padyam-hrudyam

kavitvam

Sunday, March 6, 2011

రామ తారక శతకము 14

66 . తెలిసి తెలియగ లేరు తెలివి యేలొల్లరో - మాయల బడి బోక మమత తోడ
రామ భూపాలుని రమ్యాక్షరంబుల - నే వేళ నైనను నెప్పు డైన
పని సేయు వేళైన పని లేక యున్నను - చను వేళ నైనను చనువు నైన
భయము నొన్దైనను భ్రమ తోడ నైనను - గలుగక నెందుల కలిమి నైన

పరమ కల్యాణ పరిపూర్ణ భద్ర మూర్తి - వెన్న దొంగను గోపాల విభుని ఘనుని
బుద్ధి దలచిన జనులకు పుణ్య పదవి - రామ! తారక! దశరథ రాజ తనయ!

67 . పర కాంతలను గూడి భంగమ్ము నొందక - పర ధనంబుల గోరి పట్టు వడక
పర బుద్ధి విని వేడ్క పరిహాస మెచ్చక - పరుల నిందించక భయము లేక
పరుల యిండ్లను జేరి పాపముల్ సేయక - పర దారలను బట్టి భ్రమల బడక
పరుల కాశింపక పరుల వెంటను బోక - పర సేవ సేయక పట్టు గాను

మన్మథుని గన్న వానిని మాయ కాని - శంఖ చక్రాబ్జముల వాని శౌరి నెపుడు
వర్ణనలు జేసి పల్కుడీ వందనముల - రామ! తారక! దశరథ రాజ తనయ!

68 . మీనమై జలధిలో మేనును దడియక - వేదముల్ దెచ్చిన వేల్పు వాని
తాబేటి రూపున తగ మందరాద్రిని - వీపున నిల్పిన విభవ శాలి
పంది రూపమ్మున పరి పంధి బరి మార్చి - కోర మీదను నిల్పు గోత్ర ధరుని
మెకముల సామియై మేటి దైత్యుని పొట్ట - జీల్చి చెండాడిన సింహ మూర్తి


పొట్టి తనమున బలిదైత్యు భూమి ద్రొక్కి - రామ రఘు రామ బల రామ బౌద్ధ కల్కి
రీతులను వినుతి సేయుడీ ప్రీతి గాను - రామ! తారక! దశరథ రాజ తనయ!

69 . రుక్మిణీ నాథుని రూపు వర్ణన జేసి - సత్య భామా లోలు శౌరి గనుడి
జాంబవతీ మన సంచారు వేడుడీ - సూర్య వంశేశుని సుభగ మూర్తి
మిత్ర విందా విభుని మేటి కీర్తించుడీ - భద్ర పుత్రా నాథు పాడు డెలమి
శ్రీశ ధాత్రీశుని చెలువుగ్గ డిన్చుడీ - లక్ష్మ ణాగ్రజు జగ ద్రక్ష ణాఢ్యు

నట్టి శృంగార వంతుని నట్టి ఘనుని - నట్టి వీరుని దలచిన నెవ్వడైన
జగము కైవల్య పదవిని జెంద వచ్చు - రామ! తారక! దశరథ రాజ తనయ!

70 . అంధుని చేతికి నద్దంబు నిచ్చిన - జూచునా తన మోము సుందరంబు
కుంటి వానికి నొక్క గుర్రంబు నిచ్చిన - నెక్కునా తన శక్తి నెన్న డైన
షండుని యవ్వన సతి గలదేనియు - కామంబు దీరునా కాంక్ష దీర
అల్పున కొక వేళ యర్థంబు గలిగిన - తెలివితో నిచ్చునా తెగువ తోడ

తన్ను తెలిసికొనక తన శక్తి తెలియక - ధరణి సంపదంత తనదె యన్న
లేదు లాభంబు తనకొక లేశమైన - రామ! తారక! దశరథ రాజ తనయ!

No comments: