఁడు
కొమ్మల రెమ్మలఁ గూరిచి చెట్లకు
...నాదిత్య శక్తి నందించు నెవఁడు
సాగరమ్మునుఁ జేరు శైవాలినుల కిచ్చె
...పాయల సంగమ భాగ్య మెవఁడు

ఉ.
జగతి సృష్టించి జంగమ స్థావరముల
బ్రతుకఁ జాలిన మంచి యుపాధు లిచ్చి
సృష్టి నెల్లను తన జాడ చెలగు రీతి
మాయఁ జేసెడు దేవుని మదినిఁ దలతు.

Saturday, August 15, 2020

స్వేచ్ఛ జారనీకుడు




సీ.
జాలరి వలనుండి జారి జలమ్మున
........స్వేఛ్ఛగా నీదెడి చేప రీతి
బంజరమ్మును వీడి బయటి ప్రపంచాన
........చెట్టుపై వాలిన చిలుక రీతి
బులిపట్టు జారఁ దోపులఁ జేరి గెంతుతో
........చెంగున నాడెడి జింక రీతి
హరి చక్రమున వేయ హతమయి మకరమ్ము
........గండముఁ గడచిన గజము రీతి!

తే.గీ.

నేండ్ల తరబడి మ్రగ్గుచు నితర జాతి
పాలనమ్మునఁ గడగండ్లఁ బరితపించి
స్వేఛ్ఛఁ దిన భరతాంబ చిరునగవును
మాయనీకుడు ప్రార్థింతు మాన్యులార!

Wednesday, August 12, 2020

రవీంద్ర గీతం

చిన్నతనంలో ఆకాశవాణిలో తరచూ వినిపిస్తూ హృదయాన్ని అలరింప జేసిన విశ్వకవి రవీంద్రుని మధుర గీతం.

భువనేశ్వరా! ఛేదింపుము బంధనముల ముక్తి నొసగుమా... తొలగింపుము భయము ప్రభు బాపు దైన్యము చేయుము చల చిత్తము సంశయ రహితముగా తిమిర రాత్రీ... అంధ యాత్రా... నీ ఉజ్జ్వల దీప కాంతి దారి చూపవో..భువనేశ్వరా జడ వేదన తొలగిమ్పుము ముక్తి నొసగుమా.. భువనేశ్వరా ప్రభు నీ ప్రసన్నతను వెత లొనరు సుఖములై దుర్బల హృది నొనరిమ్పుము జాగరూకముగా తిమిర రాత్రీ...అంధ యాత్రా... నీ ఉజ్జ్వల దీప కాంతి దారి చూపవో..భువనేశ్వరా స్వార్థ పాశములను ద్రెంచి ముక్తి నొసగుమా .. భువనేశ్వరా * అదనపు చరణం (ఇది ఆకాశవాణి పాటలో లేదు): ప్రభు విరస వికల హృదికి ఓ ప్రేమ సలిల ధారా సంశయ పీడిత మది కొసగవొ విభవములు

తిమిర రాత్రీ...అంధ యాత్రా...
నీ ఉజ్జ్వల దీప కాంతి దారి చూపవో..భువనేశ్వరా

Tuesday, August 11, 2020

చిన్ని కృష్ణా




సీ.
చిన్నవాడ వటంచు నిన్ను లాలన చేయ
...మన్ను తిందువ టోయి చిన్ని కృష్ణ!

వెన్నపా లుండగా మన్నుతో పని యేమి
...న న్ననుమానింప కన్న తల్లి!

మన్ను తిన్నదె కాక మిన్నవౌ మాటలా
...నోరు చూపించరా చోర బాల!

నోటిలో నేముండు పాటియే శంకింప
...ఆఁ యిదిగో చూడ వమ్మ నోరు

తే.గీ.

చిన్నినోట యశోదకు మన్నె కాదు
ముజ్జగమ్ములు కనుపింప మూర్ఛ వచ్చె
దేవదేవుని తల్లికి దేవునకును
స్వస్తి యగుగాక లోకాలు స్వస్థ మగుత.

Wednesday, August 5, 2020

అయోధ్య రామయ్య




సీ.
కరుణామృతము నిండి బరు వౌచు జేరిన 
...చాతకముల పాలి ప్రీతికరము
నింద్రాది నెమిళుల కిష్టము కలిగించు
...శార్ఙ్గ మన బరగు శక్ర ధనువు 
సుందరి యగు సీత మందహాస మనెడి
...మెరుపు తీగను గూడి మెఱయు సతము
జగతిని తీవ్రమౌ సంసార తాపము
...నారుపు ౘలువల కాశ్రయమ్ము

తే.గీ.
నేరవే దీని హృదయమా నిరతి లేదె?
మాటికిఁ దెసలఁ జూతువే మందబుద్ధి?
రమ్ము రామాంబు దమ్మిది రమ్ము చేర
నే డయోధ్యా పురిం బట్టె నింగి నెల్ల.

( శ్రీ మహేశ్వర తీర్థుల రామాయణ ప్రార్థనా శ్లోకం ఆధారంగా )

Monday, August 3, 2020

శ్రావణ పూర్ణిమ



సీ.
నూతన యజ్ఞోప వీతులై విప్రులు
...గాయత్రి నర్చించఁ గడగు వేళ 
నూతన వటువులు ప్రీతితో గురువుచే
...తైత్తరీయోపముఁ దరిగొను తరి
ఋగ్వేద ప్రభృతుల్ హితవు ద్విజుల కని
...శ్రావణోపా కర్మ జరుపు దినము
రాఖి పండుగ యని రంగుగ నేకోద
...రులు దాల్చి రాఖీల నెలయు వేళ 


తే.గీ.
జ్ఞానసిద్ధికి హయశీర్షు ధ్యానమునను
గడపు సమయము, విఖనసు గాఢ భక్తి
నర్చనలు సేసి మ్రొక్కంగ నదను చూడ
భవ్య శ్రావణ పౌర్ణమి పర్వ దినము.