padyam-hrudyam

kavitvam

Sunday, March 30, 2014

స్వాగతమ్ము జయాబ్దమా!


స్వాగతమ్ము జయాబ్దమా! ఘన స్వాగతమ్ము శుభప్రదా!
స్వాగతమ్ము భరద్ధరిత్రికి! స్వాగతమ్ము జయప్రదా!
స్వాగతమ్ము యుగాది! ధాత్రికి స్వాగతమ్ము వసంతమా!
స్వాగతమ్ము తెలుంగునేలకు! శాంతి సౌఖ్యము లీయగా!

కోయిల నింబ మామ్రములు గుప్పున తావుల జల్లు మల్లియల్ 
హాయిని గూర్చు  మారుతపు టల్లన మెల్లన సాగు వీచికల్  
సోయగ మొప్పు క్రొన్ననలు చూపుల దోచెడి పుష్ప వర్ణముల్ 
వేయి శుభమ్ము లిచ్చెడిని వేడ్క వసంత యుగాది వేళలో!

వగరు వాసనలతో పొగరైన నింబపు 
...........చినిచిన్ని పువ్వుల చెలగ దెచ్చి 
జీడి వాసన లూరు చిట్టి మామిడి పిందె 
...........ముక్కల దగిలించి మోదమలర
చెరకు గడను దెచ్చి చెక్కును తొలగించి 
...........సన్నని ముక్కల కొన్ని జేర్చి 
క్రొత్తగా పండిన కొమరైన తింత్రిణీ 
...........ఫలవిశేషము కాస్త  పదిలపరచి  

క్రొత్త బెల్లపు తీపిని కొంత గలపి 
యుప్పు చిలికించి మెదిపిన గొప్ప రుచులు
చేదు తీపియు పులుపును చెంత వగరు 
శుభ యుగాదిని  పచ్చడి విభవ మలరు!

జయమగు గాక ధారుణికి, చల్లగ దప్పిక దీర్చు నీటికిన్! 
జయమగు గాక నగ్నికిని, సన్నగ మెల్లగ వీచు గాలికిన్! 
జయమగుగాక మింటికిని, సర్వ చరాచర ప్రాణికోటికిన్! 
జయమగుగాక సద్ద్విమల సజ్జనకోటుల కీ జయమ్మునన్!  

Monday, March 24, 2014

పూర్ణేందు వదన.........


పూర్ణేందు బింబమ్ము పొలతి! సిగ్గిలి దాగె
...........నీ ముఖ బింబపు నిగ్గు జూచి
నల్లని మబ్బులు చల్లగా జారెను
..........నీలాలకల గాంచి నీల వేణి !
తెల్లని వెన్నెల తెలతెల వోయెను
..........చిరునవ్వు కాంతికి చిగురు బోడి!
కువలయ దళములు కుంచించుకొని పోయె
..........నేత్రాల సొంపుకు నీరజాక్షి !

పసిడి జలతారు వస్త్రంపు మిసిమి హెచ్చె
నీవు ధరియించుటను జేసి నెనరుబోడి!
పుస్తకము ధన్యమాయెను పూవుబోడి !
రమ్య హస్తాబ్జ యుగ్మమలంకరించి !

*********************************************

ఇనబింబ మల్లదే కనుమరుగాయె నో 
......విరిబోడి!తిల్కమ్ము నరసి నొసట
రాకేందు బింబమ్ము రాకుండె మింటికి
......చంద్రాస్య! నిన్గని సంశయమున
కమలాలు గనుమదే గమ్మున ముకుళించె
......కమలాక్షి! నినుజూచి కమిలిపోయి
దరహాస రుచులకు తత్తరపడి పోయి
......స్మితముఖీ! మల్లెలు సిగను దాగె

పసిడి వన్నెల జలతారు పట్టు చీర
మించి మెరసె నీవది ధరి యించ లలన!
పొత్త మల్లదే ముదమున పొంగి పోయె
నీదు కరకమలమ్ముల నిగ్గుదేలి.

Monday, March 17, 2014

వసంతోత్సవం..........




గోకులమ్ము లోన నాడు గోపబాలు రందరున్ 
వేకువన్ యశోదపట్టి వెంటనంటి వీధులన్ 
చీకు చింత మరచి యాడ చేరి రంగులాటలన్ 
నాక వాసు లరగి నారు నంద వ్రజము జూడగన్.

రంగురంగు పూల తోడ రమ్యమైన వనులలో 
హంగుగాను రంగులెల్ల నలదుకొనుచు నొండొరుల్ 
నింగి నేల జేసినారు నెలవు వర్ణశోభలన్ 
పొంగె యమున పట్టలేక, ప్రొద్దు వాలె నంతలో 

బాలకృష్ణు డాన్చ వేణు వల్ల నల్ల నోష్ఠమున్ 
జాలు వారె పాట మంద్రజాల మహిమ జూపుచున్ 
గాలి నింగి నీరు నేల కమ్మనైన పాటకున్ 
సోలి పోయె కరగి పోయె చోద్య మాయె నంతటన్ 

గోపబాలు రాట మరచి గోపబాలు వంకకే 
చూపులన్ని నిలపినారు చుట్టు జేరినారదే 
గోపకాంత లిహము మరచి కూర్మి కృష్ణు డొక్కడే 
తోప వారి వారి చెంత త్రుళ్ళి త్రుళ్ళి యాడిరే 

వేణు గాన లహరి లోన విశ్వవిభుడు సర్వులన్ 
తాను తక్క నన్య మేమి ధరణి లేని రీతిగన్ 
పూని యోల లాడ జేయ పులకరించి రెల్లరున్
ప్రాణికోటి పరవశించె రమ్యవర్ణ శోభలన్ 

'ఏమి జన్మ మిట్టి నాక మేల మాకు నేడహో 
భూమి పైన పుట్టి యున్న పొందుగూడి కృష్ణునిన్ 
మేము గూడ యాడి పాడి మిడిసిపడుదు మయ్యయో
ఏమి భాగ్య ముర్వి జనుల' కిట్లు సురలు వగచిరే

మోహనాంగు రాస లీల ముగ్ధమై రహించగన్ 
దేహ భ్రాంతి వీడి నాడు దివ్య గాన లహరిలో 
నాహ యంచు జీవు లెల్ల నైక్యమై తరించగన్ 
సోహ మన్న భావ మేలె చూడ నుర్వి నంతటన్.

Wednesday, March 12, 2014

భక్తి హరిని గొల్వ బాల్యమ్ము గీల్యమే ..............




బాలుడ నంచు నెంచకుము భక్తిని నీ కొఱకై తపించితిన్ 
మాలిమి జూడవే ధ్రువుని మాధవ! దీనజనావనా! హరీ!
ఏలను రాజ్యభోగము లికేలను సంపద లేల బంధువుల్ ?
చాలదె నీ పదంబు లిడు శాశ్వత దివ్య పదంబు కేశవా!

********************************

బాల్యము నందు నన్ మదిని భావన జేయుచు వీడి లోని దౌ-
ర్బల్యము, సంయమీంద్రులను రాయిడి పెట్టెడి యింద్రియాల చా-
పల్యము త్రొక్కి పట్టి, కడు భక్తి తపంబొనరించినావు కై-
వల్యము గోరి, మెచ్చితి ధ్రువా! పరమార్థము నీకు నిచ్చెదన్.

*********************************
మత్స్యరూపమున సోమకుని ద్రుంచితి వీవు
.......కూర్మమై మోసితి గిరిని నీవు
వారాహరూపివై పైడికంటిని జంపి
.......నరహరి! రాక్షసు నణచి నావు
వామన మూర్తివై బలి గర్వ మడగించి
.......పరశురాముడ వయి బరగినావు
హరిహరీ యని పిలువ నరమరికలు లేక
.......అందరి గాతువో ఆదిపురుష!

నేడు బాలుని గావగా నీలమేఘ-
దేహ! దిగి వచ్చి నావయ్య దివిని వీడి
నన్ను మించిన శ్రీమంతు డెన్న నెవరు
శరణు శరణయ్య శ్రీహరీ! శరణు శరణు!

**********************************

భక్తి హరిని గొల్వ బాల్యమ్ము గీల్యమే
అతని జేరు తపన యంకురింప
దివ్య పదము నిచ్చి దీవించి పంపడే

హరి కరుణకు నెన్న హద్దు గలదె?