padyam-hrudyam

kavitvam

Monday, October 30, 2017

కావ్య కంఠ వాశిశ్ట గణపతి {5}



ఆ నాలుగు సమస్యలు:
స్తనవస్త్రం పరిత్యజ్య వధూః శ్వశుర మిచ్ఛతి (కింత్యనవద్యచరితా)
వత్సరస్యైకదా గౌరీ పతివక్త్రం న పశ్యతి
సూర్య శశాంకేన సమం వినష్టః (నత్వమవాస్యా)
పిపీలికా చుంబతి చంద్రమండలమ్
ఇచ్చిన మరుక్షణంలోనే గణపతి, ఆ నాల్గు సమస్యలని తడుముకోకుండా పూరించి తన ప్రతిభ చాటాడు.

ఆ పూరణలేమిటంటే:

హిడింబా భీమదయితా నిధాఘే ఘర్మపీడితా
స్తనవస్త్రం పరిజ్యత్యా వధూ శ్వశుర మిచ్ఛతి
(భీముని భార్యయగు హిడింబ ఉక్కకోర్వలేక, తనమామగారైన గాలినిచ్చగించి స్తనవస్త్రమును విడిచెను అని అర్థం. ఇక్కడ, ద్రౌపదిని గాక హిడింబని చెప్పటంలో చాలా ఔచిత్యం ఉంది. దీనికి రెండు కారణాలు – మెదటిది ద్రౌపది ఒక్క భీమునికేగాక పాండవులందరికీ ఇల్లాలు. అదీగాక, ద్రౌపది రాచకన్య, కాబట్టి స్తనవస్త్రం పరిత్యజ్య అని ద్రౌపదినుద్దేశించి చెప్పటం అంత ఔచిత్యం కాదు)

చతుర్థ్యాం భాద్ర శుక్లస్య చంద్ర దర్శన శంకయా
వత్సరస్యైకదా గౌరీ పతివక్త్రం న పశ్యతి
(భాద్రపద శుద్ధ చవితినాడు (వినాయక చవితినాడు), శివుడి తలపైనున్న చంద్రుడిని చూడవలసి వస్తుందేమోననే శంకచే, సంవత్సరమున కొక్కసారి గౌరీదేవి తన పతి ముఖాన్ని చూడదు)

రాహుస్త్రీ కోణే చ గురుస్తృతీయే
కళత్ర భావే చ ధరా తనూజః
లగ్నే చ కోష్ఠే యది బాలకః స్యాత్
సూర్య శశాంకేన సమం వినష్టః
(పంచమ, నవమ స్థానములలో నొకదాని యందు రాహువు, తృతీయమునందు గురువు, కళత్ర స్థానమునందు కుజుడు ఉండగా పుట్టిన బాలునకు – లగ్నమందు సూర్యచంద్రులున్ననూ అరిష్టముండును)

సతీ వియోగేన విషణ్ణ చేతసః
ప్రభో శయానస్య హిమాలయే గిరౌ
శివస్య చూడాకలితం సుధాశయా
పిపీలికా చుంబతి చంద్ర మండలమ్
(దక్ష యజ్ఞమందు సతీదేవిని కోల్పోయి, విషణ్ణ చేతస్కుడై, శివుడు హిమవన్నగముపై పడుకొని యుండగా, అతని శిరోభూషణమైన చంద్రుడు భూమికంటియుండెను. అదే సమయమని యెంచి, చంద్రునియందున్న అమృతాన్ని అందుకోవాలనే ఆశతో చీమలు చంద్రమండలమును చుంబించెను)


దీంతో, కవిత్వ పరీక్షలో నెగ్గినట్లే.

సశేషం...

Wednesday, October 25, 2017

కావ్యకంఠ గణపతి ముని (1878-1936) : (5)


ఒక నవయువకుని నవద్వీప విజయం - పప్పు నాగరాజు
***
అది 1900 సంవత్సరం, జూన్ నెల. దేశం నలుమూలలనుంచీ కవులూ, పండితులూ ఉత్సాహంగా, ప్రతిసంవత్సరం జరిగే పండిత సభలలో పాల్గొనడానికి కాశీ దగ్గరున్న నవద్వీపం చేరుకొన్నారు. అమరావతి, నలందా, ఉజ్జయిని, నవద్వీపం మనదేశంలో అతి ప్రాచీనకాలం నుంచీ పేరుగడించిన విద్యాపీఠాలు. సకల శాస్త్రాలు అక్కడ బోధించేవారు. సరస్వతికి నాలుగు ముఖాలైన – పండితులు, కవులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలతో ఈ నాలుగు నగరాలు ఎప్పుడూ కళకళల్లాడుతూ ఉండేవి. కాలక్రమంలో అమరావతి, నలందా, ఉజ్జయిని తమ పూర్వ ప్రాభవాన్ని కోల్పోయినప్పటికీ, నవద్వీపం మాత్రం అప్పటికింకా ఉత్తరదేశంలో కాలు నిలదొక్కుకోగలిగింది. అక్కడి హరిసభలో ప్రతి సంవత్సరం పండిత పరీక్ష సభలు జరిగేవి. ఈ పరీక్షలో నెగ్గినవారికి, వారి పాండిత్యానికి తగ్గట్టు బిరుదునిచ్చి సత్కరించేవారు. అప్పటికి, ఈ సభలకి దక్షిణ దేశం నుంచీ ఎవరూ పెద్దగా వచ్చేవారు కాదు. దక్షిణాది వాళ్ళంటే నవద్వీపవాసులకి కొంచెం చిన్నచూపు కూడా.
ఆ సంవత్సరం మాత్రం, తెలుగునాట నుంచి అక్కడ జరిగే పండిత పరీక్షలలో తన సత్తా నిరూపించుకోడానికి ఒక యువకుడు వచ్చాడు – వయస్సు 22 సంవత్సరాలు – పేరు గణపతి శాస్త్రి. వయసులో చిన్నవాడైనా, అప్పటికే గణపతి శాస్త్రి సకల శాస్త్ర పారంగతుడు, ఆశుకవితా దురంధరుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఏకసంథాగ్రాహి – ఆపైన ఉపేంద్రుడినైనా లెక్కచెయ్యని ఉడుకు రక్తం. అంతకు ముందు, కాశీలో శివకుమారుడనే ప్రఖ్యాతి గాంచిన పండితుడు తనకిచ్చిన యోగ్యతా పత్రం ఒకటి ఈ యువకునికి పరీక్షలలో పాల్గొనే అవకాశం కల్పించటానికున్న ఒకే ఒక్క ఆధారం.
శితికంఠ వాచస్పతి అనే మహా పండితుడు అప్పుడు సభాపతి. పరీక్షలలో పాల్గొనదలిచేవాళ్ల యోగ్యతలు పరీక్షించి, పరీక్షకి అనుమతి ఇవ్వవలిసిందీ వాచస్పతే. గణపతి కొంత కష్టం మీద వాచస్పతి దర్శనం సంపాదించేడు. తనకి శివకుమారుడిచ్చిన యోగ్యతా పత్రాన్ని వాచస్పతికి వినయంగా చూపించాడు. ఆ ఉత్తరంలో మెదటి వాక్యం –దేవాసుర సమీకేషు బహుశోదృష్ట విక్రమః అనుంది. ఇది రామాయణంలో హనుమంతుని యుద్ధపరాక్రమము దేవతా ప్రశంసనీయమని కీర్తించే శ్లోకం. అది చూడగానే, వాచస్పతి గణపతినింకేమీ ప్రశ్నలు అడగకుండానే, ప్రత్యేక పరీక్షకి అనుమతినిచ్చి తన దగ్గరే ఉంచుకొన్నాడు. మర్నాడు, తనే స్వయంగా గణపతిని సభామంటపానికి తోడ్కొనిపోయాడు.
ఆ ఏడాది, ఆశుకవిత్వంలోనూ, శాస్త్ర సాహిత్యంలోనూ ఉత్తరదేశంలో తనంతవాడు లేడని కీర్తిగాంచిన అంబికాదత్తుడు పరీక్షాసంఘానికి అధ్యక్షుడు. అప్పటికే ఆయన వేదికనలంకరించి ఉన్నాడు. వేలకొలదీ ప్రేక్షకులు, పండితులతో సభ కన్నులపండుగగా ఉంది. సభ ప్రారంభించే లోపు గణపతిని అధ్యక్షుడికోసారి పరిచయం చేద్దామనే ఉద్దేశంతో వాచస్పతి, గణపతి తన వెంట వస్తుండగా అధ్యక్షపీఠం వద్దకి చేరుకొన్నాడు.
అధ్యక్షపీఠాన్ని అలంకరించియున్న అంబికాదత్తుడి గంభీరాకృతి గణపతి దృష్టినాకట్టుకొంది.
బాల్య చాపల్యంతో “కోసౌ మహాశయః” అని వాచస్పతిని ప్రశ్నించాడు. అంత సమీపంలో అంబికాదత్తుడికి వినిపించేటట్టుగా అలా గణపతి అడిగేసరికి పాపం వాచస్పతి కాస్త తెల్లబోయాడు. అంబికాదత్తుడు సరసుడు, రసజ్ఞుడు. తొణకకుండా, గంభీరంగా చిర్నవ్వు నవ్వి:
సత్వర కవితా సవితా గౌడోహం కశ్చిదంబికాదత్తః
అంటూ, తన దేశ, నామ, సామర్థ్యాలు మూడూ గణపతికి చెప్పి, తెలివిగా శ్లోకంలో ఒక్కపాదమే చెప్పి, ఇక నీ పరిచయమేమిటి అన్నట్టుగా మిగతా సగభాగం చమత్కారంగా విడిచిపెట్టాడు. అది గ్రహించిన గణపతి తడుముకోకుండా వెంటనే:
గణపతి రితి కవికులపతిరతి దక్షో దాక్షిణాత్యోహం
ఈ విధంగా తాను కూడా, తన దేశ, నామ సామర్థ్యాలు ఒక్క పాదంలోనే ఇమిడ్చి, అధ్యక్షుడికంటే తానే అధికుడినన్నట్టుగా కవికులపతి అంటూ ఒక చమత్కారబాణం విసిరి, అంతటితో ఊరుకోకుండా – భవాన్ దత్తః, అహంత్వౌరసః (నీవు అంబికకి దత్తుడివి మాత్రమే, నేను ఔరస పుత్రుడిని) అని అంబికాదత్తుడి అహాన్ని రెచ్చగొట్టాడుకూడా. సభలోని వారందరూ, వాచస్పతితో సహా – ‘ఎవడీ యువకుడు, సింహం జూలుపట్టి లాగుతున్నాడే, పర్యవసానం ఎరుగుదుడా’ అని నివ్వెరపోయారు. అంబికాదత్తుడు మాత్రం చలించలేదు. వెంటనే గణపతిని వేదిక మీదకి రమ్మని సంజ్ఞ చేసి, వెనువెంటనే నాలుగు సమస్యలు ఇచ్చి వాటిని పూరించమన్నాడు. ( సశేషం)
***
చి. సౌ. శ్రీమతి నాగబంది శ్రీలక్ష్మి సౌజన్యతతో...

Tuesday, October 24, 2017

కావ్యకంఠ గణపతి ముని .. 4



ఈశ్వారానుగ్రహం పొందడానికని 16వ ఏట నుండి తపస్సు చేయనారంభించారు. అచిరకాలంలోనే భువనేశ్వరీ మాత అనుగ్రహాన్నీ, ఈశ్వరానుగ్రహంతో నిర్విషయ ధ్యానయోగాన్నీ పొందారు. అయినా తృప్తి చెందక నిజ తపస్స్వరూపాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని సుమారు 12 ఏళ్లు తపస్సు చేసినా అది సిద్ధించలేదు. కానీ భగవత్ప్రేరణ పొంది అరుణాచలానికి వెళ్లారు. అక్కడ 1907లో కృత్తికోత్సవాలలో ధ్యానదీక్షను చేపట్టారు. ఈశ్వరానుగ్రహం కలిగింది. అది గణపతిపైనే కాదు. అక్కడే 12 ఏళ్లుగా తపస్సులో ఉన్న ఒక బ్రాహ్మణస్వామిపై కూడా పడింది. ఆ బ్రాహ్మణస్వామినే తన ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించి, ఆయనకు ‘‘్భగవాన్ రమణ మహర్షి’’ అనే పేరు పెట్టారు. అంతేకాదు. ఆ పేరును అంగీకరించమని ప్రార్థించారు. దాంతో ఆ బ్రాహ్మణస్వామి ‘‘అలాగే నాయనా’’ అనడంతో గణపతికి నాయనగా పేరు స్థిరపడింది.

గణపతి ముని తనకు రమణ మహర్షిని గురువుగా ప్రసాదించిన పార్వతీదేవి (ఉమాదేవి)కి కృతజ్ఞతా సూచకంగా ఒక కావ్యాన్ని రచించి సమర్పించదలిచారు. అదే ఉమాసహస్రం. దీనిని 20 రోజుల్లోగా రచించి పూర్తిచేస్తానని ప్రతిజ్ఞ చేశారు. కార్తీక బహుళ షష్ఠి, మంగళవారం (20.11.1907)నాడు రచనకు శ్రీకారం చుట్టారు. ఈ స్తోత్ర కర్మఫలంగా నాయన రమణుల సుబ్రహ్మణ్యతత్వాన్ని దర్శించాలని ఆశించారు. ఒకరోజు నాయన భారతదేశంలో నాటి క్షుద్భాదను తలుచుకుని (ఇప్పటికీ ఈ సమస్య సజీవంగానే ఉంది) ఆ బాధను నివారించమని దేవిని అర్థిస్తూ, ‘‘్ఛన్నాం భిన్నాం సుతరాం సన్నా మిన్నా భావతచితః ఖిన్నాం’’ (ఇదే ఇంద్రాణీ సప్తశతిలో-4వ శతకం, 4వ స్తబకం, 24వ శ్లోకం) అని ఒక పాదం వ్రాసేసరికి దేశంలోని ఆకలంతా తనకే వచ్చినట్లు నాయనకు అనుభవమైంది. అపుడు సమయం సరిగ్గా 7 గంటలు. నాయన రచనను ఆపి ఆ పరదేవతా స్మరణలో మునిగిపోయారు.

అదే సమయంలో రమణ భక్తురాలైన ఎచ్చమ్మాల్ ఇంటి దగ్గర ఒక విచిత్రం జరిగింది. ఆమె పొయ్యి మీద వేర్వేరు గినె్నల్లో పప్పు, బియ్యం వేసిందిట. ఇంతలో ఒక స్ర్తి ప్రత్యక్షమై, ‘‘ఓ భక్తురాలా, గుహలో స్తపబంధ దీక్షాపరుడైన ముని ఆకలితో బాధపడుతున్నాడు. అన్నం కోసం ఎదురుచూస్తూన్నాడు. వెంటనే పంపు. ఐతే, ‘ఈ దినం విశేషమేమి’ అని ఈ అన్నం తీసుకుని వెళ్లేవారిని అతనిని అడగమను’’ అని చెప్పి అదృశ్యమైపోయిందిట. ఎచ్చెమ్మాళ్ తిరిగి చూసేసరికి అన్నం, పప్పు ఉడికి సిద్ధంగా ఉండటంతో ఆమెకు ఆశ్చర్యం కలిగింది. ఇంతలో ఒక విద్యార్థితో అన్నాన్ని, పప్పునీ పంపి నాయనను అడగాల్సిన ప్రశ్న కూడా చెప్పి పంపింది. ఆ విద్యార్థి తెచ్చిన భోజనాన్ని చూడగానే నాయన ఆకలి మాయమైందిట. కానీ తెచ్చిన తిండి వ్యర్థం కాకూడదని కొద్దిగా తిని పంపేశారట. ఆ బాలుడు ఎచ్చెమ్మాళ్ అడగమన్న ప్రశ్నకు నాయన నవ్వి ‘‘క్షుత్తేశేషమ’’ని బదులు పంపారట. కొంతసేపటికి వచ్చిన ఎచ్చెమ్మాళ్ ద్వారా జరిగిన కథనంతా విని, దేశంలో శత్రువులవల్ల ఏర్పడిన క్షుద్భాదను తీర్చడానికి దేవత సిద్ధంగా ఉందని తెలుసుకుని నాయన సంతోషించారు.

ఉమాసహస్ర దీక్ష ఇక నాలుగే రోజులుందనగా నాయన కుడిచేతి బొటనవేలికి గోరుచుట్టులాటి పుండొకటి వచ్చి, రచన ఏమాత్రం ముందుకు సాగలేదు. 19వ రోజు సాయంత్రానికి ఇక నాలుగోవంతు గ్రంథం అలాగే మిగిలిపోయి ఉంది. అంటే 250 శ్లోకాలు ఇంకా పూర్తికావలసి ఉంది. 20వ రోజు వైద్యుడు వచ్చి నాయన వేలుకు శస్త్ర చికిత్స చేసి కట్టుకట్టాడు. ఐనా తగ్గలేదు. అప్పటికే వేదాంత ఆగమ శాస్త్ర రహస్యాలతో, ఉమాసహస్రం 750 శ్లోకాలతో అద్భుతంగా రూపొందింది. కేవలం 250 శ్లోకాలు కాలేదని, తన ప్రతిజ్ఞకు బద్ధుడై అప్పటిదాకా వ్రాసిన వాటిని చించేయవద్దని నాయనను భక్తులంతా ప్రార్థించారు. అది విన్న నాయన మిగిలిన భాగాన్ని ఆశువుగా పూర్తిచేశారు. అదీ ఎంతో అద్భుతంగా. అది ఎలాగంటే, ఆ రోజు రాత్రి అప్పటికే 8 గంటలైంది. తాను చెప్పింది వ్రాయడానికి ఐదు మందిని రాత సామగ్రితో సిద్ధం అయ్యారు. ఇంతలో రమణమహర్షి వచ్చి నాయన వెనకగా కూర్చుని ధ్యానముద్రలో ఉండిపోయారు. 25 శ్లోకాల చొప్పున మొత్తం 10 స్తబకాలు (1000 పాదాలు) మిగిలి ఉన్నాయి. నాయన ఐదు మందికి ఐదు స్తబకాలు ఏకకాలంలో ఒక్కో పాదాన్ని వరసగా, ఆశువుగా చెబుతూ మొత్తం 200 నిమిషాల్లో పూర్తిచేసేశారు. అంటే, 250 శ్లోకాలను ఆశువుగా 200 నిమిషాల్లో పూర్తిచేశారు. అందరూ సంతోషపడ్డారు. ఇంతలో, రమణ మహర్షి ధ్యానంలోంచి మేల్కొని ‘‘నేను చెప్పినవన్నీ సరిగ్గా వ్రాశారా?’’ అని అడిగారు. దాంతో నాయన తాను అనుకున్న సుబ్రహ్మణ్య తత్వం వెల్లడైందని తెలిసి సంతోషించారు. వెంటనే, రమణ మహర్షితో, ‘‘చిత్తం! మీరు నాకు చెప్పినదంతా శ్రద్ధగా గ్రహించి ఇపుడే రచన పూర్తిచేశాను!’’ అని సమాధానం ఇచ్చారు. దాంతో, సంతోషించి రమణులు మంచిది అని అక్కడినుంచి వెళ్లిపోయారు.


ఉమా సహస్రాన్ని ఎనిమిదిసార్లు సంస్కరించారు నాయన. ఐతే, ఆయన సంస్కరించింది మొదటి 750 శ్లోకాలే. చివరి 250 శ్లోకాలు రమణ మహర్షి ప్రత్యక్ష సాన్నిధ్యంలో పూర్తి అయినందువల్లనేమో, ఆ 250 శ్లోకాల్లో మాత్రం ఎలాటి మార్పులనూ చేయలేదు నాయన. అది తన గురువాక్కు ప్రసాదంగా నాయన భావించారు. ఇలా తమ తల్లియైన ఉమాదేవికి తనయులిద్దరూ (గణపతి, రమణ) తమ వాక్కుతో అర్పించిన నీరాజనమే ఉమా సహస్రమనే స్తోత్ర మాలిక. ఒక్క మాటలో చెప్పాలంటే, రమణ, గణపతుల మధ్య జరిగిన శక్తి ప్రవాహమే ఉమా సహస్రం. సహస్రార శక్తి ప్రవాహమే ‘‘ఉమా సహస్రం’’. ఉమా సహస్ర రచన గురించి ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందీ అంటే, రమణ, గణపతుల మధ్య జరిగిన ఆ ‘శక్తి ప్రవాహానే్న’ నాయన ఇంద్రాణీ సప్తశతిలో ప్రవేశపెట్టారు.

Sunday, October 22, 2017

కావ్య కంఠ వాశిష్ఠ గణపతి ముని (౩)


వైద్యనాద్ వెళ్లి తపస్సు చేసి సురేష మిత్రుని వద్ద ‘’తారా’’మంత్రోపదేశం పొందాడు .గణపతి గారి వల్లే ఉత్తరాదికే పరిమిత మైన ఈ మంత్రం దక్షిణాదికి చేరింది .పదవ రోజు రాత్రి శివుడు కలలో కన్పించి నిర్విషయ ధ్యాన రూపం అయిన ‘’స్మృతి మార్గం ;;చూపించి ,విభూతి చల్లి అదృశ్యమైనాడు.
గద్వాల్ చేరి మహారాజుకు ఆప్తుడై ,కాన్పూర్ వెళ్లి మూడు నెలలు తపస్సు చేసి ,మళ్ళీ ఇంటికి వెళ్లి తండ్రికి నేత్ర చికిత్స చేయించాడు .1902 లో భార్య తో సహా మందస వెళ్లి రాజు గారి ఆతిధ్యం పొంది ,భార్యను పుట్టింటికి పంపి, తమ్ముడు శివ రామ శాస్త్రి తో కలిసి భువనేశ్వర్ లో మళ్ళీ తపస్సు చేసి కలకత్తా చేరాడు .అక్కడినుంచి దక్షిణ దేశం చేరి క్షీరవతీ ,వేగావతీ నాడు మద్య శివ పంచాక్షరి జపించి ,,అరుణాచలం చేరి తన తపో సాధనకు అదే సరైన ప్రదేశం గా భావించి అక్కడే ఉందామని నిర్ణ యించుకొన్నాడు .
కానీ అన్నదమ్ములిద్దరికి పిడికెడు అన్నం పెట్టె వారే కరువైనారు .గణతి కి ఆ క్షేత్ర దేవత పై కోపం వచ్చింది .ఆకలి దహిస్తోంది .వెంటనే ఒక బ్రాహ్మణుడు వచ్చి తన భార్య వ్రతం చేసి పారణ ను బ్రాహ్మణులకు ఇవ్వాలని అనుకుంటున్నది భోజ నానికి రమ్మని చెప్పి తీసుకొని వెళ్లాడు .అక్కడ ఆమె మృష్టాన్న భోజనం పెట్టింది .సంతృప్తిగా తిన్నారు ..ఆ ఇంట్లోనే విశ్రాంతి తీసుకొన్నారు .తెల్ల వారి లేచి చూస్తె అక్కడ ఇల్లే లేదు .అరుణా చలేశ్వరుడే తమల్ని పిలుచుకొని వెళ్ళాడని అమ్మ వారు’’ ఆపీత కుచామ్బే’’ తమకు భోజనం పెట్టిందని గ్రహించాడు .కాని నోట్లో తాంబూలం అట్లాగే ఉండటం ఆశ్చర్యం వేసింది .అది కల కాదు నిజం అని తెలుసు కొన్నాడు .అప్పటికి గణపతి అయిదు కోట్ల శివ పంచాక్షరి ని జపించి నందుకు అమ్మవారే స్వయం గా కన్పించి ఆతిధ్యం ఇచ్చిందని అర్ధ మయింది .ఇక మానవ మాత్రులెవరిని దేహీ అని అర్ధించ రాదనీ నిశ్చయించు కొన్నాడు.
.రోజు అరుణాచల నందీశ్వరుని ముందు నిలిచి శ్లోకాలను అరుణా చలేశ్వరునికి విని పిస్తూ ‘’హరస్తుతి ‘’కావ్యం రచించాడు .చివరి రోజు న అరుణాచల యోగులు శేషాద్రి స్వామి ,బ్రాహ్మణ స్వామి (రమణ మహర్షి )ఆ కావ్యం విని ఆనదించారు .అక్కడి విద్యాలయం లో ఈయనకు సంస్కృత అధ్యాపక పదవి లభించింది .పది రోజుల్లో తమిళం నేర్చి ,ఆ భాష లో బోధించటం ప్రారంభించి మెప్పు పొందాడు .1903 లో రమణ మహర్షిని దర్శించాడు .ఆయనేదుర్గా మందిర యోగి చెప్పిన ‘’స్థూల శిరస్సు ‘’అని గుర్తించి నమస్కరించాడు .అప్పుడు రమణుల వయస్సు ఇరవై రెండు .గణపతి వయస్సు ఇరవై అయిదు .అలా చారిత్రాత్మకం గా కలిసిన వారిద్దరూ జీవికా జీవులు గా ఉండి పోయారు
శ్రీకావ్య కంఠ వాసిష్ఠ గణపతి ముని(నాయన) రమణ మహర్షిని ఆస్తిక లోకానికి పరిచయం చేసి మహోపకారాన్ని చేశారు. వీరు కడు మేధావులు. వంగదేశం (బెంగాల్)లోని నవద్వీప నగరంలో పాండిత్య పరీక్షల కోసం జరిగే పండిత సభలో పండితులందరినీ అబ్బురపరిచే రీతిలో నాయన తన ప్రతిభను చూపారు. అక్కడ ఒక వృద్ధ పండితుని చూసి ఎవరీయన అని తన పక్కన వారిని నాయన అడిగారట. ‘‘అతడే పరీక్షాధికారి, ఆశుకవి, అంబికాదత్తుడు’’ అని బదులిచ్చాడట పక్కనున్న వ్యక్తి. ఇంతలో అంబికాదత్తుడే వచ్చి, ‘‘నేను ఆశుకవితా జనకుడను, గౌడుడను. నా పేరు అంబికాదత్తు’’ అని సంస్కృతంలో చెప్పగా, దానికి నాయన ఏమాత్రం తడబడకుండా, ‘‘నేను కవికులానికి అధిపతిని. అతిదక్షుడను. దాక్షిణాత్యుడను. నా పేరు గణపతి’’ (నీవు కేవలం అంబికకు దత్తుడవు మాత్రమే. నేను సాక్షాత్తూ అంబికకు పుత్రుడను అని నాయన చేసిన చమత్కారంతో అంబికా దత్తుడికి నాయన పాండిత్య ప్రతిభ తెలియకనే తెలిసింది) అని సంస్కృతంలోనే జవాబిచ్చారు. ఆ తరువాత ఆ సభ పెట్టిన పరీక్షలన్నిటిలోనూ నాయన తన ప్రతిభ చాటి, తన అసమాన ప్రతిభతో అందరినీ ముగ్ధుల్ని చేశారు. ఆనాటి అచటి విద్వత్పరిషత్తు నాయనకు కావ్య కంఠ బిరుదునిచ్చి సత్కరించింది. ఇది 20.06.1900 నాడు జరిగిన సంఘటన. అలా నాయన, పండితుల మహాసభలో తన అసమాన ప్రతిభను కనబరిచి ‘‘కావ్యకంఠ’’ బిరుదును పొందారు. కావ్యకంఠ గణపతిగా ప్రసిద్ధికెక్కారు.
చి.సౌ. శీమతి నాగబంది శ్రీలక్ష్మి సౌజన్యత తో...

Thursday, October 19, 2017

దీపావళి శుభకామనలు.



అక్కయు నన్నయున్ కలసి అన్ని టపాసులు కాల్చుచుండి రిం
కెక్కడి వమ్మ నా కనుచు నేడ్చెడి బిడ్డడి నెత్తుకొంచు నో
చక్కనితల్లి నాన్న కొనె చాల టపాసుల నువ్వు నేను నెం
చక్కగ కాల్చుకొందమని సాంత్వన చేయుట చూడ ముచ్చటౌ.

Tuesday, October 17, 2017

సిద్ధ యోగి పుంగవులు : స్వర్ణ సిద్ధ యోగి వాసిష్ఠ గణపతి ముని ( 2 )

సిద్ధ యోగి పుంగవులు : స్వర్ణ సిద్ధ యోగి వాసిష్ఠ గణపతి ముని ( 2 )
***
స్వర్ణ సిద్ధ యోగి వాసిష్ఠ గణపతి ముని.
ఆయన చదవని శాస్త్రం లేదు ,రాయని కావ్యం లేదు ,దర్శించని క్షేత్రం లేదు ,తపస్సు చేయని ప్రదేశం లేదు ,చూపని మహిమలు లేవు, ప్రసన్నం చేసుకోొని దేవత లేదు అన్నిటికి మించి అస్పృశ్యతనుయేవగించుకొన్న సదాచార సంపన్నుడు ,భారత జాతీయ స్వాతంత్ర ఉద్యమం లో ముందు నిలిచినకర్మిష్టి ,భగవాన్ రమణ మహర్షి చేతనే ‘’నాయనా ‘’అని పించుకొన్న అద్భుత మూర్తి .సాక్షాత్తు గణపతి అవతారమే శ్రీ వాసిష్ఠ గణ పతి ముని .వారి జీవితం అంతా పరోప కారమే .కారణ జన్ములాయన .ఆ పేరు స్మరిస్తే చాలు సర్వ పాప హారం .
జననం –విద్యా భ్యాసం –వివాహం
అసలు పేరు అయ్యల సోమయాజుల సూర్య గణపతి శాస్త్రి .తండ్రి నరసింహ శాస్త్రి-గణపతి ఉపాసకుడు .తల్లి నరసమ్మ సూర్య ఉపాసకురాలు .వీరి సంతానమే గణపతి శాస్త్రి .శ్రీ కాకుళం జిల్లా బొబ్బిలి దగ్గర ‘’కలువ రాయి ‘’గ్రామం లో 17-11-1878 న జన్మించారు .ఆరామద్రావిడ కుటుంబం .తండ్రికి గణపతి తన దగ్గరకు వస్తున్నట్లు కని పించింది .తల్లికి సూర్యుని శక్తి అయిన అగ్ని పూర్ణ స్వర్ణ కలశం కల లో కన్పించింది ..బిడ్డ జన్మించినప్పుడు అతన్ని ఒక దివ్య తేజస్సు ఆవరించి ఉన్నట్లు చూసింది .పదేళ్ళకే తల్లిని పోగొట్టు కొన్నదురదృష్ట వంతుడు గణ పతి .ఈయన దైవాంశ సంభూతుడు అని భావిస్తున్నారు తల్లీ ,తండ్రీ .కాని మన వాడికి ఆరేళ్ళ దాకా మాటలే రాలేదు ..తండ్రి కాల్చిన లోహపు ముల్లును కొడుకు నాడిలో గుచ్చాడు .వెంటనే జలపాతం లాగా మాటలు జారి వచ్చాయి .
పిన తండ్రి ప్రకాశ శాస్త్రి దగ్గర కావ్యాలు చదవటమే కాక పంచాంగ గణనం లోను దిట్ట అని పించుకొన్నాడు .పన్నెండవ ఏట విశాలక్షమ్మ తో వివాహం జరిగింది .కాళిదాసు గారి మేఘ దూతం లాగా ‘’భ్రున్గా దూతం ‘’అనే రెండు సర్గల కావ్యం రాశాడు ..పద్దెనిమిదేళ్ళు వచ్చే సరికి వ్యాకరణ ,అలంకార ,సాహిత్యా లను కరతలామలకం చేసుకొన్నాడు .పురాణ ,ఇతి హాసాల లోతులు తరచాడు .పదమూడవ ఏటి నుండి తండ్రి వద్దే మేధా దక్షిణా మూర్తి ,నారాయణాాక్షరి ,సౌరాస్త్రాక్షరి ,చండి నవాక్షరి ,మాతంగి ,బాల ,వారాహి ,భువనేశ్వరి ,మహాగణపతి ,పంచ దశి ,షోడశి అనే పన్నెండు మహా మంత్రాలను సాధన చేసి వశం చేసుకొన్నాడు .తపస్సు చేసుకోవాలనే కోరిక బల మైంది .ఆరు నెలలు ఇంటి దగ్గర ,ఆరు నెలలు తపస్సు చేసుకోవటానికి భార్య అనుమతి పొందాడు .ఇద్దరు పిల్లలు కన్న తర్వాతతనకు కూడా తపస్సు చేసుకొనే అవకాశం ఇమ్మని భార్య కోరితే సరే నన్నాడు .వెంటనే భార్యకు మహాగణపతి మంత్రం ,శ్రీ దీక్ష ఇచ్చాడు .
దేశ సంచారం –శాస్త్ర చర్చలు –తపస్సు
1896లో అంటే పదహారేళ్ళప్పుడు కౌశికీ నదీ తీరాన పేరమ్మ అగ్రహారం లో రెండు నెలలు తీవ్ర తపస్సు చేశాడు ..కాశీ కి బయల్దేరి నంది గ్రామం లో ధర్మ శాలాధి కారిచే సన్మానం పొంది ఇంటికి వచ్చాడు .కలువరాయి లో ధ్యానం లో ఉండగా భద్రకుడు అనే అనే ఆయన కన్పించి గణపతి గణకుడు అని జ్ఞాపకం చేశాడు .తండ్రి అనుమతి తో ప్రయాగ వెళ్లి హంస తీర్ధం లో కొంత కాలం తపస్సు చేసి ,కాశీ చేరి తండ్రి మేన మామ భవానీశంకరం ఇంట్లో ఉండి దర్భాంగా సంస్థానం లో ఉండే ‘’శివ కుమార పండితుడి ‘’ని తన కవిత్వం తో మెప్పించాడు .నవద్వీపం లో జరిగే విద్వత్ పరీక్ష కు హాజరవమని పరిచయ పత్రం పొందాడు .
ఒక రోజు ఆయనకు అయ్యల సోమయాజుల సూర్య నారాయణ యోగి కని పించి భద్రకుడు మొదలైన తాము పదహారు మంది లోక కళ్యాణం కోసం జన్మించామని తాను’’ సుకేతుడనని’’ ,అతను గణపతి అని ,యే పని చేయాలో’’ స్థూలశిరస్సు’’ అనే వాడు తెలుపుతా డని చెప్పాడు .నాసిక్ లో తపస్సు చేయాలని స్వప్నం లో తెలియ జేయ బడటం తో అక్కడికి చేరి నీలామ్బికా ఆలయం లో తపస్సు చేశాడు .అక్కడే మొదటి అష్టావధాానమూ చేశాడు .అక్కడ తనను అవమానించిన పూజారిని శపించి ,పాప పరిహారం కోసం ‘’నవ చూతి ‘’లో 72 రోజులు ఘోర తపస్సు చేశాడు .అప్పుడే’’ తెల్లని దిగంబరుడు’’ కల్లో కనిపించి ఇంటికి వెళ్ళమని ఆదేశించాడు ..ఒరిస్సా చేరి భువనేశ్వర్ లోతోమ్మిది రోజులు తపస్సు చేశాడు . భువనేశ్వరి దేవి సాక్షాత్కారించి బంగారు గిన్నె లోని తేనె ను అతనితో తాగించింది ..దానితో కవితా మాధుర్యం పెరిగింది .బుద్ధి సూక్ష్మత రెట్టింపైంది .
ఇంటికి వస్తే భార్య కొడుకుని కన్నది .మహాదేవుడనే పేరు పెట్టాడు .కేశ న కుర్రు లో తర్క వేదాంత ,వ్యాకరణ మహా భాష్యాలను ,నీతి శాస్త్రాన్ని ఆపోసన పట్టాడు .1900 లో మదసా సంస్థానం లో రాజ గురువును ఓడించి ,అష్టావధానం చేసి ,రాజకుమారుడికి శివ పంచాక్షరి ఉపదేశించి రాజు ప్రోత్సాహంతో నవద్వీపం చేరాడు .అక్కడ ‘’సితి కంఠ వాచస్పతి ఆదరం పొందాడు .పరీక్షాధికారి అయిన ‘’అంబికా దత్తు. ఆయన అంబికకు దత్తుడు అయితే తాను సాక్షాత్తు అంబిక కు ఔరస పుత్రుడిని గణపతిని అనే ‘’శ్లోకం తో మెప్పించి ,ఆయన మెప్పు పొంది పరీక్ష లో పాల్గొన్నాడు .నవద్వీప పండితులను మెప్పించటం మహా కష్టం .కాని మన గణపతి అక్కడి పండిత పరిషత్తు పెట్టిన అన్ని పరీక్షల్లో నెగ్గి ,తన పాండిత్యం ,కవిత్వాలతో అందర్ని మెప్పించి ‘’కావ్య కంఠ గణపతి ‘’బిరుదును 20-6-1900 న పొందాడు .అప్పటి నుంచి ఆపేరు తో నే సార్ధక నామదేయుడైనాడు .
( చి.సౌ. శ్రీలక్ష్మి సౌజన్యతతో....)

Sunday, October 15, 2017

శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని 1

నాయన - శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని జీవిత చరిత్ర-దీనిని రచించిన వారు శ్రీ గుంటూరు లక్ష్మికాంతము గారు.
నాయన - భగవాన్ శ్రీ రమణ మహర్షి గారి ముఖ్య శిష్యులలో ప్రధమముగా చెప్పుకోవలసిన వారు.
శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని 17-11-1878 లో జన్మించిరి.
వీరు తమ పదియేండ్ల వయసు నందే తెలుగు, సంస్కృత భాషలందును, వేదములు, తర్క శాస్త్రము, గణిత శాస్త్రము, జ్యోతిష శాస్త్రము మరియు ఆయుర్వేదము నందు అసమాన ప్రతిభ చూపినారు.
వీరి యొక్క వాక్చాతుర్యము, సంస్కృత భాషా ప్రావీణ్యము మరియు అన్ని శాస్త్రములందును విశేష ప్రతిభతో - నవద్వీప మందు విద్వత్పరీక్ష లందు పాల్గొని 'కావ్యకంఠ' బిరుదమును పొందిరి.
వివిధ ప్రదేశములలో తపస్సు ఆచరించి మంత్ర సిద్ది పొందినారు.
అయినను ఇంకా సంతృప్తి పడక - ఈశ్వర ప్రేరణమున, అరుణాచలము (తిరువన్నామలై) లో, 18-11-1907 న బ్రాహ్మణ స్వామిని (వేంకటరామన్) కలిసి '....... తపస్సాధన స్వరూపము కొఱకు అర్ధించుచు మిమ్ములను శరణువేడుచున్నాను.... ' అని తమిళ భాషలో అడిగిరి. అప్పటిదాకా పెక్కు సంవత్సరములు మౌనముగా వున్న బ్రాహ్మణ స్వామి:
1. " 'నేను, నే' ననునది యెచ్చటనుండి వచ్చుచున్నదో విచారించినయెడల, అది ఉదయించు స్థలమందే లీనమగును. అదియే తపస్సు.
2. జపము చేయునప్పుడు మంత్రనాద మెచ్చటనుండి యుదయించు చున్నదని పరికించినచొ, అది యుధ్భవించు స్థలమందు పరికించు మనస్సు లీనమగును. అదియే తపము." అని మితాక్షరములతొ తమ ఉపదేశవాణిని తమిళ భాషలో వెలువడిరి.
గణపతిముని వేంకటరామన్ అను నామమమును 'రమణ' అని మార్చి, 'భగవాన్ శ్రీ రమణ మహర్షి' అను పూర్ణ నామమును సమకూర్చి, 'శ్రీ రమణపంచక' మను శ్లోక రత్నములను అప్పటికప్పుడు కూర్చి రమణుని హస్తమందుంచి 'మీరిది స్వీకరించి నన్ను ఆశిర్వదింతురు గాక' అని పలికెను.
'సరే, నాయనా' యని రమణుడు దానిని స్వీకరించెను.
అప్పటినుండి బ్రాహ్మణ స్వామి భగవాన్ శ్రీ రమణ మహర్షి గాను, కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని నాయన గాను పిలువబడుచుండిరి. జగత్ప్రసిద్దులయిరి.
తదుపరి గణపతి ముని భగవాన్ శ్రీ రమణ మహర్షి అనుగ్రహము వలన చూత గుహలో కపాల భేద సిద్ధి పొందిరి (1922 వేసవి).
గణపతిముని ఉమా సహస్రము, శ్రీ రమణ గీత, శ్రీ రమణ చత్వరిమ్సత్, ఇంద్రాణి సప్తశతీ, మహా విద్యాది సూత్రావళి, గీతమాల, విశ్వమీమాంస, మొదలగు గ్రంధములను రచించెను. మరియు భగవాన్ శ్రీ రమణ మహర్షి సంస్కృతములో రచించిన 'ఉపదేససారము' నకు వ్యాఖ్యానము రచించిరి.
'నాయన' అను ప్రియ నామముతో ప్రకాశించిన శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని 25-07-1936న తమ భౌతిక శరీరమును వీడిరి.
ఈ దివ్యపురుషుని భౌతిక దేహమంతరించినను, తన గ్రంధములందు బోధరూపమున ప్రకాశించుచున్నారు.
నాయన కలకత్తా కి 24-11-34 న వచ్చి శ్రీ గుంటూరు లక్ష్మికాంతము గారి ఇంట్లో బస చేసితిరి. వీరి ఆదరాభిమానములకు సంతసించి, నాయన షుమారు ఒకటిన్నర సంవత్సరములు కలకత్తా లో వీరి దగ్గర వుండిరి. ఆ సమయములో ప్రతిరోజూ నాయన వీరికి అనేక ముఖ్య విషయములను బోధించెడివారు.. ముఖ్యముగా లక్ష్మికాంతము గారి కోరిక మేర నాయన గారు స్వయముగా తమ జీవిత చరిత్ర, ఉమా సహస్రము నకు అర్ధము మరియు వ్యాఖ్యానము,ఇంద్రాణి సప్తశతీ యొక్క అర్ధము మరియు వ్యాఖ్యానము, విశ్వమీమాంస వివరణము, మొదలగు విషయములు బోధించిరి. గణపతి ముని గారు (వీరనారి సత్యప్రభ అను కథను) 'పూర్ణ' అని సంస్కృత భాష యందు వ్రాసి, 'పూర్ణ' అని తెలుగులో వ్రాసిరి. (ఈ కథను భారతి పత్రికలో అచ్చు వేసిరి).
గణపతిముని నిర్యాణము తరువాత గుంటూరు లక్ష్మికాంతము గారు తరచూ భగవాన్ శ్రీ రమణ మహర్షి యొద్దకు వచ్చుచుండెడి వారు.
భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వయముగా లక్ష్మికాంతమును ఆశీర్వదించి, పలు వ్యక్తులను కలిసి నిజ నిర్ధాణము చేసుకొని, ఈ జీవిత చరిత్రను వ్రాయమని ఆదేశించిరి.
ఈ జీవిత చరిత్ర మొదట 1958 లోను, తదుపరి 1964,1998,2001 మరియు 2013 ప్రచురింపబడినది.
(చి.సౌ. శ్రీలక్ష్మి సౌజన్యతతో....)

Saturday, October 14, 2017

వేంకటేశ్వరా!



మత్తకోకిల

శ్రీనివాస! రమేశ! వేగమె చేదుకో గదె శ్రీకరా!
కానివారమ? పల్కవేలర? కాస్త చూడు దయాకరా!
మానుగా కడగంటి చూపుల మమ్ము జూచిన చాలురా!
శ్రీనిధానమ! వేంకటేశ్వర! చింత లెల్లను దీరురా.

వాడు వీడని లేక కొండకు వచ్చు వారల నెల్లరన్
తోడు నీడయి కాతువంచును దూరభారము లెంచకన్
పాడుకొంచు పవిత్రనామము బాలవృద్ధులు సైతమున్
వేడ నీపదమంటి వత్తురు వేంకటేశ్వర! చూడరా.

Thursday, October 12, 2017

సమస్యా పూరణము

సా నిన్ గొల్చినవారి కబ్బును గదా సౌశీల్యసౌభాగ్యముల్.

***

రానీ యందురు నీ ఘుమంఘుమకు నీరై నోట సన్యాసులున్
పొనీ యందురు జిహ్వ ధన్యమని నీ పొందొందినన్ వృద్ధులున్ 
కానీ యందురు పిన్నపెద్ద లిక చంకల్ కొట్టుకొం చో సమో 
సా! నిన్ గొల్చినవారి కబ్బును గదా సౌశీల్యసౌభాగ్యముల్.

Saturday, October 7, 2017

శ్రీ వేంకటేశా



శా.
వైకుంఠమ్మును వీడి భక్త తతిపై వాత్సల్య మేపారగా
రాకాపూర్ణశశాంకసుందరముఖా లక్ష్మీశ పద్మప్రియా
లోకేశా తిరువేంకటాచలము భూలోకంపు వైకుంఠమై
వీకన్ బొందెడు రీతి నిల్చితివి నీవే వేంకటేశుండవై
నీ కన్నన్ కరుణాసముద్రు నిలలో నే జూతునే కన్నులన్
మా కామాది షడూర్ములన్ చెనకవే మాకీయవే సద్గతుల్. 

Thursday, October 5, 2017

నేడు వాల్మీకి మహర్షి జయంతి



ఆ యాది కవి చేసె నఖిల జగమ్ముల
.....నీ యాదికవిది రామాయణమ్ము
వేదాల రాశిని వెలికి దీసెను బ్రహ్మ
.....వేదసార మితడు వెలయ జేసె
చతురాస్యు డాయన చతురుడీయన చూడ
.....పువ్వులో నతడాయె పుట్ట నితడు
లోకాలకు విధాత లోకేశుని సుతుండు
.....శ్లోకాలకు విధాత చూడ ఋషియె

నలువ సృష్టిని లోపాలు కలుగ వచ్చు
దొసగులను మాపి పూర్ణత్వ మెసగ జేసి
కవి జగమ్ముల కందము కలుగ జేయు
ఆదిజున కాదికవికి నభేద మెన్న.

Wednesday, October 4, 2017

కన్ను చెవి ముక్కు నోరు,,,పదాలతో అన్యార్థం లో రామాయణ పరమైన పద్య రచన

కన్నులవిలుకాడు చిన్నవోవడె వీని
.....సౌందర్యమును గని సత్య మిదియ!
ముక్కుటమును దాల్చి మునివోలె గన్పట్టు
.....దాగునే వీని యందమ్ము దాన?
చెవిచేసుకొననైతి చిత్ర మెందుండెనో
.....యిన్నినాళ్ళుగ నిట్టి వన్నెకాడు?
నోరుకాచగ నింక నోపలే నిపుడె నా
.....వాంఛను ప్రకటించి వాలిపోదు

నితని బాహువు లందున వెత యడంగు
ననుచు రాముని గని శూర్పణఖ మది చెడి
కన్ను చెవి ముక్కు నోరుగా కాయమెల్ల
నందముగ మార్చుకొని వన్నెలాడి యాయె.

కన్నులవిలుకాడు: మన్మథుడు
ముక్కుటము: నారచీర
చేవిచేసుకొను: తెలిసికొను
నోరుకాచు: రహస్యముగా దాచు

Sunday, October 1, 2017

దేవీ మహిమ్న స్తోత్రం - 10




శ్రీ దూర్వాస మహర్షి విరచిత దేవీ (త్రిపురా) మహిమ్న స్తోత్రము నుండి:
వివరణ - బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు

***

గేహం నాకతి గర్వితః ప్రణతతి స్త్రీసంగమో మోక్షతి
ద్వేషీ మిత్రతి పాతకం సుకృతతి క్ష్మావల్లభో దాసతి
మృత్యుర్వైద్యతి దూషణం సుగుణతి త్వత్పాద సంసేవనా
త్త్వాం వందే భవభీతిభంజనకరీం గౌరీం గిరీశప్రియాం.

***

అమ్మా సంసార భయాన్ని పటాపంచలు చేసే గౌరీ! గిరీశుని ప్రియ పత్నీ! నీ పాదసేవలో నిత్యం తరించే వానికి ఇల్లే స్వర్గం అవుతుంది అంటే అనుకూలవతియైన భార్య, యోగ్యులైన సంతానము మొదలైనవి కలుగుతాయి . గర్వితుడైన వాడు నమస్కరిస్తాడు. స్త్రీసంగమమే మోక్షం అవుతుంది. అంటే గృహస్థ జీవితంలో ఉండి కూడా మోక్షానికి అర్హుడవుతాడు. ఎప్పుడూ ద్వేషించే వాడు స్నేహితుడైపోతాడు. చేసిన పాపము లన్నీ సుకృతము లైపోతాయి. అంటే నీ భక్తుడు కాక మునుపు చేసిన పాపము లన్నీ నశిస్తాయి. పాపవాసనలన్నీ తొలగిపోతాయి.  చక్రవర్తి దాసుడై సేవ చేస్తాడు. మృత్యువు వైద్యుడై రక్షిస్తుంది. అంటే అపమృత్యు భయం ఉండదు. దూషణములే  భూషణము లవుతాయి. ఇంకేమి కావాలి మానవునకు?

విశెషార్థం:

అమ్మా నీ భక్తుడైన వాడికి ఇల్లైనా ఒకటే స్వర్గమైనా ఒకటే. గర్విష్ఠుడు ఎదురైనా వినమ్రు డెదురైనా ఒకటే. భార్యతో సహజీవనం చేస్తున్నప్పటికీ మోక్షానికి అర్హుడై ఉంటాడు. ద్వేషించే వాడైనా మిత్రుడైనా ఒకలాగనే ఉంటాడు. పాప పుణ్యాలకు అతీతుడై ఉంటాడు. రాజును సేవకుడినీ ఒకే దృష్టితో చూస్తాడు. మృత్యువుకు భయపడడు. దూషణ భూషణములను ఒకటిగానే భావిస్తాడు.  సమశ్శత్రౌచ మిత్రేచ తథా మానావమానయోః శీతోష్ణ సుఖదుఃఖేషు " సమస్సంగ వివర్జితః తుల్య నిందా స్తుతి ర్మౌనిః సంతుష్టో యేన కేన చిత్ అనికేచ స్థిరమతిః  భక్తిమాన్ యః సమేంద్రియః "( గీతా వాక్యం ).  అలాగ ద్వంద్వాలకు అతీతుడై తరించిపోతాడు. ద్వంద్వాతీతో విమత్సరః.

అమ్మ ఆరాధన పరిపూర్ణత్వాన్ని ఇస్తుంది.


***
గృహము స్వర్గమ్మౌను కేల్మోడ్చు గర్విష్ఠి  
.....ముదితను పొందుట మోక్ష మగును
ద్వేషి మిత్రుడగును వృజినము సుకృతమౌ
.....పృథ్వీశుడు భజించు భృత్యుని వలె
మృత్యువు వైద్యుడై మేల్జేయు స్వయముగా
.....దూషణ లెల్లను భూష లగును
నీ పాద పద్మంపు నిరత సంసేవనా
.....సక్తుడై తరియించు భక్తమణికి

నింక కొఱత యేమి యిహమైన పరమైన
నండ నెపుడు నీవె యుండ గౌరి!
భవము వలన కలుగు భయమును హరియించు
గట్టువిల్తుని ప్రియ కాంత! నతులు.