padyam-hrudyam

kavitvam

Thursday, October 29, 2015

కారు, లారీ.......భారత రామాయణాలు

కారు - లారి/లారీ - జీపు - వ్యాను
పై పదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో/`రామాయణార్థం'లో
పద్యాన్ని వ్రాయాలి.  

నేను వ్రాసిన పద్యాలు:

భారతార్థంలో
---------------
కారు పాండవులన్యులు కౌరవేశ
లాతి భక్తి నీయెడను గలారిది విను
రాజ్య మిడి చూపు నవ్యానురాగ మందు
చేత వారితో రాజీ పునీత మగును.  

రామాయణార్థంలో
----------------------
కారుమబ్బులరంగు కమనీయగాత్రమ్ము
..........నీరామమూర్తిది నిజము తల్లి!
లేరమ్మ గెల్వగలారీ పృథివిలోన
..........నీనాథు నాజిలో నిజము తల్లి!
ధర్మాచరణమున తలపడు రాజీ పు
..........నీతుడు నీభర్త నిజము తల్లి!
నవ్యానుభూతులౌ నగజధవునకైన
..........నీపతిస్మరణాన నిజము తల్లి!

రాముడెన్న సాక్షాత్తు నారాయణుండు
రావణుని జంపు తథ్యమ్ము రణమునందు
శశిని జేరెడు రోహిణి చందమీవు
చేరెదవు నీవిభు ననె సమీరసుతుడు.

శ్రీ కంది శంకరయ్య మాష్టారి శంకరాభరణం సౌజన్యంతో....

Monday, October 26, 2015

శుష్కప్రియంబులు, శూన్యహస్తంబులు.....

రాజధాని కొఱకు లక్షలు కోట్లగు
ద్రవ్యమిచ్చి వెన్ను తట్టుననుచు
రాయి వేయుడనుచు రాజును పిలువంగ
ముద్దుమాటలాడి ప్రొద్దు బుచ్చె.

ప్యాకేజీ కావలయును
మాకీరాష్ట్రాభివృద్ధి మాటగ నన్నన్
మీకేయని సుందరమగు
ప్యాకింగున మన్ను, నీరు బహుమతినిచ్చెన్.

శుష్కప్రియంబులు, శూన్యహస్తంబులు
.........వేదన తీర్చునా వెగటుకాక
ఎన్నికలప్పుడు మన్నికౌ మాటలు
.........నేరుదాటిన నావ భార మకట
ప్రత్యర్థినోడింప ప్యాకేజిలక్కడ
.........చేయిచాచినచోట మాయమాట
కానివారలకేమొ కంచాలు పైడివి
.........అయినవారల కిట నాకుముక్క

నేత మాత్రమే మారును నీటుగాను
రాజకీయాల బురఖాకు రాదు మార్పు
పాత్ర మాత్రమే మారును పనికిరాని
పాత ద్రవ్యమే అందుండు ప్రజలు! కనుడు.

Wednesday, October 21, 2015

దేవి!

యష్షట్పత్రం కమల ముదితం  తస్య యా కర్ణి కాఖ్యా
యోనిస్తస్యాః  ప్రథిత ముదరే తత్త దోంకార పీఠం
తస్యాప్యంతః కుచభరనతాం కుండలీతి ప్రసిధ్దాం
శ్యామాకారాం సకలజననీం చేతసా చింతయామి.              

{ కాళిదాసు }

********************************************************

శైలపుత్రీ! బ్రహ్మచారిణీ! కూష్మాండ!
.........చంద్రఘంటా
దేవి! స్కందమాత!
కాళరాత్రీ! మహాగౌరి! కాత్యాయనీ!
.........సిద్ధిదాత్రీ! కాళి! సిద్ధలక్ష్మి!
రాజరాజేశ్వరీ! బ్రహ్మాణి! గాయత్రి!
.........మహిషాసురాంతకీ! మాత! బాల!
రాజరాజేశ్వరీ! లలితాత్రిపురసుంద
.........రీ! అన్నపూర్ణేశ్వరీ! శివాని!

శారదా నవరాత్రుల సకల జనని!
నీదు పలురూపముల నెన్ని నిష్ఠతోడ
నర్చనల జేయు భక్తుల కార్తి బాపి
కంటికిన్ రెప్పవై బ్రోచు కన్నతల్లి!



  

Tuesday, October 20, 2015

సిద్ధిదాత్రి



సిద్ధిదాత్రి! చరాచరాత్మక జీవకోటికి ప్రేమతో
సిద్ధులన్ దయచేయు తల్లివి సిద్ధయక్షసురార్చితా!
వృద్ధి జేయవె నీపదాలను విశ్వధారిణి! భక్తి, నా
బుద్ధి  లగ్నము గాగ నీయెడ పొల్పుగా వరమీయవే.

************************************************

సిద్ధగంధర్వయక్షాద్యైః అసురైరమరైరపి ।
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ॥  

దుర్గామాత తొమ్మిదవ శక్తి స్వరూప నామం ‘సిద్ధిదాత్రి’.
సిద్ధిదాత్రి మాత భక్తులకూ, సాధకులకూ ఈ సిద్ధులన్నింటిని ప్రసాదించగలదు. పరమేశ్వరుడు ఈ సర్వ సిద్ధులను దేవి కృపవలననే పొందారని దేవీ పురాణం పేర్కొంటుంది. ఈ సిద్ధిదాత్రి మాత పరమశివునిపై దయ తలచి, ఆయన శరీరంలో అర్ధభాగమై నిలిచింది. కనుక ఆయన అర్ధనారీశ్వరుడుగా వాసికెక్కారు.

 సిద్ధిదాత్రి దేవి చతుర్భుజ. సింహవాహన. ఈ దేవీ స్వరూపం కమలంపై ఆసీనురాలై ఉంటుంది. ఈమె కుడివైపు ఒక చేతిలో చక్రాన్ని దాల్చి ఉంటుంది. మరొక చేతిలో గదను ధరించి ఉంటుంది. ఎడమవైపు ఒక చేతిలో శంఖాన్నీ, మరొక హస్తంలో కమలాన్నీ దాల్చి దర్శనమిస్తుంది.

నవరాత్రి మహోత్సవాల్లో తొమ్మిదవరోజున ఉపాసించబడే దేవీ స్వరూపం ఈమెదే. తొమ్మిదవరోజున శాస్త్రీయ విధి విధానాలతో సంపూర్ణ నిష్ఠతో ఈమెను ఆరాధించేవారికి సకల సిద్ధులూ కరతలామలకం అవుతాయి. సృష్టిలో ఈమెకు అగమ్యమైనది ఏదీ లేదు. ఈ మాత కృపతో ఉపాసకుడికి ఈ బ్రహ్మాండాన్నే జయించే సామర్థ్యం లభిస్తుంది.

సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తుడికి కోరికలేవీ మిగిలి ఉండవు. ఇలాంటి భక్తుడు అన్ని విధాలైన సాంసారిక వాంఛలకు, అవసరాలకు, ఆసక్తులకు అతీతుడవుతాడు. అతడు మానసికంగా భగవతీ దేవి దివ్య లోకంలో విహరిస్తాడు. ఆ దేవీ కృపారసామృతం నిరంతరంగా ఆస్వాదిస్తూ, విషయ భోగ విరక్తుడవుతాడు. అట్టి వారికి భగవతీ దేవి సాన్నిధ్యమే సర్వస్వంగా ఉంటుంది. ఈ పరమ పదాన్ని పొందిన వెంటనే అతనికి ఇతరాలైన ప్రాపంచిక వస్తువుల అవసరం ఏ మాత్రం ఉండదు.

దుర్గామాత చరణ సన్నిధిని చేరటానికై మనం నిరంతరం నియమ నిష్ఠలతో ఆమెను ఉపాసించడమే కర్తవ్యం. భగవతీ మాత స్మరణ, ధ్యాన పూజాదికాల ప్రభావం వల్ల ఈ సంసారం నిస్సారమని మనకు బోధ పడుతుంది. తన్మహత్త్వాన నిజమైన పరమానందదాయకమైన అమృత పథం మనకు ప్రాప్తిస్తుంది.

(తెలుగులో నా భావాలు .......సౌజన్యంతో)   

Monday, October 19, 2015

మహాగౌరి

మహాగౌరీదేవీ! శివహృదయపద్మాసని! శివా!
మహాదేవార్థాంగీ! ధవళతమవర్ష్మా! బహుభుజా!
మహాకైలాసేశీ! శుభవరద! శ్రీమాత! నగజా!
మహేశానీ! గౌరీ! దురితశమనీ! మారజననీ!

***********************************************************

శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః ।
మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవప్రమోదదా ॥

దుర్గామాత యొక్క ఎనిమిదవ స్వరూపానికి ‘మహాగౌరి’ అని పేరు. ఈమె పూర్తిగా గౌరవర్ణశోభిత. ఈమె గౌరవర్ణశోభలు మల్లెపూలూ, శంఖం, చంద్రులను తలపింపజేస్తాయి. ఈమె అష్టవర్షప్రాయముగలది (అష్టవర్షభవేద్గౌరీ). ఈమె ధరించే వస్త్రాలూ, ఆభరణాలూ ధవళ కాంతులను వెదజల్లుతుంటాయి. చతుర్భుజ, సింహవాహన. ఒక కుడిచేత అభయముద్రనూ, మరొక కుడి చేతిలో త్రిశూలాన్నీ వహించి ఉంటుంది. ఒక ఏడమచేతిలో డమరుకమూ, మరొక ఎడమ చేతిలో వరదముద్రనూ కలిగి ఉంటుంది. ఈ ముద్రలలో ఈమె దర్శనం ప్రశాంతంగా ఉంటుంది. పార్వతి అవతారంలో ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి కఠోరమైన తపస్సును ఆచరించింది. వ్రియేఽహం వరదం శంభుం నాన్యం దేవం మహేశ్వరాత్ (నారద పాంచరాత్రము) అనేది ఈమె ప్రతిజ్ఞ. భగవంతుడైన శివుణ్ణి పరిణయమాడటానికే దృఢంగా సంకల్పించుకొన్నట్లు తులసీదాస మహాకవి పేర్కొన్నాడు.

కఠోర తపస్సు కారణాన ఈమె శరీరం పూర్తిగా నలుపెక్కి పోతుంది. ఈమె తపస్సునకు సంతుష్టుడైన శివుడు ప్రసన్నుడై, ఈమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళన గావిస్తారు. తత్ప్రభావంవల్ల ఈమె శ్వేతవర్ణశోభిత అయి విద్యుత్‍కాంతులను విరజిమ్ముతుంటుంది. అప్పటినుండి ఈమె ‘మహాగౌరి’ అని వాసి గాంచింది.

దుర్గా నవరాత్రోత్సవాల్లో ఎనిమిదవ రోజున మహాగౌరి ఉపాసన విధ్యుక్తంగా నిర్వహించబడుతుంది. ఈమె శక్తి అమోఘమూ, సధ్యఃఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషాలన్నీ ప్రక్షాళన చెందుతాయి. వారి పూర్వసంచిత పాపాలన్నీ పూర్తిగా నశిస్తాయి. భవిష్యత్తులో కూడా పాపతాపాలుగానీ, దైన్యదుఃఖాలు కానీ వారి దరిజేరవు. వారు సర్వ విధాలా పునీతులై, అక్షయంగా పుణ్య ఫలాలను పొందుతారు.

మహాగౌరీమాతను ధ్యానించటం, స్మరించటం, పూజించటం, ఆరాధించటం, మున్నగు రీతుల్లో సేవించటం వల్ల భక్తులకు సర్వ విధాలైనట్టి శుభాలు చేకూరుతాయి. . పురాణాలలో ఈమె మహిమలు శతథా ప్రస్తుతించబడ్డాయి. ఈమె సాధకుల మనో వ్యాపారాలను అపమార్గాలనుండి సన్మార్గానికి మరలిస్తుంది. మనం అనన్య భక్తి ప్రపత్తులతో ఈమెకు శరణాగతులమవటం ఎంతో శుభదాయకం.

(తెలుగులో నా భావాలు .......సౌజన్యంతో)

కాళరాత్రి




కాళరాత్రి! మహాభయంకరి! ! కాలికా! కరుణామయీ!
కాలకేశిని! కృష్ణ! కౌశికి! కర్వరీ! ఖరవాహనా!
నీలలోహిత! ఖడ్గధారిణి! నిర్మలా! మదనాశినీ!
ఫాలలోచని! పాపనాశని!  భక్తపాలిని! మాలినీ!

************************************************************

ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరస్థితా ।
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ॥
వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా ।
వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ॥

దుర్గామాత ఏడవ శక్తి ‘కాళరాత్రి’ అనే పేరుతో ఖ్యాతివహించింది. ఈమె శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదరై ఉంటాయి. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. ఈమెకు గల త్రినేత్రాలు బ్రహ్మాండములాగా గుండ్రనివి. వాటినుండి విద్యుత్కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. ఈమె నాసికాశ్వాసప్రశ్వాసలు భయంకరములైన అగ్ని జ్వాలలను వెడలగ్రక్కుతుంటాయి. ఈమె వాహనము గార్ధబము లేదా గాడిద. ఈమె తన ఒక కుడిచేతి వరదముద్ర ద్వారా అందరికీ వరాలను ప్రసాదిస్తుంది. మరోక కుడిచేత అభయముద్రను కలిగి ఉంటుంది. ఒక ఎడమచేతిలో ఇనుపముళ్ళ ఆయుధాన్నీ, మరొక ఎడమచేతిలో ఖడ్గాన్నీ ధరించి ఉంటుంది.

కాళరాత్రి స్వరూపము చూడటానికి మిక్కిలి భయానకమైనప్పటికీ ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలితాలనే ప్రసాదిస్తుంది. అందువలన ఈమెను ‘శుభంకరి’ అని కూడా అంటారు. కాబట్టి భక్తులు ఈమెను చూసి ఏ భయాన్నిగానీ, అందోళననుగానీ పొందనవసరంలేదు.

దుర్గానవరాత్రులలో ఏడవ రోజున కాళరాత్రి మాతను ఉపాసిస్తారు. ఆ రోజు సాధకుని మనస్సు సహస్రార చక్రంలో స్థిరమవుతుంది. అతనికి బ్రహ్మాండములలోని సమస్త సిద్ధులూ కరతలామలకములవుతాయి. ఈ చక్రాన స్థిరపడిన సాధకుడి మనస్సు పూర్తిగా కాళరాత్రి స్వారూపంపైనే స్థిరమవుతుంది. ఈమె సాక్షాత్కారం వలన భక్తునికి మహాపుణ్యము లభిస్తుంది. అతని సమస్త పాపాలు, ఎదురయ్యె విఘ్నాలు పటాపంచలైపోతాయి. అతనికి అక్షయ పుణ్యలోప్రాప్తి కలుగుతుంది.

కాళరాత్రి మాత దుష్టులను అంతమొందిస్తుంది. ఈమెను స్మరించినంత మాత్రానే దానవులూ, దైత్యులూ, రాక్షసులూ, భూతప్రేతపిశాచాలూ భయంతో పారిపోవడం తథ్యం. ఈమె అనుగ్రహంవల్ల గ్రహబాధలు తొలగిపోతాయి. ఈమెను ఉపాసించేవారికి అగ్ని, జలము, జంతువులు మొదలైన వాటి భయం కానీ శత్రువుల భయం కానీ, రాత్రి భయం కానీ – ఏ మాత్రం ఉండవు. ఈమె కృపవల్ల భక్తులు సర్వదా భయవిముక్తులవుతారు.

కాళరాత్రి మాత స్వరూపాన్ని హృదయంలో నిలుపుకొని మనుష్యుడు నిష్ఠతో ఉపాసించాలి. యమ, నియమ సంయమనాలను పూర్తిగా పాటించాలి. త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. ఈ దేవి సర్వశుభంకరి. ఈమెను ఉపాసించే వారికి కలిగే శుభాలు అనంతాలు.

(తెలుగులో నా భావాలు .......సౌజన్యంతో)

Saturday, October 17, 2015

కాత్యాయనీదేవి



కాత్యాయనీదేవి! కాత్యాయనర్షికి
..........కన్న పుత్రిక వీవు కమలనయన!
మహితశక్తులనొంది మహిషాసురుని జంపి
..........మహిని కాపాడిన మాతృమూర్తి!
గోపికా రమణులు గోవిందుపొందుకై
.........పూజించ మెచ్చిన పూర్ణ హృదయ!
అభయ ముద్రను జూపి యార్తజనాళికి
..........భవభయమును బాపు భవ్యశక్తి!

పరమదివ్య స్వరూపిణీ! భయవిదూర!
రోగ శోక వినాశనీ! రుద్రశక్తి!
సింహవాహినీ! కల్యాణి! శ్రీద! శుభద!
శరణు నవరాత్రులన్నీదు చరణరజము.

****************************************

చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా ।
కాత్యాతనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ॥

దుర్గామాత ఆరవ స్వరూపం కాత్యాయని. పూర్వం ‘కత’ అనే పేరుగల ఒక గొప్ప మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు ‘కాత్య’ మహర్షి. ఈ కాత్యగోత్రజుడే విశ్వవిఖ్యాతుడైన ‘కాత్యాయన’ మహర్షి. ఇతడు ‘పరాంబా’ దేవిని ఉపాసిస్తూ, ఎన్నో సంవత్సరాలు కఠినమైన తపస్సును ఆచరించాడు. భగవతీదేవి లేదా దుర్గాదేవి పుత్రికగా తన ఇంట జన్మించాలని అతని కోరిక. భగవతీ మాత ఆయన ప్రార్థనను అంగీకరిస్తుంది. కొంతకాలం తరువాత ‘మహిషాసురుడు’ అనే రాక్షసుని అత్యాచారాలతో భూలోకం పెచ్చరిల్లిపోతుంది. ఈ మహిషాసురుని సంహరించడానికై బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తమ తేజస్సుల అంశలతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్ట మొదట కాత్యాయన మహర్షి ఈమెను పూజిస్తారు. అందువలన ఈమె ‘కాత్యాయని’ అని ప్రసిద్ధికెక్కింది.

ఈమె ‘కాత్యాయన’ మహర్షి ఇంట పుత్రికగా అవతరించిందని మరి ఒక కథ. ఈమె భాద్రపద బహుళ చతుర్దశినాడు జన్మించింది (ఉత్తర భారత పౌర్ణిమాంత పంచాంగ సంప్రదాయమును బట్టి ఇది ఆశ్వీయుజ శుద్ధ చతుర్దశి). ఈమె ఆశ్వీయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథులలో కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించింది.  

కాత్యాయనీదేవి అమోఘఫలదాయిని. కృష్ణుడిని పతిగా పొందటానికి గోకులంలో గోపికలందరూ యమునానదీ తీరాన ఈమెనే పూజించారని భాగవతం చెబుతుంది. ఈమె గోకులానికి అధిష్ఠాత్రిగా వెలిసినది. ఈమె స్వరూపము దివ్యమూ, భవ్యమూ. ఈమె శరీరకాంతి బంగారు వన్నెతో తళతళ మెరుస్తూ ఉంటుంది. ఈమె నాలుగు భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది. ఈమె కుడిచేతులలో ఒకటి అభయముద్రనూ, మరొకటి వరదముద్రనూ కలిగి ఉంటుంది. ఈమె ఒక ఎడమ చేతిలో ఖడ్గమూ, మరొక ఎడమ చేతిలో పద్మమూ శోభిల్లుతూ ఉంటాయి. సింహవాహన.
 
దుర్గా నవ రాత్రులలో ఆరవరోజున కాత్యాయనీ స్వరూపం పూజింపబడుతుంది. ఆ దినాన సాధకుడి మనస్సు ఆజ్ఞా చక్రంలో స్థిరమవుతుంది. ఈ దేవిని భక్తితో సేవించిన వారికి ధర్మ, అర్థ, కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థముల ఫలములు లభిస్తాయి. . జన్మజన్మాంతరాల పాపాలు నశించటానికి ఈ దేవి ఉపాసనకంటె సులభమైనా, సరళమైన మార్గం మరొకటి లేదు. ఈమెను ఆరాధించేవారు నిరంతరం ఈమె సాన్నిధ్యం నుండీ, పిమ్మట పరమపదప్రాప్తికీ అర్హులవుతారు.

(తెలుగులో నా భావాలు .......సౌజన్యంతో)

Friday, October 16, 2015

స్కందమాత



స్కందమాత! చతుర్భుజా! శివ! సజ్జనావనదీక్షితా!
సుందరీ! భువనేశ్వరీ! పర! శోభనా! సురసేవితా!
స్కందుడాడగ ముద్దులాడుచు చల్లనౌ యొడి జేర్చుకన్
విందుజేతువు భక్తకోటికి వేడుకన్నవరాత్రులన్.

****************************************************

సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా ।
శుభదాఽస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ॥

దుర్గా మాతయొక్క ఐదవస్వరూపము ‘స్కందమాత’ అనే పేరుతో ప్రసిద్ధి గాంచింది. స్కందుడనగా కుమారస్వామి. ఆయనకు ‘కార్తికేయుడు’ అనే మరొక పేరు. స్కందభగవానుడి తల్లి అయినందున దుర్గాదేవి ఐదవ స్వరూపానికి ‘స్కందమాత’ అనే పేరు ప్రసిద్ధమైనది. నవరాత్రి ఉత్సవాలలో ఐదవ రోజున ఈ స్వరూపంలో దుర్గాదేవి ఆరాధించబడుతుంది.

ఈ రోజు సాధకుని మనస్సు విశుద్ధచక్రంలో స్థిరమవుతుంది. ఈమె మూర్తిలో బాలస్కందుడు ఈమె ఒడిలో కూర్చొని ఉంటాడు. స్కందమాత ‘చతుర్భుజ’. తన ఒడిలో చేరి ఉన్న స్కందుడిని తన కుడిచేతితో పట్టుకొని దర్శనమిస్తుంది. మరొక కుడి చేతిని పైకెత్తి పద్మమును ధరించి ఉంటుంది. ఎడమవైపున ఒక హస్తం అభయముద్రలో ఉంటుంది. మరొక కరములో కమలమును కలిగి ఉంటుంది. ఈమె శ్వేతవర్ణ శోభిత. ఈ దేవి కమలాసనంపై విరాజిల్లుతుంటుంది. కనుక ‘పద్మాసన’గా ప్రసిద్ధికెక్కినది. సింహవాహన.

నవరాత్రి ఉత్సవాలలో ఐదవనాటి పూజ ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నది. దాని మహా మాహాత్మ్యం గురించి శాస్త్రాలు వేనోళ్ళ శ్లాఘించాయి. విశుద్ధచక్రంలో స్థిరమైన మనస్సుగల ఉపాసకునికి లౌకిక ధోరణులు, చిత్తవృత్తులూ అంతరిస్తాయి. అతడు విశుద్ధ చైతన్య స్వరూప మార్గంలో పురోగమిస్తాడు. అతని మనస్సు సమస్తమైన లౌకిక సాంసారిక మాయా బంధములనుండి విముక్తిని పొంది, పిదప పద్మాసనంలో ఆసీనయైన స్కందమాత స్వరూపంలో పూర్తిగా కలిసిపోతుంది.

స్కందమాతను ఉపాసించటంవల్ల భక్తుల కోరికలన్నీ నేరవేరుతాయి. ఈ మృత్యులోకంలోనే వారు పరమశాంతిని, సుఖాలనూ అనుభవిస్తారు. వారికొరకై మోక్షద్వారము నిరంతరము తెరచుకొని వుంటుంది. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునికీ చెందుతాయి. ఈ దేవిని ఆరాధించటంలో ఉన్న వైశిష్ట్యము ఇదే!

కాబట్టి మనము ఏకాగ్రతో పవిత్రమైన మనస్సులతో స్కందమాతను శరణుజొచ్చుటకు ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ ఘోర భవసాగరముల దుఃఖమునుండి విముక్తులమై మోక్షమును సులభంగా పొందటానికి ఇంతకుమించిన ఉపాయము మరొకటి లేదు.

(తెలుగులో నా భావాలు .......సౌజన్యంతో)

Thursday, October 15, 2015

కూష్మాండా!



కూష్మాండా! జననీ! జగద్ధితకరీ! ఘోరాఘనిర్మూలినీ!
ఊష్మాదిత్యప్రభాంతరస్థితపదా! యోగీశసంసేవితా!
భీష్మోగ్రాసురసర్వవంశదమనీ! వేదాంతసంచారిణీ!
కూష్మాండప్రియ గొల్తు నీపదములన్ కూర్మిన్ ననున్ బ్రోవవే!

*************************************************************
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ॥
దుర్గామాత నాలుగవ స్వరూప నామము ‘కూష్మాండ’. దరహాసముతో అంటే అవలీలగా బ్రహ్మాండమును సృజించుతుంది కాబట్టి ఈ దేవి ‘కూష్మాండ’ అనే పేరుతో విఖ్యాతి చెందింది.
ఈ జగత్తు సృష్టి జరుగక ముందు అంతటా గాఢాంధకారమే అలముకొని ఉండేది. అప్పుడు ఈ దేవి తన దరహాసమాత్రంతో ఈ బ్రహ్మాండాలను సృజించింది. కాబట్టి ఈ స్వరూపమే ఈ సృష్టికి ఆదిశక్తి. ఈ సృష్టిరచనకు పూర్వము బ్రహ్మాండమునకు అస్తిత్వమే లేదు.

ఈమె సూర్యమండలాంతర్వర్తిని. సూర్యమండలంలో నివసింపగల శక్తిసామర్థ్యములు ఈమెకే గలవు. ఈమ
శరీరకాంతిచ్ఛటలు సూర్యకిరణ ప్రభలలాగా దేదీవ్యమానముగా వెలుగొందుతూ ఉంటాయి.  బ్రహ్మాండములోని అన్ని వస్తువులలో, ప్రాణులలో ఉన్న తేజస్సు కూష్మాండ ఛాయయే.
ఈ స్వరూపము ఎనిమిది భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది. అందువల్లనే ఈమె ‘అష్టభుజాదేవి’ అనే పేరుతో కూడా వాసిగాంచింది. ఈమె ఏడు చేతులలో వరుసగా కండలమూ, ధనుస్సూ, బాణమూ, కమలమూ, అమృతకలశమూ, చక్ర గదలు తేజరిల్లుతూ ఉంటాయి. ఎనిమిదవ చేతిలో సర్వ సిద్ధులనూ, నిధులనూ ప్రసాదించే జపమాల ఉంటుంది. సింహవాహన. సంస్కృతంలో ‘కూష్మాండము’ అంటే గుమ్మడికాయ. కూష్మాండబలి ఈమెకు అత్యంత ప్రీతికరము. ఇందువల్ల కూడా ఈమెను ‘కూష్మాండ’ అని పిలుస్తారు.

నవరాత్రి ఉత్సవాలలో నాల్గవరోజు కూష్మాండాదేవీ స్వరూపమే దుర్గామాత భక్తుల పూజలను అందుకొంటుంది. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములూ, ఆరోగ్యభాగ్యములు వృద్ధి చెందుతాయి. సేవకుల కొద్దిపాటి భక్తికే ఈ దేవి ప్రసన్నురాలవుతుంది. మానవుడు నిర్మల హృదయంతో ఈమెను శరణుజొచ్చిన వెంటనే అతి సులభముగా పరమ పదము ప్రాప్తిస్తుంది.

. మనిషి సహజంగా భవసాగరాన్ని తరించడనికి ఈ తల్లియొక్క ఉపాసన అతి సులభమైన, శ్రేయస్కరమైన మార్గం. మనిషి ఆదివ్యాధులనుండీ సర్వదా విముక్తుడవటానికీ, సుఖసమృద్ధిని పొందటానికీ, ఉన్నతిని పొందటానికీ కూష్మాండా దేవిని ఉపాసించటమనేది రాజమార్గం వంటిది. కాబట్టి లౌకిక, పారలౌకిక ఉన్నతిని కాంక్షించేవారు ఈ దేవీస్వరూపంయొక్క ఉపాసనలో సర్వదా తత్పరులై ఉండాలి.
(తెలుగులో నా భావాలు .......సౌజన్యంతో)  

Wednesday, October 14, 2015

చంద్రఘంట



చంద్రఘంట! చరాచరాత్మక సర్వసృష్టి శుభప్రదా!
చంద్రశేఖరి! శాంతిరూపిణి! స్వర్ణవర్ణసుశోభితా!
చంద్రమౌళిబలార్థశోభిని! సర్వశస్త్రవిశారదా!
ఐంద్రి! నీ నవరాత్రివేళల నమ్మ ! నీకు ప్రణామముల్.

**************************************************************

దుర్గామాతయొక్క మూడవ శక్తి నామము ‘చంద్రఘంట’. నవరాత్రి ఉత్సవాలలో మూడవరోజున ఈమె విగ్రహానికే పూజాపురస్కారాలు జరుగుతాయి. ఈ స్వరూపము మిక్కిలి శాంతిప్రదము, కల్యాణ కారకము. ఈమె తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘాంటాకృతిలో ఉండటంవల్ల ఈమెకు ‘చంద్రఘంట’ అనే పేరు స్థిరపడింది. ఈమె శరీరకాంతి బంగారువన్నెలో మిలమిలలాడుతుటుంది. తన పది చేతులలో – ఖడ్గము మొదలయిన శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించి ఉంటుంది. సర్వదా సమరసన్నాహయై యుద్ధముద్రలో ఉండే దివ్య మంగళ స్వరూపం. ఈమె గంటనుండి వెలువడే భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులైన దుష్టులు గడగడలాడిపోతారు.
ఈ మాత కృపవలన సాధకుని సమస్త పాపాలూ, బాధలూ తొలగిపోతాయి.  ఈమె ఆరాధన సద్యః ఫలదాయకము. ఈమె నిరంతరమూ యుద్దసన్నద్ధురాలై ఉన్నట్లు దర్శనమిస్తుంది కనుక భక్తుల కష్టాలను అతి శీఘ్రముగా నివారిస్తుంది. ఈ సింహవాహనను ఉపాసించేవారు సింహసదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉంటారు. ఈమె ఘాంటానాదము సంతతము భక్తులను భూతప్రేతాది బాధలనుండి కాపాడుతూ ఉంటుంది. ఈమెను సేవించినంతనే శరణాగతుల రక్షణకై అభయఘంట ధ్వనిస్తూ ఉంటుంది.
ఈ దేవీ స్వరూపము దుష్టులను అణచివేయటంలో, హతమార్చుటంలో అను క్షణమూ సన్నద్ధురాలై ఉండునదే; అయినప్పటికీ భక్తులకూ, ఉపాసకులకూ ఈమె స్వరూపము మిక్కిలి సౌమ్యముగానూ, ప్రశాంతముగానూ కనబడుతూ ఉంటుంది. ఈమెను ఆరాధించడంవల్ల సాధకులలో వీరత్వ నిర్భయత్వములతోపాటు సౌమ్యతా, వినమ్రతలు పెంపొందుతుంటాయి. వారి నేత్రాలలోని కాంతులు, ముఖవర్చస్సు, శరీర శోభలు ఇనుమడిస్తూ, సద్గుణములు వృద్ధిచెందుతుంటాయి. వారి కంఠస్వరములలో అలౌకికమైన దివ్యమాధుర్యము రాశిగా ఏర్పడుతుంది. చంద్రఘంటాదేవిని భజించేవారు, ఉపాసించేవారు ఎక్కడికి వెళ్ళినా వారిని దర్శించిన వారందరూ సుఖశాంతులను పొందుతారు. ఇలాంటి ఉత్తమ సాధకుల శరీరాలనుండి దివ్యమూ, ప్రకాశవంతమూ అయిన తేజస్సు బహిర్గతము అవుతూ ఉంటుంది. ఈ దివ్య ప్రక్రియ సామాన్యులదృష్టికి గోచరించదు. కానీ ఉత్తమ సాధకులూ, వారి అనుయాయులు మాత్రము వీటిని గ్రహించి, అనుభూతిని పొందగలరు.
మనము త్రికరణశుద్ధిగా విధ్యుక్తకర్మలను ఆచరిస్తూ, పవిత్రమైన అంతఃకరణ కలిగి చంద్రఘాంటాదేవిని శరణుజొచ్చి, ఆమెను ఉపాసించడానికీ, ఆరాధించడానికీ తత్పరులమై ఉండాలి. అలాంటి ఉపాసన ప్రభావము వల్ల, మనము సమస్త సాంసారిక కష్టములనుండి విముక్తులమై, సహజంగానే పరమపద ప్రాప్తికి అర్హులమవుతాము. నిరంతరమూ ఈ దేవి పవిత్రమూర్తిని ధ్యానిస్తూ మనము సాధనలో అగ్రగణ్యులమవ్వటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దేవి ధ్యానము మనకు ఇహపర లోకాలలో పరమ కల్యాణదాయకమై సద్గతులను ప్రాప్తింపజేస్తుంది.
(తెలుగులో నా భావాలు .......సౌజన్యంతో)  

Tuesday, October 13, 2015

బ్రహ్మచారిణి



బ్రహ్మచారిణి! నిత్యతోషిణి! రమ్యభాషిణి! రంజనీ!
బ్రహ్మరూపిణి! ధర్మచారిణి! బంధమోచని! పార్వతీ!
బ్రహ్మవందిత! శైలనందిని! బంధురాలక! పావనీ!
బ్రాహ్మి! నీ నవరాత్రివేళను వందనమ్ములు శాంకరీ!  

**************************************************************

దుర్గామాతయొక్క నవశక్తులలో రెండవది ‘బ్రహ్మచారిణి’ స్వరూపము. ఈ సందర్భంలో ‘బ్రహ్మ’ అనగా తపస్సు. ‘బ్రహ్మచారిణి’ అనగా తపమాచరించునది. ‘వేదస్తత్త్వం తపోబ్రహ్మ’ – ‘బ్రహ్మ’ యనగా వేదము, తత్త్వము, తపస్సు. బ్రహ్మచారిణీదేవి స్వరూపము పూర్తిగా జ్యోతిర్మయము, మిక్కిలి శుభంకరమూ, భవ్యము. ఈ దేవి కుడిచేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్నీ ధరించి ఉంటుంది.

హిమవంతుని కూతురైన పార్వతియే ఈ బ్రహ్మచారిణీ దేవి. ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి నారదుడి ఉపదేశాన్ని అనుసరించి ఘోరతపము ఆచరిస్తుంది. ఈ కఠిన తపశ్చర్య కారణానే ఈమెకు ‘తపశ్చారిణి’ అనగా ‘బ్రహ్మచారిణీ’ అనే పేరు స్థిరపడింది.

దుర్గామాతయొక్క ఈ రెండవ స్వరూపము భక్తులకూ, సిద్ధులకూ అనంతఫలప్రదము. దుర్గానవరాత్రి పూజలలో రెండవరోజున ఈమె స్వరూపము ఉపాసించబడుతుంది.

(తెలుగులో నా భావాలు .......సౌజన్యంతో) 

Monday, October 12, 2015

శైలపుత్రి!





శైలపుత్రి! భవాని! యోగిని! శంకరార్థ శరీరిణీ!
బాల! కేళికుతూహలా! శివ! వాసవాది సురార్చితా!
పాలితార్తజనాళి! పల్లవపాణి! బంభరవేణి నీ
లీలలన్ నవరాత్రివేళ స్మరింతు సర్వశుభంకరీ!  

**********************************************************

దుర్గామాత మొదటి స్వరూపము ‘శైలపుత్రి’ నామముతో ప్రసిద్ధికెక్కినది. పర్వత రాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు ‘శైలపుత్రి’ అనే నామము ఏర్పడినది. వృషభవాహననారూఢయైన ఈ మాత కుడి చేతిలో త్రిశూలమూ, ఎడమచేతిలో కమలమూ విరాజిల్లుతుంటాయి. ఈ అవతారమే నవదుర్గలలో మొదటిది.

 నవదుర్గలలో మొదటి అవతారమైన ‘శైలపుత్రి’ యొక్క మహిమలూ, శక్తులూ అనంతములు. నవరాత్రి ఉత్సవములలో మొదటిరోజున ఈ దేవికై పూజలూ, ఉపవాసాలూ జరుపబడుతాయి. మొదటి రోజున యోగులు ఉపాసనద్వారా తమ మనస్సులను మూలాధారచక్రంలో స్థిరపరుచుకుంటారు. దీనితోనే వారి యోగ సాధనలు ఆరంభమవుతాయి.

(తెలుగులో నా భావాలు .......సౌజన్యంతో)! భవాని! యోగిని! శంకరార్థ శరీరిణీ!
బాల! కేళికుతూహలా! శివ! వాసవాది సురార్చితా!
పాలితార్తజనాళి! పల్లవపాణి! బంభరవేణి నీ
లీలలన్ నవరాత్రివేళ స్మరింతు సర్వశుభంకరీ!  

**********************************************************

దుర్గామాత మొదటి స్వరూపము ‘శైలపుత్రి’ నామముతో ప్రసిద్ధికెక్కినది. పర్వత రాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు ‘శైలపుత్రి’ అనే నామము ఏర్పడినది. వృషభవాహననారూఢయైన ఈ మాత కుడి చేతిలో త్రిశూలమూ, ఎడమచేతిలో కమలమూ విరాజిల్లుతుంటాయి. ఈ అవతారమే నవదుర్గలలో మొదటిది.

 నవదుర్గలలో మొదటి అవతారమైన ‘శైలపుత్రి’ యొక్క మహిమలూ, శక్తులూ అనంతములు. నవరాత్రి ఉత్సవములలో మొదటిరోజున ఈ దేవికై పూజలూ, ఉపవాసాలూ జరుపబడుతాయి. మొదటి రోజున యోగులు ఉపాసనద్వారా తమ మనస్సులను మూలాధారచక్రంలో స్థిరపరుచుకుంటారు. దీనితోనే వారి యోగ సాధనలు ఆరంభమవుతాయి.

(తెలుగులో నా భావాలు .......సౌజన్యంతో)