padyam-hrudyam

kavitvam

Sunday, September 25, 2011

చిన్మయ రూపిణీ !


పోదురు భార్య, బిడ్డలును, పోదురు బంధు సహోదరాళియున్
పోదురు సేవకీ జనము, పోవును సంపద, ప్రాణ
మానముల్
పోదుసుమా త్వదీయ పద పూజల గల్గు ఫలమ్మనంతమై!
సాధు జనావనీ! శరణు శంకరి! చిన్మయ రూపిణీ ! ఉమా!

Friday, September 16, 2011

చిన్మయ రూపిణీ !


నశ్వరమైన సంపదల నమ్మి కృశించి నశించు మానవుల్
శాశ్వతమైన నీ చరణ సన్నిధి జేరి సుఖింప నేర్తురే?
విశ్వసనీయ సత్యములు వీనుల కెక్కునె చేటు కాలమం-
దీశ్వరి! లోకమాత! పరమేశ్వరి! చిన్మయ రూపిణీ! పరా!

Friday, September 9, 2011

చిన్మయ రూపిణీ !


కౌమారీ యవతారివై నలువకున్ కన్విన్దువై! వాణివై!
శ్రీమంతుండగు పద్మనాభు నెడదన్ క్రీడించు శ్రీ దేవివై!
కామారీ తను తాప హారిణివియై! కాత్యాయనీ రూపివై !
రామా! చిన్మయ రూపిణీ! రసధునీ! రంజిల్లవే నిత్యమున్!

Monday, September 5, 2011

గురుర్బ్రహ్మా.......


మనసా వాచా కర్మణా విద్యా బోధనకే జీవితము
నంకితము జేసిన ఉపాధ్యాయులకు నమోవాకములు.


గురువన నాదిజుడౌ ధర
గురువే హరి గురువు శివుడు గురువే సాక్షా-
త్పర తత్త్వమైన బ్రహ్మము
గురువుకు వందనము లిడుదు గురుతర భక్తిన్.

అజ్ఞానపు చీకట్లను
సుజ్ఞానపు ప్రభల జీల్చి శూన్యము చేయున్
విజ్ఞానము బోధించును
ప్రజ్ఞా మూర్తులుగ గురువు ప్రజలను దిద్దున్.

విద్యా బుద్ధుల గఱపుచు
హృద్యంబగు నీతి పథము నింపుగ జూపు-
న్నాద్యుండగు దైవంబై
సద్యశమును కల్గజేయు సద్గురువెపుడున్


Thursday, September 1, 2011

చిన్మయ రూపిణీ !


ధర్మ పథమ్ము వీడి, పర తత్త్వ మెఱుంగక, నైహికమ్ములౌ
శర్మపు జాలముం దగిలి, శాశ్వత మీ తనువంచు నెంచి, దు-
ష్కర్మము లాచరించుదురు, కాని, భవాంఘ్రి సరోజ చింత స-
త్కర్మ నొనర్ప బూనరు గదా ప్రజ! చిన్మయ రూపిణీ ! కటా!