padyam-hrudyam

kavitvam

Friday, March 18, 2016

మా కాశీరామేశ్వర యాత్ర


మేము చాలా రోజులనుంచి కాశీరామేశ్వర యాత్ర చేయాలనీ గయలో పితృకార్యక్రమం చేసుకొని పితౄణ విముక్తుడిని కావాలని సంకల్పించుకొన్నా ఇంతకాలానికి పరమేశ్వరానుగ్రహం కలిగి ఆయన అనుజ్ఞతో ఈ యాత్రను సుఖంగా చేసుకొని రాగలిగినాము. గతంలో కాశీరామేశ్వరాలను సందర్శించుకొన్నా ఈ దృష్టితో యాత్ర చేసే అవకాశం రాలేదు.
ఉత్తరాదిన చలి ఎక్కువగా ఉంటుందని అందరూ అంటున్నా మిత్రులు, పెద్దలు, గురువులు ఏం పర్వాలేదు అక్కడికదే సరిపోతుంది శుభంగా వెళ్ళి రండి అనడంతో బయలు దేరాం. యాత్రాస్పెషల్స్ వారితో వెడితే మరిన్ని ఎక్కువ క్షేత్రాలను సందర్శించుకొనే అవకాశం, ఖర్చు తక్కువ అయే అవకాశం ఉన్నా హడావిడిగా రోజూ పరుగులు పెడుతూ పరిమిత కాలంలో అన్ని క్షేత్రాలను కవర్ చేసుకొనే ధైర్యం లేక మా దంపతులము ఇద్దరమే యాత్రకు బయలుదేరాం.
జనవరి 22 ఉదయం ముందుగా రాజమండ్రి గోదావరిలో స్నానం చేసి అఖండ గౌతమి అనుజ్ఞ తీసుకొని, శివుడిపై భారాన్ని ఉంచి యాత్రకు బయలుదేరి వెళ్ళాము. 22న సాయంత్రం బయల్దేరి విశాఖ ఎక్స్ ప్రెస్ లో విజయవాడ చేరుకొని ఆ రోజు రాత్రి ఒంటిగంటకు భువనేశ్వర్ నుంచి రామేశ్వరం వెళ్ళే రైల్ ఎక్కేము. ముందుగా మా అబ్బాయి కావలసిన రిజర్వేషన్స్ అన్నీ చేయించడంతో ప్రయాణంలో ఎక్కడా అసౌకర్యం కలగలేదు.............

Monday, March 7, 2016

శివకల్యాణం

భూతసంఘమ్ములుభీతిని కల్గింప
.........గిరిబందు లరసిరి కిక్కురనక
తారకాసురునకు దగ్గరపడెనని
.........సురలు మింటను జేరి మురిసిపడిరి
ఒక యింటివాడయ్యె నిక చింతలేదని
.........ప్రమధులు తనిసిరి ప్రభువును గని
వలచిన నాథుని తిలకించి శైలజ
.........తలవంచె సిగ్గుతో తత్తరపడి

పుఱ్ఱె దండల పై వైచె పూలమాల
శివుని కంఠాన పార్వతి శిరము వంచి
తనను గెలిచిన తరుణిని తరచి చూచి
తల్లి దొరకె జగతి కని తలచెశివుడు.

**************************************

పులితోలు మారెను కలికి తాకినయంత
........కనకచేలముగ శంకరుని మేన
సర్పహారమ్ములు చక్కగా సురసాల
........పుష్పదామములాయె పురహరునకు
శవభస్మ చారికల్ క్షణములో పరిమళ
.......చందన చర్చగా జ్వాలి కమరె
చిచ్చర కన్నాయె ముచ్చట గొలిపెడి
.......బొట్టుగా నొసటను భూతపతికి

పార్వతీకరగ్రహణపర్వంపు వేళ
విరియ ముక్కోపి మొగములో చిరునగవులు
అజుడు శ్రీహరి గుసగుస లాడిరంత
నెంత వారలు దాసులే కాంత కనుచు.