padyam-hrudyam

kavitvam

Monday, April 11, 2016

వసంతుడు వచ్చేసాడు..

నలుదెసల్ క్రొంగ్రొత్త వెలుగులు నిండగా
...........ధరణికి శోభలు తరలి వచ్చె !
శోభిల్లు ధరణిని జూచిన పవనుండు
...........పరిమళవీచికల్ పంచ దెచ్చె !
పరిమళవీచులు పురికొల్ప పులకలై
...........ముదమున మావిళ్ళు మోసులెత్తె !
మోసులెత్తిన మావి మురిపింప కొమ్మపై
...........కోయిల కమ్మగా కూయసాగె !
కూయసాగిన కోయిల హాయి నీయ
పచ్చచీరను ధరియించె ప్రకృతికాంత!
ప్రకృతికాంతను గని తాను వలచి వచ్చె
చూడు డల్లదే వాసంతు డాడి పాడ!
*** *** ***
దుర్ముఖి యైన నేమి యిక దుర్మతి యైనను నేమి సర్వదా
ధర్మము దప్పకన్, పరుల దండన సేయక, లోకరీతిలో
మర్మము లెన్నుచున్, తగిన మాలిమి నెల్లర జూచుచుండు స-
త్కర్మపథానుగాములకు కాలము నెచ్చెలి కాకపోవునే!

Friday, April 8, 2016

సీతారాముల యుగాది.

నేడు గదా వసంత మది నీరజనేత్ర! త్వదీయ సీతకున్
తోడుగ నిల్చితీవు మది దూరపు తీరములందు నున్న న-
న్వీడక, నీ తలంపుననె వీడని ధైర్యముతో సహించితిన్
వాడు నిశాచరుండు నను బాధల బెట్టిన ప్రాణనాథ! నా
వా డరుదెంచి యీ వెతల వార్నిధి దాటగజేయు నంచు, నీ
నీడను, వీడిపోకు మిక నే మనజాలను జానకీసతిన్.
... .... ....
నేడు గదా యుగాది ధరణీసుత! రాముని జీవనమ్మునన్
నీడగ నిల్చినావు, కడు నెవ్వ సహించితి వీవు కానలన్,
వీడక నా తలంపు మది, వీడక ధైర్యము లంక నొంటివై,
తోడరు దెంచి నీ వెతల దూరము చేయునటంచు కన్నులన్
వీడని కాంతితో చెలగి ప్రేమ పరీక్షకు నిల్చినావు నీ
వాడను వీడ నాన నిను పాణిని బట్టి వచింతు నమ్మవో.