padyam-hrudyam

kavitvam

Sunday, December 29, 2013

రాశి బోసిన భావాల రమ్య మైన .............







బాల భరతునికి బాలేందు బింబమ్ము 
.......చూపు శకుంతల సోయగమ్ము! 
బాలరాముని జేత బట్టి వెన్నెల లోన 
.......ముద్దాడు కైకమ్మ మురిపెములును! 
వెన్నదొంగను చంకబెట్టి వెన్నెలరేని
.......సొగసుల జూపు యశోద మనసు! 
'చందమామా రావె జాబిల్లి రావోయి'
.......తెలుగమ్మ పాటలో తీయదనము!

బిడ్డ నవ్వు జూచి భీతితో దాగును
మేఘమాల వెనుక మింటను శశి!
తల్లి వదన రుచుల ధాటికి సిగ్గుతో
చితికి పోవు నతడు చిటికెలోన!

రాశి బోసిన భావాల రమ్య మైన
చిత్రమందున నిల్పిన చిత్రకారు
డెవరు రవివర్మ యౌనొకో! యెవ్వరైన
నేమి? నుతియింతు మనసార నిట్టి ఘనుని.

Tuesday, December 17, 2013

పువ్వుబోణి




ఎవ్వతె వీవు? సుందరివి! ఇందుముఖీ! మరి నామ మెట్టిదే?
పువ్వును బోలు నీ ముఖము! పువ్వు లవేలనె నీకు వేరుగా
జవ్వని? రువ్వవే యెడద జల్లన వెన్నెల జల్లు రీతిగా
నవ్వును! ధన్యమై చనెద! నాకపు టచ్చర  నీకు బోలునే?

Saturday, December 7, 2013

నెల్సన్ మండేలాకు నివాళి.





విశ్వమాత  కనుల వెంట దుఃఖాశ్రువుల్  
కారు చుండె గనుడు ధారగాను 
నల్ల జాతి వెలుగు నవ్వుల సూరీడు 
గ్రుంకె నన్న వార్త క్రుంగ దీసె. 

జాత్యహంకార ప్రభువుల జాడ్య మేమొ 
సాటి మానవుల యెడన్ జాలి లేక 
నల్ల వారని హింసించి తెల్లవారు 
బానిసల జేసి రక్కటా బాధపెట్టి.

పెద్ద సంఖ్యలో నుండియు పేదవారు 
నల్ల వారైన కతమున నాణ్యమైన 
బ్రతుకు తెరువును పొందక పరువు మాసి 
దొరల కాళ్ళను పట్టెడి  దుర్గతేల. 

కలల నైన తమకు కార్లు సౌధమ్ములు 
కోరినారె వారు కూటి కొఱకు 
మోము వాచి పసుల పోలిక గొలుసుల 
బంది లగుచు మ్రగ్గు  బ్రతుకదేల.. 

వారును కారె మానవులు వారికి నాకలి దప్పులుండవే  
వారి నరాల పారు రుధిరమ్మరుణమ్మది కాదె వారినిన్ 
క్రూరత జేసి బానిసల, కొద్ది జనుల్ తెలుపైన వారిలన్,
దూరుచు నంట రారనుచు ద్రోహము జేతురె ఘోర మక్కటా.

వర్ణవివక్షకున్ భరత వాక్యము పల్కిన గాని గుండెలో 
నర్ణవ మైన వేదనకు నంతము లేదని యెంచి దీక్షతో 
పర్ణములే భుజించి తపమున్ పచరించెడు మౌని పోలికన్ 
నిర్ణయ మూని డెందమున నీవు తపించితివయ్య మండెలా.

దేశ ద్రోహి వటంచు తెల్ల ప్రభువుల్ తీర్మానమున్ జేసినన్    
లేశంబైనను జాలి లేక యొక జైలే సృష్టిగా మార్చినన్ 
ఆశల్ జూపిన గాని లొంగ వకటా ఆత్మీయ జాత్యర్థమై 
క్లేశంబుల్ భరియించి నావు జన సంక్షేమంబు కై దీక్షతో.

యౌవన మంతయు జారిన 
నే వెల్గులు లేని రీతి నిరుకగు  జైలున్  
చేవ నశింపక పోరిన 
యో వీరా నిన్ను దలతు నుల్లము పొంగన్.

పండెను నీకల! నలుపుల 
గుండెల చల్లారె మంట! కూరిమి నేళ్ళున్ 
నిండెను నూరును దొరలకు, 
మండేలా! వందనములు, మరిమరి నుతులున్. 

భువిని విడచి పెట్టి దివికి నీవేగినన్ 
నీదు పోరు బాట నిలిచి చూపు 
మంచి మానవత్వ మెంచగ విజయమ్ము 
నొందు దారి మాకు నో మహాత్మ!


Monday, November 25, 2013

హరహర శంభో.............







నీ రూప మిట్టిదని నే
నేరను నీ తత్త్వ మసలు నీల గళ! శివా!
ఏ రూపమ్మున నుందువొ
ఆ రూపా! నీకు నతులు హరహర! శంభో!

చేయ రానట్టి  పనులను చేయుచుంటి
చేయ దగినట్టి  పనులను చేయనైతి
పాప యుగళము నీ నామ వర్ణ యుగపు
స్మరణ చేతను నశియించు సత్యము శివ!





Sunday, November 17, 2013

భారత రత్నమా! సచిను! భారత కీర్తి మహత్ప తాకమా !





బ్యాటు ఝళిపింప నరులకు భయము గల్గు
పరుగు దీసిన శతకము బాది వదలు
బంతి విసరిన నావలి యంతు జూచు
సచిను భారత మాతకు సత్సుతుండు.

విరులు మెల్లగా చల్లగా విరిసినట్లు
వెండి వెన్నెల హాయిగా పండినట్లు
సచిను నవ్విన మనసుకు సంతసమగు
నతడు భారతరత్నమే యది నిజమ్ము. 
వీరుడవై క్రికెట్టునకు విస్తృత భాష్యము జెప్పి, బ్యాట్టుతో
పోరుచు, వాడి బంతులను పూనిక వేయుచు, వైరి సోదరుల్
'లేరితనిన్ జయింప నొరు లీభువి' నంచు వచించి మెచ్చుచున్
పారగ భీరులై, భరత పావన ధాత్రికి వన్నె తెచ్చుచో
లేరిక సాటి నీ కెవరు! లీలగ నైనను కాన రారులే!
చేరియు నాటలో నెవరు చేరగ రాని మహోజ్జ్వల స్థితిన్
నేరవు సుంత లౌక్యమును! నిర్మల మైన మనస్సు నెన్నడున్
జారగ నీవు కీర్తి బల సంజనితంబగు పొంగు లోయలో!
మీరిన బ్యాటు ఘంటమున మేలుగ దేశ క్రికెట్టు గాధ నిం
పారగ నొంటిగా తిరగ వ్రాసిన లేఖకు డంచు మెచ్చెదన్!
చోరుడ వంచు పల్కెదను సోదర మానసముల్ హరించుచో!
భారత రత్నమా! సచిను! భారత కీర్తి మహత్ప తాకమా ! 

Friday, November 1, 2013

తెలుగు వెలుగు



తెనుగు భాష తీపి తేనియకును లేదు!
తెనుగు వర్ణమాల తీరు సొగసు!
తెనుగున తలకట్టు తెలుపును ఠీవిని!
దేశ భాషలందు తెనుగు లెస్స!


పాప నవ్వు వోలె పాల మీగడ వోలె
మంచిగంధ మట్లు మల్లె లట్లు
వీణ పాట రీతి విలసిల్లు జగతిని
తీపి జాలువారు తెలుగు పలుకు.


తెనుగు మాటలందు, తెనుగు పాటలయందు,
తెనుగు పద్యమందు తెలియనగును
తెనుగు సౌరభమ్ము! పునుగు జవ్వాదుల
యునికి గుండు సున్న తెనుగు ముందు!


తెలుగు రాని వాడు, తెలుగు నేర్వని వాడు,
తెలుగు పలుకుబడుల తియ్యదనము
తెలుగు నేల బుట్టి తెలియని మూర్ఖుడు
గలుగ తెలుగుతల్లి కడుపు చేటు!


తెలుగు పద్య మన్న వెలలేని బంగరు
పాత్ర నున్న యమృత ఫలము సుమ్ము! 
మనసు పడిన వారి కనుపమ మధురమౌ
రసము లూర జేయు రసన పైన!


వస్తువెట్టిదైన వర్థిల్లు తెలుగున
పద్యమందు నొదిగి, బంగరంపు
టుంగరమున రత్న మొదిగిన రీతిగా!
పోతబోయ బడిన బొమ్మ వోలె!


మలయ పవన వీచి! మకరంద బిందువు!
పాల కడలిని యల! పూల మాల!
మింటి మెరుపు తీవ! మెరసెడు తారక!
తెలుగు కైత సొగసు తెలుప వశమె!


పద్యము తెల్గు భారతికి పచ్చల హారము కంఠ సీమలో!
హృద్యము దీని సోయగము నింపులు సొంపులు! కావ్య సీమలన్
సేద్యము జేయు వారలకు శ్రీల నొసంగెడు పైరు! స్వంతమౌ
విద్యది తెన్గు వారలకు! విత్తము సత్కవి కెన్న నిద్ధరన్!


వేల వత్సరాల వెనుకనే ప్రభవించి
దీప్తు లీను చుండె తెలుగు ధాత్రి,
మాటలందు లిపిని మార్పులు జరిగిన,
మధురిమలను పంచు మనకు తెలుగు.


Monday, October 14, 2013

భవ్య సుపూజిత పాదపంకజా!



పద్మిని! పద్మనాభసతి! పాపవిమోచని! పద్మవాసినీ!
పద్మకరీ! ప్రసన్నకర భాండజలార్చిత! పద్మలోచనీ!
పద్మముఖీ! పరేశ్వరి! సువర్ణమయీ! నవపద్మ గంధినీ!
పద్మజ! శారదాగిరిజ భవ్య సుపూజిత పాదపంకజా!

శ్రీదేవీ! హరిమానసాబ్జ నిలయా! క్షీరాబ్ధి సత్పుత్రికా!
వేదాంగాది సమస్త వాఙ్మయ నుతా! విశ్వాఖిల వ్యాపకా!
హే! దారిద్ర్య విమోచనీ! శుభకరీ! హ్రీం మంత్ర బీజాత్మికా!
మోదంబౌ నవరాత్రివేళ జననీ! పూజింప నిన్ భక్తితో!

Sunday, October 13, 2013

కామాక్షి! నీ లీలయే...........





నీ యున్మేషమునన్ సమస్త జగతీ నిర్మాణముం జేసి మా
కాయుర్భాగ్యము లిచ్చి లంపటమునన్ హాయంచు మున్గంగ నీ
వా యీశానుని గూడి నవ్వుచును మా యారాటముం జూతువే!
సాయుజ్యమ్ము నొసంగు నీ పద సరోజద్వంద్వముం జూపవే?

కల్పాంతమ్మున నీ నిమేష తృటిఁ లోకా లెల్ల ఘోరాబ్ధిలో
నల్పంబౌ నొక నావవోలె మునుగంగా హాయిగా పండవే
తల్పంబందునవోలె నా జలముపై తత్త్వార్థ వర్ణాత్మికా!
కల్పంబైనను నాశమైన జననీ! కామాక్షి! నీ లీలయే!

విజయా! వేదవిదా! విశాలనయనా! విశ్వేశ్వరీ! విశ్వదా!
అజ దామోదర శంకరార్చిత పదా! ఆబ్రహ్మకీటాశ్రితా!
రజతాద్రీఘనశృంగమధ్యనిలయా! రాకేందు బింబాధరా!
విజయమ్మిమ్ము త్వదంఘ్రి సేవన మహా విద్వత్పరీక్షన్ శివా!

Saturday, October 12, 2013

మన్నించు దుర్గాంబికా!








మహిషాసురుని జంపి మహిని కాపాడిన
........కనకదుర్గా! నీకు కరము నుతులు!
చండముండుల ద్రుంచి జగము లేలిన తల్లి!
........కాళికాంబా! నీకు కైమొగిడ్తు!
భండవిశుక్రుల ప్రాణముల్ దీసిన
........దైత్యాంతకీ! నీకు దండ మిడుదు!
మధుకైటభుల బట్టి మర్దించి చంపిన
........చండికా! జేజేలు చాల జేతు!

సృష్టి సంహారణక్రియన్ శివుని తోడ
లయమొనర్చుచు లోకాల భయము గొల్పి
జగములను పునఃసృష్టించు జనని వీవు!
తల్లి వందన మొనరింతు దయను జూడు!

చెడుపై మంచికి నెన్నడున్ విజయమౌ సృష్ట్యాదినుం చెన్నగా
కడగండ్లొందుచు ధాత్రిపై జనులు దుఃఖాంబోధిలో నీదగా
వడి నీ వుద్భవ మంది దుష్ట తతులన్ వజ్రాయుధోపేతవై
మడియం జేయుదు వన్న నానుడి సదా మన్నించు దుర్గాంబికా!



Friday, October 11, 2013

చల్లని నీ చూపు సోక సౌభాగ్య మగున్.




మల్లియ, చందమామ, తెలి మంచు తుషారపు హార దీధితుల్
తెల్లనఁ బోవు నీ తనువు తెల్లని కాంతికి వాణి! దివ్యమౌ
తెల్లని యంబరమ్మునను, తెల్లని పద్మము నందు నిన్గనన్
యుల్లము పొంగదే జనుల కుర్విని యీ నవరాత్రి వేళలో!

ఏ పాదాబ్జములన్ విరించి కొలుచు న్నీ విశ్వముం జేయగా?
నే పాదాబ్జపు నీడలో హరి జగమ్మేలంగ సంశక్తుడౌ?
నే పాదాబ్జ మహద్రజో గరిమచే నీశుండు సంహర్తయౌ?
నీ పాదాబ్జము లెన్నగా నవియె వాణీ! సంశయ మ్మేలకో!
తల్లీ! నిన్ను దలంచిన
యుల్లము లుప్పొంగు వాక్కు లుబుకును ఝరులై!
ఫుల్లాబ్జాక్షి! సరస్వతి!
చల్లని నీ చూపు సోక సౌభాగ్య మగున్.

Thursday, October 10, 2013

క్షేమ మొసంగును జీవితాంతమున్.............




ఏ దేవి ఛాయగా నెల్ల జీవుల నుండు
..........నామెకు తలవంచి నతులొనర్తు!
ఏ దేవి శక్తియై యెల్ల ప్రాణుల నుండు
..........నా దేవి కేను ప్రణతు లొనర్తు!
ఏ దేవి కరుణగా నెల్ల జీవుల నుండు
..........నామెకు ప్రణమిల్లు దాదరమున!
ఏ దేవి తుష్టియై యెల్ల ప్రాణుల నుండు
..........నా దేవికి నమస్సు లందు నెపుడు!

సకల భూతాంతరంగయై సర్వ కాల
సర్వ దశలందు వెల్గెడు శక్తి కనెద!
దండమో దేవి! దండము దండమమ్మ!
దండమో తల్లి! దయజూడు దండమమ్మ!

నీ లలితాబ్జ నేత్రములు, నీ కరుణామృత పూర దృక్కులున్,
నీ లలితాధరమ్మునను నిత్యము వెల్గెడు నవ్వు వెన్నెలల్
శ్రీల నొసంగు భక్తులకు! క్షేమ మొసంగును జీవితాంతమున్!
శ్రీ లలితా! భవాని! త్రిపురేశ్వరి! చిన్మయరూపిణీ! శివా!

ఈ నవరాత్రి పర్వముల నింపగు నీ విభవమ్ము జూడగా
పూనిక, వీడి నాకమును భూమికి వత్తురటన్న దేవతల్
మా నర భాగ్య మెంతటిదొ మాతరొ! నీ పద సన్నిధానమున్
మా నయనాల ముంగిటను మల్చగ నో లలితా పరేశ్వరీ!

Wednesday, October 9, 2013

విహరణము జేయు గాయత్రి విశ్వ మేల!





ముత్యపు కాంతి నింపొదవెడు నొక మోము!
........విద్రుమాభమ్ముతో వెల్గునొకటి!
పసిడి కాంతుల తోడ భాసిల్లు వేరొండు!
........నీల మేఘఛ్ఛాయ నాలుగవది!
ధవళ వర్ణము తోడ తనరు నైదవ మోము!
........మూడు నేత్రము లుండు మోమునందు!
ఇందుబింబము కాంతు లీను కిరీటాన!
........తత్త్వార్థ వర్ణమ్ము తల్లి మేను!

అభయముద్రయు, నంకుశ, మబ్జయుగము,
శంఖ, చక్ర, కపాల, పాశములు, గదయు
నష్ట భుజముల దాలిచి, హంస పైన
విహరణము జేయు గాయత్రి విశ్వ మేల!

ఉభయ సంధ్యల గాయత్రి విభవ మెన్ని
'భూర్భువస్సువ' యను మంత్రమును జపింప
నీమమున, సజ్జనుల కొంగు హేమ మగును!
వేదమాతకు నవరాత్రి వేళ నతులు!

Tuesday, October 8, 2013

తానెటు లామెకుం దగిన స్థాయిని జేరెద?'






ఏ దేవి తల్లిగా నెల్ల జీవుల నేలు
..........నామెకు తలవంచి నతులొనర్తు!
ఏ దేవి లక్ష్మియై యెల్ల ప్రాణుల నుండు
..........నా దేవి కేను ప్రణతు లొనర్తు!
ఏ దేవి జ్ఞప్తిగా నెల్ల జీవుల నుండు
..........నామెకు ప్రణమిల్లు దాదరమున!
ఏ దేవి వృత్తియై యెల్ల ప్రాణుల నుండు
..........నా దేవికి నమస్సు లందు నెపుడు!

సకల భూతాంతరంగయై సర్వ కాల
సర్వ దశలందు వెల్గెడు శక్తి కనెద!
దండమో దేవి! దండము దండమమ్మ!
దండమో తల్లి! దయజూడు దండమమ్మ!

ఆకలి గొన్న బిడ్డనికి నన్నము పెట్టెడు నన్నపూర్ణగా
నీ కమనీయ రూపమును నే మదినెన్నుదు నాలకింపవే!
"నీ కరుణా ప్రసాదమును, నిర్మల భక్తికి మెచ్చి భిక్షగా
మాకిడ నేగుదెంచితివి మాలిమి నీ నవరాత్రి వేళలో."

'దీనుల పాలనమ్మునను దేవి కడుంగడు తాల్మి జూపెడిన్!
తానెటు లామెకుం దగిన స్థాయిని జేరెద?' నంచు నెంచి 'యీ-
శానుడు' దారి గానకను 'శక్తిని' వేడెను భిక్ష వేయగా,
పూనిక 'యోరుపున్' పతికి మోదము తోడుత, నామె వేసెడిన్.







































Monday, October 7, 2013

పరిహరింపు బాల! పాపములను.




ఏ దేవి యోర్మిగా నెల్ల జీవుల నుండు
..........నామెకు తలవంచి నతులొనర్తు!
ఏ దేవి శాంతియై యెల్ల ప్రాణుల నుండు
..........నా దేవి కేను ప్రణతు లొనర్తు!
ఏ దేవి శ్రద్ధగా నెల్ల జీవుల నుండు
..........నామెకు ప్రణమిల్లు దాదరమున!
ఏ దేవి కాంతియై యెల్ల ప్రాణుల నుండు
..........నా దేవికి నమస్సు లందు నెపుడు!

సకల భూతాంతరంగయై సర్వ కాల
సర్వ దశలందు వెల్గెడు శక్తి కనెద!
దండమో దేవి! దండము దండమమ్మ!
దండమో తల్లి! దయజూడు దండమమ్మ!

నే బాలుండని చిన్నచూపు తగునే నిర్వ్యాజమౌ నీ కృప-
న్నే బంధమ్ములు లేని ముక్తి నిడగా నింపార వర్షింపకన్?
నీ బిడ్డంగద తప్పు లొప్పులనుచున్ నీడెంద మందెంచవే
శ్రీ బాలా! నవరాత్రులన్ గొలచెదన్ చింతింతు నీ నామమున్.

హరితదివ్యవర్ణ! హరితాంబరప్రియా!
హరితలేపనాబ్జచరణయుగళ!
హరితకుసుమప్రీత! హరిహరార్చితపదా!
పరిహరింపు బాల! పాపములను.

Sunday, October 6, 2013

మసలుమమ్మ నాదు మదిని నీవు.






ఏ దేవి క్షుత్తుగా నెల్ల జీవుల నుండు
..........నామెకు తలవంచి నతులొనర్తు!
ఏ దేవి తృష్ణయై యెల్ల ప్రాణుల నుండు
..........నా దేవి కేను ప్రణతు లొనర్తు!
ఏ దేవి జాతిగా నెల్ల జీవుల నుండు
..........నామెకు ప్రణమిల్లు దాదరమున!
ఏ దేవి లజ్జయై యెల్ల ప్రాణుల నుండు
..........నా దేవికి నమస్సు లందు నెపుడు!

సకల భూతాంతరంగయై సర్వ కాల
సర్వ దశలందు వెల్గెడు శక్తి కనెద!
దండమో దేవి! దండము దండమమ్మ!
దండమో తల్లి! దయజూడు దండమమ్మ!

శైలజవై గిరీంద్రునకు జన్మ తరింపగ జేసి, దివ్యమౌ
లీలల తల్లిదండ్రులకు ప్రీతిని జేసి, తపించి, శాంభవీ!
నీలగళున్ మదిన్నిలిపి, నిండితివమ్మ సగమ్ము మేన సు-
శ్రీల నొసంగవే నిను భజించెద నీ నవరాత్రి వేళలో.

శైలపుత్రి వీవు! చల్లని తల్లివి!
కొల్చు వారి పాలి కొంగు పైడి!
మంచుకొండ యింట మసలిన రీతిని
మసలుమమ్మ నాదు మదిని నీవు.

Saturday, October 5, 2013

దండమో దేవి! దండము దండమమ్మ!






విష్ణుమాయగ సర్వ విశ్వ మేలెడు దేవి
...........కిదె నమస్కారమ్ము లిడుదు భక్తి!
చేతనా రూపమై జీవుల కదలించు
...........దేవికి ప్రణతులు చేతు నిపుడు!
బుద్ధియై సర్వుల నుద్ధరించెడు దేవి
...........కివిగో నమస్సులు ప్రవిమల మతిఁ!
నిద్ర రూపమ్మున నేలపై ప్రాణుల
...........సేద దీర్చెడు దేవి జేతు నతులు!

సకల భూతాంతరంగయై సర్వ కాల
సర్వ దశలందు వెల్గెడు శక్తి కనెద!
దండమో దేవి! దండము దండమమ్మ!
దండమో తల్లి! దయజూడు దండమమ్మ!

Friday, October 4, 2013

తల్లిదండ్రులు జగత్త్రయమునకును........






చంద్రశేఖరుడవు చంద్రాస్య యామెయౌ
..........చిరునవ్వు వెన్నెలల్ చిందుచుండు!
అగ్నిలోచనుడవు నగ్నివర్ణయు నామె
..........కన్నుల కురియును కరుణ వృష్టి!
నాగభూషణుడవు నాగగామిని యామె
..........భక్తార్తి భంజన వ్రతము మీది!
చిన్మయుండవు నీవు చిన్మయి యామెయౌ
..........తల్లిదండ్రులు జగత్త్రయమునకును!

అద్ద మేల నమ్మ అయ్యమో ముండగా
దిద్దుకొనగ నీదు దివ్య శొభ?
అమ్మ వదన పద్మ మర్థమై యుండగా
పుష్ప మేల చేత భూతనాధ?

Wednesday, October 2, 2013

దొర్లెదమయ్య హాయిగా!









భారతమాత హస్త యుగ పద్మములన్ దవిలించ సంకెలల్,
జారెను బాష్ప బిందువులు జాలిగ నాయమ కల్వ కన్నులన్
ధారగ, నీ యెడంద నవి తాకెను, చివ్వున నీవు చూడగా
క్రూరులు తెల్ల రక్కసుల కొంపలు కూలెను బాపుజీ! భళా!

మేరు సమాన ధీరుడవు మేదిని నీదగు వీరు లెన్ననీ
ధారుణి నింక బుట్ట రిది తథ్యము! యోరిమి దివ్య చాపమున్!
భూరి యహింస సత్యమను పొల్పగు బాణ యుగమ్ము! వీనితో
పోరితివీవు శత్రువుల మోములు ఛిద్రము గాగ బాపుజీ!

పుట్టిన రోజునాడు నిను బుద్ధి దలంతుమె? చెప్పలేమె యి-
ప్పట్టున బాపుజీ! సెలవు! పండుగ! సత్యమహింస తుంగలో
గట్టిగ త్రొక్కి పట్టి, కడు కమ్మగ మాంసము మెక్కి, మద్యమున్
పట్టుగ పట్టి ద్రావి కడు పారగ, దొర్లెదమయ్య హాయిగా!



Sunday, September 29, 2013

ప్రణవ నాద! మోంకారము!........





ఆదినాదమ్ముగా నవతరించిన గీత-
........మానంద సంధాయ మైన గీతి!
పంచాక్షరికి ముందు పల్లవించెడు గీత-
........మాది శంకరున కామోద గీతి!
ఆముష్మికము గోరు నా ముముక్షుల గీత-
........మాగమమ్ముల కమ్మ యైన గీతి!
జపతప యజ్ఞాది సర్వ కర్మల గీత-
........మష్టసిద్ధుల నిచ్చు నమర గీతి!

నాట్య సంగీత శాస్త్రాల నవ్య గీతి!
భారతీయుల సంస్కృతి ప్రాణ గీతి!
అన్ని జీవులలో మ్రోయు హంస గీతి!
ప్రణవ నాద! మోంకారము! భవ్య గీతి!


Wednesday, September 25, 2013

ఏమి మహానుభావమిది?


ఏమి మహానుభావమిది యీశ్వర! నీదగు వామభాగమౌ
నామె ప్రియాత్మజున్ బొదువ నంకమునన్, భవదీయ పుత్రుఁడున్
బ్రేమగఁ బట్టి మీ మొలను వ్రేలెడు నూలును, వెంట నంటెడున్!
గోముగ పెద్దవాఁడచట, కుఱ్ఱఁడు క్రింద నదేమి చోద్యమో!

ఏ తిరునాళ్ళ కీ పయన మేగుచు నుండిరి పిల్లగాండ్రతో?
రాతిరి యేడ మీకు బస? రమ్య వనాంతర సీమ లందునా?
మాత! జగత్పితా! తలప, మాయెడ మాలిమి పొంగ మీ యెదన్
భూతల మేగుదెంచిరని పోలెడు, మా యెదలందు నుండరే!

ఏల మహేశ్వరా! తమరికింతటి మాలిమి మానవాళిపై?
ఆలిని దాల్చి మేన సగమందున దోగుచు వెంట నంటి రా
బాలురు షణ్ముఖుండు గజవక్త్రుఁడుఁ, జయ్యన వచ్చినారు మా
నేలకు, మమ్ము నేలుటకొ? నీలగళా! కరుణా సముద్రమా!

తల్లియు తండ్రియున్ కలసి తత్త్వములున్ దనువుల్ సగమ్ముగా,
బిల్లల వెంటబెట్టుకొని పెద్దమనస్సున నేగుదెంచిరీ
చల్లని వేళలో, జనులఁ జల్లగఁ గావగఁ జూడు డల్లదే!
యెల్లరు మ్రొక్క రారె పరమేశునకున్, ధరణీ కుటుంబకున్.

Wednesday, September 11, 2013



ఆగు, విడువకు బాణము, నాగు పార్థ!
రథము క్రుంగెను, చక్రమ్ము లాగి పైకి
మరల యుద్ధమ్ము జేసెద నరయు మయ్య!
ఆయుధము లేని నను జంప న్యాయమగునె?

విజయ! బాణము సంధించు, విడువబోకు
నీతి మాలిన వానిపై నీకు జాలి
తగదు,  బాలు నిరాయుధు తెగడి నపుడు
ధర్మ పన్నము లేమాయె, తప్పు లేదు .

కర్ణు డీల్గెను భీభత్సు కరకుటమ్ము
గుండె చీల్చగ! పడమటి గూటికేగె
నర్కు డాతని గనలేక! నాశ్రయమ్ము
చెడ్డదగుటను, కర్ణుడు చెడెను తుదకు.

Monday, September 9, 2013

శ్రీ విఘ్నేశ! వినాయకా! గజముఖా! శ్రీ పార్వతీనందనా!



శ్రీ విఘ్నేశ! వినాయకా! గజముఖా! శ్రీ పార్వతీనందనా!
భావింపందగు నన్ని కార్యములలో ప్రారంభమందున్ నినున్!
రావే విఘ్నము లెందునన్ కొలువ దూర్వారమ్ములన్, నిత్యమున్,
భావిన్ మంచి శుభమ్ము, కీర్తి గలుగున్ ప్రార్థించ నిన్ భక్తితో.

భాద్రపదమ్మున చవితిని
భద్రేభముఖున్ భజింప భక్తిని సర్వుల్
భద్రంబగు, రావు దరి యు-
పద్రవములు విఘ్ననాధు పటుతర కృపచే.

కొల్తును నే గజవక్త్రుని,
కొల్తును నే గౌరిసుతుని, కొల్తును దంతున్,
కొల్తును నే విఘ్నేశ్వరు,
కొల్తును నే భక్తితోడ కొల్తును సతమున్.

వరములనిమ్మా గణపతి!
కరిముఖ! గౌరీకుమార! కల్పోక్త విధిన్
కరమొప్ప భక్తి మనమున
వరదా యని పూజ సేతు పత్రిని, పూలన్.

గణనాథున్ భజియింపరే సతతమున్ గల్గున్ గదా సంపదల్!
వణకున్ విఘ్నము లెల్ల విఘ్నపతిఁ సంభావింపగా, దేవతా
గణముల్, యక్షులు, రాక్షసప్రభృతు లేకార్యమ్ము చేపట్టినన్
ప్రణతుల్ జేతురు దొల్త దంతిముఖునిన్ ప్రార్థించి సఛ్ఛ్రీలకై.


Friday, September 6, 2013

భావ్యమె? రామ! దయానిధానమా!



భాద్రపదమ్మునందు మము భద్రతఁ జూడుము భద్రమూర్తివై
ఛిద్రములాయె మా బ్రదుకు చిత్రములెల్లను నిత్యకృత్యమౌ
క్షుద్రపు రాజకీయముల సోకుల మూకలఁ జిక్కి శల్యమై
భద్రగిరీశ! దాశరథి! భక్త జనావన కల్పవృక్షమా!

నిద్రయు దూరమాయె నవినీతి నిశాచర ఘోర చేష్టలన్,
భద్రత మాసిపోయినది, భద్రగిరిన్ కొలువుండి చూపినన్
ముద్రను భీతి వీడుమని మోదమె? పూనికఁ బూని యీ  మహో-
పద్రవ మాపకున్న మరి, భావ్యమె? రామ! దయానిధానమా!

చిద్రూపుండవు చిన్మయుండవు సదా శ్రీ జానకీవల్లభా!
సద్రాజాన్వయ వార్థి సంభవ శశీ! సంహారముంజేసి యా
క్షుద్రుండౌ దశకంఠు, డస్సితివొకో! చూడంగదే మమ్మికన్
నిద్రాసక్తిని వీడి కూల్చగదవే నీకోల నా దైత్యులన్.

 

Wednesday, September 4, 2013

చిన్నికృష్ణా! నిన్ను చేరి కొలుతు.




నల్ల కలువ మోము, పిల్లన గ్రోవియున్,
ఘల్లుఘల్లు మనెడు కాలి గజ్జె,
చిట్టిపొట్టి యడుగు లిట్టట్టు వేయుచు
నందు నిందు నాడు నందు పట్టి!

ఆవు పొదుగు చెంత 'ఆ' యని నోరుంచి
క్షీర మాను నందశిశువు వదన
బింబ రుచుల గాంచి బిడియమ్ముతో దాగె
మబ్బు వెనుక చందమామ గనుడు!

చేత కొంత వెన్న, మూతిని మరి కొంత,
మెడను పులి నఖమ్ము మెరయుచుండ
బెట్టు సేయు ముద్దు బెట్ట రావే యన్న,
చుట్టు ముంగమూతి సున్న వోలె!

పల్లె లోని పడుచు పిల్లల చూపులు
చిన్ని కృష్ణు పైనె యున్న వంచు
దృష్టి తీసివైచు దినదినమ్ము యశోద
వన్నె తగ్గకుండ వెన్న దొంగ!

రారా! నందకుమారా!
రారా! నవనీత చోర! రార! మురారీ!
రారా! నగధర! నాకీ
వేరా! శరణంటి పదము లిమ్ముగ కృష్ణా!

Sunday, September 1, 2013

ప్రాభాత సంధ్య



గుడి గంట మేల్కొల్పు, కోడి కూతల పిల్పు
.......... లెండు లెండని ప్రజన్ లేపు వేళ!
మలయ మారుత వీచి, మంచు బిందువు రోచి
.......... ప్రాభాత సంధ్యను పలుకరింప!
భక్తి రంజని పాట, పక్షి కూనల యాట
.......... నిదుర మత్తును లేపి నిలువరింప!
వెలుగుల యెకిమీడు వేయి చేతుల ఱేడు
.......... చీకటి రాత్రికి సెలవు జెప్ప!

తూర్పు కొండల చూడుడీ తోచె నెఱుపు
దిద్దె నుదుట నుషఃకాంత తిలక మదియె!
కర్మ సాక్షికి నందరు ఘనము గాను
స్వాగతము పల్కి చేయరే వందనములు.

Friday, August 30, 2013

వేదార్థ సమ్రాట్టు!







వేదార్థపు సమ్రాట్టులు!
వేదవ్యాసర్షి హృదయవేద్యులు! గురువుల్!
మేదిని రేమిళ్ళాకా-
శాదిత్యులు! శ్రీ ప్రకాశ శాస్త్రికి ప్రణతుల్!

Wednesday, August 28, 2013

పాడవే ఒకసారి ఓ మధుర మురళీ!



















పాడవే ఒకసారి ఓ మధుర మురళీ!
నేడు నా మది కోరె నీ దివ్య రవళీ........పాడవే...
నీ గాన లహరిలో నే మునిగి పోవాలి
హాయిగా నను నేను మైమరచి పోవాలి........పాడవే...


1.  కల్హార ముకుళమౌ కన్నయ్య పెదవి పై
కమనీయ సుధ గ్రోలి కరగి పోయితివేమొ    = కల్హార =
రాధమ్మ యెదలోన రాగాలు చివురించె
మాధవునికై విరహ బాధతో తపియించె......పాడవే...

2.  నిండు పున్నమి రేయి పండు వెన్నెలలోన
యమునా నదీ తటిని యింపైన నీ పాట       = నిండు =
తీయగా మ్రోగనీ, తీగలై సాగనీ,
అమృతమే కురియనీ, ఆమనై విరియనీ........పాడవే...



Friday, August 16, 2013

శ్రావణమందు సంధ్యలవి సన్నిధి లక్ష్మికి!




శ్రావణమందు సంధ్యలవి సన్నిధి లక్ష్మికి! యామె సత్కృపా
భావము జల్లులై కురిసి భద్రమగున్ మన ధాత్రి! కంగనల్
శ్రావణ గౌరి నోములను శ్రద్ధగ జేతురు! మ్రోయు మంగళా-
రావము లింపు మీర మధురమ్ముగ కన్యల మానసమ్ములన్!

భావిని మా కుటుంబమును భద్రముగా కనిపెట్టి కావవే
శ్రావణ లక్ష్మి నీ కరుణ ఛత్రపు చాయను! నిన్నుతించుచున్
భావము నందు భక్తి మెయి పట్టెద నోముల గౌరి, భారతీ,
శ్రీ వరలక్ష్మి నీవనుచు సేవ లొనర్చెద రంగనామణుల్.

ఈ విధమైన యొంటరిగ నెన్ని దినమ్ముల నీడ్తు? కన్నియన్!
భావికి వేయవే కృపను బంగరు బాటను జేర్చి వేగమే,
నా విభు, నా మనోహరుని, నాదగు తోడగు వాని పాలికిన్
శ్రీ వరలక్ష్మి నన్ననుచు చేతురు మ్రొక్కులు కన్యకామణుల్!


 

Thursday, August 15, 2013

మాయనీకుడు ప్రార్థింతు మాన్యులార !



జాలరి వలనుండి జారి జలమ్మున
........స్వేఛ్ఛగా నీదెడి చేప రీతి!
పంజరమ్మును వీడి బయటి ప్రపంచాన
........చెట్టుపై వాలిన చిలుక రీతి!
పులిపట్టు జార తోపుల జేరి గెంతుతో
........చెంగున నాడెడి జింక రీతి!
హరి చక్రమున వేయ హతమయి మకరమ్ము
........గండము గడచిన గజము రీతి!

ఏండ్ల తరబడి మ్రగ్గుచు నితర జాతి
పాలనమ్మున కడగండ్ల పరితపించి
స్వేఛ్ఛ పొందిన భరతాంబ చిరునగవును
మాయనీకుడు ప్రార్థింతు మాన్యులార !

Saturday, August 10, 2013

వర్షము వచ్చె.............




శ్రావణ మేఘ మాలికలు సాగుచునుండెను నింగి నింపుగా!
బావురుమంచు గ్రీష్మ మదె పారెడి జూడుడు, జేయ ఫెళ్ఫెళా
రావము, నల్లమబ్బురిమి! రంజిలె కర్షక మానసమ్ములున్!
దీవెనలిమ్ము మాభువికి తీయని చిన్కుల జల్లి వర్షమా!

చిటపట రాలు చిన్కులయి! చిత్రముగా జడివాన వెల్లువై!
కటకటలాడి యంబువులకై తపియించెడు ప్రాణికోటి కా
యటమట దీర, హర్షముగ నయ్యదె వర్షము వచ్చె, నెల్లెడన్
చిటచిట దీర! పచ్చనగు చీరను గట్టె వనాంతరమ్ములున్!

Thursday, August 8, 2013

పెళ్లి శుభ వేళ !ఎదలెల్ల త్రుళ్లు వేళ!






మరుగేలరా నీకు మాధవా! యని తెర
.....................చాటున సిగ్గిలు జలజ నయన!
తెర దీయరే చెలి! తరియింప నినుజూచి
......................యెంత సేపని యెంచు కాంతు డివల!
సుముహూర్త మునకింక సుముఖమే యంతయున్
......................రవ్వంత యాగుడన్ బ్రహ్మ గారు!
చూపులు కలసెడు శుభవేళ యెప్పుడో
......................యిరువురకని చూడ నింతులచట!

నాల్గు కన్నులు ప్రేమతో నవ్వు వేళ!
రెండు హృదయాల వలపులు పండు వేళ!
క్రొత్త భావాలు మదులలో కొసరు వేళ!
పెళ్లి శుభ వేళ !ఎదలెల్ల త్రుళ్లు వేళ!

Saturday, August 3, 2013

నీ కృప నావ...........





శ్రీ రఘురామ నీ చరణ శ్రీకర యుగ్మము మానవాళికిన్
నేరుగ త్రోవ ముక్తికిని! నీ కృప నావ భవాబ్ది దాటగన్!
తారక నామ మౌ దురిత తాపము బాపెడు మందు! దీనినిన్
నేరని వారి కేది గతి నిత్యము పుట్టుటొ చచ్చుటో గదా !

Wednesday, July 31, 2013







తెలుగు తల్లి గుండె తెగ గోసి రెండుగా
రుధిర మోడ, జేయ రోదనమ్ము,
కనని వినని నాయకమ్మన్యు లక్కటా!
క్రూరులౌ కసాయి వార లైరి.

Tuesday, July 30, 2013

రెండుగా చీల్చె వస్త్రమ్ము లేమ నొంటి జేసి కలసివోయెను..................





ఎండ కన్నొల్ల నట్టిదీ యింతి యకట
వెంట వచ్చెను వనముల కంటి నన్ను
వలదు వలదన్న వదలక, యలసి పోయె
నడవి పొదలను రాళ్ళను నడచి నడచి.

హంస తూలికా తల్పమ్ము నందు పండు
నట్టి సుకుమారి యీరాత్రి యటవి నిచట
కటిక నేలపై శయనించె కరుగ గుండె
గొప్ప దౌర్భాగ్యుడౌ పతి గూడు కతన.

యెంత చెప్పిన వినదాయె నేమి సేతు
నిట్టి దురదృష్ట జాతకు నీమె పొందె
నెట్లు పంపింతు వెన్కకు నింతి ననుచు
మిగుల వగచెను యోచించె పొగిలి నలుడు.

విడచి పెట్టెద నిప్పుడే వెలది నిచట
నేక వస్త్రమ్ము రెండుగా నింత చించి
కరుణ గలవార లెవరైన నరసి యామె
నప్ప జెప్పగ పుట్టింట నగును మేలు.

గుండె బరువెక్క నారాజు బండ బారి
లేచె మెల్లగ ప్రేమతో చూచె సతిని
రెండుగా చీల్చె వస్త్రమ్ము లేమ నొంటి
జేసి కలసివోయెను నిశి జింత తోడ.

Saturday, July 27, 2013

సరసాహ్లాదిని - సమస్య


సమస్య: పాడు మనుజుఁ జూడ వేడుక గద!

నా పూరణ :  

చెడును దరికి నెపుడు చేర నీయకు మంచు
మంచి వీడబోక మసలు మనుచు
తన మదిని వివేక మను రాతి పైన రా-
పాడు మనుజుఁ జూడ వేడుక గద!

Monday, July 22, 2013

గురు పూర్ణిమ

అజ్ఞాన ధ్వాంతములను
ప్రజ్ఞా దీధితులతోడ బారద్రోలున్
సుజ్ఞానము దయజేయును
విజ్ఞానాదిత్యుడగుచు వెల్గెడు గురుడే.

శంకరుని రూపమున దొల్త సంభవించి
మధ్యలో శంకరాచార్య మహిమ గలసి
అస్మా దాచార్య పర్యంత మవని నైన
గురు పరంపరకనయము కరము మోడ్తు.

మొదట నారాయణుని రూపమునను నిలచి
వ్యాస వాల్మీకులయి మధ్య వాసికెక్కి
అస్మ దాచార్య పర్యంత మవని వెలుగు
గురు పరంపర స్మరియింతు కరము మోడ్చి.



Friday, July 19, 2013

తొలి ఏకాదశి







శ్రీహరి పాల సంద్రమున శేషునిపై శయనించు, లోకముల్
మోహమునందు మున్గును, ముముక్షువు లిత్తరి వీడి కోరికల్
దేహము వొందు నిద్రయును, తిండియు కట్టడి జేసి, యాహరిన్
మోహపు టంధకారము సమూలముగా నశియింప వేడరే!

తొలి యేకాదశిని న్నిరశ్న వ్రతుడై తోయంబులున్ ద్రాగకే
బలి భిక్షంబులు బెట్టి ద్వాదశి తిథిన్ భక్షించుచో భోజ్యముల్
నలు మాసమ్ముల దీక్షనుండు యతిలో నారాయణుం జూచుచో
కలుగున్ సజ్జన కోటి కెల్ల శుభముల్ కాపాడుటన్ వేలుపుల్.

భానుడు దక్షిణాయనము వైపు గమించుచు కర్కటాన కా-
లూనిన పిమ్మటన్ వరుసలో నరుదెంచెడు పర్వ శోభలన్
మానవ కోటి పొంది బహు మంచిగ జీవన యాత్ర సాగగా
పూనిక నిచ్చు నీ దినము పొంగెడు భక్తిని శక్తి నిచ్చుచున్.

Thursday, July 18, 2013

పుష్పలావిక

 




కల్వల మించు కన్నులును, కాముని తూపుల బోలు చూపులున్,
చెల్వగు మేని సోయగపు శ్రీ విభవాస్పదమై తరించు నా
వల్వయు, లాస్య చంద్రికల భాసిలు దివ్య ముఖేందు బింబమున్!
చెల్వుడు పుష్ప లావికను జేరక నెచ్చట దాగెనో గదా!  

Monday, June 17, 2013

సరసాహ్లాదిని - సమస్య

సమస్య:  గొడ్రాలిన్ బ్రభవించె బాలుడయి తా గోపాలకృష్ణుండిలన్

నాపూరణలు:

మొదటి పూరణ:

లేడ్రా కృష్ణున కీడు ముజ్జగములన్, శ్రీ దేవకీ పుత్రుడై
నాడ్రా, కంసుని జంప దాటి యమునన్ నందాంగనా సూనుడై
నాడ్రా, వంద్య లనంగ నా సుదతులన్ న్యాయమ్మె? దోసమ్మనన్
'గొడ్రాలిన్ బ్రభవించె బాలుడయి తా గోపాలకృష్ణుండిలన్'.

*************************************
రెండవ పూరణ:

కాడ్రా కృష్ణుడు వంద్య పుత్రు డిలలో, కారా గృహమ్మందు పు
ట్టేడ్రా దేవకికిన్, యశోద కిల నట్టింటన్ కుమారుండురా,
చూడ్రా వంద్య లనంగ నా వనితలన్ చోద్యంబు! కీడౌ ననన్
గొడ్రాలిన్ బ్రభవించె బాలుడయి తా గోపాలకృష్ణుండిలన్

Saturday, June 15, 2013

తెలుగు దనమ్ము ప్రోవు బడి...........

 


తెలుగు దనంపు  ప్రోవనగ తీరిచి దిద్దిన రీతి నున్నదీ
కలువల బోలు కండ్లు గల కన్యక మల్లెల మాల నల్లుచున్,
కులుకుచు నుండ చెంగటను గువ్వలు, చూచెడి తండ్రి రాకకై
వెలుపలి వైపు, డెందమున విందొనరించు వివాహ వార్తకా?

Wednesday, June 12, 2013

సరసాహ్లాదిని - సమస్య

సమస్య:
ముగ్గురు పంచపాండవులు మూఁడు జగంబుల వన్నె కెక్కరే!
నా పూరణలు :

1.


పగ్గము వైచె కోర్కెలకు పాండు నృపుండు, బలీయ మౌటచే
యొగ్గి శిరమ్ము నవ్విధికి, యూరడిలెన్ ముని వాక్కు చొప్పునన్
తగ్గ సుతద్వయమ్మగుట తన్వికి మాద్రికి, కల్గ కుంతికిన్
ముగ్గురు, పంచపాండవులు మూడు జగంబుల వన్నెకెక్కరే!

2.

దిగ్గున వెంగళప్ప తల దిమ్మగు రీతిని పల్కె మిత్రమా!
యెగ్గును చేతువా యడిగి? యింతయు నేరనె? చాలు చాలులే!
సిగ్గగు నాకు! మంచమును చెన్నుగ నిల్పెడు కోళ్ళ రీతిగా
ముగ్గురు పంచపాండవులు! మూడు జగంబులవన్నెకెక్కరే!

Saturday, June 8, 2013

భవ జలధి తరింప భవ్యమౌ తరణ మా .........




దండము సామి! నీ యడుగు దామర పూలకు చల్లనయ్య! మా
దండుకు పండుగయ్య! దరి దాపుల గూడెము లెల్ల నుండు నీ
కండగ నయ్య! నీవిచట హాయిగ నుండ గదయ్య! రామ! త-
మ్ముండును తల్లితో గలసి పుణ్యము పుచ్చగ బోయ జాతికిన్.

మిత్రమ! సంతసించితిని మేలగు భిల్లులకెల్ల! నెంతయో
నాత్రము తోడ గోరితివి హాయిగ నుండు మటంచు కాని యే
మాత్రము వీలుగాదు గద! మా పయనమ్మగు గంగ దాటి యీ
రాత్రికి దూర మేగ వలె రమ్మిక నావను తెమ్ము వేగమే.

ఉండవయ్య రామ! యొకపరి గంగతో
కడగ నీయ వయ్య! కాలు దయను
గంగ పుట్టినిల్లు కద నీదు పాదము!
పుట్టి నిల్లు జేరి మురియు గంగ!

కాళ్ళు కడిగె గుహుడు కన్నీరు నింపుచూ
ధన్యు డైతి నంచు తలచి మదిని
భవ జలధి తరింప భవ్యమౌ తరణ మా
పరమ పురుషు డెక్కె పడవ యపుడు!

Thursday, June 6, 2013

కావ్య కన్య



చదివెడు వారికి చక్కిలిగిలి వెట్టి
...........సరసమ్ము చవిజూపు సన్నుతాంగి!
నవరసమ్ములు నిండి నాల్కపై చవులూరి
...........దండి రుచుల జూపు పిండి వంట!
హృదయ నేత్రమ్మున కింపగు శిల్పంపు
...........రమణీయతను జూపు రమ్య సృష్టి!
ఆదరించెడు వారి యక్కున నొదుగుచు
...........మారాము జేసెడు మంచి బాల!

భావ జాలంపు కడవలో పాల పొంగు!
మనసు తోటలో విరబూయు మల్లె పూవు!
అంద చందాల కెనలేని హంస గమన!
కవికి గారాల పుత్రిక కావ్య కన్య!

Wednesday, June 5, 2013

సరసాహ్లాదిని - దత్తపది

"తమ్ములు"
పై శబ్దాన్ని ప్రతి పాదాదిలో నిల్పుతూ
భారతార్థంలో కందపద్యాన్ని కాని, ఉత్పలమాలను కాని వ్రాయాలి.


**********

నా పద్యం:

తమ్ములు! ధర్మరాజు కనుదమ్ములు! లోకుల రెల్లవారి నే-
స్తమ్ములు! సోయగాన విరిదమ్ములు! నెంచగ సాధ్వి కృష్ణ వి-
త్తమ్ములు! కుంతి పుణ్య ఫలితమ్ములు! వర్తనమందు నీతి పొ-
త్తమ్ములు! వాసుదేవుని హితమ్ములు! నిమ్ముగ పాండు నందనుల్. 

Monday, June 3, 2013

హనుమజ్జయంతి

వందన మంజన సుతునకు
వందనము సుశోభలీను వజ్రాంగునకున్ 
వందనము రామ భటునకు
వందన మవనిజకు నార్తి బాపిన కపికిన్.

దండము  రవి శిష్యునకును
దండము కపి నాయకునకు దైత్యఘ్నునకున్
దండము రామాప్తునకును
దండము మారుతికి వాయు తనుజాతునకున్.

అంజలి లంకా వైభవ
భంజనునకు రావణారి భక్తునకు మహా
భంజన సూతికి కోతికి
నంజన  కొమరునకు జేతునతి భక్తి మెయిన్.

ప్రణతులు రావణు గర్వము
నణచిన మన  వీరునకును నసుర దళములన్
వణకించిన వానికి కపి
గణములకిల  కీర్తినిడిన ఘన మారుతికిన్.

Tuesday, May 21, 2013

సరసాహ్లాదిని - సమస్య


సమస్య:

భూతప్రేతపిశాచసంఘమును సంపూజించినన్ మేలగున్.

నా పూరణ:
 
చేతన్ శూలము, బూది మేన, తలపై చెన్నొందు నెల్వంకయున్,
భీతిన్ గొల్పెడు సర్పరాజ తతులున్, బెంబేలు పుట్టించు పల్
భూత ప్రేత పిశాచ సంఘమును సంపూజించినన్ మేలగున్
ప్రీతిన్ సాంబసదాశివున్ విరతులై బిల్వంబులన్ నిత్యమున్.

Wednesday, May 15, 2013

శంకర జయంతి.

 





శాంభవి యొడిలోన సౌన్దర్యలహరియై
...........పవళించి యాడిన ద్రవిడ శిశువు!
ఆనందహేల శివానందలహరీ త-
...........రంగభంగపు టబ్బురంపు దరువు!
మూఢమతుల ఘన మోహ ముద్గరముచే
...........దారికి దెచ్చిన దండి గురువు!
కరుణ చిప్పిల్లగా కనకధారై పేద
...........కాంతకు దొరికిన కల్ప తరువు!

కాలడి గ్రామ దేవత కన్న బిడ్డ!
అరయ నద్వైత దీప్తుల కాటపట్టు!
భక్తి వేదాంత పటిమకు పట్టుగొమ్మ!
శంకరుల కంజలి ఘటింతు సంస్మరింతు!


Wednesday, May 8, 2013

సరసాహ్లాదిని - దత్తపది

కంది - పెసర - సెనగ - మినుము
పై పదాలను ఉపయోగిస్తూ  నచ్చిన ఛందస్సులో
పార్వతీకళ్యాణము గురించి పద్యం వ్రాయాలి.


నా పద్యం:
 
సిగ్గుతో కందిన చెలి బుగ్గలను జూచి
...................చిరునవ్వు చిందించె శివుని మోము!
ఈశుని నవ్వులింపెసరగ తనపైన
..................తిలకించి పులకించె లలన గిరిజ!
సన్నముత్తియపు సేసల దీసె నగజాత
..................తలవంచె శంభుడు నెలత ముందు!
మినుముట్టె మంగళ ధ్వనులు తాళిని గట్ట
.................సర్వ మంగళ మెడన్ శర్వు డపుడు!

తల్లిదండ్రుల పెళ్లి సంతతి ఘటించి
తనువులెల్లను కన్నులై తరచి చూచె!
శుభ శకునములు పొడసూపె సురుల కంత!
తారకుని రాతి గుండెలో దడ జనించె!

Tuesday, April 30, 2013

సరసాహ్లాదిని

సమస్య:  గొడ్రాలికి కొడు కొకండు గొబ్బునఁ బుట్టెన్.

నా పూరణ:

చూడ్రా! మన వాణి కొడుకు
వాడ్రా! మందీయ తనకు వైద్యు డొకడు పు-
ట్టేడ్రా! నిజమేరా యిది,
" గొడ్రాలికి కొడు కొకండు గొబ్బునఁ బుట్టెన్."



Tuesday, April 23, 2013

సరసాహ్లాదిని

సమస్య:

గణనాయకు గళమునందు గరళము నిండెన్.
============================
నా పూరణ:

మణి శోభిల్లెను గోపీ
గణనాయకు గళమునందు, గరళము నిండెన్
గణపతి తండ్రికి, చింతా
మణి సురపతి కయ్యె సింధు మంధన వేళన్!


Friday, April 19, 2013

సీతా కల్యాణం


 


దేవతలు మునులు నరులును
భావంబున జేయుచుండ ప్రణుతులు మిథిలా
భూవిభుడు ప్రేమ పొంగెడు
భావంబున జేసె నిట్లు భాషణ మనఘా!

ఈమె నా సుత! జానకి! యింతి నీకు!
పాణి గ్రహియింపు మోరామ! భద్రమలర!
ఛాయ వోలెను నీవెంట చనును సతము
నో మహా భాగ! సతిఁజూడు ప్రేమతోడ!

Saturday, April 13, 2013

పుట్టినిల్లు వనిత పుణ్య భూమి!



















ఊరి దాపుకు జేర యురక లెత్తును మది!
...............బడి భవనమ్ములు పలకరించు!
చెరువుగట్టును జూడ చిత్తమ్ము పొంగును!
..............గ్రామ దేవత గుడి క్షేమ మడుగు!
సంతపాకలు గన సంతసమ్మొదవును
..............చావడి, కూడలి రావె యనును!
పలకరింపు కుశల ప్రశ్నల తాకిడి
.............ముసురుకొనగ నెంతొ మురియు మనసు!

వీధి లోకి నేగ వేడుక ముంచెత్తు
అల్లది గదె పుట్టి నిల్లు తనది
బండి యాగి నంత వాకిట ముంగిట
చెంగున దిగె నమ్మ చేటి గనుడు!


చిట్టి తల్లీ రావె చిక్కిపోయే వేమి?
..............కన్నతల్లి పలుకు కడుపు నింపు!
అమ్మలూ వచ్చేవ అల్లుడు కుశలమా?
..............నాన్న పలకరింపు వెన్న పూస!
నను మరచే వేమొ నాకేమి తెచ్చేవు?
.............తమ్ముడు గారాబు కమ్మదనము!
ముందు దిష్టిని తియ్యి మురిపాలు తర్వాత!
............నాయనమ్మ సలహా హాయి నిచ్చు!

తాత బోసినవ్వు! తల నిమిరెడు చెయ్యి!
పుట్టినిల్లు వనిత పుణ్య భూమి!
భర్త ప్రేమ తోడ పట్టమ్ము గట్టినన్
దాని సాటి గలదె ధరణి లోన?


ఇంటి ముంగిటిలోన యెప్పుడో పెట్టిన
..............పడి మీది ముగ్గులు పలకరించు!
పెళ్లి ముందటి దాక పెరటిలో పెంచిన
..............గుబురు మల్లెల పొద కుశల మడుగు!
బావియొద్దకు జేరి బాల్చితో తోడిన
.............చల్లని నీరాన యుల్ల మలరు!
వేప వృక్షము క్రింద చాపపై పడుకొని
.............కూని రాగము తీయ కోర్కె గలుగు!

నాటి జ్ఞాపకాల నవ్యానుభూతులు
తడుము నెదను వెన్ను తట్టు నెపుడు!
మెట్టి నిల్లు యెంత మిన్నదైనను గాని
నాతి పుట్టినిల్లు నాకమె యగు!

Wednesday, April 10, 2013

విజయ! మా దాపులకు తెమ్ము వేల నతులు .



ప్రకృతి క్రొంజీరకై పలవరించుట జూచి
............శిశిరమ్ము సెలవని చెప్పె  నేడు!
తరువులన్నియు రాల్చి దళముల,  క్రొన్ననల్
...........ధరియింప సమకట్టి మురిసె  నేడు!
నిశలు కృశింపగా నిబ్బరమ్ముగ పవల్
...........వెచ్చదనమ్ము తా నిచ్చె  నేడు!
రామ కల్యాణ సంరంభ మందున ధాత్రి
............పెండ్లి  శోభలకును వేచె నేడు!
మించ వేడుక లానంద మెల్ల నేడు
దిశలు క్రొంగ్రొత్త వెల్గుల తేజరిల్లె!
లతలు పుష్పాల ధరియించి లాస్యమాడె!
స్వాగతమ్మన రారె వాసంతునకును.

*******************************

మలయ మారుత వీచి నలుదెసల్ పరికించి
............వ్యాహ్యాళి కై లేచి వచ్చె నేడు!
మాధవీ లత తన్ను మత్తులో ముంచంగ
...........క్రొన్ననల్ ధరియించె గున్న మావి!
లేగొమ్మలన్ జేరి లేజివుళ్ళను మెక్కి
...........గొంతును సవరించె కోయిలమ్మ!
పరువమ్ము పైకొన పైటను సవరించి 
...........తెల్ల నవ్వులు రువ్వె మల్లి కన్నె!

పల్లె పట్టులు క్రొం బట్టు పరికిణీల
దాల్చె!యువతకు మదులలో తాప మాయె!
విజయముంజేసె  నదె భళా విజయ నామ
వత్సరమ్మాంధ్ర ధాత్రికి వన్నె మీర!

********************************

వరకట్నములు మాసి పురుషుల యండతో
.............వనితలు పరువుగా మనెడు దినము
ఏలికలవినీతి పాలన విడనాడి
.............పరమ ధర్మాత్ములై పరగు దినము
కుల మత వర్గంపు గోడ బీటలు వారి
.............ఐకమత్యము నెలవైన దినము
వైద్యమ్ము విద్యయు వ్యాపార వర్గాల
............సంకెలల్ విడివడి సాగు దినము

నల్ల డబ్బును నిలువునా పాతు దినము
పౌరు లోటును విజ్ఞులై వాడు దినము
సగటు మనిషికి మన్నన జరుగు దినము
విజయ! మా దాపులకు తెమ్ము వేల నతులు .
**********************************