padyam-hrudyam

kavitvam

Friday, March 4, 2011

రామ తారక శతకము 12

56 . మాయల వాడవే మాయలన్నియు జూప - జలధులన్నియు మాయ జనులు మాయ
సూర్యుండు నీ మాయ చుక్కలు నీ మాయ - యింద్రుండు మాయ చంద్రుండు మాయ
మెరయు నగ్నియును మేఘంబులును నీ మాయ - యురుములు నీ మాయ మెరుపు మాయ
వర్ష ధారలు మాయ వాన కాలము మాయ - చలి కాలమును మాయ చలియు మాయ

యిట్టి మాయలు గట్టిగా నుర్వి నిలిచి - జనులకెల్లను గర్వము కలుగ జేసి
జగతి నడుపుదు వీరీతి శాశ్వతముగ - రామ! తారక! దశరథ రాజ తనయ!

57 . నీట మీనములోన నీచ వృత్తిని జొచ్చి - సోమకు జంపిన సుభగ రామ
తలలేని వాడవై తగ కొండ మోసిన - పతిత పావన బిరుదు పద్మనాభ
మిట్ట రోమంబుల మేదిని మూతితో - ద్రొబ్బుచు విహరించు దుష్ట హరణ
సగము సిమ్గంబవై జగదపకారుని - యుదరంబు భేదించు నురగ శయన
తిరిపెపు వాడవై మురియుచు గొడ్లంట - తిరుగుచు హాలివై తివిరి గొల్ల

తనువు గైకొని వ్రతముల తొలగ జేసి - గణుతి కెక్కిన శతకోటి కోటి మదన
మోహనాంగ దయానిధీ ముద్దులయ్య - రామ! తారక! దశరథ రాజ తనయ!

58 . కేశవదేవుని కీర్తనానలము చే - కలుషాటవుల నెల్ల గాల్చవచ్చు
వాసుదేవ స్మరణ వారధి చే భవ - వార్థి దాటగ వచ్చు వసుధ లోన
శ్రీ రామ దేవుని చింతన జేసితే - పాప సంఘముల భంజింప వచ్చు
పద్మనాభ స్తోత్ర భవ్య కుఠారిచే - దురిత వనాటుల ద్రుంచ వచ్చు

గాన కుమతులు మిమ్ముల గానలేక - వెర్రి త్రోవల బోదురు వెరపు లేక
తలచి సేవించు వారికి కలదు పదవి - రామ! తారక! దశరథ రాజ తనయ!

59 . మహిలోన పొట్టకై మానవ హీనుని - వెంటనే దిరుగుచు వెర్రి బట్టి
నటువలె రాక్షసి యంటిన కైవడి - గ్రహము బట్టిన రీతి కష్ట మతిని
అడుగబోయిన వారలదలించి పొమ్మన్న - గద్దించి తలవంచి కళ్ల నీళ్ళు
గ్రుక్కుచు మదిలోన సొక్కుచు నటు మీద - నిను జేరు కొందురు నిజముగాను

దీన జన మందిరాంగణ దేవ భూజ - వెనుక కడ తేర జూతురు వేడ్క మీర
అట్టి నిన్నును సేవింతు నహ రహమ్ము - రామ! తారక! దశరథ రాజ తనయ!

60 . ఎందుల కేగిన నే పని జేసిన - చలమున నైనను చనువు నైన
బంగారు పని నైన శృంగారముల నైన - సుద్దుల నైనను ముద్దు నైన
యాత్రల నైనను రాత్రుల నైనను - నుపవాసములనైన నుబ్బి యైన
జపముల నైనను తపముల నైనను - కలుగదు మీ దివ్య ఘన పదంబు

భక్తి జే నిన్ను దలచిన భాగ్యవంతు - లిందు నందును వేడుక తోడ నుండి
ప్రబలుదురు గాన ననువుగా పంకజాక్ష - రామ! తారక! దశరథ రాజ తనయ!

No comments: