padyam-hrudyam

kavitvam

Saturday, July 22, 2017

పురోహితుడు

పురము హితమును కోరెడు పుణ్యమూర్తి
మనకు మాధవునకు గూర్చు మధ్యవర్తి
సకల వైదిక కర్మల చక్రవర్తి
మన పురోహితు మన్నించ మనకు కీర్తి.

Sunday, July 16, 2017

భవదావ సుధావృష్టి

భవదావ సుధా వృష్టి: పాపారణ్య దవానలా 
దౌర్భాగ్య తూలవాతూల జరాధ్వాంత రవి ప్రభా
భాగ్యాబ్ధి చంద్రికా భక్త చిత్త కేకి ఘనా ఘనా 
రోగపర్వత దమ్భోళిర్ మృత్యుదారు కుఠారికా

***

భవ మను కారగ్గి  పైన సుధల వాన
.....కలుషంపు టడవిని కారు చిచ్చు 
దుర్భాగ్య మనియెడు దూదికి సుడిగాలి
.....వృద్ధాప్య తిమిరాన వెలుగుల రవి 
భాగ్య సముద్రాన ప్రభవించు వెన్నెల
....భక్తచిత్తమయూర వారిధరము  
వ్యాధిపర్వతమును బాధించు వజ్రము 
.....చావు కొయ్యను జీల్చు స్వధితి యెన్న

సర్వసంపత్ప్రదాత్రి సౌజన్యనేత్రి
మందహాసోజ్జ్వలాధర మహితవదన  
అరుణకరుణాతరంగితవరుణచరణ
లలిత శ్రీపాదరజము కల్యాణదమ్ము.

 



  

Sunday, July 9, 2017

శుకునకు తండ్రియు సంయమి
యకలంకుడునుం బరాశరాత్మజుడును శ
క్తికి పౌత్రుడును వసిష్ట
ర్షికి నప్తుడు నైన వ్యాసు నెంతును మదిలో.
వ్యాసుడు సాక్షాద్విష్ణువు
వ్యాసుని రూపమున నున్న హరిని దలంతున్
వ్యాసుడు బ్రాహ్మీభూతుడు
వ్యాసునిగా ధరకు దిగిన వాణిని గొలుతున్.
సాత్యవతేయుని గృష్ణుని
సత్యవ్రతు వేదవిదుని సంయమి ననఘున్
నిత్యుని పారాశర్యుని
నత్యంతము భక్తి దలతు నాదర మొప్పన్.
ఆదిని ప్రోవైె వెలసిన
వేదములను చిక్కుదీసి విభజించిన యా
మేధకు పారాశరునకు
వేదవ్యాసునకు జేతు వేడ్కను ప్రణతుల్.
వేదములను విభజించియు
మోదముతో బ్రహ్మసూత్రముల నిచ్చియు న
ష్టాదశపురాణముల నిడి
యైదవ వేదంపు కర్తయౌ ఘను నెంతున్.

భాసుని వేదవాఙ్మయ విభాసుని పంచమవేదదివ్య సం
న్యాసుని కౌరవాన్వయ ప్రయాసుని సుందరనీలమేఘ సం
భాసుని పూర్ణచంద్రరుచిభవ్య విహాసుని శ్రీహరీతపో
భ్యాసుని సంయమీశుని ప్రభాసుని వ్యాసుని సంస్మరించెదన్.