padyam-hrudyam

kavitvam

Sunday, August 31, 2014

పాపం వినాయకుడు!




చవితి పండుగంచు సంబర మేపార
నెలుక నెక్కి భువికి నేగు దెంచె
భక్తకోటి జరుపు పందిళ్ళలో పూజ 
వైభవమ్ము గన మదేభ ముఖుడు.

సినిమాల పాటలు చెవుల చిల్లులు చేయ
........... గుండె లదిరి పోయె కొన్ని చోట్ల!
డ్యాన్సు బేబీ యంచు డాబుగా నాట్యాలు
........... కురుచ దుస్తుల దాల్చి కొన్ని చోట్ల!
మోటారు బైకుపై మోడరన్ డ్రస్సులో
........... గొప్పగా తన బొమ్మ కొన్ని చోట్ల!
అదిరేటి ఎత్తులో నంతంత లడ్డుతో
........... గుంపుగా వేలాలు కొన్ని చోట్ల!

ఇంతలో పెద్ద గుంపొక టేగు దెంచె
కరకు శబ్దాల డబ్బాలు గలగలమన
చేతులను రంగు చీట్లతో చిత్రముగను
చవితి చందాల నిమ్మని స్వామి కడకు.

విస్తు బోయి " మీరు మస్తుగా పూజించు
విఘ్న నాయకుడను వినరె మీరు
స్వామి నంచు నన్ను ప్రేమతో కొలువక
ధనము నడుగ తగునె? " తాననియెను.

స్వామివైన నేమి ? సన్న్యాసి వౌ నేమి ?
ముందు డబ్బులిచ్చి ముందుకు నడు
మింత యట్టహాస మేరీతి జరిగెడి
నెవడి యబ్బ సొమ్ము లిమ్మ " నగను .

నాదు పేరున నీరీతి మేదిని పయి
నిన్ని దారుణా లగుచుండె నన్న మాట !
దంతమును పీకి వీరి నంతమును జేయ
నేక దంతుడ నైతినే యేమి చేతు ?

చేయు దారి లేక చిన్నబుచ్చుక స్వామి
రమ్ము మూషికమ్మ రయము గాను
వెనుక కేగి పోద మని పల్కి వెంటనే
మాయ మయ్యె నయ్యొ మహిని వీడి.

Tuesday, August 26, 2014

ప్రణయ విభు పాలికి జేర్చవే............



చిక్కని పట్టు పావడయు చెన్నగు రైకయు నోణి కంఠమం 
దొక్క సరమ్ము కర్ణముల నూగెడు లోలకులున్ కరమ్ములన్ 
చెక్కుడు గాజు లల్కలను చిన్ని సుమమ్ముల మాల చూడగా 
నిక్కముగా తెలుంగవికి నిండు దనమ్మిడు కన్య యీమెయే.

గణపతి ప్రాంగణ మందున 
నణకువగా కూరుచుండి యల్లుచు నతి తో-
షణమున పూమాలను ప్రా-
ర్థన జేసెడి నట్లు తోచు తన మదిలోనన్.

గణపతి! భక్తి తో నిడుదు కంఠము నందున పూలమాల నీ
ప్రణవపు తుండమున్ కదిపి భాసుర లీలను నా శిరస్సు పై
నణచుచు నాదు దోసముల నాశిషముల్ దయసేసి వేగ నా
ప్రణయ విభున్ పరేతరుని పాలికి జేర్చవె ధన్యనై మనన్.

(తెలుంగు+అవి = తెలుగుల లోగిలి)

Monday, August 18, 2014

పూతన వధ




వస్తున్నది పూతన పా-
లిస్తానని నాకు చూడు లీలగ నే చం-
పేస్తానని నవ్వుకొనెను 
వస్తాదా నల్ల పిల్ల వాడుయ్యాల్లో.

ముద్దొస్తున్నా డబ్బో 
పెద్దవి తన కళ్ళు బుల్లి పెదవులు చూస్తే 
వద్దుర నవ్వులు, చేయకు  
సద్దును కుర్రాడ నిన్ను చంపేస్తారా.

ఉండండమ్మా బాబును 
గుండెల కద్దుకొని కాస్త గుక్కెడు పాలీ-
నిండమ్మా బులి బొజ్జకు 
నిండా ముద్దాడి వాణ్ణి నే పోతాగా.

తాగర పీకల మొయ్యా
వేగమె నావిషము నువ్వు విరుచుకు పడరా...................
తాగక మానను కాంతా
బాగా నీ పాల తోటి ప్రాణాల్ కూడా.

ఆగాగు వదలరా నను 
తాగేయకు ప్రాణమోరి  తప్పే బాబోయ్  
నీ గడప తొక్క నింకను 
వేగంగా పారిపోత  వెళిపో నీరా.

నాతో చెలగాటాలా
పాతకి నిన్నొదల నింక ప్రాణాల్ తీస్తా   
నీ తప్పును నే కాస్తే  
ఏ తప్పూ లేని పిల్ల లెల్లా మనడం?

ప్రాణాల్ పోవుట తెలియక 
ప్రాణాలను తీయవచ్చె పరుగున లోక-
ప్రాణేశు కడకు, పూతన  
ప్రాణాలను విడచి పరమ పదమును జేరెన్.