padyam-hrudyam

kavitvam

Wednesday, February 20, 2013

మిత్రుని తో ననె దివ్వె కూర్మి మై .................





దీపము పరమ బ్రహ్మము
దీపపు దీప్తుల్ హరించు తిమిరపు తతులన్
దీపమున సాధ్య మెల్లను
దీపమునకు మ్రొక్క రారె ధీయుతులారా!

భానుడు చింత నొందె  కట! పాపము ధాత్రికి వెల్గు లెట్టులౌ
నేను చనంగ రాత్రి ?యని, నీవిక చింతను వీడు, పోయి రా ! 
నేనిడు దాన కాంతులను నెమ్మది, నీవరుదెంచు దన్క, నా
మే నిల నుండు  దాక యనె మిత్రుని తోడను దివ్వె కూర్మి మై.

Tuesday, February 19, 2013

సరసాహ్లాదిని

 "తల" శబ్దాన్ని శిరస్సు అనే అర్థంలో కాకుండా
నాలుగు పాదాలలో ప్రయోగిస్తూ నచ్చిన ఛందస్సులో
భారతార్థంలో పద్యం వ్రాయాలి.


విదుర వాక్కు:


తలపులనైన పాండవులు తప్పరు సత్యము ధర్మ మార్గమున్
తలపులనైన వారలకు తప్పగు కీడును సేయ నీచమౌ
తలపుల కర్ణుడాదులును తప్పుడు బోధలు చేయ దుష్టమౌ
తలపుల నీ కుమారుడదె తప్పెను ధర్మము కౌరవేశ్వరా!

Saturday, February 16, 2013

నమో భగవతే సూర్యాయ






మానవాళికి మేల్జేయ భాను డదియె
తూర్పు కొండల పైనెక్కి తొంగి జూచె
గెల్చి మందేహ దైత్యుల దాల్చె నతడు
మంచి సిందూర రుచి తాను మించ నింగి.

Thursday, February 14, 2013

::గుమ్ముగ కమ్మని దోసె ......... ..............




ఘుమ ఘుమ లాడుచుండె నిట గుమ్ముగ కమ్మని దోసె వారెవా
గమకము హెచ్చె జిహ్వకిక గమ్మున ముంచుక పుల్సు లోన నే
నమిలెద పచ్చడిన్ రసన నచ్చిన రీతిని నంజుకొంచు నౌ
తమరిక కట్టిబెట్టి పని  తాళుడు మీకును దోసె వచ్చెడున్ .

Tuesday, February 12, 2013

సరసాహ్లాదిని

సమస్య:

భూతములకు మ్రొక్కెఁ బురహరుండు.
=========================

పూరణ:
యాతుధాన యోధు యమపురి కంపించి
సీత చెరను బాప శ్రీ రఘుపతి
మోదమాయె భువిని మునులకును సకల
భూతములకు, మ్రొక్కె బురహరుండు.

Saturday, February 9, 2013

అగ్ని కాల్చ కుండునే తను దాకిన.....











బాల్య చాపల్యమున కుంతి భాను జూచి
మంత్ర పఠనమ్ము జేసెను మాలి వేడి
యర్కు డల్లదె దిగివచ్చె నామె యెదుట
పండు వెన్నెల గాసెను పట్టపగలు.

మ్రాన్పడె మిత్రుండెదురుగ
కన్పడగా కుంతి యపుడు కలవరమై తా
పాన్పున దిగ్గున లేచెను
తన్పగ నా కన్య నంత తపనుడు పలికెన్.

తరుణీ! వచ్చితి నీకిడ
వరపుత్రుని స్వీకరింపు బాలుని యనుచున్
కరముల నుంచగ బిడ్డను
పరితాపము తోడ కుంతి పలికెను రవితో.

అయ్యో !భాస్కర! న్యాయమె
చెయ్యగ నే చిన్న తప్పు చినతన వాంఛన్
చయ్యన బిడ్డ నిడన్ మా
యయ్యకు నాకునపకీర్తి యౌ గాదె కటా.

ముని వాక్కు లగునె యనృతము
చనియెను నీ కన్యతనము సడలదనుచునా
యిను డగ్ని కాల్చ కుండునె
తను దాకిన తెలియదనుచు ధరణిని వింటే.