padyam-hrudyam

kavitvam

Tuesday, April 9, 2024

ఉగాది 24

సీ. త్యజియించ వాంఛలఁ దపము పండిన రీతి
... నాకు రాలిన చెట్ల ననలు దోచె
నిరుల సంకెలఁ ద్రెంచి యినుఁడైన విధమున
...శిశిరంపు జెఱ వీడి చెలఁగెఁ బ్రకృతి 
కావిపచ్చదనాల కలనేత చీరల
...వగ మావులెఱ్ఱ జొంపముల నొప్పె
శ్రావణమునఁ గ్రొత్త జంట లలరు గతిఁ
...గోయిలల్ జతకట్టఁ గూయ సాఁగె

తే.గీ. సొగసు లారిన దిశలకు వగలు హెచ్చె
మల్లె పొదరిళ్ళ ఘుమఘుమల్ వెల్లు వాయె
కదలి వచ్చెడి ఋతురాజు గద్దె నెక్క 
స్వాగతమ్మని పలుకరో సంతసమున.

ఉ. వచ్చెను నింపగా నవజవమ్మును ధాత్రి వసంతుఁ డల్లదే
మెచ్చి సమస్త జీవములు మించిన శోభలఁ దేజరిల్లెడిన్
జెచ్చెర షడ్రుచుల్ గలిపి చేసిన విందుల నారగించరే
విచ్చిన మానసమ్ములను వేడుక స్వాగత గీతిఁ బాడరే.

ఉ. క్రోధికి స్వాగత మ్మనరె గొప్పలు సెప్పుచు బీదసాద కా
రాధకులమ్ము మే మనుచు రాజ్యరమన్ జెరఁబట్టి సాధులన్ 
బాధలఁ బెట్టు దుష్టజన బాంధవు నింటికి సాగనంపు బెన్ 
గ్రోధముఁ బూనవే జనులఁ గూరిమిఁ జూడవె యంచు వేడరే

.

***

కాలమను దివ్య చక్రానఁ గదలెఁ జూడు
మరొక ఆకు మున్ముందుకు మహిత గతిని
కాల రూపేశునికి భక్తిఁ గేలు మోడ్చి
సలుప వలయును క్రోధికి స్వాగతమ్ము.

Friday, March 8, 2024

శివ శివ అనరాదా 2024


మత్తేభములు

శివనామమ్ము స్మరింపవేమి మనసా! చేఁదాయెనే మూఢ! ఆ 
శివపాదమ్ము సమీపమం దిడవె నీ శీర్షమ్ము భక్తాళువై   
భవపాథోధిఁ దరించు టన్నను మహా బాధాకరంబే కదా 
భవుఁ డన్నన్ గరుణాళు వండ్రు వినవే భావింపవే సర్వదా.

కరుణాళుండు గదా మహేశ్వరుఁడు సత్కల్యాణ సంధాయి శ్రీ 
చరణాబ్జంపుఁ బరాగమన్నఁ బడదా సద్భక్తులం జూడవా 
హర యన్నన్ గరు వెల్లఁ దీరును గదా ఆ మాత్రముం జేయవా 
కరిసర్పమ్ములఁ బుర్వు నేలి దయతోఁ గైవల్య మిచ్చెం గదా!  

మదనారిం గన మానసంబు జనదా మాయం దగుల్కొంటివా 
ముద మౌనా సుత బంధు మిత్ర ధనముల్ మూయించునా కన్నులన్ 
మదిలోఁ గ్రమ్మిన ప్రేమపుం బొరలు నీ మోక్షప్రదాతన్ భవున్ 
ముదమారన్ గన నీయవా తెలివితో మూఢత్వమున్ వీడవా?   

(శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గీతం స్ఫూర్తితో...)



మహాశివరాత్రి 2024


పరమేశ వృత్తము

( పరమేశునకు పంచోపచారములు )

***

లం పృథివీ తత్వాత్మనే గంధం పరికల్పయామి నమః

'అదితి' ప్రకృతి  మహద్యశా! భయనాశా!
హృదు'లం' దెలమి  వసించు హే స్మర నాశా!
పదము ల్విడువను ఛిన్నభానుజపాశా!
ఇదె 'గంధము'ను గ్రహింపుమీ పరమేశా!        1

హం ఆకాశ తత్వాత్మనే పుష్పం పరికల్పయామి నమః 

'గగనం'పు గుణము లింపుగా గల యీశా!
అగజాత హృదయచోర! 'హం'స! మహేశా!
సగ మేన బొదువు కొంటె జాయను  మోద
మ్ముగ నీ కిడుదును  'పుష్పము' ల్పరమేశా!      2

యం వాయు తత్వాత్మనే ధూపం పరికల్పయామి నమః 

'అనిలం'పు గుణ విరాజితా! ఫణిభూషా!
ఘన చారుతర మనోజ్ఞకాంతి సుదేహా!
జనతార్తిహర! జ'యం'త!  శంకర! ధూప
మ్ము'ను మూర్కొను మివె దండము ల్పరమేశా!      3

రం వహ్ని తత్వాత్మనే దీపం పరికల్పయామి నమః 

'అనలం'పు ప్రకృతి శోభితా! నిటలాక్షా!
జన'రం'జన! ప్రమధాది సంవృత! రుద్రా!
గుణిధారి! హర!  త్రినేత్ర! గోఘృత'దీప 
మ్ము'ను జూడుము ప్రణిపాతము ల్పరమేశా !       4

వం అమృత తత్వాత్మనే అమృతనైవేద్యం పరికల్పయామి నమః 

'అమృతా'త్మ! వరసుధాకరాశ్రిత శీర్షా!
హిమ'వం'త సదన  గౌరి హృన్నిలయా! నీ 
వమృతమ్ముగ మది నెంచుమా ఫల  'నైవే 
ద్య'మిదే దయ గొనరావయా! పరమేశా!          5

****

(పరమేశ వృత్తము .. స న జ భ గగ 10 యతి శక్వరి ఛందము 3452 వృత్తము

I I U I I I I U I U I I U U )

Monday, January 22, 2024

రామజన్మభూమి బాలరామ ప్రతిష్ట. 22-1-2024 సోమవారం




సీ. ఐదు శతాబ్దాల అవమాన భారమ్ము
...బాయుట యెపుడని పలవరింత
స్వాతంత్ర్య సిద్ధితో సఫలమౌ నని యెంచ
...మారెను దొర రంగె మరల చింత
సాధుల సంతుల సద్భక్తవర్యుల
...ఘన బలిదానాలు గలచు చింత
పుణ్యభూమిని న్యాయ మూర్తుల రూపాన
...ఫలియించె కల యని పులకరింత

తే.గీ.  బాలరాము డయోధ్యలో భవ్యమైన
మందిరమునందు భారత మాత యొడిని
పరవశించెడి శుభవేళ యరుగుదెంచె
నెంత ధన్యమో మన తర మెంత ఘనమొ.

ఉ. ఎంతటి భాగ్యమో మనది యెన్ని శతాబ్దులొ వేచి చూచినన్
సుంతయు ముందుకుం జరుగు సూచనలే కనుపట్టరాని య
ధ్వాంతము నందు భానుని ప్రభాకర రశ్ముల భాతి రామ భూ
కాంతుని జన్మభూమి చెఱ కాలముచెల్లి తదీయ దివ్యమౌ
ప్రాంతము నందు బాల రఘురాము మనోహర భవ్య దేవళం
బింతలు నింతలై వెలుఁగు లీనుచు నిల్చుట లెంచి చూచినన్
చింతలు దీరె నేటి కిఁక శ్రీ రఘురాముడు భారతావనిన్
వంతలు మాయ నేలుకొను బాయును రాక్షస పీడ జాతికిన్
సంతస మౌను భారత ప్రజావళి కెల్లెడలన్ శుభం బగున్.

తే.గీ. ఔ బలే రోజు బాలరా మాంఘ్రి ధూళి
యంట బులకించె నే డయోధ్యాపురమ్ము
సరయు నుప్పొంగె యెద లోన స్వామిని గని
భరతమాత కానంద బాష్పాలు రాలె.

ఉ. బాలుడె కాని యీ ప్రభువు భారతజాతికి గుండె చప్పుడై
కాల మదెంత మారినను కాపురుషుల్ చెలరేగిపోయినన్
లీలగనైన వీడక ధరిత్రి నయోధ్యను భక్తకోటినిన్
బాలన జేయుచుండు శశిభానులుఁ వెల్గెడు నంత కాలమున్.

కం. వందన మో రఘునందన!
వందన మో బాలరామ! వందన మీశా!
వందన మయోధ్యరామా!
వందన మో జానకీశ! వందనము ప్రభూ!