padyam-hrudyam

kavitvam

Friday, March 11, 2011

రామ తారక శతకము 19

91 . రామ కీర్తన లెపుడు లాలించి విను వాడు - వైకుంఠ పురమున వదల కుండు
కృష్ణ నామంబెపుడు కీర్తించి విను వాడు - మధ్యమ పురమందు నమరి యుండు
మధుసూదనా యని మరువక దలచితే - మర్మ కర్మంబులు మాయ మౌను
గోవింద నామంబు కోరి నాదము చేయ - దోష పాపంబులు తొలగిపోవు

అచ్యుతా నంద గోవింద హరి ముకుంద - పదవి నాకిమ్ము నన్నెడ బాయ కుండ
పద్మలోచన నాతండ్రి పరమ పురుష - రామ! తారక! దశరథ రాజ తనయ!

92 .నీ భక్తులగు వారి నిఖిల లోకంబుల - నిజముగా బ్రోతువు నీల వర్ణ
నీ కీర్తి గొనియాడి నీకు సేవలు జేయు - పరమ పుణ్యుల కెల్ల భవ్య పదము
భువి లోన నీ కీర్తి పొందుగా స్తుతియించు - మనుజుల కొదవు నీ మంది రంబు
భక్తుడై యీ రీతి భజన చేయగ నీవు - నుప్పొంగి యిత్తువు నొప్పు తోడ

నిట్టి సేవలు గొని నీవు నిహ పరములు - నారదంబున నాకిమ్ము నాది పురుష
గట్టి గా నీవు నన్ను చే పట్టవయ్య - రామ! తారక! దశరథ రాజ తనయ!

93. యోగ మార్గంబున నెగ సెద నంటి నా - యోగంబు లసలు నా యొద్ద లేవు
గగన మార్గంబున కదలెద నంటినా - కవచ భూషణ మేల కమల నయన
ఆత్మ మార్గంబున నరుగుదు నంటినా - యాత్మ నమ్మిన బంధువరయలేక
అభ్ర మధ్యంబున నరిగెద నంటినా - ఆశ్వ వాహనము నా కలవి గాదు

నీవు దయ దలచి నాయందు నిలిచి యున్న - నఖిల లోకంబులెల్ల నా కల్ప మిపుడు
కుతుకమున నన్ను బ్రోవుము కువలయేశ -
రామ! తారక! దశరథ రాజ తనయ!

94 . కైవల్య పదమని ఘనమని యంటినా - కైవల్య పదవి మిము గన్న చోటు
బ్రహ్మ లోకంబాది పదమని యంటినా - బ్రహ్మాదులును నిన్ను ప్రస్తు తింత్రు
ఇంద్ర లోకమె నాకు నిష్టంబ టన్టినా - యష్ట దిక్పతులు మిమ్మాశ్రయిoత్రు
పదవి పదవులు గావు పరమాత్మ నీ పాద - కమల పదవియె పదవి కంస హరణ

యిట్టి పదవులు నాకేల యిన కులేశ - కష్ట పెట్టక యేవేళ కరుణ జూడు
నిష్టతో నన్ను గావుము నీల వర్ణ - రామ! తారక! దశరథ రాజ తనయ!

95 . కమల నాభుడ నిన్ను కన్నుల జూచితే - సంభవించెడు ఫలము స్వామి నాథ
జలజ లోచన నిన్ను శరణని వేడితే - చేపట్టి రక్షించు శేష శయన
పరమాత్మ పరమేశ పద్మ లోచన నిన్ను - గొనియాడ నే జాల గోరినాను
నారాయణ ముకుంద నర హరి నిన్ను నే - నెప్పుడు సేవింతు నీల వర్ణ

ఇటకు రావయ్య నా తండ్రి యిన కులేశ - తడవు జేయక నన్నేలు ధర్మ నిపుణ
నిలువకను వేగ రావయ్య నీరజాక్ష - రామ! తారక! దశరథ రాజ తనయ!

No comments: