padyam-hrudyam

kavitvam

Thursday, March 3, 2011

రామ తారక శతకము 11

51 . చెడిపోక నామాట చిత్త మందున్చుడీ - దేవదేవుని మహా దేవు జపము
నియమంబు తో నైన నేర్పు తో నైనను - భయముతో నైనను భక్తి నైన
శక్తి తో నైనను యుక్తితో నైనను - శాంతమ్ముతో నైన సరసమైన
రాకపోకల నైన రమ్యంబుగా నైన - నాట పాటల నైన నలసి యైన

సొక్కి యైనను సొమ్మ సిల్లైన గాని - ఒంటినైనను గుంపుగూడైన గాని
జేసి కైవల్య మందుడీ సిద్ధము గను - రామ! తారక! దశరథ రాజ తనయ!

52 . శ్రీ జానకీ నాథ శ్రీ రామ గోవింద - వాసుదేవ ముకుంద వారిజాక్ష
శ్రీ రంగ నాయకా శ్రీ వెంకటేశ్వరా - ప్రద్యుమ్న యనిరుద్ధ పంకజాక్ష
శ్రీ రుక్మిణీశ్వరా శ్రీ హృషీకేశ్వరా - నారాయణాచ్యుతా నారసింహ
శ్రీ రమా వల్లభా శ్రీ జగన్నాయకా - శ్రీధరా భూధరా శ్రీనివాస

రామ జయరామ రఘురామ రామ రామ - యనుచు దలచిన నామము లాత్మ యందు
కష్టములు దీర్చి రక్షించు గారవించు - రామ! తారక! దశరథ రాజ తనయ!

53 . కలవాడనా నీవు కన్నుల జూడవు - నీ బంటు బంటును నీరజాక్ష
చెడ్డవాడని నన్ను సరకు జేయ వదేమొ - పతితపావన బిరుదు పద్మనాభ
వీడెవ్వడని నన్ను విడనాడి నొమ్పకు - కరుణా సముద్ర యో కమల నయన
వేరు జేసియు నన్ను వెలితిగా జూడకు - గోపాల భూపాల గొప వేష

ఆది దేవ పరంధామ యవ్యయాత్మ - శ్రీ మనో నాథ శ్రిత పోష శ్రీనివాస
కాచి రక్షించు మిక నన్ను కామ జనక - రామ! తారక! దశరథ రాజ తనయ!

54 . చిన్ని ముద్దుల యన్న చిన్నారి పొన్నారి - సుర భూజమా రార సుందరాంగ
నను గన్నయా నీకు నేనన్యుడను గాను - నవ్వుల సేయకు నాగ శయన
దిక్కు మాలిన నన్ను దేవరవై బ్రోవు - చక్కని నాపాలి చక్ర పాణి
అక్కరతో నన్ను నాదరించుము వేగ - నిక్కంబు నీవాడ నీల వర్ణ

అనుచు వేడితి రక్షించు మరసి నన్ను - నెంత లేదని నీ మది నెంచ వలదు
కరుణ జూడుము నా మీద కామ జనక - రామ! తారక! దశరథ రాజ తనయ!

55 . యెంత నే వేడుదు నెంతని దూరుదు - నెంతని భాషింతు నేమి సేతు
యెంతని చింతింతు నెంతని భావింతు - నెంతని సేవింతు పంత మలర
ఎంతెంతనగ వశమె ఇందిరా రమణ నీ - సచ్చిదానంద సౌందర్య మహిమ
చెప్పను జూడను చెవుల వినంగను - శక్యమెవ్వారికి స్వామి నీదు

వేష భాషల వర్ణింప వేయి నోళ్ళ - శేషునకునైన వశమౌనె శ్రీనివాస
గాన మనుజుండ వర్ణింప నేర నయ్య - రామ! తారక! దశరథ రాజ తనయ!

No comments: