padyam-hrudyam

kavitvam

Thursday, December 15, 2016

అన్నదమ్ముల అనుబంధం

యుద్దరంగమున మాయలమారి మేఘనాథుని చంపి నందులకు అగస్త్యాది మహర్షులు వచ్చి రామా పండ్రెండు వత్సరములు నిద్రాహారములు మాని బ్రహ్మచర్యమును పాటించిన వారి చేతనే ఇంద్రజిత్తు సంహరింప బడతాడు అందుచేతనే లక్ష్మణుని వలన మాత్రమే ఆ పని జరిగింది అని లక్ష్మణుని ప్రశంసిస్తారు.
దానికి రాముడు ఆశ్చర్య పోయి అదేమిటి లక్ష్మణుడు ఈ పండ్రెండు వత్సరాలూ మాతోపాటు ఆహారం తీసుకుంటున్నాడు కదా అతడు ఎలా చంపాడు యింద్రజిత్తుని అని తమ్ముణ్ణి పిలిచి సౌమిత్రీ నువ్వు రోజూ ఆహారం తీసుకోవడం లేదా అని అడుగుతాడు.
లక్ష్మణుడు లేదన్నా నేను భోజనం చెయ్యలేదు, నిద్ర కూడా పోలేదు అంటాడు.
మరి ప్రత్రిరోజూ నువ్వు తెచ్చిన ఫలాలను మూడు భాగాలుగా చేసి నీకొక భాగాన్ని ఇస్తున్నాను కదా వాటిని ఏం చేస్తున్నావు అన్నాడు రాముడు.
లక్ష్మణుడు అన్నయ్యా మీరిచ్చిన ఫలాలను నేను అనాదరం చేస్తానా వాటిని ఎండబెట్టి దాచాను, అవన్నీ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అన్నాడు.
మంచిది అయితే అవన్నీ ఒకసారి నాకు చూపించు అన్నాడు శ్రీరాముడు.
లక్ష్మణుడు ఎండబెట్టిన ఫలాలన్నీ తెచ్చి రామునికి చూపిస్తాడు. అవన్నీ లెక్కింప జేస్తే నాలుగు రోజులవి మాత్రం తక్కువగా ఉంటాయి. రాముడు తమ్ముడూ ఎందుకు నాలుగు రోజుల పళ్ళు తక్కువగా ఉన్నాయి అని అడుగుతాడు.
దానికి లక్ష్మణుడు అన్నయ్యా మనం వనవాసానికి వచ్చిన మొదటిరోజు శృంగిబేరపురం లో ఏమీ తినలేదు కదా. అలాగే మన తండ్రిగారి మరణవార్త విన్నరోజు కూడా మనం ఆహారం ఏమీ తీసుకోలేదు. సీతాపహరణం జరిగిన రోజు మనం ఏమీ తినలేదు. నాకు రాక్షసుని శక్తి తగిలినరోజు కూడా ఏమీ తినలేదు. అందుచేత మొత్తం నాలుగురోజుల పళ్ళు వీటిలో తక్కువగా ఉన్నాయి అని చెపుతాడు.
రాముడు చాలా ఆశ్చర్యాన్ని, విచారాన్నీ ప్రకటించి ప్రేమతో ఇలా అంటాడు.
సోదరా చాలా పొరబాటు జరిగింది. పెద్దవాడవడం చాలా తప్పు. వాడు సేవకులతో సేవ చేయించుకుంటాడు కానీ సేవకులు తిన్నారో తినలేదో ఏమైనా కష్టం వచ్చిందేమో అనేవేమీ పట్టించుకోడు. ఇన్నాళ్ళూ నేను నా భార్యతో ఆనందవిహారాలు చేస్తూ గడిపాను నువ్వు మాత్రం ఆహారం కూడా తీసుకోకుండా మా సేవలు చేస్తూ గడిపావు. నా యీ అపరాధానికి ప్రాయశ్చిత్తంగా వచ్చే జన్మలో నువ్వు అన్నవుగా పుడుదువు గాని నేను నీకు తమ్ముడిగా పుట్టి నీ సేవ చేసుకుంటాను .
అందుచేత ద్వాపరయుగంలో ఆదిశేాషావతారమైన సంకర్షణుడై పెద్దవాడుగా జన్మిస్తే అతనికి తమ్మునిగా శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు.
అయితే ఇతను చిన్నవాడైనా పెద్దవాడుగానే ప్రవర్తించాడు. ఎందుకంటే "పెద్దవాడైన వాడు" ఎన్నాళ్ళు చిన్నవాడుగా ఉండగలడు మరి?
( మహాభాగవతం నుంచి)

Tuesday, December 13, 2016

దత్త జయంతి



సర్వలోక గురుడు సంసార రోగంపు
వైద్యు డీత డన్ని విద్యల నిధి
స్మరణమాత్రముననె సంతుష్టుడై మెచ్చు
దత్త గురుని సాటి దైవ మెవరు?

శరణ మన్నవారి కరుణతో జూచును
భవభయమ్ము బాపి పరము నిడును
వ్యాధి బాధ లడచు నాయుష్య మిచ్చును
దత్తగురుని సాటి దైవ మెవరు?

వరదు డితడు భక్తవత్సలు డాపన్న
జనుల కార్తి బాపు సదయు డజుడు
సర్వమంగళముల సన్నిధి యైన శ్రీ
దత్తగురుని సాటి దైవ మెవరు?

హీనపాపపంక మింకింప జేయుచు
దీనజనుల గాచి తేజ మిడును
సర్వదుఃఖహరుడు సర్వమంగళకారి
దత్త గురుని సాటి దైవ మెవరు?

బ్రహ్మహరిభవైక  భవ్యస్వరూపుండు
నమలు డక్షరుండ నంతు డితడు
పరుడు గురుడు హరుడు పరమాత్మ సులభుడు
దత్త గురుని సాటి దైవ మెవరు? 

Monday, December 12, 2016

పావనీ..

లాఘవ మొప్ప దాటి జలరాశిని లంకకు జేరి తోటలో
రాఘవ పత్నినిం గని విలాపము దూరము జేసి యుంగరం
బా ఘనసాధ్వి కిచ్చి గొని యామె శిరోమణి గాల్చి సర్వమున్
శ్లాఘన కార్యమున్ సలిపి సన్నుతు లందిన పావనీ! నతుల్.

Saturday, December 10, 2016

గీతాజయంతి



ఆవు లుపనిషత్తు లర్జునుం డగు దూడ
వెన్ను డావు పాలఁ బితుకు వాడు
క్షీర  మమృతసమము గీతార్థసారమ్ము
జ్ఞాని ధరను పాల నాను వాడు.

కర్మయోగమునను కాంక్షను రగిలించి
జ్ఞానయోగమందు ధ్యానము నిడి
భక్తి యోగ మిచ్చి ముక్తికి మార్గమౌ
పరమపురుషదత్త భవ్య గీత.

హరి కరపద్మము వలనను
సురలకు లభియించి నట్టి సుధ లగునే శ్రీ
హరి ముఖకమల జనితమౌ
వర గీతామృతము సాటి వసుధను వినవో.



Monday, December 5, 2016

వల్లీనాథా! ప్రణతులు
చల్లగ మము జూడుమయ్య స్వామీ! దయతో
నుల్లము పొంగగ మ్రొక్కెడి
యెల్లర భక్తులను సతము నేలెడి దేవా!

శరవణభవ! నీ సరసిజ
చరణములను నిలచినాము స్వామీ! కనుమా
కరుణను  మము క్రీగంటను
శరణము వేరొకరు లేరు సత్యము దేవా!

తారకు జంపెడి వేల్పును
కోరితి రా పార్వతీశు గూడి నిలింపుల్
పోరున దైత్యుని జంపగ
శూరుని నిను సృష్టి జేసె సోముడు దేవా!

సుబ్రహ్మణ్యా! శివసుత!
అబ్రమె తారకుని పీచ మడచుట వేడం
గా  బ్రహ్మాదులె శరణని
లేబ్రాయుడవైన నిన్ను ప్రీతిని దేవా?.

సుబ్బారాయుడు షష్టిని
నబ్బో తీర్థమ్మటంచు నందరు నొకటై
నుబ్బున నిను గని మ్రొక్కగ
గొబ్బున సర్వులను గాచు కూరిమి దేవా!.