padyam-hrudyam

kavitvam

Saturday, October 31, 2020

ఆదికవి

 

సీ.

ఆ యాది కవి సృష్టి యఖిల ప్రపంచమ్ము

.....నీ యాదికవిది రామాయణమ్ము

వేదాల రాశిని వెలయించె నా బ్రహ్మ

.....వేదసార మితండు వెలయఁ జేసె

చతురాస్యుఁ డాయన చతురుఁడీయనఁ జూడఁ

.....బువ్వున నతఁడాయెఁ బుట్ట నితఁడు

లోకాలకు విధాత లోకేశుని సుతుండు

.....శ్లోకాల ధాత వాల్మీకి ఋషియె


తే.గీ.

నలువ సృష్టిని లోపాలు గలుగ వచ్చు

దొసగులను మాపి పూర్ణత్వ మెసగఁ జేసి

కవి జగమ్ముల కందముఁ గలుగఁ జేయు

నాదిజున కాదికవికి నభేద మెన్న.

Saturday, October 24, 2020

దుర్గాం దేవీగ్ం శరణ మహం...

 


ఉ.

దుర్గమదైత్యహంత్రి! పటు దుర్గతినాశని! దుఃఖమోచనీ! 

దుర్గమమౌ భవాబ్ధిఁ బడి త్రోవను గానక స్రుక్కుచుంటి నో 

భర్గహృదబ్జవాసిని! సువాసిని! నీ కడగంటి దృగ్ఘృణిన్  

మార్గము జూపి యేలు నను మాలిమిఁ జిన్మయరూపిణీ! శివా!

Wednesday, October 21, 2020

సరస్వతీ

 



ఉ.  ఆరని జ్ఞానధార! సకలాగమసార! శుభప్రసార! కా

శ్మీరవిహార! సుందరశుచిస్మితతార! ప్రబంధశాస్త్రసం

చార! బుధాంతరంగసువిచార! యవిద్యవిదూర! వాక్సుధా

పూర! సరస్వతీ! ప్రణతి బ్రోవవె చిన్మయరూపిణీ! శివా!    


Saturday, October 17, 2020

తరలి వచ్చెడి జననికి దండ మిడుడు.

 


సీ.

శారద వీణపై సామముం బాడుచుఁ 

...గలయంచ తేరుప కలసి నడువ  

హరినేత్ర మరవింద మందించి హరిసతి 
 
...కధిరోహణము సేయ నామతించఁ 

జిన్నారి గణపయ్య సేత నుండ్రము తోడఁ 

...దన ముందుఁ గూర్చుండి దారి సూపఁ
 
జాపబాణములతో షణ్ముఖుఁ డమ్మకు  

...వెన్వెంటఁ జనుచుండ వేడ్క మీర 

తే.గీ.
సింహవాహనారూఢయై చేతఁ దాల్చి 
శూలమును శిక్ష సేసి యా సోకు తతుల 
విజయ హర్షాన హిమగిరి విపినములకుఁ 
దరలి వచ్చెడి జననికి దండ మిడుడు.  

Wednesday, October 14, 2020

శోభానాయుడుకు నివాళి

 




ఆంధ్రసత్యభామ యలుకలు మాసెను

శ్రీనివాసపద్మ జేరె విభుని

తెనుగు నాట్య తార దివికి నేగిన వేళ

శోభ లారె నృత్య ప్రాభవమున.


శోభానాయుడు రాకను

శోభలు మితిమీరి వెలిగె సుర నాట్య సభన్

శోభా విహీనులై తమ

ప్రాభవ మడగునని యచ్చరలు దిగులు పడన్.

-దువ్వూరి